Wednesday, 18 March 2026

Telugu Regional Literature and the Water Narrative - తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

 తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-     -   / డానీ 




తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం: నీళ్లు, నేల, నేరేటివ్

-      డానీ

-       

తెలుగు సాహిత్యంలో ప్రాంతీయవాదం 1970లలో ఒక్కసారిగా ఊపందుకున్నట్టుగా కనిపించినా, దాని వేర్లు అంతకంటే లోతుగా విస్తరించి ఉన్నాయి. ఎమర్జెన్సీ తరువాత ఈ ధోరణి మరింత స్పష్టంగా, ఒక సాహిత్య ధోరణిగా రూపుదిద్దుకుంది. అయితే, ఇది కేవలం సాహిత్య పరిణామం మాత్రమే కాదు; దీనికి వెనుక బలమైన రాజకీయ-ఆర్థిక శక్తులు పనిచేశాయి.

 

సాహిత్య ధోరణులు కేవలం రచయితల వ్యక్తిగత అభిరుచుల ఫలితం కావు. అవి సమాజంలోని రాజకీయార్ధిక సంబంధాల ప్రతిబింబాలు. జాతీయ ఆదాయంలో తమకు న్యాయమైన వాటా కోసం రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల గొడుగుల కింద గొంతు పెంచినప్పుడు, ఆ భావజాలం క్రమంగా సాహిత్యంలో ప్రతిబింబించింది. ప్రాంతీయ ఆత్మగౌరవం, అన్యాయంపై అసంతృప్తి, అభివృద్ధిలో అసమానత — ఇవన్నీ కలిపి ప్రాంతీయ సాహిత్యానికి పునాది వేశాయి.

 

ఈ సాహిత్య ప్రవాహం మొదట ఉత్తరాంధ్ర–కళింగాంధ్ర ప్రాంతాలలో స్పష్టంగా వినిపించింది. అక్కడి రచయితలు తమ భూభాగానికి, జీవన అనుభవాలకు ఒక ప్రత్యేక స్వరాన్ని ఇచ్చారు. ఆ స్వరం తరువాత రాయలసీమకు విస్తరించింది. ఆ తరువాత తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో బలంగా వ్యక్తమైంది. ఈ సాహిత్య పరిణామంలో నక్సలైట్  ఉద్యమం ఒక పరోక్ష శక్తిగా పనిచేసింది. అది కేవలం రాజకీయ ఉద్యమం మాత్రమే కాక, సాంస్కృతిక చైతన్యాన్ని కూడా గొప్పగా మేల్కొలిపింది.

 

ఈ మార్పుల వెనుక ఆర్థిక మూలాన్ని ఒక్క పదంలో చెప్పాలంటే — “నీళ్లు”. ప్రాంతీయ సాహిత్యంలో నీళ్లు కేవలం ఒక నేపథ్యం కాదు; అదే కథల కథానాయకగా మారింది అనడం అతిశయోక్తి కాదు. నీటి కొరత, కరువు, వలసలు — ఇవి కథలలో కేవలం సంఘటనలు కాదు; అవే కథను నడిపించే ప్రధాన శక్తులుగా మారాయి.

 

ప్రాంతీయ సాహిత్యం కరువును తన ప్రధాన కథా వస్తువుగా స్వీకరించినప్పుడు, అది సహజంగానే నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాలపై ఒక అంతర్గత విమర్శను నిర్మించింది. ఈ విమర్శ ఎప్పుడూ ప్రత్యక్షంగా బయటపడకపోయినా, దాని అంతర్బావం స్పష్టంగా కనిపిస్తుంది. తెలుగు నేలలో నీటి సమృద్ధితో గుర్తింపుపొందిన ప్రాంతాలు గోదావరి - కృష్ణా జిల్లాలు. అయితే, అక్కడి సాహిత్యంలో ప్రాంతీయ భావోద్వేగాలు పూర్తిగా లేకపోయాయని  చెప్పడం మరీ సింప్లిఫై చేసినట్టు అవుతుంది. కానీ, నీటి కొరత వంటి తీవ్రమైన అనుభవం అక్కడి సాహిత్యంలో ప్రధాన కథావస్తువుగా మారడానికి ఆస్కారంలేదు.

 

నేను అలాంటి నేల నుంచే వచ్చాను. ఆడపిల్ల మురిపెంగా కాలి గోటి తో నేలను తాకితే చాలు — ఒక జలధార ఉబికి వస్తుందనిపించే భూమి అది. అదే ఒక గిఫ్టెడ్ ల్యాండ్; అదే ఒక కర్స్డ్ ల్యాండ్. ఎందుకంటే, కరువు కథలతో నిర్మితమైన ప్రాంతీయ సాహిత్యం విమర్శించే నేల అదే. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కథలకు జీవంపోస్తే, ఇంకో ప్రాంతంలో నీటి సమృద్ధి కథలకు వస్తువుల కొరతను సృష్టించింది. ఇది ఒక విరుధ్ధ అభాస.

