Tuesday, 7 July 2026

60 Years of Cultural Revlution - Did National Question Solved?

సాంస్కృతిక విప్లవానికి 60 యేళ్ళు!!

పరిష్కారంకాని జాతుల సమస్య

 

డానీ

సమాజ, రాజకీయ విశ్లేషకులు

 

          చైనాలో మహత్తరంగా భావించే సాంస్కృతిక విప్లవం జరిగి ఇది 60వ సంవత్సరం.  ఆ విప్లవాన్ని మావో స్వయంగా ఆరంభించాడు, నాయకత్వం వహించాడు. దీని ఉత్తేజంతోనే భారతదేశంలో నక్సలైట్ ఉద్యమం ఆరంభమయింది.  60 ఏళ్ళ తరువాత, ఇప్పుడయినా సరే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏమంటే ఈ విప్లవం కనీసం చైనాలో అయినా సాంస్కృతిక సమస్యల్ని ఏమేరకు పరిష్కరించిందీ అనీ.

 

పెట్టుబడీదారీ వ్యవస్థను కమ్యూనిస్టులు చాలా అద్భుతంగా విమర్శిస్తారు.  ఈనాటి మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థను కూడ వాళ్లు చాలా వివరంగా, చాలా లోతుగా విమర్శిస్తారు. ఈ విషయంలో వారికి సాటి మరొకరు వుండరు.  అయితే, ఈ వ్యవస్థను రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఎలాంటి వ్యవస్థను రూపొందించాలీ? అనే ప్రశ్నకు వారి దగ్గర స్పష్టమైన సమాధానం వుండదు. ఈ నేపథ్యంలోనే కమ్యూనిస్టులు పాతవ్యవస్థల్ని నిర్మూలించగలరుగానీ, కొత్త వ్యవస్థను నిర్మించలేరు అనేమాట తరచూ వినపడుతూ వుంటుంది.

 

          1917లో రష్యాలో సోషలిస్టు విప్లవం ద్వారానూ, 1949లో చైనాలో నూతన ప్రజాస్వామిక విప్లవం ద్వారానూ సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడినట్టు చెప్పే సాహిత్యం చాలా వుంది. ఆ రెండు దేశాల్లో ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల పాలనే కొనసాగుతున్నప్పటికీ ఆదర్శ సోషలిస్టు సమాజాలు కొనసాగుతున్న దాఖలాలు లేవు. అక్కడ పెట్టిబడీదారీ వంటి సమాజాలే కొనసాగుతున్నాయి.

 

          మనుషులు ఆర్ధిక జీవితాన్ని మాత్రమే గడపరు. కులం మతం తెగ, లింగం, ప్రాంతం, భాష, సంస్కృతి మొదలయినవి కూడా మనుషుల జీవితాల్లో వుంటాయి. అవి ఆయా సమూహాల అస్తిత్వాలతోపాటూ  ఆలోచనలనూ ప్రభావితం చేస్తుంటాయి. తమవైన అనేకానేక కొత్త ప్రశ్నలను రేపుతుంటాయి.  కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించేవాళ్ళు వీటికి సంతృప్తికరమైన సమాధానాలు చెప్పడానికి ప్రయత్నించాలి. వాళ్ళు ఆపని చేయలేదు; చేయడమూలేదు. .

 

          వర్గ ఘర్షణ అంటే ఆర్ధిక దోపిడికి సంబంధించింది మాత్రమే అనీ మిగిలినవన్నీ ఉపరితల అంశాలని ఉపదేశించే కమ్యూనిస్టులు మనకు  తరచూ తారసిల్లుతుంటారు. మిగిలిన వ్యవస్థల్లో వర్గపోరాటం వుండదని వీరు బల్లగుద్ది చెపుతుంటారు. నిజం అదికాదు. వర్గం సర్వాంతర్యామి. అన్ని వ్యవస్థల్లోనూ, సమస్త చారిత్రక దశల్లోనూ వర్గం వుంటుంది, వర్గపోరాటం వుంటుంది.

 

మార్క్స్-ఏంగిల్స్ 1846లోనే సంతానోత్పత్తి వ్యవస్థలో భార్యాభర్త మధ్య శ్రమ విభజన వుందని గమనించారు. ఈ విశ్లేషణను 1884లో ఏంగిల్స్ ఇంకా ముందుకు సాగించాడు.  దాంపత్యంలో వర్గ వైరుధ్యం, వర్గ ద్వేషం, వర్గ అణిచివేత (1. Class Opposition 2. Antogonism 3. Class Oppression) అనే మూడు అంశాలు వున్నట్టు తేల్చాడు. ఇది 150 సంవత్సరాల క్రితపు మార్క్సిస్టు సమాజశాస్త్ర పరిజ్ఞానం. ఆనాడే దాంపత్య వ్యవస్థలో ఇన్ని వర్గ వైషమ్యాలు వున్నట్టు మార్క్సిస్టు మహోపాధ్యాయులు గుర్తించినపుడు, ఈనాటి మతవ్యవస్థలో ఇంకెన్ని వర్గ వైషమ్యాలను మార్క్సిస్టులు గుర్తించాలీ?  పైగా, మతతత్త్వ పెట్టుబడీదారీ వ్యవస్థలో వుంటూ!!

