భౌతిక పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 27 August 2023
Objective conditions and subjective efforts
Objective conditions and
subjective efforts
భౌతిక
పరిస్థితులు - వ్యక్తిగత ప్రయత్నం
పుట్టిన రోజు సందర్భంగా కొన్ని
వందల మంది సోషల్ మీడియా ద్వార శుభాకాంక్షలు తెలిపారు. సన్నిహిత మిత్రులు ఫోన్
కాల్స్ ద్వారనూ మరి కొందరు వ్యక్తిగతంగానూ కలిసి అభినందించారు. కొడుకులిద్దరు
వాళ్ల అభిరుచి మేరకు ఓ విందు జరిపారు.
అందరికీ పేరుపేరున ధన్యవాదాలు.
గుంటూరు లక్ష్మీ నరసయ్య తదితరులు
నా గురించి చాలా గొప్పగా రాశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ గొప్పతనం అంతా
నాదికాదని నాకు తెలుసు. నేను పుట్టి పెరిగిన కాలానికీ, ఆయా దశల్లో నా పరిసరాల్లో
వున్నవారికీ నాకు బతుకు మార్గం చూపినవారికీ ఈ గొప్పతనంలో పెద్దవాటా దక్కుతుంది.
కష్టాల్లోవున్నవాళ్ళు, వివక్షకు గురయ్యేవాళ్ళు
అత్యంత సహజంగానే సమానత్వాన్ని కోరుకుంటారు. వీళ్ళు సహజ సామ్యవాదులు; ఆర్గానిక్
కమ్యూనిస్టులు. నా విషయంలోనూ అదే జరిగిందనుకుంటాను. పేదరికాన్ని అనుభవిస్తూ, బాలకార్మికునిగా
జీవితాన్ని ఆరంభించిన కారణంగా నేను చిన్నప్పటి నుండే సమానత్వాన్ని కోరుకునేవాడిని.
నన్ను ఎవరూ ఓదార్చనందుకేనేమో మరొకర్ని ఓదార్చడంలో నాకు చాలా ఆనందం
కలుగుతుంది.
కార్ల్ మార్క్స్ పేరు కూడ
వినకుండానే, పేదోళ్ల ఆవేదన, వున్నోళ్ల అత్యాశను ఘర్షణ అంశంగా తీసుకుని ‘ప్రగతి’
నాటిక రాశాను. దానికి ధవళా సత్యంగారు
దర్శకత్వం వహించారు. ఎంజి రామారావుగారు చాలా ప్రోత్సహించారు. వారే మాక్సిమ్ గోర్కి
‘అమ్మ’ నవలను నాకు బహుమతిగా ఇచ్చారు. అందులో నాకేదో జీవనమార్గం కనిపించింది. ఆ తరువాత
మరికొన్ని నాటకీయ మలుపులు తిరిగి ఎమర్జెన్సీ తరువాత నన్ను నక్సలైట్ గా మార్చింది. ఆ
తరువాతి కథ మీకందరికీ తెలుసు.
సాహిత్యం నేరుగా సమాజాన్ని
మార్చలేదుగానీ పాఠకుల ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. కొత్త ఆలోచనలతో పాఠకులు
సమాజాన్ని మార్చే శక్తిని పుంజుకుంటారు. అలా సాహిత్యం పరోక్షంగా భౌతిక శక్తిగా
మారుతుంది.
“డానీ కథలు చదువుతుంటే ఇతను మిగతా వ్యాపకాలన్నీ వదిలి కథలు మాత్రమే రాసి ఉంటే తెలుగు సాహిత్యానికి గొప్ప కధకుడు లభించి వుండేవాడనిపిస్తుంది” అన్నాడు గుంటూరు
లక్ష్మీనర్సయ్య. చాలా ఆనందం వేసింది. లక్ష్మీనర్సయ్య వాక్యానికి తెలుగు సాహిత్య
విమర్శలో మంచి విలువ వుంది. అయితే, నేను సోషల్ యాక్టివిస్టుగా వుండడానికే ఎక్కువ
ఇష్టపడతాను. ఒక చారిత్రక సందర్భంలో అత్యవసరమైన అంశాన్ని ఇతర కథకులు రాయకపోవచ్చు అనుకున్నప్పుడు
మాత్రమే నేను కొన్ని కథలు రాశాను. భావోద్వేగాలను చిత్రించడానికి ఎన్నికథలయినా
రాయవచ్చు. రాజ్యాన్ని
మార్చాలనుకునే లక్ష్యం వుంటే రాజకీయ కథలు మాత్రమే రాయాలి అనే కోవకు చెందినవాడిని. నా
అభిప్రాయం కొందరికి నచ్చకపోవచ్చు. కానీ, రాజకీయంతోతప్ప రాజ్యాన్ని మార్చలేము.
