*సైనిక ఓటమా? సైద్ధాంతిక వైఫల్యమా?*
*మావోయిస్టు ఉద్యమం ముగింపుపై ఒక రాజకీయ విశ్లేషణ*
సాక్షి దినపత్రిక ఈరోజు నా వ్యాసం 'సైనిక ఓటమా? సిధ్ధాంత వైఫల్యమా?' ప్రచురించింది. పత్రిక యాజమాన్యానికీ, ఎడిటర్, పేజీ ఇన్ చార్జీలకు ధన్యవాదాలు.
వ్యాసం మీద మీ అభిప్రాయాలు రాయండి. నన్ను నేను మెరుగుపరచుకోవడానికి దోహద పడుతుంది.
డానీ
సామాజిక–రాజకీయ విశ్లేషకులు
నడుస్తున్న చరిత్రలో కొన్ని దశలు మన కళ్లముందే మూసుకుపోతాయి. తుపాకీతో ప్రారంభమైన దశ, తలవంచి ముగిసిన దశగా మారిపోతుంటే అది కేవలం సంఘటన కాదు — ఒక యుగాంత సంకేతం.
పోరాట సంసిద్ధత క్షీణించినప్పుడు, విజయంపై విశ్వాసం సన్నగిల్లినప్పుడు నక్సలైట్లు లొంగిపోవడం కొత్త విషయం కాదు. గతంలోనూ లొంగుబాట్లు జరిగాయి. అయితే అవి నిశ్శబ్ద ఘటనలు. ముఖం చాటేసి, ప్రధాన స్రవంతి జీవితంలో కలిసిపోయే వ్యక్తిగత నిర్ణయాలు.
ఇప్పుడు దృశ్యం భిన్నంగా ఉంది. సరళీకృత ఆర్థిక విధానాల కాలం ఇది. లొంగుబాటు ఇక ఏమాత్రం వ్యక్తిగత నిర్ణయం కాదు; అదొక ప్రజా ప్రదర్శన. జాతరలా ఉత్సవాలు, సభలు. స్వీయప్రశంసలు. తుపాకీని ప్రభుత్వానికి అప్పగించడాన్ని కూడా ఒక సిద్ధాంత విజయం అన్నట్టు ప్రచారం. ఒకప్పుడు “తుపాకీ గొట్టం ద్వారానే విప్లవం” అన్నవాళ్లు, ఇప్పుడు “తుపాకీ స్వాధీనం ద్వారానే శాంతి” అంటున్నారు. ఇప్పుడు మావోయిస్టు పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీతో సహా మరో నలుగురు కీలక నేతలు లొంగిపోవడం ఆ శ్రేణిలో తాజా పరిణామం. ఆ పార్టీ కేంద్ర కమిటి పూర్వ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి సహా మరో 11 మంది ముఖ్య నాయకుల లొంగుబాటుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్టు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. ఇది యాదృచ్ఛికమా? లేక ఒక సంకేతమా?
రికార్డు కాదు, మలుపు
దేవ్ జీ మావోయిఒస్టు పార్టికి కేంద్ర కమిటీ కార్యదర్శి అయ్యారనో అవుతున్నారనో ఇటీవల వార్తలు వచ్చాయి. పీపుల్స్ వార్ గ్రూపు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేసిన కె.జీ. సత్యమూర్తి 1990లో అజ్ఞాత జీవితం ముగించి బయటకు వచ్చారు. కానీ లొంగుబాటు కార్యక్రమం జరపలేదు. ఆ పార్టి వ్యవస్థాపకులైన కొండపల్లి సీతారామయ్య 1995లో జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకూ లొంగుబాటు సంస్కారం అవసరం రాలేదు. కానీ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి హోదాలో వుండగా లొంగిపోవడం - ఇది మొదటిసారి.
అలా దేవ్ జీ ఒక రికార్డు సృష్టించారనుకోవచ్చు. కానీ అది గర్వించదగిన రికార్డా? లేక చరిత్రలో ఒక మలుపా? ఒకరు లొంగిపోతే యాదృచ్ఛికం. ఇద్దరు లొంగిపోతే వ్యక్తిగత వైఫల్యం. వరుసగా నాయకత్వం లొంగిపోతే అది ధోరణి. ధోరణిపై సైద్ధాంతిక చర్చ తప్పనిసరి.
ముగిసిందా ఒక అధ్యాయం?
మావోయిస్టు ఉద్యమం ఒక విషాదాంతపు దశకు చేరుకుందనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. గణపతి అనారోగ్యంతో చాలాకాలం క్రితమే కేంద్ర కమిటీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అసలు ప్రశ్న వ్యక్తుల గురించి కాదు. ఉద్యమం గురించి. ఈ ముగింపు సైనిక ఓటమా? లేక సైద్ధాంతిక వైఫల్యమా?
