Monday, 20 November 2023

The Hero and illusions

 రాబిన్ హుడ్ – పండుగ సాయన్న – మీరేసాబు

 

ఓ ఏడేళ్ళ క్రితం స్థానిక ప్రతినిధి ద్వార   ఓ హాలివుడ్ సంస్థకు  ఒక సినిమా కథ ఔట్  లైన్   రాసే ఆఫర్ వచ్చింది. వాళ్ళకు ఒక సాంప్రదాయం వుంది.  కథ జానర్ వాళ్ళే నిర్ణయిస్తారు. కొన్ని సీన్లు కూడ చెపుతారు. మన స్థానిక జానపద సాంప్రదాయాన్ని, మన గద్వాల పాలెస్, గోల్కొండ ఖిలా వంటి చారిత్రక  కట్టడాలనీ,  చారిత్రక నగరాలనీ జోడించి క్లుప్తంగా  కథ చెప్పమన్నారు. దాని కోసం వాళ్లు నాకు కొంత ఫీజు చెల్లించారుగానీ అది చెప్పుకోదగ్గంత గొప్పదేమీ కాదు.

 

ఇలా వాళ్ళు అనేక దేశల్లో అనేక మందిని సంప్రదిస్తుంటారని తరువాత తెలిసింది. వచ్చిన ఇన్ పుట్స్ ని దగ్గర పెట్టుకుని ఒకరు ఒక కథ తయారు చేస్తారు. ఇంకొకరు స్క్రీన్ ప్లే రాస్తారు.  దానికి ఒక ఇలస్ట్రేటర్ ను పెట్టి స్టోరీ లైన్ గీయిస్తారు. ఇప్పుడయితే ప్రీ-షూటింగ్ ‘ప్రీ-విజువలైజేషన్’ టెక్నాలజీ కూడ వచ్చేసింది. అది స్టూడియోవారెవకైనా నచ్చితే సినిమా తీస్తారు. ఇంత కతుంది గనుక నాకు వచ్చిన ఆఫర్ గొప్పదేమీకాదు. నేనేదో స్కెచ్ రాసి పంపించేశాను. అయితే ఈ అనుభవంలో కొన్ని ఆసక్రికర అంశాలున్నాయి.

 

వాళ్లకు రాబిన్ హుడ్ జానర్ లో “పెద్దలను దోచి పేదలకు పెట్టే దొంగ” కథ కావాలి. అందులో  రైలు దోపిడి, కోట ముట్టడి  వంటి  యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలూ వుండాలి అని ముందే చెప్పారు.

 

మనలో చాలామందికి రాబిన్ హుడ్ కథ తెలుసు.  హైస్కూలు రోజుల్లో ‘నాన్ డిటెయిల్’ గా చదివి వుంటాము. రాబిన్ హుడ్ మీద హాలీవుడ్ లో 1938 నుండి ఇప్పటి వరకు అరడజనుకు పైగా సినిమాలొచ్చాయి. వాటి సిడీలన్నీ కొనుక్కొచ్చి చూసేశాను.   

 

పశ్చిమ ఆసియాలో 11-13 శతాబ్దాల మధ్య జెరూసలేం మీద పట్టు కోసం పవిత్ర యుధ్ధాలు (Crusades) సాగాయి. ఇప్పుడూ హమస్ – ఇజ్రాయిలు యుధ్ధం సాగుతున్న నేపథ్యంలో సినిమా స్కెచ్ కథ గుర్తుకు వచ్చింది.

 

పవిత్ర యుధ్ధంలో  బ్రిటీష్ రాజు  కింగ్ రిచర్డ్ – 1, ద లయన్ హార్ట్ (Richard I,  the Lionheart) ముఖ్యుడు. రిచర్డ్ సోదరుడు ప్రిన్స్ జాన్ చాలా దుర్మార్గుడు. అన్న యుధ్ధరంగంలో వుంటే ప్రిన్స్ జాన్ ప్రజల్ని క్రూరంగా వేధించేవాడు. ప్రిన్స్ జాన్ మీదనే రాబిన్ హుడ్ తిరుగుబాటు చేశాడు అనేది కథ.

