*అశోక్ పార్మర్ జీవితం ఇస్తున్న హామీ!*
Author, Journalist, Documentary Filmmaker, Political Commentator, Literary Critic, Humourist, and Social Worker
Sunday, 1 March 2026
Ashok Parmar - అశోక్ పార్మర్ జీవితం ఇస్తున్న హామీ!*
-
డానీ
రాజకీయ,
సమాజ విశ్లేషకులు
గుజరాత్ అల్లర్ల సందర్భంగా
రెండు ఫొటోలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. మొదటిది; అశోక్ పార్మర్ ది. కుడిచేతిలో
ఇనపరాడ్డు పట్టుకుని, తలకు కాషాయపు గుడ్ద చుట్టుకుని అల్లర్లలో అతను వీరావేశంతో
చెలరేగిపోయాడు. రోడ్ల మీద దొరికిన ముస్లింలందరీ
తలలు పగులగొట్టాడు. ఆ రాక్షసానందంలో మీడియాకు మంచి పోజులిస్తూ జాతీయ అంతర్జాతీయ గుర్తింపును పొందాడు.
గుజరాత్ అల్లర్లకు
కిరీటధారులు, సూత్రధారులు, అమలుకర్తలు వేరేగావున్నారు. ఆ
అల్లర్ల నిర్వాహకులు ఎస్సి, బిసి సామాజికవర్గాలకు చెందిన వారిని పెద్దఎత్తున సమీకరించి
విశాలమైన కాల్బలాన్ని నిర్మించారు. అశోక్ పార్మర్ వంటి వారిది అందులో కాల్బలం పాత్ర.
1970ల నాటి గుజరాత్ లో
బనియా, పటేల్, బ్రాహ్మణ సామాజికవర్గాలు రాజకీయరంగాన్ని
శాసించేవి. దానికి విరుగుడుగా ఒక కొత్త సామాజిక కూర్పును కాంగ్రెస్ నాయకుడు మాధవ్ సింగ్ సోలంకీ రూపొందించారు. క్షత్రీయులు, హరిజనులు,
ఆదివాసులు, ముస్లింలను ఇందులో సమీకరించారు. దానికి అనుగుణంగా ఈ సమీకరణను ఖామ్
(KHAM) అని పేరు పెట్టారు. ఇది గుజరాత్ రాజకీయాల్లో ఒక దశలో బాగా పనిచేసింది. 1985
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 56 శాతం
ఓట్లు వచ్చాయి. మొత్తం 182 అసెంబ్లీ స్థానాల్లో 142 స్థానాలు దక్కాయి. అలా దెబ్బతిన్న పటేల్ సామాజికవర్గం హిందూ సమూహాల ఐక్యతకు పూనుకున్నాయి. అప్పటి ‘బిసి
రిజర్వేషన్’ వ్యతిరేక ఉద్యమం వాళ్లకు
కలిసి వచ్చింది. దానితో, ఖామ్ బలహీనపడింది. హిందూ సమాజంలో అణగారిన సామాజికవర్గాలు
కాంగ్రెస్ కు దూరం అయ్యారు. బిజెపికి
దగ్గరయ్యారు. గుజరాత్ అల్లర్లలో ఈ సమూహాలు రిజర్వుడు సైన్యంగా రంగంలోనికి దిగి
చెలరేగిపోయాయి.
అశోక్ పార్మర్ మాదిగ సామాజికవర్గానికి చెందిన వాడు. అల్లర్ల కిరీటధారులు,
సూత్రధారులు, అమలుకర్తలు అతనికి సామాజిక అణిచివేత నుండి విముక్తిని ప్రసాదించారు.
ముస్లింలను ఊచకోత కోయడానికి సంపూర్ణ స్వేఛ్ఛను ఇచ్చారు. కొత్తగా లభించిన స్వేఛ్చతో
అతను చెలరేగిపోయాడు. ప్రాణభయంతో
పారిపోతున్న వారి పట్టుకుని తలలు పగులగొడుతూ వీలయినంత ఆనందాన్ని జుర్రుకున్నాడు.
