Sunday 14 February 2021

Shocking History of POSCO

Shocking History of POSCO

పోస్కో చరిత్ర వింటే  షాక్ అయిపోతారు !

-       డానీ

 

ఆంధ్రప్రదేశ్ ను ఇప్పుడు భయపెడుతున్న పదం పోస్కో. ఇది దీని పొట్టి పేరు. పొడుగు పేరు పోహాంగ్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్. దక్షణ కొరియా తీర ప్రాంత నగరం పోహాంగ్ దీని కేంద్ర కార్యాలయం. మరో తీర నగరం గ్వాంగ్ యాంగ్ లో మరో యూనిట్ వుంది. సాలీన 43 మిలియన్ (430 లక్షల) మెట్రిక్  టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో పోస్కో ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఉక్కుకర్మాగారంగా కొనసాగుతోంది.     

 

దక్షణ కొరియా మాజీ మేజర్ జనరల్  పార్క్ తాయి జూన్  1968లో పోస్కోను నెలకొల్పాడు. పార్క్ తాయి జూన్ కు వాణిజ్యం అంటే యుధ్ధమే. కార్మిక చట్టాలనుగానీ, పర్యావరణ నిబంధనల్ని గానీ  పాటించదని పోస్కోమీద ఆరోపణలున్నాయి. పార్క్ తాయి జూన్  2011లో  చనిపోయాడు. 2018 నుండి చోయి జెఓంగ్ వూ పోక్సో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వుంటున్నాడు.

 

పోస్కోకు మనుషుల మీదకన్నా యంత్రాల మీద నమ్మకం ఎక్కువ. ఆటోమేషన్, రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని అతిగా పెంచి కార్మికుల సంఖ్యను కుదించి భారీ లాభాలను అర్జించడం ఈ సంస్థ మార్కెట్ వ్యూహం. 430 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తున్నప్పటికీ ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 34 వేలు మాత్రమే. ఈ 34 వేల మందిలోనూ సగం మంది ఔట్ సోర్సింగ్ / కాంట్రాక్టు  ఉద్యోగులు. ప్రతి పది పని గంటలకు ఒక టన్ను ఉక్కు ఉత్పత్తి కావాలనేది పోస్కో  కొలమానం;  అంటే 1.25 పని దినాలు.

 

          పోస్కో అనుసరించే విచక్షణారహిత విధానాల వల్ల ప్రపంచ దేశాలు దాన్ని దూరంగా పెడుతున్నాయి. ‘సామాజిక దూరం’లా 'పారిశ్రామిక దూరం' పాటిస్తున్నాయి. యూఎస్ స్టీల్  తో కలిసి అమెరికా కాలిఫోర్నియా  రాష్ట్రంలోని పోర్ట్ సిటి పీట్స్ బర్గ్ లో 2010లో యూఎస్ ఎస్ – పోస్కో ఇండస్ట్రీస్ ను నెలకొల్పారు. అందులో రెండు సంస్థలకూ చెరో 50 శాతం వాటాలుండేవి.  POSCOతో పడలేక గత ఏడాది పిబ్రవరిలో  మొత్తం కర్మాగారాన్ని యూఎస్ స్టీల్ స్వాధీనం చేసుకుంది. 50 శాతం వాటాను చెల్లించి పోస్కోను బయటికి పంపించేసింది.

 

రేవు పట్టణాల మీద ఆసక్తివున్న పోస్కో భారత దేశంలో అలాంటి అవకాశం కోసం ఓ పదిహేనేళ్ళగా వెంపర్లాడుతోంది. జగత్ సింగ్ పూర్ జిల్లాలోని పారదీప్ రేవు పట్టణం సమీపంలో ఒక ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పడానికి ఒడిశా  ప్రభుత్వంతో పోస్కో 2005లో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. 4 వేల ఎకరాల భూమి కేటాయించడమేగాక, నీరు, విద్యుత్ వినియోగంపై భారీ రాయితీలు ఇవ్వడానికి ఒడిశా  ప్రభుత్వం అంగీకరించింది. అయితే, విచక్షణా రహితంగా అడవుల్ని నరికివేయడంతో స్థానికులు తిరగబడ్డారు. పర్యావరణ చట్టాలను కఛ్ఛితంగా పాటించాలని ఒడిశా ప్రభుత్వం పట్టుబట్టింది. అది కుదరదని  పోస్కో  అక్కడి నుండి తప్పుకుంది.

 

          ఇనుప గనులు పుష్కలంగావున్న ఛత్తీస్ గడ్, జార్ఖండ్ లలో కాలు మోపడానికి పోస్కో ప్రయత్నాలు చేసింది. అవి ఫలించలేదు. అప్పుడు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పోస్కోను ఆహ్వానించింది.

 

భారత దేశంలో ఉక్కు పరిశ్రమాభివృధ్ధి –  ఒరిస్సా సన్నివేశం అనే అంశంపై 2007 సెప్టెంబరు 27న భవనేశ్వర్ లో ఒక సదస్సు జరిగింది. అందులో ప్రధాన వక్తగా పాల్గొన్న పోస్కో రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్  డైరెక్టర్ ఛాంగ్ హో క్వాంగ్  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఒడిశా, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అపార ఖనిజ నిక్షేపాలున్నాయి.  కానీ; భారీ పరిశ్రమల్ని నెలకొల్పే నైపుణ్యం వాళ్లకు లేదు “పొరుగున వున్న పశ్చిమ బెంగాల్ రాష్ట్రం భిన్నమైనది. అక్కడున్న వామపక్ష ప్రభుత్వానికి పెట్టుబడుల్ని ఎలా తీసుకురావాలో తెలుసుఅన్నాడు.

 

విదేశీ పెట్టుబడుల విషయంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించినప్పటికీ బెంగాల్ రైతులు తీవ్రంగా ప్రతిఘటించారు. దానితో బెంగాల్ లోనూ  పోస్కో ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది.

 

ఆ తరువాత పోస్కో కన్ను విశాఖపట్నం మీద పడింది. ఏపీలో పోస్కోకు అనేక సానుకూల అంశాలున్నాయి. మొదటిది; ప్రధాన రాజకీయ పక్షాలన్నీ విదేశీపెట్టుబడుల కోసం వెంపర్లాడుతున్నాయి. రెండవది; ఏపీ ప్రజలు ఆందోళనలు చేయడం మరిచిపోయి చాలా కాలం అయింది.  ప్రభుత్వాలు సానుకూలంగా వుండి, ప్రజలు నిర్లిప్తంగా వుండిపోతే అంతకన్నా సానుకూల వాతావరణం ఏముంటుంది సామ్రాజ్యవాద వలసవాదానికి!  (imperialist Coloniaism).

 

13 ఫిబ్రవరి 2021

No comments:

Post a Comment