 

"Robin Hood: Prince of Thieves" (1991) సినిమాలో అజీమ్ అనే ఒక ముస్లిం  రాబిన్ హుడ్ కు ప్రాణ స్నేహితునిగా వుంటాడు. ఈ  ట్విస్టు నాకు నచ్చింది.  అజీమ్ పాత్రను మోర్గాన్ ఫ్రీమన్ పోషించాడు.  సీన్ కానరీ, ఆడ్రి హెబ్బర్న్ నటించిన  ‘Robin and Marian (1976)’ కూడ నాకు బాగా నచ్చింది. ఆడ్రి హెబ్బర్న్ మీద మాతరం వాళ్ళకు చిన్నది కాకుండ పెద్ద క్రష్ వుండేది. ఆమె మా వైపు కన్నెత్తి చూడక పోయినాసరే మేము కళ్ళు పెద్దవి చేసుకుని తెర మీద ఆమెను చూస్తుండి పోయేవాళ్ళం!.

 

పిల్లల బొమ్మల పుస్తకాల కోసం బ్రిటీష్ చిత్రకారుడు హోవార్డ్ పైలే (Howard Pyle) రాబిన్ హుడ్ పాత్రను సృష్టించాడు. ఎందుకయినా మంచిదని పైలే పుస్తకం The Merry Adventures Of Robin Hood కూడ తిరగేశాను. అలాగే జయధీర్‌ తిరుమలరావు సంపాదకత్వంలో వచ్చిన ‘జానపద చారిత్రక గేయ గాధలు’ చదివాను. ఆ తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగులో  ప్రచురించిన తమిళ జానపద గాధలు పుస్తకం ఒకటి చదివాను. అప్పుడు నాకు అర్ధం అయ్యిందేమంటే హీరోల కథలన్నీ ఒకటే అని.

 

హీరో అంటేనే జానపద కథానాయకుడని అర్ధం. జానపద కథానాయకులు విషయంలో  కొన్ని నిజజీవిత సంఘటనలు వుంటాయి. వాటిని జానపద కళాకారులు తమ కాల్పానిక శక్తితో చాలా పెంచేస్తారు. నాటకీకరిస్తారు.  ఒక్క రాబిన్ హుడ్ విషయంలోనేకాదు అందరి విషయంలోనూ ఇలాగే  జరుగుతుంది. అల్లూరి శ్రీరామ రాజు జీవితంలో  సీత లేదు; నాటకం కోసం ఓ స్త్రీ పాత్రను పడాల సృష్టించాడంటే ఇప్పుడు ఎవ్వరూ నమ్మరు. అలాగే విశాఖపట్నం జిల్లా కలెక్టరు థామస్ జార్జ్ రూథర్డ్ ఫర్డ్ (Thomas George Rutherford), శ్రీరామరాజు ఎప్పుడడయినా కలిశారా? అన్నదీ అనుమానమే. అసలు శ్రీరామరాజు 1924 మే 7న చనిపోయిన రోజున ఆ జిల్లా కలెక్టరు ఎవరూ? అని కూడ ఎవరూ పరిశీలించరు. విశాఖపట్నం జిల్లా కలెక్టరు ఆఫీసుకు వెళ్ళి అక్కడి పెట్టిన బోర్డులో జాబితాను చూసినా తేలిపోయే విషయం కదా! . 

 

జానపద కథానాయకుల మీద ప్రజలకు విపరీతమైన అభిమానం ఆరాధనా భావం వుంటుంది. తమకు తోచిన ప్రతి మంచినీ వాళ్ళు ఆ జానపద హీరోలకు ఆపాదించేస్తుంటారు. కొమురం భీం,  రాంజీ గోండ్, పండుగ శాయన్న, మీరే సాబూ, సర్వాయి పాపన్న తదితరుల కథలన్నీ అంతే. వీటిల్లో వాస్తవం ఎంత?  కల్పితం ఎంత? తేల్చడం తరువాతి తరాలకు చాలా కష్టం.