విప్లవం ఒక రాజకీయ చర్య.
మన వ్యక్తిగత ప్రతిభ, నైపుణ్యాలు,
ఆశయాలు, లక్ష్యాలు అన్నింటినీ మన కాలం ప్రభావితం చేస్తుంటుంది. “అప్పుడు కాలం
కడుపుతో వుండింది; కార్ల్ మార్క్స్ ను కనింది” అన్నాడు మయకోవిస్కీ. చారిత్రక,
సామాజిక, తాత్విక పార్శ్వాలున్న కవిత్వ వ్యక్తీకరణ అది. భౌతిక వాస్తవికత; వ్యక్తిగత ప్రయత్నం
(Objective conditions and subjective efforts) రెండింటి మధ్య సమన్వయం కుదరాలి అన్నాడు
కార్ల్ మార్క్స్.
మా తరం స్వాతంత్య్రానంతర భారత
దేశంలో పుట్టింది. మేము హైస్కూల్ ను వదిలి కాలేజీలో చేరుతున్న కాలంలో నక్సల్ బరీ
ఉద్యమం మొదలయింది. రాజ్యాంగం ప్రవచించిన ప్రజాస్వామిక ఆదర్శాలకూ ప్రభుత్వాధినేతల
ఆచరణకు మధ్యనున్న వైరుధ్యాన్ని పరిష్కరించడానికే నక్సల్ బరీ గర్జించింది.
మొద్దుబారిపోతున్న భారత సమాజాన్ని మేల్కొల్పడానికి హైవోల్టేజ్ షాక్ ట్రీట్మెంట్
ఇచ్చాడు చారు మజుందార్. అనేక సంస్కరణలు, అనేక ఉద్దీపన చర్యలు నక్సల్ బరికి భయపడే
వచ్చాయి. నాటి ఇందిరాగాంధీ గరీబీ హటావో నుండి, ఎన్టీ రామారావు కిలో బియ్యం రెండు
రూపాయాలు మొదలు జగన్ నవరత్నాలు వరకు అన్నీ నక్సల్ బరీ వెలుగులోనే వచ్చాయి. రాజ్యాంగ
ప్రవేశికలో సామ్యవాదం చేరింది కూడ నక్సల్ బరీ భయంతోనే. ఆ పక్కనే అనేక నల్ల చట్టాలు
కూడ వచ్చాయి. అది వేరే కత.
నేను సరైన కాలంలో పుట్టడంవల్లనే
కొండపల్లి సీతారామయ్య, కెజి సత్య మూర్తి, ఐవి సాంబశివరావులతో రాజకీయాల్లో కలసి
పనిచేయగలిగాను. పీపుల్స్ వార్ తో అనుబంధాన్ని నేను చాలా గొప్పగా ఆస్వాదించాను. శ్రీశ్రీ, రావి శాస్త్రి, కాళీపట్నం రామారావు,
కేవి రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చలసాని ప్రసాద్ లతో కలిసి పనిచేసే
అవకాశం దక్కింది. ఇక్కడ పేర్కొనాల్సిన మరో ఇద్దరు ముఖ్యులు ఆర్ ఎస్ రావు, ఎంటి
ఖాన్ గార్లు. వరవరరావుతో అనుబంధాన్ని నేను
ఒక వరంగా భావిస్తాను. అల్లం రాజయ్య, బిఎస్ రాములు, ఎన్ వేణుగోపాల్, అట్టాడ
అప్పల్నాయుడు తదితరులు నా సమకాలీనులు
కావడం గొప్ప అవకాశంగా భావిస్తాను. గొప్ప
సమకాలికులు లేకుండ ఎవరూ గొప్పవారు కాలేరు. విరసం బయట జిలుకర శ్రీనివాస్, భార్గవ
గడియారం, ఉసా నాకు ఇష్టం.
ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి మొదలు
నేటి ఎంఎల్, మావోయిస్టు పార్టీల వరకు అన్నీ సమసమాజ స్థాపన కోసం తమ ‘వ్యక్తిగత
ప్రయత్నాలను’ దాదాపు నిజాయితీగానే సాగించాయి. కానీ, భారత ‘సమాజ భౌతిక వాస్తవికతను’
అర్ధం చేసుకోవడంలో పాక్షికంగానో, సంపూర్ణంగానో అవి విఫలం అయ్యాయి. వివక్ష కేవలం
అర్ధిక రూపంలో మాత్రమే సాగదనీ, కుల, మత, తెగల, సాంస్కృతిక రూపాల్లో కూడా
సాగుతుందని స్వయంగా మార్క్స్ చెప్పిన మాటల్ని గుర్తించడంలో భారత కమ్యూనిస్టు
పార్టీలకు హ్యాంగోవర్ ఇబ్బందులున్నాయి. సిధ్ధాంత పరంగా ప్రాణప్రదమైన ఈ అంశాన్ని
పరిష్కరించుకోనంత వరకు ప్రస్తుత ఫాసిస్టు వ్యవస్థ విసురుతున్న సవాళ్ళను అవి
ఎదుర్కోలేవు. ఫాసిజం రూపంలో సాంస్కృతికమైనది; సారంలో ఆర్ధికమైనది. సాంస్కృతిక
రంగంలో అది ముస్లింలు, క్రైస్తవుల్ని అణిచివేస్తుంది. ఆర్ధిక రంగంలో దేశసంపదను అస్మదీయ
కార్పొరేట్లకు అప్పగించడానికి అది ముస్లింలు, క్రైస్తవుల్నేకాక, హిందూ సమాజాన్ని
సహితం అణిచివేస్తుంది.
కమ్యూనిస్టు పార్టీలు చేసే సైధ్ధాంతిక
చారిత్రక తప్పిదాలు వాటికే పరిమితంకావు; అవి సామ్యవాద సిధ్ధాంత ఆమోదాంశానికే ముప్పుగా
మారుతాయి. సరిగ్గా ఇక్కడే నేను కమ్యూనిస్టు పార్టీల నాయకులతో విభేధిస్తుంటాను.
మెయిన్ ల్యాండ్ ఇండియాలో 1984లోనే
మత యుధ్ధం మొదలయింది. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో తెగ హననం కొనసాగుతోంది. ఈ పరిణామాల్ని
ఇప్పుడు ఎక్కువమంది గుర్తిస్తున్నారు.
ఉద్యమ జీవితంలో రెండుసార్లు చావు
నా ముందు కనిపించింది. చావు కొంచెం అందంగా వుండాలనే చిన్న కోరిక తప్ప చావుకు
భయపడింది ఎన్నడూ లేదు. యాధృఛ్ఛికంగా నేను పఠాన్ తెగకు చెందినవాడిని. మొరటోళ్ళం
అన్నమాట!
స్త్రీలు బాల్యంలో తల్లిదండ్రుల
నీడన, యవ్వనంలో భర్త నీడన, వృధ్ధాప్యంలో పిల్లల నీడన బతకాలనేది స్మృతి వాక్యం.
నన్ను బాల్యంలో మా అమ్మీ ప్రెజెంటబుల్ గా వుంచింది. యవ్వనంలో నా భార్య అజిత
ప్రెజెంటబుల్ గా వుంచింది. ఇప్పుడు కొడుకులిద్దరు కలిసి ప్రెజెంటబుల్ గా
వుంచుతున్నారు. కొన్ని అంశాల్లో నాకు స్వేఛ్ఛలేదు. నిన్నటి పార్టీ అలాంటిదే.
ఇటీవల మిజోరం వెళ్ళి శరణార్ధి
శిబిరాల్లో కుకీ జోలను పరామర్శించి వచ్చినందుకు చాలా మంది నన్ను
మెచ్చుకుంటున్నారు. పది మంది మిత్రుల గుప్త సహకారం లేకుండా ఈ పనిని నేను చేయగలిగి
వుండే వాడిని కాదు. అది objective condition. నేను వారందరికీ రుణపడి వున్నాను.
ఇలాంటి భౌతిక వాస్తవికత సహకరించినంతవరకు
నా వ్యక్తిగత ప్రయత్నానికి ఎలాంటి లోటు రానివ్వను. నా శక్తి సామర్ధ్యాలు
పరిమితమైనవని నాకు స్పష్టంగా తెలుసు. కష్టాల్లో వున్నవారిని పరామర్శించం ఒక్కటే
ఇప్పుడు నేను చేయగలుగుతున్న పని. ఆ
కర్తవ్యాన్నీ ఇకముందు కూడ ఎలాగూ చేస్తాను. అయితే, వాళ్ళను కష్టాల నుండి బయట పడేసే
శక్తి నాకులేదు. దానికి సమూహ శక్తి కావాలి. అయినప్పటికీ శరీరం మెదడు సహకరించినంత
వరకు నా subjective effortsకు లోటు రానివ్వను; అది ఎంతటి రిస్క్ అయినా సరే.
పుట్టిన రోజున ఇది నా కొత్త
నిర్ణయం.
మీ
ప్రేమాభిమానాల్ని కోరుకునే
ఉషా ఎస్ డానీ
27 ఆగస్టు 2023
with Kuki Zo boy at Relief camp in Aizawl, Mizoram on 7th
August 2023
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment