*తెలుగు భాషను ప్రచారం చేసే బాధ్యతను
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Thursday, 31 August 2023
Telugu entrepreneurs should promote Telugu Novels and stories
వాణిజ్య,
వ్యాపారవేత్తలు స్వీకరించాలి!*
బ్రిటన్ పెట్టుబడీదారులు
తమ అవసరాల కోసం ఇంగ్లీషును ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రచారం చేశారో చెప్పడానికి ఎక్కడో
ఒక సంఘటనను చదివాను. బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం సాగుతున్న కాలంలో ఛార్లెస్
డికెన్స్ రచయితగా వున్నాడు. ఆయన ఒక రకం కమ్యూనిస్టు. ఆయనకు పెట్టుబడీదారీ వ్యవస్థ
పడదు; పెట్టుబడీదారులకు ఆయనంటే నచ్చదు. కానీ, డికెన్స్ వారంవారం ఒక థియేటరులో తన
రచనల్ని స్వయంగా చదివి వినిపించేవాడు. దానికి సంపన్న కుటుంబాలవాళ్ళు టిక్కెట్టు
కొని వచ్చి వినేవారు. ‘టేల్ ఆఫ్ టూ సిటీస్’ నవలలో రాచరిక వ్యతిరేకురాలైన మేడం డీఫార్జ్
వంటి మహిళా గెరిల్లా పాత్రను వర్ణిస్తుంటే సంపన్నవర్గాల స్త్రీలు కొన్ని సందర్భాల్లో
తట్టుకోలేక మూర్చపోయేవారట. అయినప్పటికీ
డికెన్స్ నవలల్ని వాళ్ళు ప్రమోట్ చేసేవారట. ఎందుకటా? వాళ్ళకు అందులో ఒక మారకపు
విలువ కనిపించింది. డికెన్స్ నవలల్లో పాత్రలు చాలా వినసొంపుగా మాట్లాడుకుంటాయి. ‘గ్రేట్
ఎక్స్ పెక్టేషన్’ లో ప్రొటోగోనిస్టు పిప్ చిన్న
పట్టణం నుండి లండన్ మహానగరానికి వచ్చి ఓ అడ్వకేట్ ఇంటికి వెళ్ళడానికి జట్కా
ఎక్కుతాడు. జట్కావాడు ఆ అడ్వకేట్ ఇల్లు తనకు తెలుసనీ, ఆయన చాలా మంచివారని
చెపుతాడు. అడ్వకేట్ ఇంటికి చేరాక “వారు ఆఫీసులో వున్నారు లైటు వెలుగుతోంది. మీరు
అదృష్టవంతులు. సరైన సమయంలో వచ్చారు” వంటి వినయపూర్వక మెచ్చుకోలు మాటలు చెపుతాడు. అప్పుడు
పిప్ “నీ సేవలకు నేను ఎంత రుణపడివున్నానూ?” అని అడుగుతాడు. ఆ జట్కావాడు ఇంకా చతురతతో “సాధారణంగా ఐదు పెన్నీలు
ఇస్తారండి; మీరు ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం” అంటాడు. ఇంత సంస్కారంతో ఎవ్వరూ
ఎక్కడా మాట్లాడుకోరు. కానీ ఇంగ్లండ్ వాసులు సంస్కారవంతులు అని ప్రపంచం నమ్మాలంటే
డికెన్స్ నవలల్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాలనుకున్నారట ఆనాటి బ్రిటీష్
పెట్టుబడీదాడులు.
తెలుగును తెలుగు సమాజం
కూడ ఆదరించడంలేదు. ఇంగ్లీషు, హిందీలను పక్కన పెట్టినా కన్నడ, మలయాళ, తమిళ భాషలతో
పోల్చినా తెలుగు పుస్తకాలు చదివేవారు చాలాచాలా తక్కువ. కవితా సంకలనాలను కవులు
పంచుకుంటూ తిరగడమేతప్ప కొని చదివేవారు వుండదు. కథా సంకలనాలదీ దాదాపు అదేస్థితి.
నవలలు తెలుగులో పెద్దగా రావడంలేదు. తెలుగు కథలు, నవలల్ని అలా ఇతర ప్రాంతాల్లో
పంపిణీ చేయాలి. ఆ బాధ్యతను తెలుగు వాణిజ్య వ్యాపార వేత్తలు చేపట్టాలి.
-
డానీ
సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
Remembering Gidugu Ramamurthy -
*గిడుగును అందుకు స్మరించుకోవాలి !*
ప్రభుత్వం గిడుగు రామ్మూర్తిని స్మరించుకోవడం గొప్ప విషయం. అయితే దాన్ని 'వ్యవహారిక భాష దినోత్సవం' అని అంటే బాగుండేది. కనీసం 'వ్యవహారిక తెలుగు భాష దినోత్సవం' అన్నా బాగుండేది. ‘తెలుగు భాషాదినోత్సవం’ అన్నారు. గిడుగు రామ్మూర్తి కన్నా అనేక శతాబ్దాల ముందే తెలుగు భాష పుట్టింది. తెలుగును మనం ప్రాచీన భాషల్లో ఒకటి అంటున్నాం. గిడుగు ప్రత్యేకత ఏమంటే నియత విద్యా వ్యవస్థలో పాఠ్యాంశాలను వ్యవహారిక భాషలో బోధించడానికి మహత్తర కృషి చేయడం.
తెలుగు భాష గొప్పది. అందమైనది. పశ్చిమదేశాల్లో ఇటాలియన్ భాష వినడానికి సొంపుగా ఉంటుంది అంటారు. తూర్పుదేశాల్లో తెలుగు వినడానికి అంత సొంపుగా ఉంటుంది. తెలుగు నేర్చుకున్నందుకు, తెలుగులో రాస్తున్నందుకు నాలాంటివాళ్ళకు చాలా ఆనందంగా గర్వంగా ఉంటుంది.
వ్యవహారిక భాషలో కూడ ఒక ప్రామాణికీకరణ (స్టాండర్డైజేషన్) సాగింది. విజయవాడ కేంద్రంగా, సినిమా మాధ్యమంలో ఇది పెరిగింది. ఆ స్థాయిని దాటి స్థానిక యాసలో రాసే ధోరణి వచ్చింది. నిజానికి యాస ధోరణి ఉత్తరాంధ్రాలో మొదలయిందిగానీ తెలంగాణ ప్రాంతంలో ఇది ఒక ఉద్యమ స్థాయికి చేరింది. ఇప్పుడు రాయలసీమ రచయితలు తమ ఉనికిని చాటుకుంటున్నారు. అలాగే గోదావరి జిల్లాలవారూ ప్రయత్నిస్తున్నారు.