 

అన్నింట్లో కథ ఒకటే. పంటలు పండవు, ప్రజలకు పనీ వుండదు; తిండీ వుండదు, పన్నులు కట్టాలి. పాలకులు ఎక్కడో రాజధానిలో వుంటారు. వాళ్ళు వీళ్లని పట్టించుకోరు. వాళ్ళ జిల్లా ప్రతినిధులు, పరగణాల ప్రతినిధులు మహా క్రూరులు, వాళ్లు ప్రజల నడ్డి విరగ్గొట్టి కప్పం వసూలు చేస్తుంటారు. చావుకన్నా ఘోరమైన జీవితం ఆ ప్రజలది. ఇలా వుండగా ‘దేవుడు’ ఒకడ్ని పంపిస్తాడు. అతను  పాలకుల స్థానిక ప్రతినిధుల్ని తన్ని తరిమిగొడతాడు. సర్కారు గిడ్దంగుల్ని బద్దలు గొట్టి ఆకలిగొన్నవారికి అన్నం పెడతాడు.  అతను పేదల దేవుడిగా వెలిగిపోతున్న దశలో రాజధాని నుండి భారీ సైన్యం వచ్చి బంధిస్తుంది. లేదా, అతని అనుచరుల్లో ఎవరో ఒకరు ద్రోహానికి పాల్పడి అతన్ని పట్టిస్తారు. ఇక ముందు మరెవ్వరూ తిరుగుబాటు చేయకుండ అతన్ని అందరి ముందు క్రూరంగా ఉరి వేస్తారు. జనం అక్కడో స్మారక స్థూపం కట్టి ఏడాదికోసారి ఉత్సవం జరిపి పాటలు పాడుతుంటారు.

 

కమ్యూనిస్టు సాహిత్యంలోనూ ఇలాంటి హీరోలు వుంటారు.  “ఏడ పుట్టి ఏడ పెరిగే - ఏడకొచ్చి ఏడ చచ్చే”  వంటి పాటలు, ఒగ్గు కథలు వుంటాయి.

 

ఈ జానపద కథా నాయకులకు ఒక పరిమితి వుంటుంది. వీరి కార్యక్షేత్రం చాలా చిన్నది. ఉదాహరణకు పండుగ శాయన్న ప్రభావం చక్రవర్తులతో తలపడినట్టు జానపద కళాకారులు చిత్రిస్తుంటారు.  కిన్నెర పాట ప్రకారం పండుగ శాయన్న ప్రభావం పధ్నాలుగు గ్రామాలకు విస్తరించి వుంటుంది. ఆపైన గద్వాల పరగణ,  ఆపైన నిజాం సంస్థానం, ఆ పైన బ్రిటీష్ రెసిడెంట్ . ఆపైన గవర్నర్ జనరల్, వైశ్రాయి, ఆ పైన బ్రిటీష్ మహారాణి వుంటారని  ఆ కళాకారులకు తెలీదు. నేరుగా బ్రిటీష్ రాణి సింహాసనం  కదిలిపోయినట్టు కథనం సాగుతుంటుంది.

 

ఈ సాంప్రదాయం చారిత్రక సినిమాలన్నింటిలోనూ వుంటుంది. పేరుకు మాత్రం కొన్ని పాత్రల్ని చరిత్ర నుండి తీసుకుంటారు. ఆ తరువాత కథనం అంతా సినిమా బాక్సాఫీసు ఫార్మూలాను అనుసరిస్తుందేతప్ప చారిత్రక వాస్తవాన్ని పట్టించుకోదు.

