Thursday, 12 February 2026

On Maoists Crisis

 


1.

*సిధ్ధాంతం మాట్లాడండి  :  ట్రోల్ భాషను పక్కన పెట్టండి*

 

పీపుల్స్ వార్ గానీ, మావోయిస్టు పార్టీ గానీ 1990 తరువాత ఏ రంగంలో అయినా సాధించిన స్పష్టమైన విజయం ఏమిటో నాకు తెలియదు అన్నాను. “విజయం” అనే పదం నచ్చకపోతే — “కొత్తగా ఆవిష్కరించిన సిద్ధాంత అంశాలు ఏమిటి?” అని అడగవచ్చు. నిజంగా నాకు తెలియదు. మీకు తెలిసి ఉంటే చెప్పండి. “గుడ్డోళ్లు, కళ్ళజోళ్లు” వంటి మాటలు అనవసరం.

 

ముందుగా నా అంధత్వం గురించి స్పష్టత: బాల్యంలోనే ఎడమ కన్ను తెగింది. అదే కంటికి ఇరవై ఏళ్ల క్రితం రెటీనోపతి వచ్చింది; దాని ప్రభావం కుడి కంటికి కూడా వస్తోంది. రెండు కళ్ళూ పోయినా ఎలా జీవించాలో ముందే కొంత  శిక్షణ తీసుకున్నాను. కళ్ళో, కాళ్ళో పోతాయేమోనని భయపడే మనిషిని కాదు.

 

నేను 1980లో కొండపల్లికి కొరియర్/బాడీగార్డ్ గా  పనిచేశాను. 1985లో కారంచేడు ఉద్యమానికి నాయకత్వం వహించాను. 1990లో పీపుల్స్ వార్ విధానాలతో విభేదించాను.  బయటికి రావడానికి ముందు ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఒక వ్యాసం రాసి బహిరంగంగా నా అసంతృప్తిని ప్రకటించాను. ఆ వ్యాసాన్ని విరసం జనరల్ బాడీ చర్చించింది. అప్పటి నుండి పీపుల్స్ వార్ మీద నా అభిప్రాయాలు ఏమాత్రం మారలేదు. రాజకీయ ఆలోచనల్ని నేను బహిరంగంగానే మాట్లాడుతాను.

 

పీపుల్స్ వారుకు  ఒక సృజనాత్మక దశ ఉండింది. ఎమర్జెన్సీ కాలంలో పూర్తిగా దెబ్బతిన్న సివోసిని కొండపల్లి మళ్ళీ పట్టాలు ఎక్కించారు. ఇందులో రెండు దశలున్నాయి. ఉద్యమం పెరుగుతున్నప్పుడు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పుష్కలంగా వుండేది. దాన్ని నాలాంటివాళ్ళు బాగా ఆస్వాదించారు. ఉద్యమం బలపడిన తరువాత  పార్టీలో బ్యూరాక్రసీ పెరిగింది. పార్టీ బాధ్యుల నైతిక విలువలు దిగజారిపోయాయి. 1989 అసెంబ్లీ ఎన్నికల తరువాత ప్రభుత్వ ప్రోత్సాహం కూడ తోడవ్వడంతో  ఇవి విజృభించాయి. నాలాంటి వాళ్ళు భరించలేని స్థితి ఏర్పడింది. తరువాత ఇంకో దశ మొదలయ్యింది.  బయటి నుండి ప్రభుత్వ నిర్బంధం పెరగడం ఒక పార్శ్వం.  లోపలి వికృతులు పెరగడం మరో పార్శ్వం. ‘ఆరు చెడులు’ అంటూ కొండపల్లి ప్రవేశపెట్టిన పత్రం కూడా పార్టి నాయకత్వం అంతర్గత పతనానికి సంకేతమే. ఉద్యమం లోపల నుంచి కూడ  క్షీణిస్తోంది అన్న భావన బలపడినప్పుడు నేను బయటికి వచ్చేశాను. ఇది జరిగిన కొద్ది రోజులకే  గ్రేటెస్ట్ తరానికి చెందిన కొండపల్లి సీతారామయ్యను బేబీ బూమర్లు పీపుల్స్ వార్ నుండి తరిమేశారు.

 

ఆ తరువాత పీపుల్స్ వార్ గురించిగానీ, మావోయిస్టు పార్టీ గురించి గానీ నేను ఒక్క మాట కూడా మెచ్చుకోలుగా చెప్పలేదు. వాటి మీద నాకు సదభిప్రాయం లేదు. వాటి పేరు చెప్పుకుని జీవించాల్సిన అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. ఉద్యమం మీద ప్రభుత్వ నిర్బంధాన్ని ప్రజాస్వామిక దృక్కోణంలో ఖండించడం అనేది వేరే విషయం; వారి విధానాలను సమర్థించడం అనేది వేరే విషయం. నేను ప్రభుత్వ అణిచివేతని ఖండించడం ఆపలేదు; విప్లవపార్టీలు అని చెప్పుకునేవారి డొల్లతన్నాని ఖండించడమూ ఆపలేదు.

 

మావోయిస్టు అభిమానుల్లో ఒక అతిశయ ధోరణి కనిపిస్తోంది. ఆ పార్టీ నాయకత్వాన్ని నేను దగ్గరగా చూసిన వాడిని. కొన్ని మరచిపోలేని చేదు అనుభవాలున్నాయి.

 

ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని గుర్తించాలి. రాజ్యాంగ లక్ష్యాల రూపకల్పనలో, భూపరిమితి చట్టాలు, రాజాస్థానాలు-రాజభరణాల రద్దు, కార్మిక హక్కులు, అటవీ భూములపై ఆదివాసి హక్కులు, రాజ్యాంగంలో “సోషలిస్టు”, “సెక్యులర్” ఆదర్శాల చేర్పు తదితర అంశాల్లో కమ్యూనిస్టు ఉద్యమాల పాత్ర ప్రధానంగా ఉన్నది. అలాగే ఉనికివాద ఉద్యమాలను కమ్యూనిస్టు పార్టీలు తాముగా ప్రారంభించకపోయినా, ఎస్సీ, బిసి, ముస్లిం, ఆదివాసి, మహిళా ఉద్యమాలను ప్రారంభించిన వారిలో చాలామంది పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు శిబిరాల్లో పనిచేసినవారే.

 

కమ్యూనిస్టుల ప్రభావంవున్న రాష్ట్రాల్లో కులనిర్మూలనో, మత నిర్మూలనో జరగలేదుగానీ కమ్యూనిస్టు సంఘాల్లో కులసామరస్యం, మత సామరస్యం కొనసాగింది. కులాంతర, మతాంతర వివాహాలను ప్రత్యేకంగా  ప్రోత్సాహించకపోయినా ఆమోదం లభించింది.  తెలుగు సాహిత్యం మీద వామపక్ష ప్రభావం మరీ ఎక్కువ. కవులు కథకులు నవలాకారులు కమ్యూనిస్టు సంఘాల్లో వున్నాలేకపోయినా తెలుగు కవిత్వం, కథా నవల తదితర ప్రక్రియలన్నీ పీడితుల పక్షమే వహించాయి. ఇవన్నీ కమ్యూనిస్టుల చారిత్రక విజయాలే. వీటిని ఎవరూ కాదలేరు.

 

1990 తరువాత ప్రపంచ సామాజిక-ఆర్థిక కూర్పు సమూలంగా మారిపోయింది. దీనిని నేను “1990 అనంతర సంక్షోభం” అంటున్నాను. పాత కూర్పుకు సరిపోయిన సిద్ధాంత-రాజకీయ పద్ధతులు కొత్త కూర్పులో పనిచేయవు. పనిచేయలేదు కూడ.  ఈ మార్పును కమ్యూనిస్టు నాయకత్వం సరిగ్గా విశ్లేషించుకోలేక పోయింది.

 

*ఇక్కడ తరాల ప్రశ్న కీలకం*

Greatest Generation – Silent Generation – Baby Boomers – Gen X/Y/Z.

 

పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులు Greatest Generationకు చెందినవారు. రెండు ప్రపంచ యుద్ధాల మధ్యకాలపు అంతర్జాతీయ కూర్పు వారికి బాగా అర్థమైంది; ఆ మేరకు వారు తమ కాలంలో సమాజం మీద గొప్ప ప్రభావాన్ని చూపారు.

 

మధ్యలో  silent Generation ఒకటుంది. కేజి సత్య మూర్తి ఆ తరానికి చెందినవారు. తరువాతి నాయకత్వం ప్రధానంగా Baby Boomers‌కి చెందింది. కొత్తగా ఎదిగి వచ్చిన  Gen X, Y, Z తరాలను వారు ఆకర్షించలేకపోయారు. విద్యావంతులైన పట్టణ మధ్యతరగతి సానుభూతి వర్గాన్ని కూడా క్రమంగా కోల్పోయారు.

 

1990ల దశకం భారతదేశానికే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒక సంధికాలం. ఆ మార్పును Baby Boomer నాయకత్వం హ్యాండిల్ చేయలేకపోయింది. అక్కడి నుంచే కమ్యూనిస్టు ఉద్యమం చారిత్రక పతన దశలోకి వెళ్లింది.

 

ఉద్యమాలకు చారుమజుందార్ కాంట్రిబ్యూషన్ ఏమిటో మనకు తెలుసు. కొండపల్లి సీతారామయ్య కాంట్రిబ్యూషన్ కూడ మనకు తెలుసు. గణపతి సిద్ధాంతపరంగా కొత్తగా ఏమి జోడించారో మనకు తెలియదు. అలాగే, ఉద్యమ పురోగతికి వారు చేసిన కృషి గురించి కూడ ఎవరూ చెప్పగా వినలేదు.  ఎవరైనా స్పష్టంగా చెప్పగలిగితే వినడానికి సిద్ధం. విప్లవకారుల త్యాగాలను గౌరవించడం వేరు. వారి విప్లవ పంథాను సమర్థించడం వేరు. బయటివారికి పంథానే ముఖ్యం.

 

ఈరోజు మావోయిస్టుల విప్లవ పంథా ఏమిటి? మావో వందేళ్ళ క్రితం చెప్పిన నూతన ప్రజాస్వామిక విప్లవమేనా? దానికి ముందు కొండపల్లి వ్యవసాయిక విప్లవాన్ని జోడించారు. వందేళ్ళలో సమాజం చాలా మారిపోయింది. మారిన సమాజాన్ని గుర్తించని వాళ్ళు ఆ సమాజాన్ని ఎన్నడూ మార్చలేరు.

 

వర్తమాన భారత సమాజాన్ని నేను “కార్పొరేట్ – కమ్యూనల్ - డిక్టేటర్‌షిప్”గా అర్థం చేసుకుంటాను. మావోయిస్టు పార్టీతో సహా ఇతర కమ్యూనిస్టు పార్టీలు  ఇంకా “అర్ధవలస-అర్ధభూస్వామ్య వ్యవస్థ””నాలుగు వైరుధ్యాలు” అనే పురాతన నిర్వచనానికే కట్టుబడి ఉంటే అది చారిత్రక జఢత్వమే అవుతుంది. పాత విశ్లేషణ పనికిరాకపోయినా కొత్త విశ్లేషణ సృష్టించలేని నిస్సహాయ స్థితి — అదే అసలు సంక్షోభం.

 

ఉద్యమాల్లో సైనిక విజయాలు - పరాజయాలు నాకు ఆసక్తికరం కాదు. సిద్ధాంత పరాజయం గురించి మాత్రం విస్తృత చర్చ అవసరం. విప్లవ సిద్ధాంతం సామాజిక మార్పుకు ప్రాణవాయువు. నిరంతరం బొగ్గుపులుసు వాయువును వదిలేసి, ప్రాణవాయువును పీల్చుకుంటూ వుండాలి. లేకుంటే మరణం తప్పదు.

 

విమర్శించగానే తిట్లు మొదలుపెట్టడం వాదన కాదు.  మావోయిష్టులు ఇటీవల ట్రోల్ ఇష్టులుగా మారారు. ఇదో ముందంజ కాబోలు. మర్యాదకర  భాషలో చర్చించాలంటే నేను ఎప్పుడైనా సిద్ధం. తిట్ల భాష మాత్రమే మీకు వచ్చు అనుకుంటే — నేను నరసాపురోడినని గుర్తుంచుకోండి.

 

– డానీ

 

 

*పాత కార్యక్రమాలకు కాలం చెల్లింది*

 2

 

1985లో కేజి సత్యమూర్తిని పార్టీ నుండి బహిష్కరించారు. సరిగ్గా అదే సాంప్రదాయంలో  కొండపల్లి సీతారామయ్యను 1990లో పార్టీ నుండి బహిష్కరించారు. ఆ తరువాత పీపుల్స్ వార్ గానీ, 2004లో ఏర్పడిన  మావోయిస్టు పార్టీగానీ కొత్తగా రూపొందించిన విప్లవ కార్యక్రమం ఏమిటీ? అనేదే సూటి ప్రశ్న. అలాంటి కార్యక్రమం ఏదైనా వుంటే మావోయిస్టు పార్టీ ప్రతినిధులుగానీ, అభిమానులుగానీ బయటి ప్రపంచానికి చెప్పాలి. 

 

ప్రస్తుత వ్యవస్థను ‘కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్’ అని కొన్నేళ్ళుగా పిలుస్తున్నాను. ఇంగ్లీషులో ‘Corporate Communal Dictatorship’  అంటున్నాను. దీనికి బాధితులు కొన్ని వందల సమాజాలు, సమూహాలుంటాయి. ముందు వాటన్నింటి విస్తృత జాబితా ఒకటి తీయాలి. విడిగా ప్రతి సమాజపు జన సంఖ్యనూ అంచనా వేయాలి.