అయితే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ఒక్కటేనా వ్యవహారిక భాష? మొన్నటి ప్రభుత్వ ఉత్సవాన్ని కొందరు 'మాతృభాషా దినోత్సవం' గా కూడ ప్రకారం చేశారు. రాష్ట్రంలో ఇంకో 15 వ్యవహారిక భాషలు, మాతృభాషలు ఉంటాయి . వాటికి ఉత్సవాలు జరపదా ప్రభుత్వం?. ఇది ఏ సంకేతాన్ని ఇస్తుంది? ఆ భాషల గతి ఏంకానూ? ఆ భాషల్లో ఇటీవలి కాలంలో వచ్చిన పరిణామాల గురించి మాట్లాడరా? ఆ భాషల్ని అధికారికంగా నిర్దయగా చంపేస్తారా?
ఒకరు దేశప్రజలందరూ హిందీలో (మాత్రమే) మాట్లాడాలంటారు. మరొకరు తెలుగులో (మాత్రమే) బోధించాలంటారు. ఇంకొకరు తమ మతాన్ని మాత్రమే అనుసరించాలంటారు. ఇవన్నీ అతివ్యాప్తి దోషాలు. ఆధిపత్యవాదనలు. ఒక భాషను అధికార భాషగా గుర్తిస్తే మిగిలిన భాషలు శ్రామిక భాషలైపోతాయన్న తర్కం ఇతరులకు తెలియకపోవచ్చు కానీ ప్రజాస్వామిక వాదులకు, నూతన ప్రజాస్వామిక వాదులకు స్పష్టంగా తెలుసు. వాళ్ళూ ఈ వరదలో కొట్టుకుపోతున్నారు. మాతృభాషలో విద్యాబోధన అనే ఆదర్శం ఆచరణలో అధికారభాషలో విద్యాబోధనగా మారి కొత్త వివాదాలను సృష్టిస్తోంది.
నియత విద్యలో ప్రవేశానికి, తరగతి గది సంస్కృతి అలవాటు కావడానికి ప్రాధమిక దశలో మాతృభాషలో బోధన చాలా అవసరం. అక్కడయినాసరే ఎవరికి ఎవరి మాతృభాషలో బోధించాలనే ప్రశ్న కూడ తలెత్తుతుంది. ప్రాధమిక విద్య స్థాయిలో ప్రతి ఒక్కరికి కనీసం మూడేళ్ళయినా వారివారి మాతృభాషలల్లో మాత్రమే బోధించాలి. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరాలి. అవసరం అయితే ఉద్యమించాలి.
ఇంట్లో ఉర్దూ మాట్లాడుకునే ముస్లిం పిల్లలు స్కూళ్లలో తొలి దశలో తెలుగు మాధ్యమాన్ని తట్టుకోవడానికి ఇబ్బందులు పడతారు. ఒక అదనపు భాషను నేర్చుకుంటున్నందుకు వాళ్లను మెచ్చుకోవాలి. కానీ, అలా ఎవ్వరూ చేయరు. పైగా, ఉర్దూ ప్రభావిత ఉఛ్ఛారణతో తెలుగు మాట్లాడుతున్నందుకు అవహేళనకు గురిచేస్తారు. ఈ వివక్ష కారణంగా వాళ్ళు మొత్తం నియత విద్యనే మానేస్తారు. ఈ సమస్య ముస్లింలకు మాత్రమేకాదు; అధికార భాషేతర సమూహాలందరికి ఉంటుంది.
భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడి దాదాపు 70 ఏళ్ళు అవుతున్నాయి. పార్లమెంటులో చర్చలు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల్లో వాదనలు తీర్పులు, జాతీయ టీవీల్లో డిబేట్లు అన్నీ ఇంగ్లీషులోనే కొనసాగుతున్నాయి. అంటే ఇంగ్లీషు మన రాజభాష అన్నమాట. ఇంగ్లీషును రాజభాషగా తొలగించి హిందీను రాజభాషగా మార్చేందుకు సంఘపరివారం ప్రయత్నిస్తున్నది. ఈ మధ్య భారత శిక్షాస్మృతికి హిందీ పేర్లు పెట్టడం ఒక వివాదంగా మారింది. ఓ నాలుగు రాష్ట్రాల హిందీ బెల్టులోతప్ప మిగిలిన భారత దేశంలో హిందీకన్నా ఇంగ్లీషే అనుసంధాన భాషగా వుంటుంది.
ఎక్కడో అరుదుగా ఓ అధికారి ప్రయోగాత్మకంగా తెలుగులో ఉత్తర్వులు జారీచేసిన సంఘటనలుంటాయి. అందులో కఠిన గ్రాంధిక భాష వుంటుంది. అది సామాన్య ప్రజలకు అర్ధంకాదు. ఆ కృతక తెలుగు భాషకన్నా ఇంగ్లీషే మేలేమో అనిపిస్తుంది. అది గిడుగుకు అపచారం. మొన్నటి తెలుగు భాషాదినోత్సవానికి ప్రచురించిన ఆహ్వానపత్రంలోనే అనేక తప్పులున్నట్టు సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి.
ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో, ఓ మూడేళ్ళ ప్రాధమిక విద్య ముగియగానే అందరూ ఇంగ్లీషు మీడియంకు మారిపోవడమే మేలు. ఎవరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశంలో ఇంగ్లీషు ఒక సామాజిక పెట్టుబడి. దానికి గొప్ప మారకపు విలువవుంది. దాన్ని సరుకు అన్నా తప్పుకాదు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ టెక్నాలజీ మొత్తం ముందు ఇంగ్లీషులోకి మారుతుంది. దాన్ని వెంటనే తెలుగులోనికి మార్చగల యంత్రాంగం మనకు లేదు. ఆ మేరకు తెలుగు మీడియంలో చదివినవాళ్లు వెనుకబడిపోతున్నారు. పైగా సంభావిత (conceptual) వ్యక్తికరణకు తెలుగులో చాలా పరిమితులున్నాయి. కృతకంగా అనువాదం చేసినా అవి చాలామందికి అర్ధం కావు.
మాతృభాష వేరు; బోధన భాష వేరు, బతుకు తెరువు భాషావేరు. చాలా మంది వీటిమధ్య తేడాను గమనించలేకపోతున్నారు. నియత విద్య బతుకు తెరువు కోసమే ఉంటుంది. సులువుగా ఉద్యోగాలు వస్తాయనే నమ్మకం కలిగించే కోర్సులు, సబ్జెక్టులు, మీడియంనే విద్యార్థులు ఎంచుకుంటారు. అభిరుచి మేరకు నియత విద్య చదివేవారు చాలాచాలా అరుదుగా మాత్రమే వుంటారు.
