Manipur is a
teaser only; IMAX movie is ahead!
మణిపూర్ టీజర్ మాత్రమే;
ఐమాక్స్ సినిమా ముందుంది!
భారతదేశం అంతటా ఇవ్వాళ చర్చనీయాంశంగా మారిన రాష్ట్రాలు
మణిపూర్, హర్యాణ. ఒకచోట క్రైస్తవులు, ఇంకోచోట ముస్లింలు బాధితులు. మతమైనారిటీలను వేధిస్తుంటే
హిందూ ఓటు బ్యాంకు ధృవీకరణ చెంది ఎన్నికల్లో బిజేపికి విజయాన్ని సాధించి పెడుతోంది.
ముస్లింలనేకాదు; క్రైస్తవుల్ని కూడ వేధిస్తామని 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రచారం
చేసి మూడోసారి ప్రధాని అవ్వాలని నరేంద్ర మోదీజీ సిధ్ధం అవుతున్నారని అందరికీ తెలుసు.
కానీ, అసలు స్కెచ్ ఇంతకన్నా చాలా పెద్దదని చాలామందికి తెలీదు.
మణిపూర్ ఒక విధంగా చతురస్రాకారంలో వుంటుంది.
రాష్ట్రానికి నాలుగు సరిహద్దుల్లోనూ ఎత్తైన
కొండలుంటాయి మధ్యలో లోయ వుంటుంది. రాజధాని ఇంఫాల్ కూడ లోయ ప్రాంతంలో వుంటుంది. రాష్ట్రంలో
మెజారిటీ సామాజికవర్గంగా భావించే మెయితీలు లోయలోనే వుంటారు. మైనారిటీలుగా భావించే కుకీ జో తెగలు రాష్ట్రం చుట్టు
వున్న కొండ ప్రాంతాల్లో వుంటారు.
బయటివారు సాధారంణంగా భావిస్తున్నట్టు మెయితీలందరూ
హిందువులు కాదు. వారిలో క్రైస్తవులు, ముస్లింలు కూడ వున్నారు. మెయితీలు చర్చీల దహనం
కార్యక్రమాన్ని మొదలెట్టినపుడు మెయితీ క్రైస్తవుల చర్చీల జోలికి పోలేదు. అయితే మెజారిటీ
మెయితీలు హిందువులు. వారిలో వర్ణవ్యవస్థ కూడ కొనసాగుతోంది.
కుకీ జో ల మాతృభాష మిజావు. ఇంగ్లీషు ధారాళంగా
మాట్లాడుతారు. అంతేకాదు; హిందీని వ్యతిరేకిస్తారు. వాళ్ళు క్రైస్తవులు కావడం మాత్రమేగాక,
ఉత్తర భారతదేశంలో వుంటూ హిందీని దూరంగా వుంచడం కూడ సంఘపరివారానికి చిరాకు కల్పించే అంశంగా మారింది.
ఈశాన్య రాష్ట్రాల్లోని ఎస్టీలకు దేశంలోని ప్రతిష్టాత్మక
విద్యాసంస్థల్లో రిజర్వేషన్లు వుంటాయి. ‘సానుకూల వివక్షను’ సద్వినియోగం చేసుకున్నకుకీ జో, నాగ తెగలు క్రమంగా
ప్రభుత్వ యంత్రాంగంలో కీలక స్థానాలకు చేరుకున్నారు. మొన్నటిదాక మణీపూర్ డిజిపిగా వున్న
పి దౌంగెల్ కుకీ జో తెగకు చెందినవారే. విశ్వవిద్యాలయాల్లోనూ కుకీ జో, నాగ ప్రొఫెసర్లు
పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. కుకీ జో, నాగ తెగల అభివృధ్ధిని చూసి మెయితీలు ఈర్ష్యా ద్వేషాలను
పెంచుకున్నారు.
ఆర్ధిక బలహీనవర్గాలకు (EWS) గత ఎన్నికలకు ముందు
కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లు కూడ మెయితీలను సంతృప్తి పరచలేదు.
ప్రస్తుత చట్టాల ప్రకారం అటవీ భూముల మీద సమస్త అధికారాలు కుకీ జో, నాగ తదితర తెగలవి.
