Saturday, 18 March 2023

80-20 Assimilations - Muslim Crisis

 80:20 సమీకరణలు : ముస్లింల ఇరకాటం

80-20 Assimilations - Muslim Crisis

 

          తక్కువ సంఖ్యాకుల్ని అధిక సంఖ్యాకులు సులువుగా జయించగలరనేది ఒక సాధారణ అభిప్రాయం.  “30 కోట్ల మంది భారతీయులు ఒక్కసారిగా కాండ్రించి ఉమ్మి వేస్తే అందులో మీరంతా కొట్టుకుపోతారురా” అని అల్లూరి సీతారామరాజు సినిమాలో అగ్గిరాజు డైలాగ్ ఒకటి వుంటుంది.  ఉద్యమాల్లో ప్రజల్ని ఉత్తేజపరచడం కోసం తరచూ ఇలాంటి మాటలు అవసరం అవుతుంటాయి.

 

          భారత ప్రధమ స్వాతంత్ర్యపోరాటం, సిపాయిల తిరుగుబాటు సమయంలో బ్రిటీష్ ఇండియాలో విశాల ప్రజా సమీకరణ జరిగింది. ఆంగ్లేయుల్ని తరిమి కొట్టడానికి ఒక ప్రాదేశిక జాతీయవాదం వువ్వెత్తున  ముందుకు వచ్చింది. అంతటి వృధ్ధుడయిన బహదూర్ షా జాఫర్ ను అందరూ తమ సర్వ సేనాధిపతిగా స్వఛ్ఛందంగా ఎన్నికున్నారు.

 

సిపాయిల తిరుగుబాటు  శిధిలాల నుండి పుట్టిన జాతియోద్యమం దేశ ప్రజలకు 80:20 ఉత్తేజాన్నే ఇచ్చి ముందుకు సాగింది. భారతీయులు 80 శాతం ఆంగ్లేయులు 20 శాతం అనేది విభజన.  భారత ముస్లింలు సహితం ఉత్సాహంగా 80 శాతంలో చేరారు. బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో తమ వంతు బాధ్యతను  కఛ్ఛితంగా నిర్వర్తించారు. జాతీయోద్యమంలో అత్యంత కీలకం, స్వాతంత్ర్యం రావడానికి నిర్ణయాత్మకంగా పనిచేసిన క్విట్ ఇండియా ఉద్యమానికి మౌలానా అబుల్ కలామ్ అజాద్ నాయకత్వం వహించారు.

 

సాంస్కృతిక జాతీయవాదం ముందుకు రావడం  ఆ తరువాతి పరిణామం.

 

స్వాతంత్ర్యానంతరం కమ్యూనిస్టులు కొత్త సమీకరణలతో 80:20  సిధ్ధాంతాన్ని బాగా ప్రచారం చేశారు. దేశంలో కష్టజీవులు 80 శాతం అని, విశ్రాంత వర్గం కేవలం 20 శాతమేనని వీళ్ళు వర్గీకరించేవారు. 20 శాతాన్ని 80 జయించడం పెద్ద కష్టం కాదనేవారు. సహజంగానే ఈ విభజన కష్టజీవులకు బాగా నచ్చేది. వాళ్ళు పెద్ద సంఖ్యలో కమ్యూనిస్టు పార్టిలకు దగ్గరయ్యేవారు. స్వాతంత్ర్యానంతరం విశ్రాంత వర్గంలో ముస్లింల భాగం మరీ చిన్నది. వాళ్ళు 80 శాతం కష్టజీవులతోనే  వున్నారు. పారిశ్రామిక విప్లవం మూలంగా కొత్తగా పుట్టుకొచ్చిన చేతివృత్తులన్నింటిలోనూ ముస్లింలే వుండేవారు. వాళ్లు పేదవాళ్లయినప్పటికీ 80 శాతంతో వుండడంతో గొప్ప నైతిక బలంగా వుండేది.

 

1990లలోదేశంలోనేగాక, ప్రపంచ వ్యాప్తంగా కమ్యూనిస్టుల ఆమోదాంశం దెబ్బతిన్నది. తూర్పుయూరోపు పతనం, రష్యా విఛ్ఛిన్నం దీనికి ప్రధాన కారణం. దేశంలోనూ కమ్యూనిస్టులు చెప్పుకోదగ్గ విజయాలను నమోదు చేయలేకపోయారు.  దానితో  సామాజిక సందర్భం మారింది.