1970 వ దశకంలో బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు బాగా పెరిగాయి. అందరూ కామర్స్ చదివి బికాం డిగ్రీ పట్టుకుని బ్యాంకుల్లో చేరేవారు. 1985 తరువాత ఐటి ఉద్యోగావకాశాలు పెరిగాయి. అందరూ అటుకేసి పరుగులు తీయడం మొదలెట్టారు. పట్టుబట్టి జావా, సి ప్లస్ ప్లస్, పైథాన్, రూబీ, స్విఫ్ట్, రస్ట్ మొదలయిన ఓ ఇరవై కొత్త సాంకేతిక భాషలు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ (ఏఐ) వచ్చింది. దాని వెనుక పరుగులు మొదలయ్యాయి. అందులో తెలుగు ఇంకా అభివృధ్ధికాలేదు. సరైన ఇన్ పుట్ ప్రాంప్ట్ లేకుండా మేలైన అవుట్ పుట్ రాదు. తెలుగు లో ప్రాంప్ట్ ఇవ్వడానికి ఎంతకాలం పడుతుందో చెప్పలేం.
ఇంగ్లీషు మాధ్యమానికి ఉద్యోగావకాశాలు ఎక్కువకాబట్టి మెరుగయిన జీవితం కోసం పేదలు సహితం తమ పిల్లలను ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్లలో చేరుస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజుల్ని తట్టుకోలేక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరుతున్నారు. అది చాలా సమంజసమయిన కోరిక. అదొక అవసరమైన ఉద్దీపన చర్య.
ఇప్పటి ఉపాధ్యాయులకు వుండే నైపుణ్యం ఒక్కటే; పరీక్షల్లో ఎక్కువ మార్కుల్ని సాధించే చిట్కాల్ని విద్యార్ఢులకు బోధించడం. దీనికి ప్రభుత్వ రంగం, ప్రైవేటు రంగం అనే తేడాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెడుతున్నారనగానే ఇంగ్లీషు మాధ్యమంలో బోధించే సత్తాలేని ప్రభుత్వ ఉపాధ్యాయిలకు హఠాత్తుగా తెలుగు భాషాభిమానం గుర్తుకు వచ్చింది. నిజానికి వారిలో చాలామందికి తెలుగును బోధించడం కూడా సరిగ్గా రాదు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలు ఓ ఉద్యమంగా భుజాన వేసుకున్నాయి. ఇదో ట్రేడ్ యూనియన్ వ్యవహారం.
ఈమధ్యన ఒక తెలుగు భాషాభిమాని గ్రామ సచివాలయం వాలంటీర్ల వ్యవస్థ మీద విరుచుకుపడ్డారు. వాళ్ళు ఇంటర్మీడియట్ లో సెకండ్ లాంగ్వేజ్ గా సంస్కృతం చదివి వచ్చారుగాబట్టి వారికి సంస్కృతంలో పరీక్షలుపెట్టాలని ఓ సవాలు విసిరారు. ఇంటర్మీడియట్ పాసై 5 వేల రూపాయలకు కూలీపని చేస్తున్న వాలంటీర్స్ ను సంస్కృతంలో పరీక్షలు పెట్టమనడం దేనికీ? తెలుగు ఎంఏ చదివి నెలకు లక్ష రూపాయల జీతం తీసుకుంటున్న ప్రభుత్వ తెలుగు టీచర్లు అందరినీ ‘మణిపూర్ లో జాతిహననం’, ‘ఉమ్మడి పౌర స్మృతి’, ‘హిండేన్ బర్గ్ రిపోర్టు’ వంటి ఏదో ఒక బర్నింగ్ టాపిక్ మీద అందమైన వ్యవహారిక తెలుగు భాషలో వెయ్యి పదాల వ్యాసం ఒకటి రాయమంటే పోలా? ఎవరికి ఎంత తెలుగు తెలుసో తేలిపోతుంది.
భాషోత్సవాల్లో గిడుగు పేరిట కవులను ఎందుకు సత్కరిస్తారో నాకు అర్ధంకాదు; అందులో పద్యకవులను కూడ సత్కరిస్తుంటారు. గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ‘ప్రజామిత్ర’ కార్యాలయంలో పత్రికా సంపాదకులను సంబోధిస్తూ “ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆ భాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను” అన్నారు. కవిత్వ రచన అంతరించిపోతున్న ప్రక్రియ. కథ, నవల, వ్యాసాలు, ఉపన్యాసాలు మాత్రమే ఆధునిక సాహిత్య ప్రక్రీయలు. ఉపన్యాసాల్లో వ్యవహారిక శైలి చాలా అందంగా వుంటుంది.
గిడుగును తెలుగుకు మాత్రమే పరిమితం చేయడం ఇంకో చారిత్రక అపచారం. ఈనాటి మన సంకుచిత భాషాభిమానులకన్నా గిడుగు రామ్మూర్తి గొప్ప విశాల హృదయులు. లిపిలేని సవర భాషకు లిపిని సృష్టించారు. సవర భాషలో బోధించారు. బ్రిటీష్ అధికారుల్ని ఒప్పించి సవర భాషకు గుర్తింపు సాధించారు. అందుకు వారిని ప్రత్యేకంగా స్మరించుకోవాలి.
డానీ
సమాజ విశ్లేషకులు,
రచన : 31 ఆగస్టు
2023, హైదరాబాద్
ప్రచురణ : 1 సెప్టెంబరు 2023, దిశ డైలీ,
https://www.dishadaily.com/editpage/article-on-gidugu-rammurthy-248077
Sunday, 27 August 2023
Objective conditions and subjective efforts
భౌతిక పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
Kuki Zo boy at Relief camp in Aizawl, Mizoram on 7th August 2023
Objective conditions and
subjective efforts
భౌతిక
పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
పుట్టిన రోజు సందర్భంగా కొన్ని
వందల మంది సోషల్ మీడియా ద్వార శుభాకాంక్షలు తెలిపారు. సన్నిహిత మిత్రులు ఫోన్
కాల్స్ ద్వారనూ మరి కొందరు వ్యక్తిగతంగానూ కలిసి అభినందించారు. కొడుకులిద్దరు
వాళ్ల అభిరుచి మేరకు ఓ విందు జరిపారు.
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
గుంటూరు లక్ష్మీ నరసయ్య తదితరులు
నా గురించి చాలా గొప్పగా రాశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గొప్పతనం అంతా
నాదికాదని నాకు తెలుసు. నేను పుట్టి పెరిగిన కాలానికీ, ఆయా దశల్లో నా పరిసరాల్లో
వున్నవారికీ నాకు బతుకు మార్గం చూపినవారికీ ఈ గొప్పతనంలో పెద్దవాటా దక్కుతుంది.
కష్టాల్లోవున్నవాళ్ళు, వివక్షకు గురయ్యేవాళ్ళు
అత్యంత సహజంగానే సమానత్వాన్ని కోరుకుంటారు. వీళ్ళు సహజ సామ్యవాదులు; ఆర్గానిక్
కమ్యూనిస్టులు. నా విషయంలోనూ అదే జరిగిందనుకుంటాను. పేదరికాన్ని అనుభవిస్తూ, బాలకార్మికునిగా
జీవితాన్ని ఆరంభించిన కారణంగా నేను చిన్నప్పటి నుండే సమానత్వాన్ని కోరుకునేవాడిని.
