రాజకీయ పార్టీలకు అతీతంగా మహా ప్రజాఉద్యమాన్ని నిర్మిద్దాం!
ఉక్కు ఉద్యమానికి MTF సంఘీభావం
20-02-21 శనివారం – విశాఖపట్నం
21-02-21 ఆదివారం – కాకినాడ
22-02-21 సోమవారం – విశాఖపట్నం
టాకింగ్ పాయింట్స్
ఉక్కుఫ్యాక్టరీ కోసం ప్రాణత్యాగాలు చేసిన జి కృష్ణారెడ్డి, షేక్ అహ్మద్, మరి 30 మందికి –
ఉద్యమిస్తే సాధించలేనిది ఏదీ లేదని
చాటి చెప్పిన 1960-70 నాటి యువతరానికీ -
ఆనాటి ఉద్యమానికి
నాయకత్వం వహించిన తెన్నేటి విశ్వనాధం గారికీ -
ఆమరణ నిరాహార
దీక్షకు కూర్చున్న తమనంపల్లి అమృతరావు గారికీ
–
ముందుగా నివాళులు
-
1. ఒక పరిశ్రమ కావాలని ప్రజలు పోరాడి ప్రాణత్యాగాలు
చేసిన సందర్భం ఎక్కడయినా వుందా? ఆ చరిత్ర కేవలం
విశాఖ ఉక్కుకు మాత్రమే వుంది. ఒకరూ ఇద్దరూ
కాదు 32 మంది చనిపోయారు. ఆంధ్రా రాయలసిమ తెలంగాణల్లో కూడ విశాఖ ఉక్కుకోసం బలిదానాలు
జరిగాయి.
2.
ఇవాళ మన దేశంలో ఒక విషాదం, ఒక ప్రహసనం రెండూ ఒకేసారి
జరుగుతున్నాయి.
3.
విషాదం ఏమంటే భారత దేశాన్ని గజాలు అడుగుల చొప్పున
విదేశీ సంస్థలకు అమ్మివేయడానికి ఫైళ్ళు చాలా వేగంగా కదులుతున్నాయి.
4.
ప్రహసనం ఏమంటే మన రాజకీయ నాయకులు వెన్నెముకలేనిజీవుల్ని
తలపిస్తున్నారు.
5.
నేను చరిత్రలోనికి ఎక్కువగా వెళ్ళనుగానీ, వర్తమానంతో
పోల్చడానికి రెండు సంఘటనల్ని మీ ముందు వుంచుతాను.
6.
బ్రిటీష్ సైనికాధికారి రాబర్ట్ క్లైవ్ ప్లాస్సీ (Plassey) దగ్గర 1757లో బెంగాల్
నవాబు సిరాజ్ ఉద్దౌలా సైన్యంతో హోరాహోరీ పోరాటం చేశాడు. ఆ తరువాతగానీ భారత దేశాన్ని హస్తగతం చేసుకోవడం ఈస్ట్ ఇండియా కంపెనీకి
సాధ్యం కాలేదు.
7.
దక్షణ కొరియాలో మాజీ సైనికాధికారి పార్క్ తాయి జూన్ నెలకొల్పిన
సంస్థ పోస్కో.
8.
ఈస్ట్ ఇండియా కంపెనీలా ఇవ్వాళ భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి
యుధ్ధం చేయాల్సిన పనిలేదు. సైన్యం అక్కరలేదు. గుర్రాలు, ఏనుగులు, తుపాకులు, ఫిరంగులు
అక్కరలేదని పోస్కోకు చాలా స్పష్టంగా తెలుసు.
9.
పోస్కో సిఇవో చోయి జెఓంగ్ వూ ఒన్ ఫైన్ మార్నింగ్ పోహాంగ్
నుండి విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగుతాడు. బంగాళాఖాతం తీరాన ఓ ఉదయమో,
సాయంత్రమో వ్యాహాళికి వెళుతాడు.
10. అక్కడ 33 వేల ఎకరాల భూమి
వృధాగా పడివుండడాన్ని చూసి బాధపడిపోతాడు. ఢిల్లీ
వెళ్ళి ఆ వ్యర్ధ భూమిని ఉద్దరిస్తానని ఆఫర్ చేస్తాడు.
