Wednesday, 17 February 2021

స్టీల్ ఫ్యాక్టరీ మీద డర్టీ పాలిటిక్స్

 

స్టీల్ ఫ్యాక్టరీ మీద డర్టీ పాలిటిక్స్

1.

విశాఖ స్టీల్స్ ను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన మొదట బిజెపికే వచ్చింది. వాజ్ పాయి ప్రభుత్వం 2000లో విశాఖ స్టీల్స్ ను ఖాయిలా పరిశ్రమగా భావించి Board for Industrial and Financial Reconstruction (BIFR)కు అప్పచెప్పింది.

 2

అప్పట్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగావున్న చంద్రబాబు ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. అలా ప్రవేటీకరణ చర్యల్ని వాయిదా వేయించగలిగారు. . 

 3

ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు విదేశీ పెట్టుబడులు,  ఆర్థిక సంస్కరణల విషయంలో బిజెపి, టిడిపి, వైయస్సార్ కాంగ్రెస్, జాతీయ కాంగ్రెస్ ల మధ్య స్థూలంగా ఏకాభిప్రాయం వుంది.

 4.

ఈ విషయంలో కాంగ్రెస్ ది  కొంచెం ఓపెన్ డోర్ పాలసి. బిజెపిది క్లోజ్డ్ డోర్ పాలసి.  అదొక్కటే తేడ.

 5

బిజెపి విధానమే జనసేన విధానం కనుక ఆ పార్టి విధానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు.

 6.

నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకో  విచిత్రం వుంది. ఇప్పటి కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న వివాదాస్పద చట్టాలు అన్నింటికి ప్రధాన పక్షాలైన వైసిపి, టిడిపిలు పార్లమెంటులో బేషరతుగా మద్దతు పలుకుతుంటాయి. ఇక్కడ మాత్రం “నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ” అంటూ రాజకీయ ప్రహసనం ఆడుతుంటాయి.

 7.

బిజెపి తీరు మరీ విచిత్రం. “ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే భాష” దాని నినాదం. కానీ ఆ పార్టి నేతలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో మాట్లాడుతుంటారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీ కరించాలని కేంద్ర కేబినెట్ మరీ ముహూర్తం చూసి ‘రిపబ్లిక్ డే’ రోజున తీర్మానించింది. ఫిబ్రవరి 6న బిజేపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ సాంకేతికరంగం అభివృద్ధి చెందేకొద్దీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వంటి వాటిని ప్రైవేటీకరించక తప్పదన్నారు. ఆ మరునాడు విశాఖపట్నం వచ్చిన బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాలనే నిర్ణయం బిజేపిది కాదన్నారు. కేంద్ర కేబినెట్ నిర్ణయం బయటికి వచ్చే వరకు అసలు ఆ విషయమ తమకు తెలియదన్నారు.

8.

ఎప్పటిలాగే రాష్ట్రంలో టిడిపి వైసిపి బురదజల్లుడు ఆట మొదలెట్టాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డి కేంద్రంలో బిజెపికి ‘లొంగిపోయి’ విశాఖ ఉక్కు మీద హక్కును వదులుకున్నారని టిడిపి విమర్శిస్తోంది. పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్  మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ ను తాడేపల్లి నివాసంలో కలిసినప్పుడే ఈ కుట్రకు బీజాలు వేశారని ఆ పార్టి ఆరోపిస్తోంది.   

9.

కేంద్ర ఉక్కుశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఫిబ్రవరి 10న రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇస్తూ పోస్కో వాళ్ళు భారత్ తో మూడేళ్ళుగా సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో సౌత్ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు.  ఆ ఏడాది అక్టోబరు 22న ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో వాళ్ళు సమావేశమయ్యారని మంత్రి ప్రకటించారు. ఉక్కు మంత్రి పేర్కొన్న సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలో వుంది. సరళికృత ఆర్థిక విధానాన్ని పివి నరసింహారావు - మన్మోహన్ సింగ్ ద్వయం రూపొందించినప్పటికీ దానికి  తానే అసలుసిసలు బ్రాండ్ అంబాసిడర్ నని చంద్రబాబు ఘనంగా చెప్పుకుంటుంటారు.  చంద్రబాబు హయాంలో జరిగిన 2018 నాటి సమావేశంలోనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఫైళ్ళు కదలడం ఆరంభమయిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఓ ట్వీటు చేశారు.

 10.

“జియో ఉచితంగా ఇచ్చి లాభాలు సంపాదిస్తుంటే బిఎస్ ఎన్ ఎల్ చార్జీలు  పెంచి నష్టాల్లో కూరుకుపోతుంది” అని ఒక కార్పొరేట్ జోక్ వుంది. ప్రైవేటు సంస్థలు లాభాల్ని సంపాదిస్తుంటే ప్రభుత్వరంగ సంస్థలు నష్టాల ఊబిలో ఎందుకు కూరుకుంటున్నాయన్నది చాలా కాలంగా మనల్ని వేధిస్తున్న ప్రశ్న.  ఇంతటి ప్రతిష్టాత్మక ఉక్కు కంపెనీకి స్వంత గనుల్ని కేటాయించని కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాలీ? ప్రభుత్వం ప్రైవేటు సంస్థల్ని స్వంత బిడ్డల్లా, పబ్లిక్ రంగ సంస్థల్ని సవతి బిడ్డల్లా చూస్తుందనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుందీ?


11.

పిబ్రవరి 16, 17 తేదీల్లో ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు, ముఖ్యమంత్రి జగన్ విశాఖపట్నం పర్యటనకు వెళ్ళారు. ఆందోళన చేస్తున్న కార్మిక నాయకుల్ని ఇద్దరూ కలిశారుగానీ ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న ప్రధాన మంత్రిని ఒక్కరూ పల్లెత్తు మాట అనలేదు. ఢిల్లీలో మకాంవేసి ప్రవేటీకరణ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ సంకేతాలిస్తున్నారు. “విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే వుంటుంది; కార్మికులూ వాళ్ళే వుంటారు” అని బిజెపి ప్రతినిధులు అంత గట్టిగా చెపుతున్నారంటే; కథ ముగిసిపోయిందనే అర్థం.

 12.

సరళీకృత ఆర్ధిక విధానాల పట్ల వామపక్షాల తీరు కూడ స్పష్టంగాలేదు. అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారంలో వున్నప్పుడు ఇంకోలా వ్యవహరిస్తున్నాయి.  పశ్చిమ బెంగాల్ లో అధికారంలో వున్నప్పుడు వామపక్షాలు సరళీకృత ఆర్థిక విధానానికి ఎర్ర తివాచీ పరిచాయి. దాన్ని అక్కడి ప్రజలు తిప్పికొట్టారు. నందిగ్రామ్ ఆందోళన దానికి పెద్ద ఉదాహరణ. “పెట్టుబడులు పెట్టడానికి ప్రపంచంలోనే సురక్షిత రాష్ట్రం కేరళ” అని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కామ్రేడ్  పినరయి విజయన్ ప్రకటనలు గుప్పిస్తున్నారు.

  

13.

రాజకీయ నాయకుల అవకాశవాద విధానాలను చూసి ప్రజలకు రాజకీయ పార్టీల మీద నమ్మకం సడలిపొతోంది. అయినప్పటికీ ఒక భారీ ప్రజా ఉద్యమం ఆరంభమం అయితేగానీ  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందని చెప్పలేం.

No comments:

Post a Comment