నన్ను ఎవరూ ఓదార్చనందుకేనేమో మరొకర్ని ఓదార్చడంలో నాకు చాలా ఆనందం
కలుగుతుంది.
కార్ల్ మార్క్స్ పేరు కూడ
వినకుండానే, పేదోళ్ల ఆవేదన, వున్నోళ్ల అత్యాశను ఘర్షణ అంశంగా తీసుకుని ‘ప్రగతి’
నాటిక రాశాను. దానికి ధవళా సత్యంగారు
దర్శకత్వం వహించారు. ఎంజి రామారావుగారు చాలా ప్రోత్సహించారు. వారే మాక్సిమ్ గోర్కి
‘అమ్మ’ నవలను నాకు బహుమతిగా ఇచ్చారు. అందులో నాకేదో జీవనమార్గం కనిపించింది. ఆ తరువాత
మరికొన్ని నాటకీయ మలుపులు తిరిగి ఎమర్జెన్సీ తరువాత నన్ను నక్సలైట్ గా మార్చింది. ఆ
తరువాతి కథ మీకందరికీ తెలుసు.
సాహిత్యం నేరుగా సమాజాన్ని
మార్చలేదుగానీ పాఠకుల ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. కొత్త ఆలోచనలతో పాఠకులు
సమాజాన్ని మార్చే శక్తిని పుంజుకుంటారు. అలా సాహిత్యం పరోక్షంగా భౌతిక శక్తిగా
మారుతుంది.
“డానీ కథలు చదువుతుంటే ఇతను మిగతా వ్యాపకాలన్నీ వదిలి కథలు మాత్రమే రాసి ఉంటే తెలుగు సాహిత్యానికి గొప్ప కధకుడు లభించి వుండేవాడనిపిస్తుంది” అన్నాడు గుంటూరు
లక్ష్మీనర్సయ్య. చాలా ఆనందం వేసింది. లక్ష్మీనర్సయ్య వాక్యానికి తెలుగు సాహిత్య
విమర్శలో మంచి విలువ వుంది. అయితే, నేను సోషల్ యాక్టివిస్టుగా వుండడానికే ఎక్కువ
ఇష్టపడతాను. ఒక చారిత్రక సందర్భంలో అత్యవసరమైన అంశాన్ని ఇతర కథకులు రాయకపోవచ్చు అనుకున్నప్పుడు
మాత్రమే నేను కొన్ని కథలు రాశాను. భావోద్వేగాలను చిత్రించడానికి ఎన్నికథలయినా
రాయవచ్చు. రాజ్యాన్ని
మార్చాలనుకునే లక్ష్యం వుంటే రాజకీయ కథలు మాత్రమే రాయాలి అనే కోవకు చెందినవాడిని. నా
అభిప్రాయం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, రాజకీయంతోతప్ప రాజ్యాన్ని మార్చలేము.
విప్లవం ఒక రాజకీయ చర్య.
మన వ్యక్తిగత ప్రతిభ, నైపుణ్యాలు,
ఆశయాలు, లక్ష్యాలు అన్నింటినీ మన కాలం ప్రభావితం చేస్తుంటుంది. “అప్పుడు కాలం
కడుపుతో వుండింది; కార్ల్ మార్క్స్ ను కనింది” అన్నాడు మయకోవిస్కీ. చారిత్రక,
సామాజిక, తాత్విక పార్శ్వాలున్న కవిత్వ వ్యక్తీకరణ అది. భౌతిక వాస్తవికత; వ్యక్తిగత ప్రయత్నం
(Objective conditions and subjective efforts) రెండింటి మధ్య సమన్వయం కుదరాలి అన్నాడు
కార్ల్ మార్క్స్.
మా తరం స్వాతంత్య్రానంతర భారత
దేశంలో పుట్టింది. మేము హైస్కూల్ ను వదిలి కాలేజీలో చేరుతున్న కాలంలో నక్సల్ బరీ
ఉద్యమం మొదలయింది. రాజ్యాంగం ప్రవచించిన ప్రజాస్వామిక ఆదర్శాలకూ ప్రభుత్వాధినేతల
ఆచరణకు మధ్యనున్న వైరుధ్యాన్ని పరిష్కరించడానికే నక్సల్ బరీ గర్జించింది.
మొద్దుబారిపోతున్న భారత సమాజాన్ని మేల్కొల్పడానికి హైవోల్టేజ్ షాక్ ట్రీట్మెంట్
ఇచ్చాడు చారు మజుందార్. అనేక సంస్కరణలు, అనేక ఉద్దీపన చర్యలు నక్సల్ బరికి భయపడే
వచ్చాయి. నాటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నుండి, ఎన్టీ రామారావు కిలో బియ్యం రెండు
రూపాయాలు మొదలు జగన్ నవరత్నాలు వరకు అన్నీ నక్సల్ బరీ వెలుగులోనే వచ్చాయి. రాజ్యాంగ
ప్రవేశికలో సామ్యవాదం చేరింది కూడ నక్సల్ బరీ భయంతోనే. ఆ పక్కనే అనేక నల్ల చట్టాలు
కూడ వచ్చాయి. అది వేరే కత.
