Wednesday, 15 July 2026

Bombard the Brains - మెదళ్ల మీద మిస్సైళ్ళు -

 ఈరోజు నా వ్యాసం *మెదళ్ళ మీద మిస్సైళ్ళు* ను ప్రచురించిన తెలుగుప్రభకు ధన్యవాదాలు.

 

*మెదళ్ల మీద మిస్సైళ్ళు*

*దేశభద్రతా? ప్రజాస్వామ్యమా?*

*డానీ*

*సమాజరాజకీయ విశ్లేషకులు*

డానీ

 


యుద్ధం అంటే ఒకప్పుడు మనకు గుర్తుకొచ్చేది సరిహద్దులు. తుపాకులు, ట్యాంకులు, యుద్ధ విమానాలు. గెలుపు అంటే భూభాగాన్ని ఆక్రమించడం. ఓటమి అంటే సైన్యాన్ని వెనక్కి నెట్టడం. కానీ ఇరవై ఒకటో శతాబ్దంలో యుద్ధ స్వరూపం మారిపోయింది. నేడు యుద్ధం కేవలం నేల మీద కాదు; మనసుల మీద, సమాచారంపై, ప్రజాభిప్రాయంపై కూడా జరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా భద్రతా నిపుణులు చెబుతున్నారు.

 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యాన్ని పొగుడుతూ వచ్చే సోషల్ మీడియా పోస్టులు  చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు భావించి వాళ్ల మనోభావాలు తీవ్రంగా ద్ఫెబ్బతింటాయి. అది అక్కడితో ఆగదు. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం అనేది వారి అభిప్రాయం. అంచేత ప్రధానిని విమర్శించి, దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసేవారిని దేశద్రోహులుగా  పరిగణించి శిక్షించాలి అనే మాట ఇటీవల ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

 

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? విమర్శిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  ఎలిమెంటరీ స్కూళ్ళలో రాజ్యాంగ ఆదర్శాల గురించి అలానే బోధిస్తారు.

 

ఇప్పుడు రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని బిఆర్ అంబేడ్కర్ అంతటి వాడే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు దోవల్ మొదటిసారి సిధ్ధాంతానికి ఒక ప్రవేశిక రాసి చదివారు. యుధ్ధాలు మూడు రకాలు.  మొదటివి; దేశ సరిహద్దుల్లో శతృదేశ సైనికులతో జరుగుతాయి. రెండవవి, దేశం లోపల ఉద్రవాదులు, తీవ్రవాదుల ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతాయి. ఇది అక్కడితో ఆగదు. ఆధునిక యుద్ధంలో పౌర సమాజమే యుద్ధభూమిగా మారవచ్చని వారొక వినూత్న సిధ్ధాంతాన్ని రచించారు. 2026లో రాష్ట్రీయ రక్షా విశ్వవిద్యాలయం కాన్వొకేషన్లో ఆయన మరోసారి, "The objective of every war is to break the willpower of a country" అని అన్నారు.

 

యుధ్ధంలో గెలవాలంటే ముందు శతృదేశ ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయాలని అలెగ్జాండరో మరొకరో ఎక్కడో అన్నారట. దాని అర్ధం ఏమంటే, శత్రు దేశ ప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే.

 

అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు.  సిధ్ధాంత ప్రకారం ఆధునిక ప్రపంచంలో యుద్ధం మూడు రంగాల్లో జరుగుతుంది. మొదటిది సరిహద్దులో శత్రు సైన్యాలతో జరిగే సాంప్రదాయిక యుద్ధం. రెండవది దేశంలోపల తీవ్రవాదం, ఉగ్రవాదం, అంతర్గత భద్రతకు సంబంధించిన యుద్ధం. మూడవది అత్యంత సంక్లిష్టమైనది—మేధో లేదా కాగ్నిటివ్ యుద్ధం. ఈ యుద్ధంలో లక్ష్యం భూభాగాన్ని ఆక్రమించడం కాదు; ఒక దేశ ప్రజల మనోధైర్యాన్ని, విశ్వాసాన్ని, సామాజిక ఐక్యతను దెబ్బతీయడం.

 

మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు.  వాళ్లను దేశద్రోహులు అనాలి అనేది వారి సిధ్ధాంతం. దేశద్రోహులు అంటే సరిపోదు దేశద్రోహులుగా పరిగణించి శిక్షించాలి. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద కూడ యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం సరికాదు. నేటి ప్రపంచంలో సైబర్ దాడులు, విదేశీ ప్రభావ కార్యకలాపాలు, దుష్ప్రచారం, డీప్‌ఫేక్‌లు, తీవ్రవాద ప్రచారం వంటి సవాళ్లు వాస్తవమే. అందువల్ల దేశభద్రత బలంగా ఉండాల్సిన అవసరం అనివార్యం. దీనిపై సందేహం లేదు.