 

ఆర్ధిక నిర్ణాయకవాదం వంటి బండ నిర్వచనాల నుండి బయటపడడానికి కొండపల్లి సీతారామయ్య వంటివాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. స్త్రీల అణిచివేత గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ సోషలిస్టు సమాజం ఏర్పడ్డాక మాత్రమే వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందనడం సరికాదు అని మందలించారు. అలాగే, ఎజెండాలో తమ సమస్య లేదంటూ స్త్రీలు కమ్యూనిస్టు పార్టీలకు దూరంగా వుండరాదని కూడా హితవు చెప్పారు. ఇది అంతకు ముందువారికన్నా మెరుగైన భావనగా కనిపిస్తున్నప్పటికీ సంతృప్తికరమైన సమాధానం మాత్రంకాదు. సోషలిస్టు సమాజాల్లో స్త్రీపురుష సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయో కూడ విడమరచి చెప్పాలి.

 

          సరిగ్గా ఇలాంటి అసంతృప్తి కుల, మత, తెగ పీడితుల్లోనూ వుంటుంది. వుంటున్నది. పెట్టుబడీదారీ వ్యవస్థలో ప్రధాన పీడితులు కార్మికులు అయినట్టే,  మతోన్మాద పెట్టుబడీదారీ వ్యవస్థలో  ప్రధాన పీడితులు  మైనారిటీ మత సమూహాలవుతాయి. ముస్లింలు, క్రైస్తవులు, శిక్కులు, బౌధ్ధులు ఈ కోవలోనికి వస్తారు. వీళ్ళు సోషలిస్టు సమాజాల్లో భిన్న మతాలమధ్య సంబంధాలు, వైరుధ్యాలు ఎలా వుంటాయాని తరచూ ప్రశ్నిస్తూ వుంటారు. ఉద్యమ నిర్మాణాల్లో వుండేవారు వీటికి సమాధానాలు చెప్పాలి. వర్గసమాజం రద్దయినపుడు మతం కూడ రద్దవుతుంది గనుక, అప్పుడు మత అణిచివేత కూడ రద్దవుతుంది కనుక అప్పటి దాక  మైనారిటీ మత సమూహాలు  ఓపిగ్గా ఎదురు చూడాలనే ఉచిత సలహాలు ఇచ్చేవారూ లేకపోలేదు.

 

          సోషలిస్టు సమాజంలో మతం? కమ్యూనిస్టు సమాజంలో మతం? వంటి సందేహాలకు సమంజసమైన సమాధానం చెప్పకపోతే ఇప్పటి మత మైనారిటీ సమూహాలు, ఆదివాసులు మరో కోణంలో వాళ్ళ పరిశోధనలు సాగిస్తారు. రష్యా, చైనాల్లో సోషలిస్టు సమాజాలు ఏర్పడిన తరువాత మత మైనారిటీలు, ఆదివాసి తెగల పరిస్థితి ఏమిటీ? ఎవరయినా అధ్యయనం చేశారా?

 

          కార్ల్ మార్క్స్ – ఏంగిల్స్ ప్రధానంగా జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లండ్ దేశాల్లో జీవించారు. అవి యూరోపియన్ జాతిరాజ్యాలు. అక్కడ ఇతర జాతుల సమస్య అంతగా వుండదు. రష్యా సంగతి వేరు. అత్యంత విశాలమైన దేశం. అనేక జాతులు, భాషలు, సంస్కృతులు వున్నాయి. అక్కడ ఈ సమస్యను ఎలా పరిష్కరించారు అనేది ఎవరికయినా ఆసక్తికర అంశం.

 

రష్యాలో అక్టోబరు విప్లవం విజయవంతం కావడానికి ముందే లెనిన్, స్టాలిన్ కూడ జాతుల సమస్త మీద సైధ్ధాంతిక గ్రంధాలు రాశారు. అవి చాలా ఆదర్శవంతంగా వుంటాయి. జాతులకు విడిపోయే హక్కుతోసహా స్వయం నిరంయాధికారం  వుండాలని వాళ్ళు అప్పట్లో ప్రతిపాదించారు. వాళ్ళ హయాంలో సోవియట్ రష్యా సంయుక్త రాష్ట్రాలు  ఎర్పడ్డాక ఆ పుస్తకాల్లో చేసిన ప్రతిపాదనల్ని వాళ్ళు పాటించారా? రెండురకాల సమాధానాలు వస్తాయి. ఒక దశలో ఆదర్శంగా వుండడానికి ప్రయత్నించనట్టూ, ఇంకో దశలో కఠినంగా వ్యవహరించినట్టూ మనకు అర్ధం అవుతుంది. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో  దేశ సమగ్రత, భద్రతా నెపాలతో రష్యన్ కమ్యూనిస్టు పాలకులు సరిహద్దుల్లోని ఆదిమజాతులు, మత మైనారిటీల మీద అనేక ఆంక్షలు విధించినట్టు ఇప్పుడు వెలుగులోనికి వస్తున్నాయి.