 

ఆ సమయంలో మాన్యశ్రీ  కాన్షీరామ్ ఒక సరికొత్త పధ్ధతిలో  80:20 సమీకరణల్ని పునర్ వ్యవస్థీకరించే ప్రయత్నం చేశారు. దేశంలో ఎస్టి, ఎస్సి, బిసి, మైనారిటీలు 80 శాతం అనీ, భద్రలోక్ 20 శాతమేనని ఆయన కొత్త లెఖ్ఖలు చెప్పారు. ఈ నిర్వచనం ముస్లింలకు కూడ అనువుగానే కనిపించింది. దళిత-ముస్లిం ప్రజాస్వామిక సంఘటనలు డెఫోడమ్, దరకమే వంటి సాంస్కృతిక సంస్థలు, బలహీనవర్గాల సమాఖ్యవంటి ప్రజాసంఘాలు ఏర్పడ్డాయి. ఈ ఉత్సాహం దాదాపు మూడు దశాబ్దాలు  కొనసాగింది. ఈ పరిణామాలు, కొత్త సామాజిక ఐక్యతలు సంఘ్ పరివారాన్ని కొంతకాలం  నిజంగానే కలవర పెట్టాయి.

 

తమ సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి సంఘపరివారం కొత్త ఎత్తుగడలు ఆరంభించారు. మొదట్లో వర్ణాలకే పరిమితమైవున్న తమ సామాజిక ఛత్రాన్ని కులాలకు కూడ విస్తరించడానికి ప్రయత్నించారు. బహుజనసమాజ్ లోని బహుజనులైన  హిందూ- బిసిలను మొదట ఆకర్షించారు. నరేంద్ర మోదీ హిందూ-బీసి  కావడమూ, వారు గుజరాత్ ముఖ్యమంత్రి కావడమూ దీనికి కలిసి వచ్చింది. ముస్లింలకు వ్యతిరేకంగా సాగిన గుజరాత్ అల్లర్లలో, బిసిలు, ఎస్సీలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చేయడంలో సంఘపరివారం సఫలమయింది. దీనివల్ల హిందూ బిసిలకు, సంఘపరివారానికి కూడ పరస్పర ప్రయోజనాలూ వున్నాయి. కాల్బలంలో దండనాయకులుగా హిందూ బిసిలను ముందుంచుతున్నారు. దీన్ని వాళ్ళూ సాంస్కృతిక గౌరవంగా భావిస్తున్నారు.  కంచ ఐలయ్య షెఫర్డ్ వంటి మేధావులు ఈ సామాజిక వలసలకు  సైధ్ధాంతిక సమర్ధనను తరచూ అందిస్తూవస్తున్నారు.   

 

కేంద్రంలో నరేంద్ర మోదీ- అమిత్ షాల పాలన మొదలయ్యాక ఒకవైపు ఎస్సీలను, మరోవైపు షియా ముస్లింలను  ఆకర్షించడానికి కొత్త పథకాలు రచించారు.  దానితో  మరో రకం 80:20 సమీకరణ ప్రతిపాదనను  ముందుకు తెచ్చారు. దేశంలో హిందువులు 80 శాతం, ముస్లింలు, కమ్యూనిస్టులు-నక్సలైట్లు,  హేతువాదులు, నాస్తికులు అంత కలిసి 20 శాతం అని వాళ్ళు ప్రచారం మొదలెట్టారు. ఆ 20 శాతం ఓట్లు తమకు అక్కరలేదని, 80 శాతంవున్న తమ ఓట్లతోనే అధికారానికి నిలబెట్టుకుంటాం అనే ధీమాను వ్యక్తం చేయడం మొదలెట్టారు.

 

దేశ సామాజిక, రాజకీయ రంగాలో కొత్తగా వస్తున్న పరిణామాల్ని గమనిస్తే మనకు రెండు అంశాలు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. ‘20’ శిబిరంలో వుందడానికి ఎవరూ ఇష్టపడడంలేదు. ఏదో ఒక విధంగా ‘80’ శిబిరంలో చేరాలనే తాపత్రయం అందరిలో మొదలయింది. ప్రముఖ అంబేడ్కరిస్టులుగా చెలామణి అయిన రామ్ విలాస్ పాశ్వాన్, ఉదిత్ రాజ్, తామ్ దాస్ అథవాలే  చాలా కాలం బిజెపి సేవలో తరించారు.

 

ఇంతా చేసినా సంఘీయులకు ఆశించిన 80 శాతం దకక్కడం                 లేదు. హిందూ పెత్తందారీ కులాల్లోని ఉదారవాదులు ఈ సమీకరణకు సుముఖంగా లేరు. వాళ్ళ సంఖ్య కూడ తక్కువగా ఏమీలేదు. ఇది సంఘీయుల్ని ప్రధానంగా అసహనానికి గురిచేస్తున్న అంశం. 2019 ఎన్నికల్లో మొత్తం పోలయిన  91 కోట్ల ఓట్లలో బిజెపికి పడినవి 23 కోట్ల ఓట్లే.

 

దేశ అర్ధిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత వేగంగా దూసుకుపోతున్నదనీ, మన ఆదానీ, అంబానీలు ప్రపంచ కుబేరుల్లోఒకరుగా మారారనీ, భారత దేశం విశ్వగురువుగా మారుతోందని ఎంతగా ప్రచారం చేస్తున్నా దేశంలోని హిందూ ఉదారవాద సమూహం నమ్మడం లేదు.