నేను సరైన కాలంలో పుట్టడంవల్లనే
కొండపల్లి సీతారామయ్య, కెజి సత్య మూర్తి, ఐవి సాంబశివరావులతో రాజకీయాల్లో కలసి
పనిచేయగలిగాను. పీపుల్స్ వార్ తో అనుబంధాన్ని నేను చాలా గొప్పగా ఆస్వాదించాను. శ్రీశ్రీ, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు,
కేవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్ లతో కలిసి పనిచేసే
అవకాశం దక్కింది. ఇక్కడ పేర్కొనాల్సిన మరో ఇద్దరు ముఖ్యులు ఆర్ ఎస్ రావు, ఎంటి
ఖాన్ గార్లు. వరవరరావుతో అనుబంధాన్ని నేను
ఒక వరంగా భావిస్తాను. అల్లం రాజయ్య, బిఎస్ రాములు, ఎన్ వేణుగోపాల్, అట్టాడ
అప్పల్నాయుడు తదితరులు నా సమకాలీనులు
కావడం గొప్ప అవకాశంగా భావిస్తాను. గొప్ప
సమకాలికులు లేకుండ ఎవరూ గొప్పవారు కాలేరు. విరసం బయట జిలుకర శ్రీనివాస్, భార్గవ
గడియారం, ఉసా నాకు ఇష్టం.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి మొదలు
నేటి ఎంఎల్, మావోయిస్టు పార్టీల వరకు అన్నీ సమసమాజ స్థాపన కోసం తమ ‘వ్యక్తిగత
ప్రయత్నాలను’ దాదాపు నిజాయితీగానే సాగించాయి. కానీ, భారత ‘సమాజ భౌతిక వాస్తవికతను’
అర్ధం చేసుకోవడంలో పాక్షికంగానో, సంపూర్ణంగానో అవి విఫలం అయ్యాయి. వివక్ష కేవలం
అర్ధిక రూపంలో మాత్రమే సాగదనీ, కుల, మత, తెగల, సాంస్కృతిక రూపాల్లో కూడా
సాగుతుందని స్వయంగా మార్క్స్ చెప్పిన మాటల్ని గుర్తించడంలో భారత కమ్యూనిస్టు
పార్టీలకు హ్యాంగోవర్ ఇబ్బందులున్నాయి. సిధ్ధాంత పరంగా ప్రాణప్రదమైన ఈ అంశాన్ని
పరిష్కరించుకోనంత వరకు ప్రస్తుత ఫాసిస్టు వ్యవస్థ విసురుతున్న సవాళ్ళను అవి
ఎదుర్కోలేవు. ఫాసిజం రూపంలో సాంస్కృతికమైనది; సారంలో ఆర్ధికమైనది. సాంస్కృతిక
రంగంలో అది ముస్లింలు, క్రైస్తవుల్ని అణిచివేస్తుంది. ఆర్ధిక రంగంలో దేశసంపదను అస్మదీయ
కార్పొరేట్లకు అప్పగించడానికి అది ముస్లింలు, క్రైస్తవుల్నేకాక, హిందూ సమాజాన్ని
సహితం అణిచివేస్తుంది.
కమ్యూనిస్టు పార్టీలు చేసే సైధ్ధాంతిక
చారిత్రక తప్పిదాలు వాటికే పరిమితంకావు; అవి సామ్యవాద సిధ్ధాంత ఆమోదాంశానికే ముప్పుగా
మారుతాయి. సరిగ్గా ఇక్కడే నేను కమ్యూనిస్టు పార్టీల నాయకులతో విభేధిస్తుంటాను.
మెయిన్ ల్యాండ్ ఇండియాలో 1984లోనే
మత యుధ్ధం మొదలయింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తెగ హననం కొనసాగుతోంది. ఈ పరిణామాల్ని
ఇప్పుడు ఎక్కువమంది గుర్తిస్తున్నారు.
ఉద్యమ జీవితంలో రెండుసార్లు చావు
నా ముందు కనిపించింది. చావు కొంచెం అందంగా వుండాలనే చిన్న కోరిక తప్ప చావుకు
భయపడింది ఎన్నడూ లేదు. యాధృఛ్ఛికంగా నేను పఠాన్ తెగకు చెందినవాడిని. మొరటోళ్ళం
అన్నమాట!
స్త్రీలు బాల్యంలో తల్లిదండ్రుల
నీడన, యవ్వనంలో భర్త నీడన, వృధ్ధాప్యంలో పిల్లల నీడన బతకాలనేది స్మృతి వాక్యం.
నన్ను బాల్యంలో మా అమ్మీ ప్రెజెంటబుల్ గా వుంచింది. యవ్వనంలో నా భార్య అజిత
ప్రెజెంటబుల్ గా వుంచింది. ఇప్పుడు కొడుకులిద్దరు కలిసి ప్రెజెంటబుల్ గా
వుంచుతున్నారు. కొన్ని అంశాల్లో నాకు స్వేఛ్ఛలేదు. నిన్నటి పార్టీ అలాంటిదే.
ఇటీవల మిజోరం వెళ్ళి శరణార్ధి
శిబిరాల్లో కుకీ జోలను పరామర్శించి వచ్చినందుకు చాలా మంది నన్ను
మెచ్చుకుంటున్నారు. పది మంది మిత్రుల గుప్త సహకారం లేకుండా ఈ పనిని నేను చేయగలిగి
వుండే వాడిని కాదు. అది objective condition. నేను వారందరికీ రుణపడి వున్నాను.
ఇలాంటి భౌతిక వాస్తవికత సహకరించినంతవరకు
నా వ్యక్తిగత ప్రయత్నానికి ఎలాంటి లోటు రానివ్వను. నా శక్తి సామర్ధ్యాలు
పరిమితమైనవని నాకు స్పష్టంగా తెలుసు. కష్టాల్లో వున్నవారిని పరామర్శించం ఒక్కటే
ఇప్పుడు నేను చేయగలుగుతున్న పని. ఆ
కర్తవ్యాన్నీ ఇకముందు కూడ ఎలాగూ చేస్తాను. అయితే, వాళ్ళను కష్టాల నుండి బయట పడేసే
శక్తి నాకులేదు. దానికి సమూహ శక్తి కావాలి. అయినప్పటికీ శరీరం మెదడు సహకరించినంత
వరకు నా subjective effortsకు లోటు రానివ్వను; అది ఎంతటి రిస్క్ అయినా సరే.
పుట్టిన రోజున ఇది నా కొత్త
నిర్ణయం.
మీ
ప్రేమాభిమానాల్ని కోరుకునే
ఉషా ఎస్ డానీ
27 ఆగస్టు 2023
with Kuki Zo boy at Relief camp in Aizawl, Mizoram on 7th
August 2023
Friday, 25 August 2023
Hallucinations and Four phone calls
ఒక చిత్తభ్రమ నాలుగు ఫోన్లు.
మీరు నామీద చాలా కోపంతో వున్నారు.
అది చాలా సహజం.
మీరు ఒక్కరే కాదు నన్ను చాలామంది ద్వేషిస్తారు.
స్వతహాగా నేను కొంచెం చెడ్డ వాడిని
చాలా అబధ్ధాలు చెపుతాను.
మహాభారతంలో వుండే భీష్ముడు నేను క్లాస్ మేట్లమి. ఆ విషయం
ఎవరికీ చెప్పను. నా వయస్సు తెలిసిపోతుందని భయం. నాకు పెళ్ళయిందనీ, పెళ్ళంతోపాటు
పెళ్ళీడుకు వచ్చిన కొడుకులు వున్నారని కూడ ఎవరికీ చెప్పను.
అడవుల్లో, కొండల్లో, మైదానాల్లో బికారీలా నడిచి నడిచి నా
తుంటి కీళ్ళు అరిగిపోయాయనీ, వాటిని తీసేసి కొత్తవి అమర్చాలని డాక్టర్లు
చెప్పినపుడు అది మీకు తెలియకుండ జాగ్రత్త పడ్డాను.
తుంటి కీళ్ళు అరిగిపోయిన వాళ్లను ఏ అమ్మాయీ ఇష్టపడదు కదా
అందుకన్న మాట!
ఇవన్నీ మిమ్మల్ని మోసం చేయడానికి ఒక పథకం ప్రకారం ఆడిన
అబధ్ధాలు.