అక్కడ మెయితీలు భూములు కొనడానికి వీల్లేదు. అటవీ భూములపై మెయితీలకు హక్కు దక్కాలంటే
వారికి ఎస్టీ హోదానివ్వాలి. అదే సామాజికవర్గానికి చెందిన ముఖ్యమంత్రి ఎన్ బీరేంద్ర
సింగ్ మెయితీలకు ఎస్టీ గుర్తింపునివ్వడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. మణిపూర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎంవి మురళీధరన్ మార్చి
27న మెయితీలకు ఎస్టీ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం ఏప్రిల్ 19న
బయటికి వచ్చింది. అప్పటి నుండి ఎస్టీలు ఆందోళన బాట పట్టారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ATSUM) హైకోర్టు ఉత్తర్వులకు
వ్యతిరేకంగా మే 3న ‘గిరిజనుల సంఘీభావ యాత్ర’ కు పిలుపిచ్చింది. అక్కడి నుండి మణిపూర్
లో హింసాత్మక సంఘటనలు ఆరంభమయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు తమను భిన్న జాతులుగా
భావిస్తారుగానీ, భారతీయులు అనుకోరు. చాలా మంది ఆధార్ కార్డ్ కూడ తీసుకోరు. ఆధార్ కార్డు
తీసుకుంటే తమను భారతీయుల జాబితాలో పడేస్తారని వాళ్ళు భయపడతారు. కశ్మీర్ లోయలోనూ ఇలాగే
వుంటుంది. కశ్మీర్ లోయ ప్రజలంతా ఒకే జాతి అని
వాళ్లు భావిస్తారు. తమ భూభాగాన్ని సగం పాకిస్తాన్, సగం ఇండియా ఆక్రమించుకున్నాయనే భావనతో
వుంటారు.
కుకీ జోలు మాత్రమే కాదు ఈశాన్య రాష్ట్రాల్లోని
గిరిజనులంతా సాధారణంగా శాంతి కాముకులు. మౌనంగా వుంటారు. ఇతరులు తమ జోలికి వస్తే మాత్రం
ఉగ్రులైపోతారు. సాంప్రదాయకంగా వాళ్ళు సైనిక జాతి (Warrior Tribe / Martial Tribe). ఆయుధాలు వాడడంలో నేర్పరులు. హైకోర్టు ప్రకటన వెలువడగానే
ప్రభుత్వం ముందు జాగ్రత్తగా కుకీ జోల నుండి లైసెన్సు
ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. మరో వైపు మెయితీలు పోలీసు స్టేషన్ల నుండి 6 వేల ఆయుధాలను
ఎత్తుకుపోయారు. బుల్లెట్లు అయితే లక్షల సంఖ్యలో ఎత్తుకుపోయారట. ముఖ్యమంత్రి సూచనల మేరకు
పోలీసులే స్వఛ్ఛందంగా మైతీలకు ఆయుధాలను సరఫరా చేశారనే మాట మణిపూర్ లో పెద్ద ప్రచారంలో
వుంది. పోలీసులు తోడుగావున్నా, ఆయుధాలు చేతిలోవున్నా తగిన శిక్షణలేని మైతీలు వాటిని
ఉపయోగించుకోవడంలో విఫలం అయ్యారు. ఆ అసహనంతో కుకీల ఇళ్లను తగుల బెట్టారు. మహిళల మీద
లైంగిక దాడులు జరిపారు. మరోవైపు, కుకీ జోలు తమ యుధ్ధ నైపుణ్యంతో నాటు తుపాకులతోనే మైతీల
మీద భీకరంగా ప్రతిదాడి చేశారు.
చూరచందాపూర్ జిల్లాలోని కుకీ జో మహిళలు, పిల్లలు
పక్క రాష్ట్రమ్జైన మిజోరంకు శరణార్ధులుగా వెళ్ళిపోయారు. కుకీ జో పురుషులు ఇంటికొకరు
చొప్పున స్వఛ్ఛంద సైనిక దళంగా మారి వంతుల వారీగా ప్రతిదాడి సాగిస్తున్నారు. దానిని
తట్టుకోవడం మైతీలకు సాధ్యం కావడంలేదు.
శరణార్ధులుగా వచ్చిన కుకీ జోలను మిజోరంలోని మీ
జోలు అక్కున చేర్చుకున్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం 40 వేల మంది కుకీ జోలు మిజోరంకు
తరలి వచ్చారు. శరణార్ధుల కోసం మిజోరం రాజధాని నగరం ఐజ్వాల్ లో ఇటీవల లక్షమంది సంఘీభావ
యాత్ర జరిపారు. కుకీ జోలు, మీ జోలు ఒకే తల్లి బిడ్దలుగా భావిస్తారు. మణిపూర్ ప్రభుత్వానికి కుకీ జోలు వద్దనుకుంటే చూరచందాపూర్
తదితర జిల్లాలను తమకు ఇచ్చేయాలనీ, తాము ‘గ్రేటర్ మిజోరం’ ఏర్పాటు చేసుకుంటామని మిజో
నేషనల్ ఫ్రంట్ కు చెందిన మిజోరం ముఖ్యమంత్రి జోరంథంగా కొత్త నినాదాన్ని ముందుకు తెచ్చారు.
