ఏబికే సైన్యం అంటే ఆ కిక్కే వేరబ్బా!
ఎమెర్జెన్సీ తరువాత జర్నలిజం లోనికి కొత్త రక్తం వచ్చింది. శ్రీకాకుళ గిరిజన
సాయుధ పోరాటం అణిచివేత తరువాత మిగిలివాళ్ళు ఎన్జీవోలవైపు, మీడియావైపు నడిచారు. మీడియా
వైపుకు వచ్చిన వాళ్ళకు ఎబికె ప్రసాద్ ఒక ఆశ్రయం కల్పించారు.
దాసరి నారాయణ రావు స్థాపించిన ‘ఉదయం’ దిన పత్రిక ఫస్ట్ వీక్ టాక్ వీక్ గా వుండింది. దాసరి నారాయణ రావు కోరిక మేరకో,
ఏబికే చొరవ మేరకో అందులోనికి రకరకాల ఎర్రరక్తం ఎక్కించారు. అంతే సూర్యుడు పూర్తి వెలుగులతో
ఉదయించాడు.
విరసం సభ్యునిగా విప్లవ వ్యాసాలు, కథలు రాసిన నేను కారంచెడు ఉద్యమం తరువాత మెయిన్
స్ట్రీమ్ జర్నలిజంలోనికి ప్రవేశించాలనుకున్నాను. రెండింటి జానర్ వేరు. విప్లవ రచనల్లో
“జాతులు విముక్తిని కోరుతున్నాయి; ప్రజలు విప్లవాన్ని కొరుతున్నారు” అంటూ భావోద్వేగంతో
ఒక అబ్సల్యూట్ స్టేట్ మెంట్ ఇస్తాం. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో అలా కుదరదు. “కొన్ని
జాతులు విముక్తిని కోరుతున్నాయి; కొందరు ప్రజలు విప్లవాన్ని కొరుతున్నారు” అనాలి. వంగవీటి
రంగా హంతకులు ఎవరో మనకు తెలిసినప్పటికీ వారు హత్యచేశారు అని రాయకూడదు. ఈ హత్య వెనుక
ఫలానావారి హస్తం వున్నట్టు ఆరోపణలున్నాయి అని అంటీఅంటనట్టు రాయాలి. ఎంత వరకు మనకు ఆధారాలతోసహా
కఛ్ఛితంగా తెలుసో అంతవరకే రాయాలి. మిగిలినదాన్ని
ఒక ఊహాగానంగా ప్రకటించాలి. ఇంగ్లీషు జర్నలిజంలో allegedly అనే పదాన్ని తప్పక వాడుతుంటారు.
అంటే రాసిన దానికి మాకూ సంబంధలేదు; జనం అనుకుంటున్నారని ఇంకొకరి మీద తోసేయ్యాలి.
మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం మెళుకువల్ని నా ఆత్మీయ మిత్రులు, ఇప్పటి ఆంధ్రజ్యోతి
ఎడిటర్ కే. శ్రీనివాస్ దగ్గర నేర్చుకున్నాను. మెయిన్ స్ట్రీమ్ జర్నలిజంలో నా తొలి రచన
‘పగలూ రేయీ – పశ్చిమగోదావరి’ ఉదయం దినపత్రిక 1986 జనవరిలో ప్రచురించింది. ఆ వ్యాసం కాన్సెప్ట్ వరకే నాది; రచనా
శైలిని పూర్తిగా కే శ్రీనివాస్ గైడెన్స్ లోనే రాశాను. అలా తను నాకు జర్నలిజంలో తొలి
గురువు.
1988 చివర్లో నేను ఆంధ్రభూమి – డెక్కన్ క్రానికల్ తో వర్కింగ్ జర్నలిస్టుగా
మారాను. చెన్నైలోని ‘ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం’ లొ ప్రొఫెసర్ గా పని చేస్తున్న
మరో ఆత్మీయ మిత్రుడు మోహన్ రామ్మూర్తి అప్పట్లో ఢిల్లీలో పేట్రియాట్ ఇంగ్లీషు పత్రికల్లో
పనిచేస్తుండేవాడు. ఢిల్లీ వెళ్ళి తన గదిలోనే వుంటూ తనతో ప్రెస్ కాన్ఫెరెన్స్ లకు వెళ్ళి
రిపోర్టింగ్ modus operandi నేర్చుకున్నాను. అలా తను నాకు రిపోర్టింగ్ గురువు.
అప్పుడు ఆంధ్రభూమికి ఏబికే ప్రసాద్ చీఫ్ ఎడిటర్. అలా వారి శిష్యునిగా జర్నలిజంలో
ప్రవేశించాను. వారు నాకు చాలా స్వేఛ్ఛ ఇచ్చారు. నా తొలి బ్యూరో చీఫ్ లు ఆంధ్రభూమిలో
సతీష్ చందర్; డెక్కన్ క్రానికల్ లో కే. శ్రీరాములు. సతీష్ చందర్ ఎలాగూ కమ్యూనిస్టు.
అయితే, శ్రీరాములుగారికి అప్పట్లో కమ్యూనిస్టులు అంటే ఎందుకోగానీ బొత్తిగా పడేదికాదు. కానీ, మనిషి చాలా మంచివారు.
వారే నాకు ఫస్ట్ ప్రమోషన్ కు రికమెండేషన్ లేఖ ఇచ్చారు.
గురువుల్ని మరచిపోవడం భావ్యంకాదు. తల్లిదండ్రులు లేకుండా మనం పుట్టలేనట్టే, గురువులు లేకుండా మనం ఎదగలేము.
ఈ రోజు ఏబికే ప్రసాద్ గారి పుట్టినరోజు. 90వ పడిలో పడ్డట్టున్నారు. ఆర్ధిక శాస్త్రంలో
వారు దిట్ట. రాజకీయాల్లో వామపక్షవాది. యువతరాన్ని ప్రోత్సహించడంలో వారిని మించినవారు
లేరు. ఏబికే సైన్యం అనుకోవడంలో గొప్ప కిక్కు వుంటుంది. దానిని నేను ఇప్పటికీ ఆస్వాదిస్తుంటాను.
గురువుగారూ! పుట్టిన రోజు శుభాకాంక్షలు.
2 ఆగస్టు 2023
No comments:
Post a Comment