 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

రచన : 20 – 11- 2023

Sunday, 19 November 2023

Caste Census: A Step Towards Social Revolution

Caste Census: A Step Towards Social Revolution

సామాజిక విప్లవానికి నాంది కులగణన 

గెలిచే అవకాశాలున్న పార్టీలో ఎన్నికల ముందు ఎక్కువ సీట్లు అడగడానికీ, గెలిచిన పార్టీలో ఎన్నికల తరువాత ఎక్కువ పదవులు కోరడానికీ రాజకీయ నాయకులు కులం కార్డును వాడడం సహజం. ఇలాంటి సందర్భాల్లో ప్రతీ కులం తన జనాభా సంఖ్యనూ,  శాతాన్ని పెంచి చెపుతుంటుంది. ఈ శాతాలన్నింటినీ కూడితే సులువుగా 300 దాటుతుంది!. ఎన్నికల సంవత్సరంలో కులగణన చర్చ మరింత వేడెక్కుతుంది. 

సమాజంలో విభిన్న సమూహాల మధ్య సంబంధాలను నిర్ణయించడంలో వేల సంవత్సరాలుగా  కులం ప్రధాన పాత్ర పోషిస్తున్న దేశం మనది. ప్రతి కులానికి ప్రత్యేకమైన చరిత్ర, సంస్కృతి వుంటుంది. మన దేశంలో 5 వేలకు మించికులాలున్నాయని  అంచనా. కులాల తొనే మన దేశంలో సామాజిక అంతస్తుల దొంతర (social stratification) ఏర్పడుతోంది.   వీటిని అర్ధం చేసుకోవడానికి కులగణన ఒక చారిత్రక అవసరంగా మారింది. సామాజిక విప్లవానికి కులగణన నాందీ పలుకుతుంది. 

ఎస్సీ, ఎస్టిలకు రాజ్యాంగంలోనే విద్యా, ఉపాధి రిజర్వేషన్లు కల్పించారు. సామాజిక వివక్షకు గురవుతూ, విద్యారంగంలో అవకాశాలు కోల్పోతున్న సమూహాల కోసం ఉద్దీపన చర్యలు చేపట్టడంలో చాలా తాత్సారం జరిగింది. 1979 జనవరి1న ప్రధాని మురార్జీ దేశాయి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబిసిలకు  రిజర్వేషన్లు కల్పించడానికి ‘సోషల్లీ అండ్ ఎడ్యూకేషనల్లీ బ్యాక్ వర్డ్ క్లాసెస్ కమీషన్’ (SEBC)ను నియమించారు. స్వల్పకాలం బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన భిందేశ్వరీ ప్రసాద్ మండల్ ను ఛైర్మన్ గా నియమించడంతో దానికి ‘మండల్ కమీషన్’ అనే పేరు వచ్చింది. రెండేళ్ళ పరిశీలన  తరువాత 1980 డిసెంబరు 31న  అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి బిపి మండల్ తన నివేదికను సమర్పిస్తూ ఓబిసిలకు 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేశారు.  దాని మీద తీవ్ర భిన్నాభిప్రాయాలు తలెత్తాయి. ఈ వివాదం ‘ఇంద్ర సహానీ కేసు’ పేరుతో సుప్రీం కోర్టుకు వెళ్ళింది. 

ఇక్కడ ఒక విచిత్రం వుంది. మండల్ కమీషన్ ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్ ఇమ్మందిగానీ, కులగణన నిర్వహించలేదు. బ్రిటీష్ కాలపు రికార్డుల ప్రకారం దేశంలో బిసిల జనాభా 54 శాతం వుంటుందని అంచనా వేసి అందులో 50 శాతం అనగా 27 శాతం  రిజర్వేషన్లు కల్పించాలని సిఫార్సు చేసింది. ఓబిసి రిజర్వేషన్లు పొందడానికి రెండు అర్హతల్ని కమీషన్ నిర్ణయించింది. ఆ సమూహం సామాజిక వివక్షకు గురవుతూ వుండాలి, విద్యారంగంలో వాళ్ళ ప్రాతినిధ్యం తక్కువగా వుండాలి. 

ఒబిసి రిజర్వేషన్ల కేసు మీద అంతిమ తీర్పు రాకముందే 1990 ఆగస్టు 7న అప్పటి ప్రధాని విపి సింగ్ మండల్ కమీషన్ సిఫార్సుల్లో కొన్నింటిని అమలుపరచబోతున్నట్టు ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో ఇది చాలా సాహసోపేతమైన నిర్ణయం. జనతాదళ్ నాయకుడైన విపిసింగ్ కు లోక్ సభలో మెజారిటీ లేదు. ఎన్ టి రామారావు నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ అభ్యర్ధిగా రంగంలో దిగి, బయటి నుండి బిజెపి ఇచ్చిన మద్దతుతో ఆయన  ‘మైనారిటీ ప్రభుత్వానికి’ ప్రధాని అయ్యారు.  

అప్పట్లో బిజెపికి లోక్ సభలో 85 సీట్లున్నాయి. ఒబిసిలకు రిజర్వేషన్లు కల్పిస్తే తన ఓటు బ్యాంకు అయిన ఓసిలు పార్టికి దూరం అయిపోతారని ఆ పార్టి భయపడింది. అప్పటి బిజేపి అధ్యక్షులు ఎల్ కే అడ్వాణి 1990 సెప్టెంబరు 25న సోమనాథ్ నుండి అయోధ్య వరకు 35 రోజుల  ‘రామ్ రథయాత్ర’ మొదలెట్టారు. దీనికి  రెండు లక్ష్యాలున్నాయి. మొదటిది; మండల్ కమీషన్ సిఫార్సుల అమలును అడ్డుకోవడానికి ఏకంగా విపి సింగ్ ప్రభుత్వాన్ని పడగొట్టడం. రెండోది, ముస్లింల మీద ద్వేషాన్ని రెచ్చగొట్టి హిందూ ఓటు బ్యాంకును సమీకరించడం. ఈ రెండు లక్ష్యాల రథయాత్రను రాజకీయ విశ్లేషకులు ‘మండల్ –కమండల్’  అని పిలిచేవారు.  బిజెపి తన మద్దతును ఉపసంహరించుకోవడంతో 1990 నవంబరు 7న  విపి సింగ్ ప్రభుత్వం పడిపోయింది. 

రెండేళ్ల తరువాత  1992 నవంబరు 16న ‘ఇంద్ర సహానీ కేసు’లో సుప్రీం కోర్టు ఒబిసిలకు 27 శాతం రిజర్వేషన్లను ఆమోదిస్తూ తుది తీర్పు ఇచ్చింది. అయితే, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదనీ, క్రీమీలేయర్ కుటుంబాలను రిజర్వేషన్ పరిధి నుండి తప్పించాలనీ కొత్తగా రెండు నిబంధనలు పెట్టింది. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన పక్షం రోజుల్లోనే కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేశారు. 

సిపాయిల తిరుగుబాటు అనబడే భారత ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటీష్ పాలకులకు అనేక గుణపాఠాలు నేర్పింది. భారత దేశాన్ని పరిపాలించాలంటే ఇక్కడి సమాజ స్వభావాన్ని, ముఖ్యంగా కుల,మత స్వభావాలను క్షుణ్ణంగా అర్ధం చేసుకోవాల్సిన అవసరముందని  వాళ్లు గుర్తించారు. అప్పట్లో సెన్సస్ కమీషనర్ ఆఫ్ ఇండియాగా నియమితుడైన డబ్ల్యూ సి ప్లౌడెన్ (W.C. Plowden)1981లో తొలిసారిగా జనగణన నిర్వహించాడు. ఆ మరు సంవత్సరం అంటే 1882లో విలియం విల్సన్ హంటర్ (William Wilson Hunter) నాయకత్వాన ఏర్పడిన కమీషన్ దేశంలో కులగణన నిర్వహించింది. దీనినే హంటర్ కమీషన్ అంటారు.  