 

ఈ సమూహాల్లో ప్రతీదీ ఒక ప్రత్యేక తరహా అణిచివేతకు గురవుతుంటుంది.  అణిచివేత తీవ్రత కూడ ఒక్కో సమూహానికి ఒక్కో స్థాయిలో వుంటుంది.  తీవ్రత ప్రాతిపదికగా వాటన్నింటినీ నిలువు దొంతరలు (vertical staratification)గా పేర్చాలి. నా అంచనా మేరకు ఈ దొంతరల్లో అత్యంత   అణిచివేతకు గురవుతున్న సమాజాల్లో ఆదివాసులు, ముస్లింలు, దళితులు వుంటారు. ఆ తరువాత కూడ ఇంకో 97 రకాల సమాజాలు వుంటాయి.

 

ఈ సమూహాలన్నీ బాధిత సమాజాలు. వీటన్నింటినీ అవి ప్రస్తుతం అనుభవిస్తున్న ప్రత్యేక అణిచివేతల నుండి విముక్తి చేసి స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలతో జీవించగలిగే ఒక కొత్త సమాజాన్ని నిర్మించాలి.  అలాంటి ఒక విప్లవ సిధ్ధాంతం  విప్లవ కార్యక్రమం ఒకటి రూపొందాలీ. అదీ నేటి చారిత్రక అవసరం.

 

స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అనేవి రాజ్యాంగ ఆదర్శాలు. రాజ్యాంగవాదం పరిమితమైనదనీ తమది అంతకన్నా విస్తృతమైన ఆదర్శాలనీ మావోయిస్టులు అంటుంటారు.  ఇటు రాజ్యాంగం ప్రతిపాదించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్య పంథా, అటు సాయుధపోరాట పంథా రెండూ విషాదకరంగా విఫలం అయిపోయిన దశలో ఇప్పుడు మనమున్నాము.  

 

రాజ్యాంగం అనేది ఒకటి వుండబట్టే కొన్ని సానుకూల చట్టాలను కమ్యూనిస్టు పార్టీలు సాధించుకోగలిగాయి. అయితే, ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. ఆ  పాజిటివ్ కాన్స్టిట్యూషన్ దశ 1990లలో ముగిసి పోయింది. ఇది పోస్ట్ -1990 దశ.

 

దేశంలోని రాజకీయ పార్టీల్లో కమ్యూనిస్టు పార్టీలు ఉన్నతమైనవనీ, వాటిల్లోనూ మావోయిస్టు పార్టి మరింత ఉన్నతమైనదనే నేరేటివ్ ఒకదాన్ని కొందరు ఇప్పుడు అతి ఉత్సాహంతో రేయింబవళ్ళు ప్రచారం చేస్తున్నారు. అంచేత వారినే నేరుగా అడిగాను;  ‘Corporate Communal Dictatorship’  సమాజం నుండి బాధిత, పీడిత సమూహాలను విముక్తి చేయడానికి మీ విప్లవ కార్యక్రమం ఏమిటీ? అని. సమాధానం లేదు. ఆపైన, వ్యక్తిత్వ హననం. నిందలు. చెత్త మాటలు. ఇదేనా వీరి సైధ్ధాంతిక స్థాయి?. బహుశ ఇదే కావచ్చు.

 

అర్ధవలస అర్ధ భూస్వామ్య వ్యవస్థ కాలగర్భంలో కలిసిపోయి నూతన ఆర్ధిక వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇప్పుడూ ఆ నాలుగు వైరుధ్యాలేనా? దున్నేవానికే భూమి నినాదంతో సాగే వ్యవసాయిక విప్లవం ఇరుసుగా గలిగిన నూతన ప్రజాస్వామిక విప్లవం అనే కార్యక్రమం 1990 నాటికే తన ప్రాసంగికతను కోల్పోయింది.

 

మన దగ్గర జలుబు దగ్గుకు మందులే వున్నాయిగానీ కరోనాకు మందులు లేవంటే కుదరదు. కనిపెట్టాలి. ఇప్పుడున్న పార్టీలకు చారిత్రికంగా  అవసరమైన సృజనాత్మకత లేదు. అది వ్యక్తుల తప్పుకాదు. కాలం మారింది. పాత కార్యక్రమాలకు కాలం చెల్లింది.

 

విముక్తి అనేది చాలా పెద్ద మాట. వర్తమాన సమాజంలో శ్రామికవర్గాన్ని, అణగారిన సమూహాల్ని  కనీసం నిర్వచించగలిగే స్థితిలో అయినా కమ్యూనిస్టు పార్టీలు వున్నాయా?

