Friday, 10 July 2026

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

 

*పవన్ కళ్యాణ్ ను మిమిక్రీ చేస్తే దేశద్రోహమా?*

*డానీ*

*సమాజ, రాజకీయ విశ్లేషకులు*

 

ప్రభుత్వ నాయకుడిని విమర్శించడం, వ్యంగ్యంగా అనుకరించడం, మిమిక్రీ చేయడంఇవి రాజకీయ సంస్కృతిలో భాగమా? లేక దేశద్రోహమా? ప్రశ్న ఇప్పుడు యూట్యూబర్ 'ప్రశ్న రావణ్' అరెస్టుతో మళ్లీ ముందుకు వచ్చింది. 

ఇరాన్ యుధ్ధం ఆరంభం కావడానికి ఒకరోజు ముందు ఇజ్రాయిల్ వెళ్ళిన ప్రధాని నరేంద్ర మోదీ, భారత యూదులకు భారతదేశం మదర్ ల్యాండ్, ఇజ్రాయిల్ ఫాదర్ ల్యాండ్ అన్నారు. మానవేతిహాసంలో ఇదొక గొప్ప ఆవిష్కరణగా సంఘపరివారకులు తన్మయంతో పొంగిపోయారు. ఇటీవల ఇండోనేషియా వెళ్ళిన ప్రధాని రెండు దేశాల మధ్య అనుబంధాన్ని తేదీల్లో చెప్పారు.  26 అనేది భారత రిపబ్లిక్ దినోత్సవం, 17 అనేది ఇండోనేషియా ప్రస్తుత అధ్యక్షుడు  ప్రబొవో సుబియంతో  పుట్టినరోజు. 2+6 అయినా, 1+7 అయినా సమాధానం 8 అని గుర్తుచేసి అక్కడి సభికుల్ని హాశ్చర్య చకితుల్ని చేశారు. గణిత శాస్త్రంలో ఇదొక సరికొత్త ఆవిష్కరణ అంటూ సంఘీయులు తెగ ముసిపోతున్నారు.

 

ప్రధాని సామర్ధ్యం గురించి జరిగే చర్చలు దేశప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని (విల్ పవర్)  పెంచుతాయని  బిజెపి మద్దతుదారులు నమ్ముతుంటారు. అలా కాకుండా, ఇలాంటి లెఖ్ఖలు నాలుగో తరగతి పిల్లలు కూడా చెపుతారు అని తీసిపడేస్తే దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నట్టు లెఖ్ఖ. దేశ ప్రధానిని చులకన చేసి దేశప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీయడం దేశద్రోహంతో సమానమైన నేరం!! వినడానికి ఇది వింతగావున్నా ఇదే నిజం!

 

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యూ ట్యూబర్ ‘ప్రశ్న రావణ్’ మధ్య కొంతకాలంగా వాద వివాదాలు సాగుతున్నాయి. అనేక వీడియోల్లో, సభల్లో ‘ప్రశ్న రావణ్’ పవన్ కళ్యాణ్ ను అనుకరిస్తూ మాట్లాడారు. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ చేతిలో చెప్పుతీసుకుని బెదిరిస్తూ, హెచ్చరిస్తూ మాట్లాడారు. చేతిలో చెప్పు లేకుండానే పవన్ కళ్యాణ్ మాటల్ని  ‘ప్రశ్న రావణ్’ మిమిక్రీ చేశారు. అది నేరం అయితే పవన్ కళ్యాణ్ ది కూడ నేరమే అవుతుంది. ‘ప్రశ్న రావణ్’ ని శిక్షించాలనుకుంటే పవన్ కళ్యాన్ ని కూడ అదే చట్టం కింద శిక్షించాలి. చట్టం ముందు అందరూ సమానమే అనికదా మన రాజ్యాంగం చెపుతోందీ? ఉప ముఖ్యమంత్రికి ఒక చట్టం, యూట్యూబరుకు ఇంకో చట్ట వుండకూడదుగా.  చేతిలో చెప్పు పట్టుకుని ప్రదర్శించినవారిని వదిలేసి, చెప్పులేకుండా ప్రదర్శించినవారిని ఎక్కువగా శిక్షిస్తే చట్ట సమానత్వం గురించి సహజంగానే సందేహాలు తలెత్తుతాయి.

 

‘ప్రశ్న రావణ్’ మీద అనేక ఆరోపణలు చేసి  నాలుగుసార్లు అరెస్టు చేశారు. నాలుగుసార్లూ ఆతనికి బెయిల్ వచ్చింది. ఐదోసారి ఉపా చట్టాన్ని ప్రయోగించారు. ప్రముఖ మావోయిస్టు హిడ్మా చనిపోయినపుడు ఒక టీవీ సంస్థ ప్రసారం చేసిన ఒక వీడియోకు ‘ప్రశన రావణ్’ వాయిస్ ఓవర్ చెప్పారు. అందులో, ఒక హిడ్మా చనిపోతే వందమంది హిడ్మాలు పుట్టుకుని వస్తారు వంటి వాక్యాలున్నాయి. వీటి ఆధారంగా ఉపా చట్టాన్ని అతని మీద ప్రయోగించారు.

 

ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఉపా చట్టాన్ని ప్రయోగిస్తారా? ప్రశ్నిస్తే దేశద్రోహం అంటారా? అని ప్రజాస్వామికవాదులు సమంజసంగానే అడుగుతున్నారు. దేశంలో 1950ల నాటి రాజ్యాంగం దాని ఆదర్శాలు ఇప్పటికీ అమల్లో వున్నాయని చాలామంది  అనుకుంటుంటారు.  రాజ్యాంగ ఆదర్శాల అర్ధాలు మారిపోతున్నాయి. రాజ్యాంగంలోని పదాలు మారలేదు. కానీ వాటి అధికారిక వ్యాఖ్యానాలు, అమలు విధానం, భద్రత పేరుతో ఏర్పడుతున్న కొత్త చట్టపరమైన అర్థాలు మారుతున్నాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పాత అర్ధాలు చాలా వేగంగా మారిపొతున్నాయనీ బహుకొద్ది మంది మాత్రమే గుర్తిస్తున్నారు. రాజ్యాంగాన్ని అమలు చేసేవాడు మంచోడా? చెడ్డోడా? అనేది తప్పితే గొప్ప రాజ్యాంగం, చెడ్డ రాజ్యంగం అంటూ ఏమీ వుండదు అని అంబేడ్కరే ఒక దశలో అని వున్నాడు. ప్రస్తుతం రాజ్యాంగం ప్రజాస్వామిక  ఆదర్శాలు గిట్టని వాళ్ళ చేతుల్లో వుంది.

 

అలెగ్జాండర్ కాలం నుండి ఇప్పటి వరకు యుధ్ధాల్లో పాటించే మొదటి లక్ష్యం ఏమిటీ?; శత్రు దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం. శత్రు దేశ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే యుధ్ధాన్ని సగం గెలిచేసినట్టే. మన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్ దొవ్వాల్ ఈ తర్కాన్ని తిరగేసి చెపుతారు. మన దేశప్రజల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేవారు స్వదేశీయులు అయినాసరే వాళ్ళు  మన దేశ శత్రువులు, దేశద్రోహులు అనేది వారి సిధ్ధాంతం. అలా వారు 2014 నుండి దశలవారీగా చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక (ఉపా) చట్టానికి కొత్త కొత్త అర్ధాలు చెపుతూ వస్తున్నారు.

 

హైదరాబాద్ లో 2014లో జరిగిన IPS అధికారుల పాసింగ్-అవుట్ పరేడ్‌లో దోవల్ ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు. యుధ్ధాలు ఇక సరిహద్దుల్లో మాత్రమే జరగవు. అలాగే, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో మాత్రమే జరగవు. సమాజంలో, ప్రజల మధ్య, విద్యాసంస్థల్లో, మీడియాలో, డిజిటల్ వేదికల్లో కూడా యుధ్ధాలు జరుగుతాయి. నాలుగవతరం యుధ్ధాల్లో పౌరసమాజమే యుధ్ధరంగంగా మారిపోవచ్చు (Civil Society itself becomes the battleground.) అని వారు ఒక కొత్త హెచ్చరిక చేశారు. దానికి వారు 4GW అని అందమైన పేరు పెట్టారు.

 

ఆపరేషన్ కగార్ తో చత్తీస్ గడ్, మహారాష్ట్ర,  ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టుల్ని తుడిచి పెట్టేసినట్టు కేంద్ర హోంమంత్రి ప్రకటించ్సారు. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఉద్యమాలు తలెత్తకుండా మొగ్గలోనే తుంచేయాలంటే పౌరసమాజం మీద యుధ్ధం చేయక తప్పదనేది అజిత్ దోవల్ సిధ్ధాంతం.

 

పెట్రోలు ధరలు పెరుగుతున్నాయనిగానీ, రూపాయి విలువ పడిపోతున్నదనిగానీ, అమెరికా వంగమంటే ఇండియా పాకుతున్నదనిగానీ ఎవరయినా అంటే, అది ఇక ముందు ఒక అభిప్రాయంకాదు. దేశప్రజల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం.  ప్రయత్నం కూడ కాదు అది ఒక దేశద్రోహ కుట్ర అవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహమా? లేక ప్రజాస్వామ్య బాధ్యతా? ప్రశ్నకు ఇచ్చే సమాధానమే రేపటి భారత ప్రజాస్వామ్య స్వరూపాన్ని నిర్ణయిస్తుంది.

 

10 అక్టోబరు 2026

No comments:

Post a Comment