Thursday, 31 August 2023

Telugu entrepreneurs should promote Telugu Novels and stories

 *తెలుగు భాషను ప్రచారం చేసే బాధ్యతను

వాణిజ్య, వ్యాపారవేత్తలు స్వీకరించాలి!*

 

బ్రిటన్ పెట్టుబడీదారులు తమ అవసరాల కోసం ఇంగ్లీషును ప్రపంచ వ్యాప్తంగా ఎలా ప్రచారం చేశారో చెప్పడానికి ఎక్కడో ఒక సంఘటనను చదివాను. బ్రిటన్ లో పారిశ్రామిక విప్లవం సాగుతున్న కాలంలో ఛార్లెస్ డికెన్స్ రచయితగా వున్నాడు. ఆయన ఒక రకం కమ్యూనిస్టు. ఆయనకు పెట్టుబడీదారీ వ్యవస్థ పడదు; పెట్టుబడీదారులకు ఆయనంటే నచ్చదు. కానీ, డికెన్స్ వారంవారం ఒక థియేటరులో తన రచనల్ని స్వయంగా చదివి వినిపించేవాడు. దానికి సంపన్న కుటుంబాలవాళ్ళు టిక్కెట్టు కొని వచ్చి వినేవారు. ‘టేల్ ఆఫ్ టూ సిటీస్’ నవలలో రాచరిక వ్యతిరేకురాలైన మేడం డీఫార్జ్ వంటి మహిళా గెరిల్లా పాత్రను వర్ణిస్తుంటే సంపన్నవర్గాల స్త్రీలు కొన్ని సందర్భాల్లో తట్టుకోలేక మూర్చపోయేవారట.  అయినప్పటికీ డికెన్స్ నవలల్ని వాళ్ళు ప్రమోట్ చేసేవారట. ఎందుకటా? వాళ్ళకు అందులో ఒక మారకపు విలువ కనిపించింది. డికెన్స్ నవలల్లో పాత్రలు చాలా వినసొంపుగా మాట్లాడుకుంటాయి. ‘గ్రేట్ ఎక్స్ పెక్టేషన్’ లో ప్రొటోగోనిస్టు  పిప్ చిన్న పట్టణం నుండి లండన్ మహానగరానికి వచ్చి ఓ అడ్వకేట్ ఇంటికి వెళ్ళడానికి జట్కా ఎక్కుతాడు. జట్కావాడు ఆ అడ్వకేట్ ఇల్లు తనకు తెలుసనీ, ఆయన చాలా మంచివారని చెపుతాడు. అడ్వకేట్ ఇంటికి చేరాక “వారు ఆఫీసులో వున్నారు లైటు వెలుగుతోంది. మీరు అదృష్టవంతులు. సరైన సమయంలో వచ్చారు” వంటి వినయపూర్వక మెచ్చుకోలు మాటలు చెపుతాడు. అప్పుడు పిప్ “నీ సేవలకు నేను ఎంత రుణపడివున్నానూ?” అని అడుగుతాడు. ఆ  జట్కావాడు ఇంకా చతురతతో “సాధారణంగా ఐదు పెన్నీలు ఇస్తారండి; మీరు ఎక్కువ ఇవ్వాలనుకుంటే మీ ఇష్టం” అంటాడు. ఇంత సంస్కారంతో ఎవ్వరూ ఎక్కడా మాట్లాడుకోరు. కానీ ఇంగ్లండ్ వాసులు సంస్కారవంతులు అని ప్రపంచం నమ్మాలంటే డికెన్స్ నవలల్ని ప్రపంచ వ్యాప్తంగా పంపిణీ చేయాలనుకున్నారట ఆనాటి బ్రిటీష్ పెట్టుబడీదాడులు.

 

తెలుగును తెలుగు సమాజం కూడ ఆదరించడంలేదు. ఇంగ్లీషు, హిందీలను  పక్కన పెట్టినా కన్నడ, మలయాళ, తమిళ భాషలతో పోల్చినా తెలుగు పుస్తకాలు చదివేవారు చాలాచాలా తక్కువ. కవితా సంకలనాలను కవులు పంచుకుంటూ తిరగడమేతప్ప కొని చదివేవారు వుండదు. కథా సంకలనాలదీ దాదాపు అదేస్థితి. నవలలు తెలుగులో పెద్దగా రావడంలేదు. తెలుగు కథలు, నవలల్ని అలా ఇతర ప్రాంతాల్లో పంపిణీ చేయాలి. ఆ బాధ్యతను తెలుగు వాణిజ్య వ్యాపార వేత్తలు చేపట్టాలి.

-      డానీ

సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

No comments:

Post a Comment