11. పాతదీపాలకు కొత్త దీపాలు
ఇస్తాననే చైనా మాంత్రికుడు వచ్చినట్టు మనోళ్ళు గొప్పగా ఆనందిస్తారు. వాడు ఆ భూమికి
వెలకట్టి అక్కడికక్కడే నెట్ బ్యాంకింగ్ లో డబ్బు ట్రాన్స్ ఫర్ చేస్తాడు.
12. మన దేశాధినేతలు, రాష్ట్రాధినేతలు
తరచూ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్ళి, మేము మీ కోసం ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్
సిధ్ధం చేశాం మీరు పెట్టుబడులతో రండి అని బతిమాలుతుంటారు.
13. ఈ మొత్తం ప్రక్రియను ఇటీవల
దేశాభివృధ్ధి అంటున్నారు. ఇందులో ఎవరికయినా ఏదయినా తప్పుగా అనిపిస్తే వాళ్ళకు దేశాభివృధ్ధి
అర్థం కాలేదని మనం అర్ధం చేసుకోవాలి.
14. మన దేశంలో
ఇప్పూడు దేశభక్తికి అర్థం మారిపోయింది. దేశాన్ని
ప్లాట్లు వేసి చదరపు గజాలు చొప్పున విదేశాలకు అమ్మివేయడం దేశభక్తి; దాన్ని తప్పుపట్టడం
దేశద్రోహం.
15. చరిత్ర తనంతటతానే పునరావృతమౌతుంది; మొదటిసారి విషాదంగా రెండోసారి
ప్రహసనంగా అన్నాడు కార్ల్ మార్క్స్. అది ఇదే నేమో. History repeats itself, first as tragedy,
second as farce.
16. పోక్సో అనేది ఒక ఖతర్నాక్ పారిశ్రామిక సంస్థ. అది మనుషులకన్నా యంత్రాలను
ఎక్కువగా నమ్ముతుంది. లేదా మనుషుల్ని యంత్రాలుగా మార్చేస్తుంది. తన్ను ఉక్కు ఉత్పత్తికి
పది పనిగంతలు అనేది దాని కొలమానం.
17. లాల్ బహద్దూర్ శాస్త్రి హయాంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రతిపాదన
వచ్చింది. ఇందిరాగాంధి శంకుస్థాపన చేశారు. పివి నరసింహారావు ప్రారంభించారు. మన్మోహన్
సింగ్ విస్తరణ పథకాన్ని ఆరంభించారు.
18. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో బిజెపి కాంట్రిబ్యూషన్ కూడ వుంది. 2000లో
దాన్ని అమ్మివేయాలని తొలుత ప్రతిపాదించింది వాజ్ పాయి ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ప్రైవేటు
సంస్థలకు అమ్మాలని తీర్మానం చేసింది నరేంద్ర మోదీజీ ప్రభుత్వం.
19. స్వాతంత్ర్యోద్యమంలోగానీ, ఆ తరువాతి కాలంలో గానీ జవహర్ లాల్ నెహ్రూతో
సమానస్థాయిలో నిలిచిన నాయకులు కొందరైనా ఆంధ్రాప్రాంతంలో వుండేవారు. కాంగ్రెస్ లోపల
దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, అల్లూరి సత్యనారాయణ రాజు, నీలం సంజీవరెడ్డి, ఎన్ జి రంగా
వంటివారుంటే; కాంగ్రెస్ బయట చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమిల నాగిరెడ్డి
వంటివారు వుండేవారు.
20. ఢిల్లీ ఒక మిధ్య అనగలిగిన నాయకుడు ఎన్టీ రామారావు. 1989ఎన్నికల తరువాత ప్రధాని పదవికి విపి సింగ్, దేవీలాల్ తో పాటూ దీటుగా
నిలబడిన నాయకుడాయన.
21. ఈతరం రాజకీయ నాయకుల్ని చూసి తెలుగు జాతి సిగ్గుతో తల దించుకోవాల్సి
వస్తున్నది. పలనాటి పౌరుషం, రాయలసీమ ఫ్యాక్షనిజం, బెజవాడ గూండాయిజం వంటి గొప్పలు ఇక్కడేగానీ
ఢిల్లీలో వీళ్ళ పప్పులు ఉడకడం లేదు.