కమ్యూనిస్టుల చారిత్రక ముద్ర
భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీలు అధికారాన్ని సాధించలేకపోయి ఉండవచ్చు. కానీ భారత సమాజంపై వాటి ప్రభావం నిరాకరించలేనిది. రాజ సంస్థానాల రద్దు, భూపరిమితి చట్టాలు, కార్మిక హక్కుల విస్తరణ, అటవీ హక్కులు, ఆదివాసీ హక్కుల చట్టాల రూపకల్పన—ఇవన్నీ నేరుగా లేదా పరోక్షంగా వామపక్ష పోరాటాల ఫలితాతగా వచ్చినవే. రాజ్యాంగంలో “సోషలిస్టు”, “సెక్యులర్” అనే పదాలు చేరడమూ ఆ ఉద్యమాల ఒత్తిడినే ప్రతిబింబించాయి.
ఎస్సీ, బిసి, ముస్లింలు, ఆదివాసులు, మహిళలు తదితర సమూహాల ఉనికివాద ఉద్యమాల్లోనూ పూర్వ కమ్యూనిస్టు కార్యకర్తల ముద్ర స్పష్టంగా ఉంది. సాహిత్యం, కళలు, నాటకం, కవిత్వం అన్నీ పీడితుల పక్షాన నిలబడే సాంస్కృతిక ధోరణి కూడా వామపక్ష చైతన్యానికి రుణపడి ఉంది. అంటే చరిత్రలో కమ్యూనిస్టుల ముద్ర చెరిగిపోయేది కాదు. కానీ చరిత్రలో ముద్ర ఉండటం వేరు; వర్తమానంలో ప్రభావం నిలబెట్టుకోవడం వేరు.
అసలు మలుపు – 1990
1990 తర్వాత ప్రపంచం మారిపోయింది. గ్లోబలైజేషన్, సరళీకరణ, ప్రైవేటీకరణలతో భారత సామాజిక–ఆర్థిక నిర్మాణం పూర్తిగా మారింది. దీన్నే “1990 అనంతర సంక్షోభం” అంటున్నాం.
ఆర్థిక వర్గ నిర్మాణం మారింది. కార్మికవర్గం స్వరూపం మారింది. సాంకేతిక రంగం కొత్త తరాన్ని తెచ్చింది. సేవారంగం విస్తరించింది. వ్యవసాయం పాత్ర తగ్గింది, కానీ, పోరాట కార్యక్రమం మారిందా?
అర్ధ-వలస, అర్ధ-భూస్వామ్య వ్యవస్థ నిర్ధారణ. నాలుగు వైరుధ్యాలు. వ్యవసాయిక విప్లవం. నూతన ప్రజాస్వామిక విప్లవం. ఈ సిద్ధాంత భాష అంతా 1970లది. గట్టిగా మాట్లాడితే చైనాలో 1930ల నాటిది. 2020ల నాటి భారతదేశానికి అది పనికి వస్తుందా?
ఇక్కడే భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం సృజనాత్మకతను కోల్పోయింది. పాత మ్యాప్‌తో కొత్త భూభాగాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించింది. కొత్త నీరు చేరనప్పుడు నది ఎండిపోతుందని గ్రహించలేదు. ఇది సైద్ధాంతిక వైఫల్యం.
సైనిక వ్యూహంలోనూ పొరపాట్లు.
మావోయిస్టులను అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం గడువు పెట్టి, బలగాలను ఒకే ప్రాంతంలో- దంతేవాడలో - మోహరించినప్పుడు, వ్యూహాత్మక చాతుర్యం అవసరం. కానీ అన్ని శక్తులను ఒకే ప్రదేశంలో దించి, చుట్టుముట్టే పరిస్థితిని తెచ్చుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. సైనిక ఓటమి అక్కడ కనిపిస్తోంది.
కానీ సైనిక పరాజయం తాత్కాలికం. సిద్ధాంత పరాజయం అంతకన్నా పెద్ద దెబ్బ. ప్రజల్లో కొత్త ఆశలు నింపలేకపోవడం, మారుతున్న తరాన్ని ఆకర్షించలేకపోవడం—ఇవి మరింత తీవ్రమైన దెబ్బలు.
ముగిసిందా ఉద్యమం?
ఒక పార్టీ కథ ముగిసిపోవచ్చు. ఒక నాయకత్వం లొంగిపోవచ్చు. ఒక దశ చరిత్రలోకి వెళ్లిపోవచ్చు. కానీ ప్రజల మీద అణచివేత ముగిసిందా? అసమానత అంతరించిందా? వనరుల దోపిడీ ఆగిపోయిందా? లేదనేదే సమాధానం. అంతేకాదు అసమానతలు, అణచివేతలు గతంకన్నా పెరిగాయి.
అణచివేత ఉన్నంతకాలం పోరాటం అంతరించదు. కేవలం రూపం మారుతుంది. భాష మారుతుంది. సిద్ధాంతం మారుతుంది. చరిత్ర ఖాళీని సహించదు. పాత సిద్ధాంతం విఫలమైతే ఆ స్థానంలో కొత్తది వస్తుంది. పాత పార్టి ఆయుధాలను వదిలేసి లొంగిపోతే కొత్త పార్టి వస్తుంది. పోరాడే సమూహాలు మారుతాయి.
ఇప్పుడు ప్రశ్న ఒక్కటే; కొత్తగా వస్తున్న సిధ్ధాతం ఏమిటీ? కొత్తగా పోరాడే శక్తులు ఏవీ? వాటిని ఆహ్వానిద్దాం.
24 ఫిబ్రవరి 2026
.png)
No comments:
Post a Comment