-ఆయన ప్రస్తుతం ఎన్డీఏలో వున్నారు. ఉమ్మడి పౌరస్మృతి విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో
విభేదిస్తున్నారు. మొన్నటి స్వాతంత్ర్యదినోత్సవ ప్రసంగంలో మణిపూర్ హింసమీద తీవ్రంగా
మాట్లాడారు. ఎన్డీయేకు తమది అంశాలవారీ మద్దతు మాత్రమేనని ప్రకటించారు. ఇక ‘గ్రేటర్
మిజోరం’ అంశాన్ని ముందుకు తెస్తే
మోదీ, అమిత్ షాలకు రాజకీయంగా కొత్త సమస్యలు తప్పవు.
మణిపూర్ కు ఉత్తరాన వున్న నాగాలాండ్ రాష్ట్రంలోనూ అనేక
కొత్త పరిణామాలు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మణిపూర్ ఉత్తరాన వుండే కాంగ్ పోక్పీ
(Kangpokpi), సేనాపతి జిల్లాల్లో కుకీ జోలు, నాగాలు వుంటారు. ఈ
రెండు తెగల మధ్య 1984లో కొన్ని ఘర్షణలు జరిగాయి. అందులో కుకీ జోలు ఎక్కువగా
నష్టపోయారు. దానికి గుర్తుగా వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక రోజు బ్లాక్ డే
నిర్వహిస్తుంటారు. అయితే ఇప్పటి పరిస్థితి వేరు. ఆదివాసీ తెగల మధ్య ఐక్యత బలంగా పెరుగుతోంది.
ప్రస్తుత మెయితీ-కుకీ జోల ఘర్షణలో నాగ
తెగ తటస్థంగా వుంటోంది. మణిపూర్ నుండి లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇద్దరు
సభ్యుల్లో ఒకరు మెయితీ, మరొకరు నాగ. కుకీలకు లోక్ సభలో ప్రాతినిధ్యంలేదు. కుకీ
జోలకు ఇప్పుడు నాగ తెగల సహకారం చాలా అవసరం.
కుకీ జోలు బ్లాక్ డేను విరమిస్తున్నట్టు ఒక ప్రకటన చేస్తేచాలు
వాళ్లను అన్ని విధాలుగా ఆదుకోవడానికి నాగాలాండ్ ముఖ్యమంత్రి నైఫియూ రియో (Neiphiu Rio) సిధ్ధంగా వున్నారు.
ఆయన ఇప్పటికే ఆదివాసులు, క్రైస్తవుల్ని ఉమ్మడి పౌరస్మృతి నుండి మినహాయించాలని
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చర్చలు జరుపుతున్నారు.
మరోవైపు, బ్లాక్ డేను విరమించడానికి కుకీ జోలు కూడ
సిధ్ధంగా వున్నారు. నాగాలు కుకీ జోలు ఏకమైతే మణిపూర్ లోయలోని మైతీలకు మరిన్ని
కష్టాలు వస్తాయి. కోల్ కటా నుండి మణిపూర్ వెళ్ళే రోడ్డు మార్గం నాగాలాండ్ మీదుగా
వెళుతుంది. ఆ మార్గాన్ని నాగాలు కుకీ జోలు అడ్డుకుంటే మణిపూర్ లోయకు సరఫరాలన్నీ
ఆగిపోతాయి. అప్పుడు, ఎయిర్ లిఫ్ట్ ఒక్కటే శరణ్యం అవుతుంది.
ఘర్షణల మొదటి దశలో కుకీ జోలు ఎక్కువ మంది చనిపోయారుగానీ
ఇప్పుడు వాళ్ళు జరుపుతున్న ప్రతిదాడిలో చనిపోతున్న మైతీల సంఖ్య కూడ తక్కువగా ఏమీలేదు. పరువుపోతుందని ఆ విషయాన్ని మైతీలు బయటికి చెప్పుకోవడంలేదు.
సైనికంగా, నైతికంగా, భౌతికంగా ఇంతటి పరాజయాన్ని పరాభవాన్నీ మూటగట్టుకోవాల్సి వస్తుందని
మైతీలు ఊహించి వుండరు. వాళ్ల కథ అడ్డం తిరిగింది.
ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్
మే 3న నిర్వహించిన ‘గిరిజనుల సంఘీభావ మార్చ్’ వల్ల హింస చెలరేగిందని మైతీలు ఆరోపిస్తున్నారు.
మణిపూర్ హైకోర్టు మార్చి 27న మెయితీలను ఎస్టి
జాబితాలో చేర్చడంవల్ల కుకి జో తదితర ఆదివాసి సమూహాల ఉనికికి ముప్పు ముంచుకు వచ్చిందని
ట్రైబల్ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఏది కారణం? ఏది ప్రభావం? ఇదీ ప్రస్తుతం
మణిపూర్ లో సాగుతున్న ఎడతెగని వేదాంత చర్చ.
కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్ లోని అటవీ ప్రాంతం
– కొండప్రాంతం కావాలి. కుకీ జో లను అక్కడి నుండి తరిమేయాలి. ఆ ప్రాంతాన్ని అస్మదీయ
కార్పొరేట్లకు దారదత్తం చేయాలి. దానికోసం మైతీలను పావులుగా వాడింది. వాళ్ల ప్లాన్
- ఏ విఫలం అయింది. అయితే, వాళ్ల దగ్గర ప్లాన్ – బి కూడ వుంది.
మణిపూర్ మంటల మీద ప్రధాని మోదీజీ నెలల తరబడి
మౌనం వహించడం మీద చాలా కథనాలు వచ్చాయి. వారు ప్లాన్ -బి అయిన అటవీ భూముల (పరిరక్షణ)
సవరణ బిల్లు – 2023 ను రూపొందించే పనిలో తీరిక లేకుండ వున్నారు. ఈ బిల్లును జులై
27న లోక్ సభ ఆమోదించింది.
దేశ సరిహద్దుల నుండి వంద కిలో మీటర్ల లోపు భూముల్ని
వ్యూహాత్మక ప్రాజెక్టుల కోసం వాడుకోవచ్చు అనేది సవరణ చట్టంలో కీలక అంశం. వ్యూహాత్మకత
అనే పదానికి ఎవరికి తోచిన అర్ధం వారు చెప్పుకోవచ్చు. అస్మదీయ కార్పోరేట్లకు ఆ భూముల్ని
దారాదత్తం చేయడం కూడ వ్యూహాత్మక ప్రాజెక్టు కావచ్చు.
మణిపూర్ రాష్ట్రానికి తూర్పు దిక్కున మయన్మార్
దేశం వుంటుంది. ఆ వైపున వంద కీలో మీటర్ల మేర తెంచి వ్యూహాత్మక ప్రాజెక్టులకు కేటాయించవచ్చు. అలా కుకీ జోలను చట్టబధ్ధంగా వాళ్ల భూముల నుండి తప్పించవచ్చు.
మిజోరం కు తూర్పున మయన్మార్, పశ్చిమ దిక్కున బంగ్లాదేశ్ వుంటాయి. ఉత్తర దక్షణ సరిహద్దుల
మధ్య మిజోరం పొడవు 285 కిలో మీటర్లు. తూర్పు పడమరల మధ్య మిజోరం వెడల్పు 115 కిలోమీటర్లు.
అక్కడ వంద కిలో మీటర్ల ఫార్మూలాను అమలు చేస్తే అసలు మిజోరం రాష్ట్రమే మిగలదు. నాగాలాండ్
పరిస్థితి కూడా ఇంతే. ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ చోట్ల ఇలాంటి ముప్పుతప్పదు.
చైనా, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్,
మయన్మార్, ఆఫ్గనిస్తాన్ దేశాలతో మన దేశంలోని
20 రాష్ట్రాలు సరిహద్దులు కలిగి వున్నాయి. అవన్నీ తమ భూభాగాల్ని వ్యూహాత్మక ప్రాజెక్టులకు
ఇవ్వాల్సి వుంటుంది. మణిపూర్ లో అస్సాం రైఫిల్స్ తో సాధ్యం కానిదాన్ని ఒక చట్ట సవరణతో
సాధించవచ్చని నరేంద్ర మోదీజీ ఒక్కరికి మాత్రమే తెలుసు.
డానీ
సమాజ
విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు
మొబైలు
– 9010757776
రచన
: 10 జులై 2023
ప్రచురణ : 18 ఆగస్టు 2023, ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎడిట్
పేజీ
https://www.andhrajyothy.com/2023/editorial/manipur-teaser-only-imax-movie-is-ahead-1123535.html
No comments:
Post a Comment