22. కరోనా వుధృతంగావున్న రోజుల్లో ఢిల్లీ విమానాశ్రయంలో ఒక రూల్ వుండేది.
విదేశీయులు విమానం దిగగానే కోవిడ్ టెస్టుల
కోసం 14 రోజులు క్వారంటైన్ కు పంపించేవారు. ఇప్పుడు ఏపీ నాయకులు ఢిల్లీలో విమానం దిగగానే
కేంద్ర ప్రభుత్వం వాళ్ళ వెన్నెముకను తొలగించేస్తున్నది.
23. ఢిల్లీ వీరిని కొంచెం లొంగి వుండమంటే వీరు ఏకంగా పాకుతున్నారు.
24. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (RINL)కు చెందిన వైజాగ్ స్టీల్స్ నుండి పెట్టుబడుల్ని
ఉపసంహరించుకుని ప్రైవేటు సంస్థలకు అమ్మాలని ఈఏడాది జనవరి 26న కేంద్ర మంత్రివర్గం తీర్మానం
చేసింది.
25. వ్యవహారం మంత్రివర్గ తీర్మానం వరకూ
వచ్చిందంటే ఈ ప్రక్రియ ఈ రెండు మూడేళ్ల క్రితమే ఆరంభం అయివుంటుంది.
26. పోస్కో ఇండియా గ్రూపు సిఎండి సుంగ్ లయ్ చున్ మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. భావనపాడు, కృష్ణపట్నం, కడపలో పరిశ్రమలు పెట్టే అంశాల్ని మాత్రమే అప్పుడు చర్చించాముగానీ విశాఖ
ఉక్కు విషయం అసలు ప్రస్తావనకే రాలేదంటున్నారాయన.
ఇది నమ్మశక్యంగా లేదు.
27. విశాఖపట్నం
మీద పోస్కోకు ఆసక్తి లేదని కూడ జగన్ అంటున్నారు.
28. కేంద్ర ఉక్కుమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వాదన మరోలా వుంది. పోస్కో, హ్యుందాయ్ ప్రతిధులతోపాటు భారత్ లో దక్షణ కొరియా రాయబారి 2018లో ఒక బృందంగా విశాఖపట్నం వెళ్ళి ఉక్కు ఫ్యాక్టరీని సందర్శించారు. ఆ ఏడాది అక్టోబరు 22న ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో వాళ్ళు సమావేశమయ్యారని ఉక్కుమంత్రి రాజ్యసభలో అధికారికంగా
ప్రకటించారు.
29. 2018
అక్టోబరులో చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా
వున్నారు. పైగా అప్పటికి ఒక ఏడాది ముందు
చంద్రబాబు దక్షణ కొరియా వెళ్ళి పెట్టుబడులతో ఏపికి రండని అక్కడి కార్పొరేట్లను ఆహ్వానించి
వచ్చారు.
30. పోస్కో
సంస్థ ప్రతినిధులు ఫ్యాక్టరీని సందర్శించడం, ఆర్ ఐ ఎన్ ఎల్, ఎన్ ఎండిసి, కేంద్ర ఇనుము ఉక్కు మంత్రిత్వశాఖ ప్రతినిధులతో కీలక సమావేశం జరపడం
అప్పటి ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగాయి అనుకోవాలా?
31. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రితోగానీ,
ఇప్పటి ముఖ్యమంత్రితోగానీ సంప్రదించలేదనేది ఇంకో అభిప్రాయం. ఫ్యాక్టరీ కేంద్ర ప్రభుత్వానిది
కనుక ముఖ్యమంత్రుల్ని సంప్రదించాల్సిన అవసరం లేదన్నది కేంద్రం అభిప్రాయం కావచ్చు.
32. కొంతమంది ఇప్పటికీ మనది ఫెడరల్ వ్యవస్థ అంటుంటారు. కేంద్ర ప్రభుత్వం
రోజుకు డజను సార్లు ఇది యూనిటరీ రాజ్యం అని చెపుతుంటుంది.
33. కేంద్ర ప్రభుత్వం బయటి పార్టీలనేకాదు స్వంత పార్టిని కూడా పట్టించుకోలేదు. కేంద్ర కేబినెట్ ప్రైవేటీకరణ తీర్మానం
చేసే వరకు తమకు ఆ విషయం తెలియదని బిజేపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి
అంటున్నారంటే దాని అర్ధం ఏమిటీ?
34. జనసేన పరిస్థితి మరో ఘోరం. కేంద్ర ప్రభుత్వానికి అది కాంగ్రెస్ వలే
బ్యటి పార్టీ కాదు. బిజెపి వలే లోపలిపార్టి కాదు. ఏపిలోనూ దాన్ని ఔటర్ లోనే వుంచుతున్నారు.
ఢిల్లీలోనూ దాన్ని ఔటర్ లోనే వుంచుతున్నారు.
35.
పార్లమెంటులోగానీ,
శాసనసభల్లోగానీ ఒక విధానపరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (FDI) ఆహ్వానించని రాజకీయ
పార్టీలు ఏవైనా వున్నాయా?
36.
బయటివాళ్ళు వచ్చి మనదేదో గద్దల్లా కొట్టుకుపోతున్నారని మనం తరచూ అనుకుంటుంటాం. వాళ్ళను
మనవాళ్ళే ఆహ్వానిస్తున్నారని మరచిపోతుంటాం.
37.
మన తెలుగు నాయకులు పోస్కో మీద పోరాటం చేయలేరు. కేంద్రప్రభుత్వ
విధానాలనూ విమర్శించలేరు. పోరాడుతున్నట్టు ఒక నాటకం ఆడుతుంటారు.
38.
ఇందిరాగాంధి దిగి వచ్చి ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే నెలకొల్పుతామని
ప్రకటించాక అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి విశాఖపట్నం వచ్చి టి అమృతరావుకు
నిమ్మరసం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేశారు.
39.
ఇప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడ విశాఖపట్నం వచ్చి
మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావుకు నిమ్మరసం ఇచ్చి ఆమరణ నిరాహార దీక్షను విరమింపచేశారు.
ఇందులో చిన్న తేడా వుంది. ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నంలోనే నెలకొల్పుతామని కేంద్రం ప్రకటించాక
బ్రహ్మానంద రెడ్డి నిమ్మరసం ఇచ్చారు. ప్రైవేటీకరణను విరమించుకుంటాం అని కేంద్రం చెప్పక
ముందే చంద్రబాబు నిమ్మరసం ఇచ్చారు. ఇదో కొత్త పోరాట రూపం.
40.
తెలుగు ప్రజలనైనా, భారత ప్రజలనైనా ఈరోజు పదేపదే ఓడిస్తున్నది
లోపలి శక్తులే.
41.
ఈ రాజకీయ పార్టీలను నమ్ముకుని గోదారి ఈదడం ఎంతవరకు
సమంజసం?
42.
షాహీన్ బాగ్ ఆందోళన
రాజకీయ పార్టీలకు అతీతంగా సాగింది. ఇప్పుడు రైతుల ఆందోళన కూడ రాజకీయ పార్టీలకు అతీతంగా సాగుతోంది.
43.
రాజకీయ పార్టీలు సంఘీభావాన్ని తెలిపితే మనం స్వీకరించాలి.
కానీ వాటి నాయకత్వంలో పోరాటాలు విజయవంతం కావని నిరంతరం గుర్తుపెట్టుకోవాలి.
44.
షాహీన్ బాగ్, రైతుల ఆందోళనల బాటలో ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమం
సాగాలి.
45.
ప్రజాస్వామ్యంలో ఉద్యమిస్తే సాధించలేనిది ఏదీ లేదని 1960-70 నాటి యువతరం
నిరూపించింది. అప్పటి యువతరం నుండి నేటి యువతరం
స్పూర్తి పొందాలి.
46.
అలాంటి ఉద్యమంలో MTF భాగస్వామి
అవుతుంది.
No comments:
Post a Comment