 

– డానీ

 

*ముస్లింల ప్రస్తావనలేని విప్లవకార్యక్రమం ఒక బూటకం!*

 3.

 

సమాజాన్ని మార్చడానికి దీర్ఘకాలిక పోరాటం అవసరమనీ, దానికి వందేళ్ళు కూడ సరిపోవు అని కొందరు  అంటున్నారు. ఆరెస్సెస్ పుట్టి కూడ వందేళ్ళే. అది ఏం సాధించిందో కళ్ళు మూసుకున్నా కనపడుతోంది. ముస్లింలు పొట్టకూటి కోసం ఓ జాతరలో కోవా బన్ అమ్ముకుందామన్నా కుదరడంలేదు.

 

          కోవా బన్ విషాదం మీద  చాలామంది స్పందించారు. దానికి వారందరికీ ధన్యవాదాలు. అనేక రాష్ట్రాల్లో ముస్లింలను జీవనోపాధిని అణిచివేస్తున్నారు. వాళ్ళ ఇళ్ళను, దుకాణాలనూ బుల్ డోజర్లతో కూల్చేస్తున్నారు. మావోయిస్టులు ఎన్నికల్ని బహిష్కరించమంటారు. సంఘపరివారం ముస్లింలను చట్టసభల నుండి బహిష్కరిస్తోంది.  వాటి మీద కూడ  కోవా బన్ స్థాయి స్పందన అవసరం.

 

ఇవన్నీ సంఘపరివారం సాగిస్తున్న ముస్లింయాగం అనుకోవచ్చు. కమ్యూనిస్టు విప్లవకారులు అయినా అందుకు భిన్నంగా వున్నారా? ఇటివల విరసం 30వ మహాసభలు జరిగాయి. నాలుగు పేజీల ఒక పెద్ద అందమైన కరపత్రం విడుదల చేశారు. సాయుధ విప్లవ పోరాట విరమణ  గురించి లోకంలో ఎంతమంది  ఎన్ని రకాలుగా అనుకుంటున్నారో అందులో చాలా వివరంగా చర్చించారు.

 

ఆయుధాలను భుజాన్నే మోస్తారా? లేక, జాతర పెట్టి ప్రభుత్వానికి ఉత్సాహంగా అప్పగిస్తారా? అనేది మావోయిస్టుల ఇష్టం. ఆయుధాలను భజాన్న పెట్టుకున్నా, ప్రభుత్వానికి స్వాధీనం చేసినా దేనికోసం? అనేది సామాజిక అంశం. బయటి వారికి సామాజిక అంశంతోనే పని.  జాగ్రత్తగా గమనిస్తే ఆ కరపత్రంలో విప్లవ కార్యక్రమం, పంథాల మీద సెంటిమెంట్ కన్నా తుపాకీ మీద సెంటిమెంట్ అతిగా కనిపిస్తుంది. విప్లవోద్యమ పతనానికి ఇది చివరి సంకేతం.

 

ఆ కోవాబన్ బాధితుడు నడుబిగించి విప్లవించడానికి సిధ్ధపడి ఉత్తేజం కోసం ఆ కరపత్రాన్ని చదివితే చాలా నిరుత్సాహానికి గురవుతాడు. ఆ కరపత్రంలో ముస్లిం అనే పదం కాదుకదా మైనారిటీలు అనేమాట కూడ మనకు కనిపించదు. ఆ కరపత్ర రచయితలు చాలా తెలివైనవారు. అవకాశం వస్తే మావోయిస్టు పార్టీకి కొత్త కార్యదర్శి కాగలిగినంత  సమర్ధులు. అంత జాగ్రత్త పడి దాన్ని రాశారు. ఇది కూడ ఇంకో జాతరలో ఇంకో కోవా బన్ కథ.

 

పూర్వ విప్లవ విద్యార్ధి సంఘం  50 వసంతాల ఉత్సవం నుండి గమనిస్తే మనకో విషయం సులువుగా అర్ధం అవుతోంది. మావోయిస్టు పార్టి సోషల్ మీడియాలో ముస్లింల కోసం  ప్రత్యేతేకంగా ఉత్సాహవంతులైన ఒక ట్రోల్ బ్యాచిని తయారు చేసింది.

 

మైనారిటీల ప్రస్తావనలేని విప్లవకార్యక్రమం ఏదైనా  ఒక బూటకం!. ఇది పైకి ప్రగతిశీలంగా కనిపించే మెజారిటీ మతవాదం!

 

- డానీ


No comments:

Post a Comment