 

అయితే ప్రజాస్వామ్యం ముందున్న అసలు ప్రశ్న ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. మేధోయుద్ధం అనే భావన పరిధిపరిమితుల్ని ఎలా నిర్వచించాలీ? చట్టబద్ధమైన విమర్శ, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు, పరిశోధనాత్మక జర్నలిజం, విశ్వవిద్యాలయాల్లో జరిగే మేధో చర్చలు—వీటిని కూడా దేశభద్రత కళ్ళజోళ్ళతో చూడడం మొదలెడితే  ప్రజాస్వామ్య వ్యవస్థపై దాని ప్రభావం ఏమిటి?

 

భారత రాజ్యాంగం ఈ ప్రశ్నకు ఒక సమతుల్య దారి చూపుతుంది. ఆర్టికల్ 19(1)(a) ప్రతి పౌరుడికి భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పిస్తుంది. అదే సమయంలో ఆర్టికల్ 19(2) దేశ సార్వభౌమత్వం, రాష్ట్ర భద్రత, ప్రజా శాంతి వంటి కారణాల దృష్ట్యా సహేతుక పరిమితులను గుర్తుచేస్తుంది. ఈ రెండు నిబంధనలు పరస్పర విరుద్ధాలు కావు; అవి ప్రజాస్వామ్య సమతుల్యతకు రెండు ఆధారస్తంభాలు.

 

ఇక్కడే ప్రభుత్వాలపై అత్యంత పెద్ద బాధ్యత ఉంటుంది. జాతీయ భద్రత పేరిట రూపొందించిన చట్టాలు నిజమైన ఉగ్రవాదం, హింసాత్మక కుట్రలు, విదేశీ శత్రు కార్యకలాపాలను అరికట్టడానికి ఉపయోగించాల్సిందే. అదే సమయంలో చట్టబద్ధమైన విమర్శ, స్వతంత్ర మీడియా, శాంతియుత అసమ్మతి, రాజ్యాంగబద్ధమైన రాజకీయ భిన్నాభిప్రాయాలను వాటితో కలిపి చూడకూడదు.

 

ప్రపంచంలోని ఇతర ప్రజాస్వామ్యాలు కూడా ఇదే సవాలును ఎదుర్కొంటున్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ—అన్ని దేశాల్లో తీవ్రవాద వ్యతిరేక చట్టాలు ఉన్నాయి. కానీ అదే సమయంలో న్యాయస్థానాలు, స్వతంత్ర మీడియా, పౌరసమాజం ఈ చట్టాల వినియోగంపై నిరంతర పర్యవేక్షణ చేస్తుంటాయి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో దేశభద్రతకు ఉన్న విలువ ఎంతుంటుందో స్వేచ్ఛకు కూడా అంతే విలువ ఉండాలి.

 

మేధో యుద్ధం నిజంగా జరుగుతుంటే  ప్రజాస్వామ్యానికి అది అతిపెద్ద బలంగా కూడ మారుతుంది.  ప్రశ్నించే పౌరులు, స్వతంత్ర విశ్వవిద్యాలయాలు, బాధ్యతాయుతమైన మీడియా, నిష్పాక్షిక న్యాయవ్యవస్థ —ఇవే ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు. భయంతో మౌనం ఏర్పడితే ప్రజాస్వామ్యం బలపడదు.  దేశభద్రత అవసరమే. కానీ దేశభద్రతను కాపాడే అత్యంత శక్తివంతమైన ఆయుధం కేవలం క్షిపణులు కావు. ప్రజల విశ్వాసం. రాజ్యాంగంపై నమ్మకం. చట్టం ముందు సమానత్వం. భావ ప్రకటనా స్వేచ్ఛపై గౌరవం. ఈ మూడు విలువలు బలంగా ఉన్నప్పుడే ఏ దేశమైనా నిజంగా సురక్షితంగా ఉంటుంది.

 

చివరికి ప్రశ్న ఒక్కటే—

 

శత్రువుల మిస్సైళ్ల నుంచి దేశాన్ని కాపాడటం ఎంత అవసరమో, మన పౌరుల మెదళ్లలోని స్వేచ్ఛను కూడా అంతే జాగ్రత్తగా కాపాడుతున్నామా? ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సింది ఒక్క ప్రభుత్వం కాదు; సమాజం మొత్తం. ఎందుకంటే దేశభద్రత, ప్రజాస్వామ్యం—ఇవి రెండూ పరస్పర ప్రత్యర్థులు కావు. ఒకటి లేకుండా మరొకటి సంపూర్ణం కాదు.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఒక అభిప్రాయం. దానిని దేశద్రోహ కుట్ర అనేస్తే మొత్తం ప్రజాస్వామ్య భవనమే కూలిపోతుంది.

 

14 అక్టోబరు 2026

ప్రచురణ తెలుగుప్రభ 15 అక్టోబరు 2026

No comments:

Post a Comment