అందంగావున్నారు; పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు.
రాస్తున్నారు; పాడుతున్నారు, ఉపన్యాసాలిస్తున్నారు, సెలబ్రెటిగా ఎదుగుతున్నారు.
స్థిరమైన ఉద్యోగం చేస్తున్నారు.
ఇన్ని గొప్ప లక్షణాలు వున్నామెను ఎవరూ వదులుకోరుకదా!
మీకు కొంచెం అమాయికత్వం కూడ వుంది. బుట్టలో వేసుకోవడం సులువు.
నాది కొంచెం మొరటు వ్యవహారం.
బుర్ర తక్కువ; భ్రమలు ఎక్కువ.
తరచూ చిత్తభ్రమలు కూడ వస్తుంటాయి.
Hallucinations అన్నమాట.
మీరు నాకు రాధాకృష్ణుల ప్రేమ పెయింటింగ్స్ పంపిస్తున్నట్టు
ప్రతి రోజూ ఉదయం చిత్తభ్రమ కలిగేది.
ఒకరోజు ఏకంగా మిక్కి మౌస్, అతని భార్య కలిసి రాక్ అండ్ రోల్
డాన్సు చేస్తున్న ఫొటోను మీరు పంపినట్టు చిత్తభ్రమ కలిగింది.
దానికింద “హమ్ ఔర్ ఆప్” అని క్యాప్షన్ రాసినట్టూ అనిపించింది.
ఈ చిత్తభ్రమ నాకు నచ్చింది.
పిచ్చోళ్లకు ఇలాంటి భ్రమలు బాగా నచ్చుతాయిగా.
ఆ తరువాత నా చిత్తభ్రమల స్థాయి పెరిగింది. మెడికల్ భాషలో
క్రానిక్ దశ అంటారు.
నా భార్య నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) తీసుకొమ్మని
మీరు ఫోన్ చేసి అడిగినట్టు ఒకరోజు చిత్తభ్రమ కలిగింది.
కొంచెం చదువు తక్కువ కావడాన NOC కి నాకు సరైన అర్ధం
తెలియలేదు. మిమ్మల్ని పెళ్ళి చేసుకోవడానికి నా భార్య నుండి అనుమతి
తీసుకొమ్మంటున్నారని అనుకున్నాను.
మీరేమీ తప్పుగా అనుకోవద్దు;
పిచ్చోళ్లకు అలాంటి వైల్డ్ ఆలోచనలు వస్తుంటాయి లెండి.
ఆ చిత్తభ్రమలోనే నేను నా భార్యను NOC అడిగేశాను.
నాలాగ ఆమెకు
చిత్తభ్రమలు లేవు. చెడామడా చెత్తగా తిట్టేసింది.
అక్కడితో ఆగకుండ ఫోన్ చేసి మీకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చేసింది.
మీకూ చిత్తభ్రమలు లేవు; మీరు చాలా ప్రాక్టికల్ వుమన్.
మీ గురించి మీ అనుమతి లేకుండా ఏవేవో ఊహించుకున్నందుకు నామీద
పరువునష్టం దావా వేయమంటూ అడ్వకేట్ కు ఫోన్ చేశారు.
నా భార్య నాకు ఫోన్ చేసింది.
“మనిద్దరికి కుదరదు. నువ్వు ఆమెతోనే సెటిల్ అవ్వు. గుడ్ బై
“అంది.
నన్ను విడిచి నా భార్య వెళ్ళిపోయింది. మీ అడ్వకేట్ పంపిన
నోటీసు వచ్చింది.
రచన : 25 ఆగస్టు 2023
Thursday, 17 August 2023
Manipur is a teaser only; IMAX movie is ahead!
Manipur is a
teaser only; IMAX movie is ahead!
మణిపూర్ టీజర్ మాత్రమే;
ఐమాక్స్ సినిమా ముందుంది!
భారతదేశం అంతటా ఇవ్వాళ చర్చనీయాంశంగా మారిన రాష్ట్రాలు
మణిపూర్, హర్యాణ. ఒకచోట క్రైస్తవులు, ఇంకోచోట ముస్లింలు బాధితులు. మతమైనారిటీలను వేధిస్తుంటే
హిందూ ఓటు బ్యాంకు ధృవీకరణ చెంది ఎన్నికల్లో బిజేపికి విజయాన్ని సాధించి పెడుతోంది.
ముస్లింలనేకాదు; క్రైస్తవుల్ని కూడ వేధిస్తామని 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రచారం
చేసి మూడోసారి ప్రధాని అవ్వాలని నరేంద్ర మోదీజీ సిధ్ధం అవుతున్నారని అందరికీ తెలుసు.
కానీ, అసలు స్కెచ్ ఇంతకన్నా చాలా పెద్దదని చాలామందికి తెలీదు.
మణిపూర్ ఒక విధంగా చతురస్రాకారంలో వుంటుంది.
రాష్ట్రానికి నాలుగు సరిహద్దుల్లోనూ ఎత్తైన
కొండలుంటాయి మధ్యలో లోయ వుంటుంది. రాజధాని ఇంఫాల్ కూడ లోయ ప్రాంతంలో వుంటుంది. రాష్ట్రంలో
మెజారిటీ సామాజికవర్గంగా భావించే మెయితీలు లోయలోనే వుంటారు. మైనారిటీలుగా భావించే కుకీ జో తెగలు రాష్ట్రం చుట్టు
వున్న కొండ ప్రాంతాల్లో వుంటారు.
బయటివారు సాధారంణంగా భావిస్తున్నట్టు మెయితీలందరూ
హిందువులు కాదు. వారిలో క్రైస్తవులు, ముస్లింలు కూడ వున్నారు. మెయితీలు చర్చీల దహనం
కార్యక్రమాన్ని మొదలెట్టినపుడు మెయితీ క్రైస్తవుల చర్చీల జోలికి పోలేదు. అయితే మెజారిటీ
మెయితీలు హిందువులు. వారిలో వర్ణవ్యవస్థ కూడ కొనసాగుతోంది.
కుకీ జో ల మాతృభాష మిజావు. ఇంగ్లీషు ధారాళంగా
మాట్లాడుతారు. అంతేకాదు; హిందీని వ్యతిరేకిస్తారు. వాళ్ళు క్రైస్తవులు కావడం మాత్రమేగాక,
ఉత్తర భారతదేశంలో వుంటూ హిందీని దూరంగా వుంచడం కూడ సంఘపరివారానికి చిరాకు కల్పించే అంశంగా మారింది.