 

చైనాలో  సాంస్కృతిక వాతావరణం అందుకు భిన్నంగా ఏమీ కనిపించడంలేదు. మనకు ఇప్పుడు అందుబాటులో వున్న సమాచారం ప్రకారం సాంస్కృతిక విప్లవ కాలంలో అనేక ప్రాంతాల్లో మఠాలు, ఆలయాలు, మసీదులు, చర్చిల్ని మూసివేశారు. కొన్నింటిని ధ్వంసం చేశారు. టిబెటన్ బౌద్ధ వారసత్వం, ఉయ్‌ఘూర్ ముస్లిం సంస్కృతి, మంగోలియన్ సాంస్కృతిక సంప్రదాయాలు తీవ్ర ఒత్తిడిని అణిచివేతని ఎదుర్కొన్నాయని అనేక అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో, హాన్ సమాజంలోని మేధావులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పార్టీ నాయకులు కూడా రాజకీయ ఇబ్బందులకు గురయ్యారు. కాబట్టి ఈ కాలాన్ని కేవలం ఒకే కోణంలో అర్థం చేసుకోవడం సరిపోదు. చరిత్రను సంపూర్ణంగా చూడాలి.

 

 

చర్చ కేవలం చైనాకు సంబంధించినది కాదు. భారతదేశం, మాజీ సోవియట్ యూనియన్, యుగోస్లావియా, ఇథియోపియా వంటి అనేక బహుళ జాతి సమాజాలు ఒకే ప్రశ్నను ఎదుర్కొన్నాయివైవిధ్యాన్ని కాపాడుతూ ఐక్యతను ఎలా నిర్మించాలి? రాజకీయ తత్వవేత్తలు తరచూ హెచ్చరించే మాటేమిటంటే చరిత్రను అర్థం చేసుకోవడం అంటే భవిష్యత్తును ఎలా నిర్మించాలో తెలుసుకోవడం. అలాగే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రజాస్వామ్యం కేవలం రాజకీయ వ్యవస్థ కాదని, "సహజీవనం చేసే పద్ధతి" అని వివరించాడు. మన రాజ్యాంగ ప్రధాన ఆదర్శల్లో స్వేఛ్ఛా, సమానత్వంతోపాటు సహోదరభావం చాలా కీలకమైనది.

 

2026 జూలై 1 నుంచి చైనాలో "Law on Promoting Ethnic Unity and Progress" అమల్లోకి వచ్చింది. చైనా ప్రభుత్వం ఈ చట్టం లక్ష్యం అన్ని జాతుల సమాన అభివృద్ధి, జాతీయ ఐక్యత, మరియు "చైనీయ జాతి ఉమ్మడి చైతన్యం" (Community of the Chinese Nation)ను బలోపేతం చేయడమని ప్రకటించింది. చైనా వాదన ప్రకారం, ఇది విభజనవాదాన్ని నిరోధిస్తూ అన్ని జాతులు కలిసి ఆధునిక సోషలిస్టు దేశ నిర్మాణంలో భాగస్వాములు కావడానికి రూపొందించిన చట్టం. అయితే, అనేక అంతర్జాతీయ పరిశోధకులు, మానవ హక్కుల సంస్థల ప్రతినిధులు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. ఈ చట్టం మైనారిటీ సంస్కృతులను అణిచివేసి, హాన్ జాతీయ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ఉద్దేశించిన చట్టం ఇది అంటున్నాయి.

 

కొత్త చట్టం గురించి భిన్నాభిప్రాయాలు వుండవచ్చు. కానీ సాంస్కృతిక విప్లవం జరిగిన అరవై సంవత్సరాల తరువాత కూడా చైనాలో జాతీయ అంశంపై చర్చ కొనసాగుతోంది అన్నది గమనించాల్సిన అంశం. భారతదేశాన్నీ హిందూత్వ దేశంగా మార్చాలని ఇక్కడి పాలకులు భావిస్తున్నట్టు చైనాలోనూ హాన్ జాతి రాజ్యాన్ని నెలకొల్పే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.

 

ఈంశం మీద శాస్త్రీయ చర్చ కొనసాగాలి. మరింత న్యాయమైన సమాజ నిర్మాణానికి దారి చూపించేందుకు ఈ అంశాల మధ్య మరింత లోతైన అధ్యయనం జరగాలి.

 

2026 జూలై 7

No comments:

Post a Comment