అమరావతికి లక్ష్మీ కటాక్షం
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:57 AM
‘రాజధాని అమరావతికి జగన్నాథుడు వ చ్చాడు. ఆయన వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే అమరావతికి జగన్నాథుడి తోడుగా లక్ష్మీ కటాక్షం లభించబోతోంది.

హిందూ ధర్మానికి సాక్ష్యంగా రాజధానిని నిర్మిస్తున్నాం
ఈ స్థల మహత్యంతో అమరావతిని ఎవరూ కదిలించలేరు
సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికతకూ వేదికగా నవ నగరం
టీటీడీతో కలసి రాష్ట్రంలో 5 వేల ఆలయాల నిర్మాణం: సీఎం
వెంకటపాలెంలో వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర
అమరావతి ప్రజల రాజధాని.. దేవతల రాజధాని.. అందుకే పూరీ జగన్నాథుని రథయాత్ర ఇక్కడకు వచ్చింది. శ్రీవారి ఆలయం చెంతనే రథయాత్ర ప్రారంభం కావడం ఎంతో ఆనందంగా ఉంది.
ఒకవైపు కలియుగ ప్రత్యక్ష దైవం.. ఇంకొంచెం ముందుకు వెళితే క్వాంటం వ్యాలీ... సాంకేతిక విజ్ఞానంతో అభివృద్ధి, ఆధ్యాత్మికతతో విలువలు, సంస్కృతి వృద్ధి చెందుతాయి. ఈ నవనగరం సాంకేతికత, ఆధ్మాత్మికతకు వేదికగా ఉండబోతోంది.
- సీఎం చంద్రబాబు
గుంటూరు(రాజధాని), జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘రాజధాని అమరావతికి జగన్నాథుడు వ చ్చాడు. ఆయన వెంటే లక్ష్మీదేవి కూడా వస్తుంది. అంటే అమరావతికి జగన్నాథుడి తోడుగా లక్ష్మీ కటాక్షం లభించబోతోంది. ఇక మన రాజధానికి తిరుగులేదు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని పరిధి వెంకటపాలెంలో గురువారం నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఆయన పాల్గొన్నారు. రథాన్ని లాగేముందు పూరీలో జగన్నాథ స్వామికి చేసే ప్రత్యేక పూజలు ఇక్కడా నిర్వహించారు. రాజధాని నగర బృహత్ ప్రణాళికతో కూడిన చిత్రపటాన్ని తలపై పెట్టుకొని విశ్వనగరిగా అమరావతి ఎదగాలని సీఎం కోరుకున్నారు. సంప్రదాయ వస్త్రాల్లో హాజరైన చంద్రబాబు రథం ముందు భాగంలో బంగారు చీపురుతో ఊడ్చారు. అనంతరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ఆశీనులైన రథాన్ని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి పి. నారాయణ, ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి తాడుతో లాగి రథయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. ‘అమరావతిని హిందూ ధర్మానికి సాక్ష్యంగా నిర్మిస్తున్నాం. ఈ స్థల మహాత్మ్యంతో అమరావతిని ఎవరూ కదిలించలేరు. ఇటు కృష్ణమ్మ, అటు స్వామివారి ఆలయం అమరావతికి శాశ్వత దీవెనలు అందిస్తున్నారు.
అమరావతి రాష్ట్ర ఖ్యాతిని పెంచేదిగా, తెలుగు యువతకు ఉపాధినిచ్చే కల్పవల్లిగా వర్ధిల్లుతుంది’ అని పేర్కొన్నారు. సమాజంలో విలువలు పడిపోతున్న సమయంలో, మానవ సంబంధాలు తగ్గిపోతున్న తరుణంలో ఎన్నో సమస్యలకు ఆధ్యాత్మికత ఒక్కటే సరైన పరిష్కార మార్గమని చెప్పారు. ప్రజల్లో ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించేందుకు టీటీడీతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా 5వేల దేవాలయాలను నిర్మిస్తున్నామన్నారు. ఉమ్మడి కుటుంబాలే భారతదేశ సంపద అని చెప్పారు.
ఇస్కాన్ సేవలకు ప్రశంసలు
ఆధ్యాత్మక విలువలు, నిస్వార్థ సేవలో ఇస్కాన్, అక్షయపాత్ర సేవలు ప్రశంసనీయమని సీఎం అన్నారు. ప్రపంచవ్యాప్తంగా, 16 రాష్ట్రాల్లో, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 25వేల ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో భోజనాలు ఏర్పాటు చేస్తోందని వివరించారు. అక్షయపాత్ర ద్వారా 25 ఏళ్లుగా 500 కోట్ల మందికి ఆహారం అందించారని కొనియాడారు. అక్షయపాత్రకే అన్న క్యాంటీన్ల నిర్వహణ అప్పగించామని, వాటిని అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. అమరావతి, పోలవరం పూర్తి చేయాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చాలని జగన్నాథుడిని సీఎం వేడుకున్నారు.
No comments:
Post a Comment