ఈశాన్య రాష్ట్రాల్లోని ఎస్టీలకు దేశంలోని ప్రతిష్టాత్మక
విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు వుంటాయి. ‘సానుకూల వివక్షను’ సద్వినియోగం చేసుకున్నకుకీ జో, నాగ తెగలు క్రమంగా
ప్రభుత్వ యంత్రాంగంలో కీలక స్థానాలకు చేరుకున్నారు. మొన్నటిదాక మణీపూర్ డిజిపిగా వున్న
పి దౌంగెల్ కుకీ జో తెగకు చెందినవారే. విశ్వవిద్యాలయాల్లోనూ కుకీ జో, నాగ ప్రొఫెసర్లు
పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. కుకీ జో, నాగ తెగల అభివృధ్ధిని చూసి మెయితీలు ఈర్ష్యా ద్వేషాలను
పెంచుకున్నారు.
ఆర్ధిక బలహీనవర్గాలకు (EWS) గత ఎన్నికలకు ముందు
కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు కూడ మెయితీలను సంతృప్తి పరచలేదు.
ప్రస్తుత చట్టాల ప్రకారం అటవీ భూముల మీద సమస్త అధికారాలు కుకీ జో, నాగ తదితర తెగలవి.
అక్కడ మెయితీలు భూములు కొనడానికి వీల్లేదు. అటవీ భూములపై మెయితీలకు హక్కు దక్కాలంటే
వారికి ఎస్టీ హోదానివ్వాలి. అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్ర
సింగ్ మెయితీలకు ఎస్టీ గుర్తింపునివ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంవి మురళీధరన్ మార్చి
27న మెయితీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఏప్రిల్ 19న
బయటికి వచ్చింది. అప్పటి నుండి ఎస్టీలు ఆందోళన బాట పట్టారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ATSUM) హైకోర్టు ఉత్తర్వులకు
వ్యతిరేకంగా మే 3న ‘గిరిజనుల సంఘీభావ యాత్ర’ కు పిలుపిచ్చింది. అక్కడి నుండి మణిపూర్
లో హింసాత్మక సంఘటనలు ఆరంభమయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తమను భిన్న జాతులుగా
భావిస్తారుగానీ, భారతీయులు అనుకోరు. చాలా మంది ఆధార్ కార్డ్ కూడ తీసుకోరు. ఆధార్ కార్డు
తీసుకుంటే తమను భారతీయుల జాబితాలో పడేస్తారని వాళ్ళు భయపడతారు. కశ్మీర్ లోయలోనూ ఇలాగే
వుంటుంది. కశ్మీర్ లోయ ప్రజలంతా ఒకే జాతి అని
వాళ్లు భావిస్తారు. తమ భూభాగాన్ని సగం పాకిస్తాన్, సగం ఇండియా ఆక్రమించుకున్నాయనే భావనతో
వుంటారు.
కుకీ జోలు మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల్లోని
గిరిజనులంతా సాధారణంగా శాంతి కాముకులు. మౌనంగా వుంటారు. ఇతరులు తమ జోలికి వస్తే మాత్రం
ఉగ్రులైపోతారు. సాంప్రదాయకంగా వాళ్ళు సైనిక జాతి (Warrior Tribe / Martial Tribe). ఆయుధాలు వాడడంలో నేర్పరులు. హైకోర్టు ప్రకటన వెలువడగానే
ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కుకీ జోల నుండి లైసెన్సు
ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మరో వైపు మెయితీలు పోలీసు స్టేషన్ల నుండి 6 వేల ఆయుధాలను
ఎత్తుకుపోయారు. బుల్లెట్లు అయితే లక్షల సంఖ్యలో ఎత్తుకుపోయారట. ముఖ్యమంత్రి సూచనల మేరకు
పోలీసులే స్వఛ్ఛందంగా మైతీలకు ఆయుధాలను సరఫరా చేశారనే మాట మణిపూర్ లో పెద్ద ప్రచారంలో
వుంది. పోలీసులు తోడుగావున్నా, ఆయుధాలు చేతిలోవున్నా తగిన శిక్షణలేని మైతీలు వాటిని
ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారు. ఆ అసహనంతో కుకీల ఇళ్లను తగుల బెట్టారు. మహిళల మీద
లైంగిక దాడులు జరిపారు. మరోవైపు, కుకీ జోలు తమ యుధ్ధ నైపుణ్యంతో నాటు తుపాకులతోనే మైతీల
మీద భీకరంగా ప్రతిదాడి చేశారు.
చూరచందాపూర్ జిల్లాలోని కుకీ జో మహిళలు, పిల్లలు
పక్క రాష్ట్రమ్జైన మిజోరంకు శరణార్ధులుగా వెళ్ళిపోయారు. కుకీ జో పురుషులు ఇంటికొకరు
చొప్పున స్వఛ్ఛంద సైనిక దళంగా మారి వంతుల వారీగా ప్రతిదాడి సాగిస్తున్నారు. దానిని
తట్టుకోవడం మైతీలకు సాధ్యం కావడంలేదు.
శరణార్ధులుగా వచ్చిన కుకీ జోలను మిజోరంలోని మీ
జోలు అక్కున చేర్చుకున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 40 వేల మంది కుకీ జోలు మిజోరంకు
తరలి వచ్చారు. శరణార్ధుల కోసం మిజోరం రాజధాని నగరం ఐజ్వాల్ లో ఇటీవల లక్షమంది సంఘీభావ
యాత్ర జరిపారు. కుకీ జోలు, మీ జోలు ఒకే తల్లి బిడ్దలుగా భావిస్తారు. మణిపూర్ ప్రభుత్వానికి కుకీ జోలు వద్దనుకుంటే చూరచందాపూర్
తదితర జిల్లాలను తమకు ఇచ్చేయాలనీ, తాము ‘గ్రేటర్ మిజోరం’ ఏర్పాటు చేసుకుంటామని మిజో
నేషనల్ ఫ్రంట్ కు చెందిన మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు.
-ఆయన ప్రస్తుతం ఎన్డీఏలో వున్నారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో
విభేదిస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో మణిపూర్ హింసమీద తీవ్రంగా
మాట్లాడారు. ఎన్డీయేకు తమది అంశాలవారీ మద్దతు మాత్రమేనని ప్రకటించారు. ఇక ‘గ్రేటర్
మిజోరం’ అంశాన్ని ముందుకు తెస్తే
మోదీ, అమిత్ షాలకు రాజకీయంగా కొత్త సమస్యలు తప్పవు.
మణిపూర్ కు ఉత్తరాన వున్న నాగాలాండ్ రాష్ట్రంలోనూ అనేక
కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మణిపూర్ ఉత్తరాన వుండే కాంగ్ పోక్పీ
(Kangpokpi), సేనాపతి జిల్లాల్లో కుకీ జోలు, నాగాలు వుంటారు. ఈ
రెండు తెగల మధ్య 1984లో కొన్ని ఘర్షణలు జరిగాయి. అందులో కుకీ జోలు ఎక్కువగా
నష్టపోయారు. దానికి గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రోజు బ్లాక్ డే
నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. ఆదివాసీ తెగల మధ్య ఐక్యత బలంగా పెరుగుతోంది.