ఆ అల్లర్లలో లించింగ్
మాబ్ కు చిక్కి ప్రాణభిక్ష పెట్టమంటూ
దయనీయంగా వేడుకున్న వేలాది మందిలో కుతుబుద్దీన్ అన్సారి ఒకరు. నిస్సహాయ స్థితిలో చేతులు జోడించి
వేడుకుంటున్న అన్సారి ఫొటో కూడ అప్పట్లో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
గుజరాత్ అల్లర్లు
జరిగిన చాలాకాలం వరకు అన్సారీ మామూలు మనిషి కాలేదు. మనుషుల్ని చూస్తే చాలు భయంతో వణికిపోయేవాడు. అప్పట్లో
చాలామంది గుజరాత్ ముస్లింల పరిస్థితి ఇదే. మానవజాతి మీదే నమ్మకాన్ని కోల్పోయే అమానవియ
వాతావరణం అది.
మరోవైపు, అశోక్
పార్మర్ కు వాస్తవ సాంఘీక జీవితం గొప్ప పాఠాన్ని నేర్పింది. అల్లర్ల నిర్వహణలో తనది
కాల్బలం పాత్ర మాత్రమేనని అతనికి తెలిసివచ్చింది. అంతకు మించిన సాంస్కృతిక స్థానాన్ని
కోరుకుంటే తమ సామాజికవర్గ మీద కూడ అల్లర్లు జరుగుతాయని అతనికి కొంచెం ఆలస్యంగా అర్ధమయ్యింది.
తను చాలా తప్పుచేశానని పశ్చాత్తాప పడ్డాడు. ఇనపరాడ్డును పడేశాడు.
నెత్తినకట్టుకున్న కాషాయ గుడ్దను విసిరి కొట్టాడు.. తన కులవృత్తి అయిన చెప్పులు
కుట్టుకోవడం మొదలెట్టాడు. కుతుబుద్దీన్ అన్సారీని వెతికి పట్టుకున్నాడు. తన
చెప్పుల బడ్డీ కొట్టును ఆవిష్కరించడానికి ఒప్పించాడు. అలా ఒక విషాదం ఒక పరిష్కారంగా
ముగిసింది.
ఇవ్వాల్టి కార్పొరేట్
కమ్యూనల్ డిక్టేటర్ షిప్ అప్రతిహత శక్తిగా కనిపిస్తున్నమాట నిజమే. దాన్ని ఎవరూ ఏమీ
చేయలేరని చాలామంది అనుకుంటున్న మాట కూడ నిజమే. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో
కమ్యూనిస్టు పార్టీల దగ్గర కార్యక్రమంలేదు. ఇండియా బ్లాక్ సమిష్టిగా లేదు. రాహుల్
గాంధీ వుండాల్సినంత చొరవగా లేరు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదు. ఎన్నికల ప్రక్రియ హైజాక్
అయిపోతున్నా దాన్ని సరిదిద్దే మార్గాలు కనిపించడంలేదు. మరోవైపు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి
భిన్నంగా సాయుధపోరాటం సాగిస్తామన్న మావోయిస్టులు సహితం భవిష్యత్తు మీద నమ్మకాన్ని
కోల్పోయారు. ఇలాంటి నేపథ్యంలో కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ ను
ఓడించగలమనే ఊహ కూడ దుస్సహాసం అనేలా వుంది.
కానీ, కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ కాల్బలం దానిదికాదు అని అశోక్ పార్మర్ కథ
చెపుతోంది. ఈరోజు కాకపోయినా రేపయినా దాడి మూకల నుండి అశోక్ పార్మర్లు బయటికి
వస్తారు. మరో కోరేగావ్ యుధ్ధం జరగవచ్చు. అప్పుడు
కార్పొరేట్ కమ్యూనల్ డిక్టేటర్ షిప్ వ్యవస్థ పూర్తిగా బీటలు వారుతుంది.
1 మార్చి 2026
Subscribe to:
Post Comments (Atom)



No comments:
Post a Comment