 

ధృఢ అంబేడ్కరిస్టులు అయిన ఎస్సీలు తమ వైపుకు రావడం లేదనే అసంతృప్తి కూడ సంఘీయుల్లో చాలా కాలంగా వుంది. ఎస్సీలకు విద్యా, ఉపాధి రంగాల్లో రాజ్యాంగబధ్ధ రిజర్వేషన్లున్నాయి. రాజకీయ రిజర్వేషన్ మాత్రం కేంద్ర ప్రభుత్వ ఇష్టాయిష్టాల మీద ఆధారపడివుంది. ఎస్సీల నిరసనను తగ్గించ గలిగితే తాము 80 శాతానికి చేరుకోవడానికి మార్గం సులువవుతుందనే ఆశ సంఘీయులకు లేకపోలేదు.  

 

అందరూ తమ శిబిరంలో చేరిపోతే ముస్లింలు, ఆదివాసులు, కొందరు ఎస్సీలు, కమ్యూనిస్టులు మాత్రమే ప్రత్యర్ధి శిబిరంలో మిగులుతారనే నమ్మకం సంఘీయుల్లో కనిపిస్తోంది.

ఇప్పుడు ఎస్సీలను మరింతగా ఆకట్టుకోవడానికి సంఘపరివారం కొత్త ఆలోచనలు చేస్తున్నది. బిఆర్ అంబేడ్కర్ తన జీవితకాలంలో  వర్ణ-కుల నిర్మూలన మీద ఎక్కువ దృష్టి పెట్టారు. ఇప్పుడు ఆ అంశాన్ని సంఘీయులు పరిశీలిస్తున్నారు. వర్ణాలు-కులాలు పోవాలని సర్ సంఘ్ ఛాలక్ మోహన్ భాగ్వత్ ఇటీవల ప్రకటించారు. అంబేడ్కరిస్టులయిన ఎస్సీల నుండి దానికి ఏ మేరకు  సానుకూల స్పందన వస్తుందో చూడాలి.

 

కష్టకాలంలో కమ్యూనిస్టులు తమకు గట్టి అండగా వుంటారనే నమ్మకం ముస్లిం సమూహాల్లో వుంది. ఈ 80:20  ఫోబియా క్రమంగా  ఇటు కాంగ్రెస్ ను, అటు కమ్యూనిస్టుల్ని కూడ భయపెడుతోంది. ముస్లింలను దరిచేరిస్తే తమ ఉనికే గల్లంతవుతుందనే భయం వాళ్లను వెంటాడుతోంది. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత సిపియంలో ఈరకం ఆందోళన మరీ ఎక్కువయింది.

 

20 శాతం శిరంలో  వుండడానికి ఇప్పుడు ఏ సామాజికవర్గమూ సిధ్ధంగా లేదు. అన్ని సామాజికవర్గాలు 80 శాతం శిబిరంలోనికే ప్రవేశించాలనుకుంటున్నాయి. ముస్లిం సామాజికవర్గం ఇప్పుడు మునుపెన్నడూ లేనంత ఒంటరులు.

 

చివరికి అన్యుల శిరంలో ముస్లింలు, ఆదివాసులు మాత్రమే మిగిలిపోయే సన్నివేశం ఒకటి ఏర్పడుతోంది. ఆ ముస్లిం సమూహం నుండి  బిసి ముస్లింలను విడదీసే ప్రయత్నాలనూ సంఘ్ పరివారం ఆరంభించింది. ఆదివాసుల కోసం వనవాసి కళ్యాణ్ యోజన ఎలాగూ వుంది. ముస్లింలను ఏకాకుల్ని చేసేందుకు రంగం సిధ్ధమైంది.

 

19వ శతాబ్దంలో ఫూలే సాంఘీక ఉద్యమానికి ముస్లింలు చేయుత నిచ్చారు. సంతాల్ తిరుగుబాటు, నీలిమందు ఉద్యమం కాలంలో ఆదివాసుల పక్షాన వున్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫెరెన్స్ లో అంబేడ్కర్ ప్రతిపాదించిన  ఎస్సీల రిజర్వేషన్ కు ముస్లింలు మద్దతు పలికారు. రాజ్యాంగ సభలోనికి ప్రవేశించడానికి అంబేడ్కరుకు దారి కల్పించారు. ఇలాంటి సామాజికవర్గాల ఐక్యత ఇప్పుడొకటి ఏర్పడాలి. అలా మొదలయ్యే ఐక్య సంఘటన విశాలంగా మారి మళ్ళీ 80 శాతానికి చేరుకోవాలి.  

 

18 మార్చి 2023

No comments:

Post a Comment