ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇరాన్ యుధ్ధం మీద నా వ్యాసాన్ని ప్రచురించింది. ప్రచురణకర్తలకు ధన్యవాదాలు.
*ఇరాన్ ధ్వంసం
కావచ్చు; కానీ ఒంటరిగా కాదు!*
ABN , Publish Date - Mar 07 , 2026 | 01:10 AM
అమెరికా–ఇజ్రాయెల్
క్షిపణి దాడుల్లో తొలిరోజే చనిపోయిన సయ్యిద్ అలీ హుసైనీ ఖమేనీ గొప్ప ప్రజాదరణ పొందిన
నేత ఏమీకాదు. నిస్సందేహంగా అతనొక నియంత. కానీ, అంతర్జాతీయ వ్యవహారాల్లో అమెరికా సామ్రాజ్యవాదానికి
పచ్చి వ్యతిరేకి. ఇరాన్ చమురు కొనే దేశాలు ఆ మొత్తాన్ని తమ దేశ కరెన్సీలో చెల్లించవచ్చని
పెద్ద ఆఫర్ ఇచ్చినవాడు, అమెరికా ఆర్థిక మనుగడకు ప్రాణప్రదమైన డాలర్ ఆధిపత్యానికి గట్టి
సవాలు విసిరినవాడు ఖమేనీ. ఇరాక్ సద్దాం హుస్సేన్, లిబియా మువమ్మర్ గడాఫీల దారిలో అలీ
ఖమేనీ కూడా ఇప్పుడు అమరవీరుల జాబితాలో చేరాడు.
అంతర్జాతీయ
చమురు వనరుల మీద అమెరికా గుత్తాధిపత్యాన్ని సాగించాలనుకుంటున్నది. అందులో భాగంగా రెండు
నెలల క్రితం సైనిక చర్య ద్వారా వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, అతని భార్య సిలియా
ఫ్లోరెస్‌లను కిడ్నాప్ చేసి అమెరికా జైలులో బంధించడాన్ని ప్రపంచం చూసింది. ఆ తరువాతి
వంతు ఇరాన్ అగ్రనేతదే అని ప్రపంచం మొత్తానికీ తెలుసు. అలీ ఖమేనీకి కూడా తెలుసు. అయినా,
అతడు భయపడలేదు. అమెరికాకు సరెండర్ కాలేదు. ఓ ట్రేడ్ డీల్ చేసుకుని దేశ ఆర్థిక వ్యవస్థను
అమెరికాకు తాకట్టుపెట్టలేదు. భార్యా పిల్లలతో సహా చనిపోవడానికి సిద్ధపడ్డాడు; చనిపోయాడు.
భారత
ముస్లింలలో సున్నీలు 85 శాతం, షియాలు 15 శాతం. నేటి ఇరాన్ జనాభాలో షియాలు 90–95 శాతం.
సున్నీలు 5–10 శాతం. ధార్మిక శాఖా భేదాల ప్రకారం, భారత ముస్లింలు ఇరాన్‌ను వ్యతిరేకించాలి;
సౌదీ అరేబియాను సమర్థించాలి. కానీ అలా జరగడం లేదు. భారత ముస్లింలు మాత్రమే కాదు, ప్రపంచ
ముస్లింలు ఇప్పుడు సౌదీ అరేబియాను వ్యతిరేకిస్తూ ఇరాన్ పక్షం వహిస్తున్నారు! ఇక్కడ
ధార్మిక శాఖా భేదాలకన్నా అమెరికా సామ్రాజ్యవాద వ్యతిరేకత ప్రధానంగా మారింది.
ఇరాన్
ఇవ్వాళ అమెరికా–ఇజ్రాయెల్ కూటమితో మాత్రమే పోరాడడం లేదు. అమెరికాకు సైనిక స్థావరాలు
ఏర్పాటు చేసిన సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, కువైట్, ఖతర్, జోర్డాన్
తదితర ముస్లిం దేశాలతోనూ ఒకే సందర్భంలో పోరాడుతోంది.
ఇరాక్‌లో
పరిస్థితి భిన్నంగా ఉంది. అక్కడి ప్రభుత్వం ఈ యుద్ధానికి దూరంగా ఉండాలనుకుంటున్నది.