ప్రస్తుత మెయితీ-కుకీ జోల ఘర్షణలో నాగ
తెగ తటస్థంగా వుంటోంది. మణిపూర్ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు
సభ్యుల్లో ఒకరు మెయితీ, మరొకరు నాగ. కుకీలకు లోక్ సభలో ప్రాతినిధ్యంలేదు. కుకీ
జోలకు ఇప్పుడు నాగ తెగల సహకారం చాలా అవసరం.
కుకీ జోలు బ్లాక్ డేను విరమిస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తేచాలు
వాళ్లను అన్ని విధాలుగా ఆదుకోవడానికి నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో (Neiphiu Rio) సిధ్ధంగా వున్నారు.
ఆయన ఇప్పటికే ఆదివాసులు, క్రైస్తవుల్ని ఉమ్మడి పౌరస్మృతి నుండి మినహాయించాలని
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు, బ్లాక్ డేను విరమించడానికి కుకీ జోలు కూడ
సిధ్ధంగా వున్నారు. నాగాలు కుకీ జోలు ఏకమైతే మణిపూర్ లోయలోని మైతీలకు మరిన్ని
కష్టాలు వస్తాయి. కోల్ కటా నుండి మణిపూర్ వెళ్ళే రోడ్డు మార్గం నాగాలాండ్ మీదుగా
వెళుతుంది. ఆ మార్గాన్ని నాగాలు కుకీ జోలు అడ్డుకుంటే మణిపూర్ లోయకు సరఫరాలన్నీ
ఆగిపోతాయి. అప్పుడు, ఎయిర్ లిఫ్ట్ ఒక్కటే శరణ్యం అవుతుంది.
ఘర్షణల మొదటి దశలో కుకీ జోలు ఎక్కువ మంది చనిపోయారుగానీ
ఇప్పుడు వాళ్ళు జరుపుతున్న ప్రతిదాడిలో చనిపోతున్న మైతీల సంఖ్య కూడ తక్కువగా ఏమీలేదు. పరువుపోతుందని ఆ విషయాన్ని మైతీలు బయటికి చెప్పుకోవడంలేదు.
సైనికంగా, నైతికంగా, భౌతికంగా ఇంతటి పరాజయాన్ని పరాభవాన్నీ మూటగట్టుకోవాల్సి వస్తుందని
మైతీలు ఊహించి వుండరు. వాళ్ల కథ అడ్డం తిరిగింది.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్
మే 3న నిర్వహించిన ‘గిరిజనుల సంఘీభావ మార్చ్’ వల్ల హింస చెలరేగిందని మైతీలు ఆరోపిస్తున్నారు.
మణిపూర్ హైకోర్టు మార్చి 27న మెయితీలను ఎస్టి
జాబితాలో చేర్చడంవల్ల కుకి జో తదితర ఆదివాసి సమూహాల ఉనికికి ముప్పు ముంచుకు వచ్చిందని
ట్రైబల్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది కారణం? ఏది ప్రభావం? ఇదీ ప్రస్తుతం
మణిపూర్ లో సాగుతున్న ఎడతెగని వేదాంత చర్చ.
కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లోని అటవీ ప్రాంతం
– కొండప్రాంతం కావాలి. కుకీ జో లను అక్కడి నుండి తరిమేయాలి. ఆ ప్రాంతాన్ని అస్మదీయ
కార్పొరేట్లకు దారదత్తం చేయాలి. దానికోసం మైతీలను పావులుగా వాడింది. వాళ్ల ప్లాన్
- ఏ విఫలం అయింది. అయితే, వాళ్ల దగ్గర ప్లాన్ – బి కూడ వుంది.
మణిపూర్ మంటల మీద ప్రధాని మోదీజీ నెలల తరబడి
మౌనం వహించడం మీద చాలా కథనాలు వచ్చాయి. వారు ప్లాన్ -బి అయిన అటవీ భూముల (పరిరక్షణ)
సవరణ బిల్లు – 2023 ను రూపొందించే పనిలో తీరిక లేకుండ వున్నారు. ఈ బిల్లును జులై
27న లోక్ సభ ఆమోదించింది.
దేశ సరిహద్దుల నుండి వంద కిలో మీటర్ల లోపు భూముల్ని
వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు అనేది సవరణ చట్టంలో కీలక అంశం. వ్యూహాత్మకత
అనే పదానికి ఎవరికి తోచిన అర్ధం వారు చెప్పుకోవచ్చు. అస్మదీయ కార్పోరేట్లకు ఆ భూముల్ని
దారాదత్తం చేయడం కూడ వ్యూహాత్మక ప్రాజెక్టు కావచ్చు.
మణిపూర్ రాష్ట్రానికి తూర్పు దిక్కున మయన్మార్
దేశం వుంటుంది. ఆ వైపున వంద కీలో మీటర్ల మేర తెంచి వ్యూహాత్మక ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. అలా కుకీ జోలను చట్టబధ్ధంగా వాళ్ల భూముల నుండి తప్పించవచ్చు.
మిజోరం కు తూర్పున మయన్మార్, పశ్చిమ దిక్కున బంగ్లాదేశ్ వుంటాయి. ఉత్తర దక్షణ సరిహద్దుల
మధ్య మిజోరం పొడవు 285 కిలో మీటర్లు. తూర్పు పడమరల మధ్య మిజోరం వెడల్పు 115 కిలోమీటర్లు.
అక్కడ వంద కిలో మీటర్ల ఫార్మూలాను అమలు చేస్తే అసలు మిజోరం రాష్ట్రమే మిగలదు. నాగాలాండ్
పరిస్థితి కూడా ఇంతే. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల ఇలాంటి ముప్పుతప్పదు.
చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్,
మయన్మార్, ఆఫ్గనిస్తాన్ దేశాలతో మన దేశంలోని
20 రాష్ట్రాలు సరిహద్దులు కలిగి వున్నాయి. అవన్నీ తమ భూభాగాల్ని వ్యూహాత్మక ప్రాజెక్టులకు
ఇవ్వాల్సి వుంటుంది. మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ తో సాధ్యం కానిదాన్ని ఒక చట్ట సవరణతో
సాధించవచ్చని నరేంద్ర మోదీజీ ఒక్కరికి మాత్రమే తెలుసు.
డానీ
సమాజ
విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
మొబైలు
– 9010757776
రచన
: 10 జులై 2023
ప్రచురణ : 18 ఆగస్టు 2023, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్
పేజీ
https://www.andhrajyothy.com/2023/editorial/manipur-teaser-only-imax-movie-is-ahead-1123535.html
Friday, 4 August 2023
Manipur mayhem, a manufactured Ethnic Cleansing
Manipur mayhem, a manufactured Ethnic Cleansing