 

అయితే, కృష్ణా–గోదావరి ప్రాంతాల గురించిన ఈ భావన కూడా పూర్తిగా సత్యం కాదు. ఈ జిల్లాలలోని తూర్పు ప్రాంతాల్లో నీటి సమృద్ధి ఉన్నప్పటికీ, పశ్చిమ ప్రాంతాల్లో మెట్టభూములు, అడవి ప్రాంతాలు కరువుతోనే పోరాడుతున్నాయి. ఈ అంతర్గత వైరుధ్యాన్నీ మనం తరచూ విస్మరిస్తుంటాము.

 

నీరు పుష్కలంగా ఉన్న ప్రాంతాల రచయితలు సహజంగానే వేరే దిశలో ప్రయాణిస్తారు. వారు స్థూల సామాజిక అంశాలు, తత్త్వశాస్త్ర సమస్యలు, లేదా మనిషి అంతర్గత ప్రపంచాన్ని పరిశీలించే కథల వైపు మొగ్గు చూపవచ్చు. ఈ విభిన్న దృక్కోణాలే తెలుగు సాహిత్యాన్ని సమృద్ధిగా నిలబెడతాయి.

 

ఇటీవల నీటిపారుదల ప్రాజెక్టుల విస్తరణతో, గతంలో కరువుతో బాధపడిన అనేక ప్రాంతాల్లో పరిస్థితులు మారాయి. రాయలసీమలో పండుతున్న సోనా మసూరి ధాన్యం, తెలంగాణలోని నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పెరిగిన ధాన్య ఉత్పత్తి — ఇవన్నీ ఈ మార్పులకు సంకేతాలు. ఉత్తర తెలంగాణలో పండే జిరా రైస్ వంటి పంటలకు జాతీయ స్థాయిలో గిరాకీ పెరగడం కూడా ఒక కొత్త ఆర్థిక వాస్తవాన్ని సూచిస్తోంది.

 

అయితే, ఈ మార్పుల ప్రభావం సాహిత్యంలో అంత త్వరగా ప్రతిబింబించలేదు. కరువు కథలకు అలవాటు పడిన రచయితలు, మారిన వాస్తవాలను పట్టుకోవడంలో కొంత వెనుకబడి ఉన్నారు. కథలు, నవలలు రాయడంలో సులభ మార్గాలను వెతుక్కోవడం ఒక ధోరణిగా మారుతోంది. 1980–90లలో వచ్చిన ఉనికివాదాలు కొంతకాలం కొత్త ఆకర్షణగా నిలిచినా, కాలం మారినా రచయితల దృక్కోణం అంతగా మారలేదనిపిస్తుంది.

 

మలిదశ తెలంగాణ ఉద్యమం ఆంధ్రా ప్రాంతం నుండి వలసవచ్చిన వారిపై ఎక్కుపెట్టింది. నిజానికి తమ ప్రాంతంలో పెరుగుతున్న పెట్టుబడి సంచయనం మీద పోరాడాల్సిన సమయంలో ప్రాంతీయవాదానికి పరిమితమైంది. రాష్ట్ర విభజన తరువాత విజృభించిన పెట్టుబడీ సంచయనంతో ఎలా వ్యవహరించాలో ప్రాంతీయవాద సాహిత్యానికి అర్ధం కాలేదు. అది ఇప్పటికీ కన్వీనియంట్ గా పాత పాటలే పాడుతోంది.

 

ఈ స్థితికి కారణం ఏమంటే, చాలా మంది రచయితలు తమకు అనువైన ఒక సాహిత్య స్థలాన్ని ఎంచుకుని, దానిలోనే స్థిరపడిపోతున్నారు. తమ రచనలు పాక్షిక వాస్తవాలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయన్న అవగాహన కూడా చాలామందిలో కనిపించడం లేదు. ఈ పెరిఫెరల్ సౌకర్యం, సాహిత్యానికి మాత్రమే కాదు, సమాజానికీ హానికరం.

 

కథకుడికి కావలసింది కేవలం రచనా నైపుణ్యం మాత్రమే కాదు; సమాజాన్ని అర్థం చేసుకుని మార్చే తత్త్వదృష్టి కూడా కావాలి. ప్రస్తుతం ఆ తత్త్వదృష్టికే కరువు ఏర్పడింది. కార్పొరేట్–కమ్యూనల్ నియంతృత్త్వం పెరుగుతున్న ఈ కాలంలో, ఆ వాస్తవాన్ని కథా వస్తువుగా స్వీకరించినప్పుడే తెలుగు సాహిత్యం కొత్త జవసత్వాలను పొందుతుంది.

 

ప్రాంతీయవాదం ఒక దశలో అవసరమైన చైతన్యాన్ని తీసుకొచ్చింది. కానీ, అదే ఒక సౌకర్యవాదంగా మారినప్పుడు, అది తన తొలినాటి శక్తిని కోల్పోతుంది. కాబట్టి, ప్రాంతాన్ని దాటి, సమాజపు విస్తృత వాస్తవాలను ఆవిష్కరించే దిశగా తెలుగు సాహిత్యం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది.

 

(ఖదీద్ బాబు రైటర్స్ మీట్‌లో 15 మార్చి 2026న చేసిన ప్రసంగం ఆధారంగా)


No comments:

Post a Comment