అయితే, అక్కడి సైన్యం మీద ప్రభుత్వానికి పెద్దగా పట్టులేదు. అది ఇరాన్ పక్షం వహించాలనుకుంటున్నది.
అదీగాక ఇరాక్‌లోని కతీబ్ హిజ్బొల్లా వంటి తీవ్రవాద సంస్థలు కూడా అమెరికా వ్యతిరేకతతో
ఇరాన్‌కు మద్దతు పలుకుతున్నాయి.
ఇరాన్‌లో
చైనా పెట్టుబడులున్నాయి. ఆ దేశంతో భౌగోళిక, రాజకీయ అవసరాలున్నాయి. అయినప్పటికీ అమెరికాతో
నేరుగా ఢీకొనడానికి చైనా సిద్ధంగా లేదు. అమెరికా దురుసుతనం మీద పరిమిత నిరసనను వ్యక్తం
చేసి ఊరుకుంది. ఉక్రెయిన్ యుద్ధంలో మునిగి ఉన్న రష్యా సైతం తన మిత్రదేశమైన ఇరాన్‌కు
ప్రత్యక్ష సహకారం అందించే స్థితిలో లేదు. కంటి తుడుపుగా మద్దతిచ్చి సరిపెట్టుకుంది.
యుద్ధం వల్ల చమురు ధరలు పెరుగుతాయి కాబట్టి, అలా అందివచ్చిన అవకాశాన్ని వాడుకోవాలని
పుతిన్ భావిస్తున్నారు.
ఇరాక్‌ను
ధ్వంసం చేయాలనుకున్నప్పుడు సద్దామ్ హుస్సేన్ జీవరసాయన ఆయుధాలను తయారు చేసి ప్రపంచ వినాశనానికి
కుట్ర చేస్తున్నాడని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్, యూకే ప్రధాని టోనీ బ్లెయిర్
తెగ ప్రచారం చేశారు. సద్దాం హుస్సేను ఉరి తీశాక, ఇరాక్ అంతటా వెతికినా అలాంటి ఆయుధాల
జాడ ఎక్కడా కనిపించలేదు. వెనెజువెలా చమురును స్వాధీనం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ దేశాధ్యక్షుడు
మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నాడని అమెరికా ప్రచారం చేసింది. ఆ సంప్రదాయంలోనే ఇరాన్
అణ్వాయుధాలను పెద్ద ఎత్తున సిద్ధం చేస్తున్నట్టు కొన్నాళ్ళుగా అమెరికా ప్రచారం చేస్తున్నది.
ఏకంగా దేశాధినేత చనిపోయినా సరే, వైరి దేశాలపై ఇరాన్ ఇప్పటిదాకా అణ్వాయుధాలను ప్రయోగించలేదంటే
అర్థం ఏమిటి?
అబద్ధాలను
ప్రచారం చేయడంలో డొనాల్డ్ ట్రంప్ గత అమెరికా అధ్యక్షులందర్నీ మించిపోయారు. తానే ప్రపంచ
పోలీసు, ప్రపంచ జడ్జి అనుకుంటున్నారు. ఇప్పుడైతే మరీనూ, తానో ప్రపంచ మొనగాడు అనుకుంటున్నారు.
యుద్ధాలు
మొదలుపెట్టడం సులభం; ముగించడం కష్టం. యుద్ధాలను మొదలు పెట్టినవారి లక్ష్యాలు నెరవేరుతాయని
చెప్పడం కూడా కష్టమే. చరిత్ర చెప్పేది ఒకటే– పెద్ద యుద్ధాలు ప్రత్యర్థిని మాత్రమే కాదు,
ప్రారంభించిన వారినీ మార్చేస్తాయి. అమెరికాకు వియత్నాం ఎలా గుణపాఠమైందో, ఈ యుద్ధం కూడా
అలాగే మరో అంతర్జాతీయ పాఠంగా మిగిలే అవకాశం ఉంది.
ఈ
యుద్ధంలో ఇరాన్ ధ్వంసం కావచ్చు; కానీ ఒంటరిగా అయితే కాదు!
- డానీ
సమాజ, రాజకీయ
విశ్లేషకుడు
Updated
Date - Mar 07 , 2026 | 01:12 AM
.png)
No comments:
Post a Comment