సామాజిక అశాంతిని రేపుతున్న ఏఐ విప్లవం!
డానీ
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
మెగా కార్పొరేట్ల ధనదాహం తీర్చడానికి భూగోళం సరిపోయేలాలేదు. మరో ఏడాదిలో వైట్ కాలర్ జాబ్స్ చాలా వరకు కనుమరుగైపోయే అవకాశాలున్నాయని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం చీఫ్ ముస్తఫా సులేమాన్ అంటున్నారు. మరో రెండు మూడేళ్లల్లో కంప్యూటర్లతో ఇంటర్ ఫేస్ (కీబోర్డ్స్) మారిపోతాయని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అంటున్నారు. ఓ మూడేళ్లల్లో అంతరిక్షంలో ఏఐ డేటా సెంటర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం వస్తుందని టెక్ జెయింట్ ఎలాన్ మస్క్ అంచనా.
సాంకేతిక విప్లవం అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది అభివృద్ధి, వేగం, సామర్థ్యం. కానీ ప్రతి సాంకేతిక మార్పు ఒక ప్రశ్నను కూడా రేపుతుంది. ఆ మార్పు ప్రయోజనం అందరికీ దక్కుతుందా? లేక కొందరికేనా? ప్రస్తుతం నడుస్తున్న కృత్రిమ మేధ (AI) విప్లవం ఈ ప్రశ్నను మరింత పదునుగా ముందుకు తెస్తోంది. ఎందుకంటే, ఇది కేవలం పని విధానాన్ని మార్చి ఊరుకోదు; మొత్తం పని స్వభావాన్నే మార్చుతోంది.
చేతి పని నుంచి మెదడు పనివరకు
పారిశ్రామిక విప్లవం చేతిపనుల్ని యంత్రాలకు అప్పగించింది. కంప్యూటర్ విప్లవం కార్యాలయ వ్యవస్థను మార్చింది. కాని కుత్రిమమేధ విప్లవం నేరుగా మానవ బుద్ధిని సవాలు చేస్తోంది. డేటా విశ్లేషణ, నివేదికల తయారీ, ప్రాథమిక న్యాయ సలహా, కోడింగ్, మార్కెటింగ్ వ్యూహం—ఇవన్నీ ఇప్పుడు అల్గోరిథమ్స్ చేసేయగలుగుతున్నాయి. ఈ మార్పులు మొదట ఉద్యోగుల సామర్ధ్యాన్ని అనూహ్యంగా పెంచుతాయి. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒక్కడే చేయగలిగితే సంస్థలకు లాభాలు పెరుగుతాయి. కానీ, పదిమందిలో తొమ్మిదిమంది ఉపాధిని కోల్పోతారు. వాళ్లను ఎక్కడ సర్దుతారు? ఇది తప్పనిసరిగా సామాజిక ఉద్రిక్తతకు దారి తీస్తుంది.
విరిగిపోతున్న ఉద్యోగ మెట్టు
కుత్రిమ మేధ మూలంగా ప్రస్తుతం ఎక్కువగా దెబ్బతింటున్న సమూహం ఎంట్రీ లెవల్ ఉద్యోగులు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికిచ్చే రొటీన్ పనులను కుత్రిమ మేధ వేగంగా చేసిపడేస్తోంది. ఇది తాత్కాలికంగా కంపెనీలకు ప్రయోజనం. కానీ దీర్ఘకాలంలో ప్రమాదం. ఎంట్రీ లెవల్ లో రిక్రూట్మెంట్ లేకుండా ఆ పై స్థాయి ఉద్యోగులకు నైపుణ్యాం ఎలా అబ్బుతుందీ? ఉద్యోగ మెట్ల వ్యవస్థలో మొదటి మెట్టును తీసేస్తే పైకి ఎక్కే దారేదీ? ఇది కేవలం ఉపాధి సమస్య కాదు - సామాజిక శాంతికి సంబంధించిన సమస్య.
మధ్యతరగతి అస్థిరత
మధ్యతరగతివర్గం సాధారణంగా విద్య, ఉద్యోగభద్రత, స్థిర ఆదాయంపై ఆధారపడి ఉంటుంది. కుత్రిమ మేధ కారణంగా స్థిర ఉద్యోగాల స్థానంలో అస్థిర ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పందాలు పెరుగుతున్నాయి. దానితో కుటుంబ భవిష్యత్తు ప్రణాళికలు దెబ్బతింటాయి. ఫలితంగా అసంతృప్తి పెరుగుతుంది. అసంతృప్తి నుంచి సామాజిక ఉద్రిక్తతలు, రాజకీయ అశాంతి పుడతాయి. అప్పుడవి వ్యవస్థ వునికినే ప్రశ్నిస్తాయి.
కార్పొరేట్ కేంద్రీకరణ
కుత్రిమ మేధ తయారీకి భారీ పెట్టుబడులు కావాలి. సహజంగానే వీటిని అతికొద్దిగా వుండే భారీ టెక్నాలజీ కంపెనీలే రూపొందించగలుగుతాయి. ఆ కంపెనీల ఉత్పాదకత పెరుగుతుంది. లాభాలు పెరుగుతాయి. కాని ఆ లాభాలు సమాజంలో సమానంగా పంపకం జరగవు. పెరుగుతున్న ఉత్పాదకత ఫలితాలు మెగా కార్పొరేట్ల స్థాయిలోనే నిలిచిపోతాయి. సంపద పంపకాల్లో అసమానత పెరిగిన ప్రతిసారి చరిత్రలో సామాజిక అశాంతి చెలరేగింది. పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు కూడ సాగాయి.
యువతలో ఆందోళన
యువత జనాభా అధికంగా ఉన్న భారతదేశంలో ఈ పరిణామం మరింత తీవ్రంగానూ మారవచ్చు. ప్రతి సంవత్సరం కోటిమందికి పైగా పట్టభద్రులు ఉద్యోగ మార్కెట్‌లోకి వస్తున్నారు. ఎంట్రీ లెవల్ అవకాశాలు తగ్గిపోతే వాళ్ళకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఉద్యోగం లేని విద్యావంతుల సమూహం ఏ దేశానికైనా పెద్ద సవాలు. వాళ్ళ అసంతృప్తి దేశ రాజకీయాలను కొత్త మలుపు తిప్పవచ్చు. కగార్ ఆపరేషన్ తో ఛత్తీస్ గడ్ లో మావోయిస్టుల్ని సమూలంగా అణిచివేస్తున్నామనే ఉత్సాహంలో కేంద్ర ప్రభుత్వం వుంది. దాని కోరిక నెరవేరనూ వచ్చు. అయితే, నిరుద్యోగానికి గురైన విద్యావంతులైన యువతరం తిరగబడిన కారణంగానే 1960లలో నక్సల్బరి వుద్యమం తలెత్తింది. చరిత్ర పునరావృతం కావచ్చు.
‘గిగ్’ సమాజం వైపు?
స్థిర ఉద్యోగాల స్థానంలో తాత్కాలిక పనులు, ప్రాజెక్ట్ ఆధారిత ఒప్పందాలు పెరుగుతున్నాయి. ఇది ఒక కొత్త పని సంస్కృతి; గిగ్ ఎకానమీ. బయటికి స్వేచ్ఛలా కనిపించినా, లోపల అనిశ్చితి కొనసాగుతుంటుంది. ఉద్యోగ భద్రత లేకుండా, సామాజిక భద్రత లేకుండా, వ్యక్తులు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇది వ్యక్తిగత స్థాయిలో ఒత్తిడిని, సామాజిక స్థాయిలో వర్గ వైషమ్యాన్నీ పెంచుతుంది.
సాంకేతిక విప్లవమా? సామాజిక పరీక్షా?
ఇప్పటి వరకు ఏ సాంకేతిక పరిజ్ఞానం కూడ ఆగలేదు. ఎవరు ఎన్ని అనుకున్నా ఇప్పుడు ఏఐని ఆపడం సాధ్యం కాదు. అది ముందుకు సాగుతూనే వుంటుంది. ఏఐ సృష్టించే సంక్షోభాన్ని ఎలా అదుపు చేయాలి అనేదే అసలు ప్రశ్న. ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు ఇందులో బాధ్యతాయుత పాత్రను పోషించాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, రీస్కిల్లింగ్ విధానాలు, సామాజిక భద్రతా వలయాలు, కార్పొరేట్ల నియంత్రణ చేపట్టాలి.
ఉత్పాదకత పెరిగితే పని గంటలు తగ్గాలి. జీవన ప్రమాణాలు మెరుగవ్వాలి. అందరికీ అవకాశాలు దక్కాలి. అలా జరగకపోతే, సాంకేతిక విప్లవాలు సాధించే ఉత్పత్తి పెరుగుదలకన్నా అవి సమాజంలో సృష్టించే అసమానతలు ప్రమాదకరంగా మారుతాయి. కాబట్టి అసలు చర్చ టెక్నాలజీ మీద కాకుండా అది సృష్టించే లాభాలు, పంపకాల మీద సాగాలి. మనిషి సామర్ధ్యాన్ని పెంచడానికి సాంకేతిక పురోగతి తోడ్పడాలి. అది ఏకంగా మనిషినే లేకుండా చేస్తే ఉపాధిరంగంలో ఒక ప్రళయం చెలరేగుతుంది.
16 ఫిబ్రవరి 2026
Published Sakshi 22-02-2026
https://epaper.sakshi.com/Andhra_Pradesh_Main?eid=99&edate=22/02/2026&pgid=809458&device=desktop&view=3
.png)
No comments:
Post a Comment