అప్పటి నుండి ప్రతి పదేళ్ళకు ఒకసారి జనగణన కార్యక్రమం క్రమం తప్పకుండ సాగుతోంది. గానీ, హంటర్ కమీషన్ తరువాత ఇప్పటి వరకు  140 యేళ్ళుగా మనదేశంలో  కులగణన జరగలేదు.  ఇప్పటి వరకు వివిధ కులాలు జనాభాలో తమ శాతం గురించి చెప్పుకుంటున్నవన్నీ కాకిలెక్కలు అంటే బాగుండకపోవచ్చుగానీ వాటిని ‘ఎన్నికల లెక్కలు’ అనవచ్చు. 

స్వతంత్ర్య భారత దేశంలో తొలిసారిగా కులగణన చేపట్టిన ఘనత బీహార్ కు దక్కుతుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ గత ఏడాది బీహార్ లో కులగణన మొదలెట్టారు. కోర్టు కేసు రావడంతో కొంతకాలం సర్వే ఆగిందిగానీ మొత్తానికి కోర్టు అనుమతి పొంది సర్వేను పూర్తి చేశారు. ఆ ఫలితాలను గత నెలలో ప్రకటించారు.  దేశంలో అంతటి చొరవను చూపిన మరో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. బీహార్ లో 214 కులాలున్నట్టు తేలింది. అయితే, ఆంధ్రప్రదేశ్ లో 7 వందలకు పైగా  కులాలున్నట్టు అంచనా. ఆ లెఖ్ఖన ఏపి కులగణన ప్రాజెక్టు బీహార్ కన్నా మూడు నాలుగు రెట్లు పెద్దది. 

రెండేళ్ళ క్రితం బీహార్ రాష్ట్ర అఖిలపక్షం ఢిల్లీ వెళ్ళి కులగణన చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరింది. దానికి వాళ్ళు అంగీకరించలేదు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ ఎస్సీ, ఎస్టి మినహా మరెవ్వరికీ కులగణన నిర్వహించడం తమ విధానంకాదని 2021 జులై 20న  పార్లమెంటులో ఒక విస్పష్ఠ ప్రకటన చేశారు. 

బిజెపిది ఒక విచిత్రమైన వ్యవహారం. ఒకవైపు, ఉచితాలు దేశ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీస్తాయి అంటుంది; ఎన్నికల ప్రచారంలో తామర తంపరగా ఉచితాలను ప్రకటిస్తుంది. ఒకవైపు,  కులం వంటి సంకుచిత భావాలకు తాము దూరం అంటుంది. ఎన్నికలకు ముందు కుల సమ్మేళనాలు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మొదట్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి నిర్వహించిన కుల సమ్మేళనాలను చూశాం. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మళ్ళీ అలాంటివే చూస్తున్నాం. ఐదు రోజుల వ్యవధిలో ఒకే నగరంలో  రెండు కుల సమ్మేళనాల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరేనేమో! వారు హైదరాబాద్ లో బిసి సమ్మేళనంలో పాల్గొన్నారు; నాలుగు రోజుల్లో మళ్ళి వచ్చి మాదిగ సమ్మేళనంలో పాల్గొన్నారు. కానీ, విధానపరంగా వారు కులగణనకు వ్యతిరేకం.  హైదరాబాద్ లో జరిగింది మంద కృష్ణ మాదిగ ‘కంటితుడుపు’ కార్యక్రమం మాత్రమే. 

నిజానికి సామాజిక న్యాయాయానికి కులగణన ఒక ప్రాతిపదిక అవుతుంది. సంక్షేమ పథకాలను అడగడానికి ప్రజలకూ, వాటిని రూపొందించడానికి ప్రభుత్వాలకూ అది ఆధారంగా మారుతుంది. అడవి ఎస్టీల పథకాలను అర్బన్ ఎస్టిలు మింగేస్తున్నారనీ, బిసిల పథకాలను రెండు మూడు కులాలే అందుకుంటున్నాయనీ అనడం ఇకముందు కుదరదు. బిసి ముస్లింల వాటాల్ని ఓసి ముస్లింలు మింగేస్తున్నారని స్వయంగా ప్రధాని ప్రచారం చేస్తున్నారు. పైగా వారు ఈమధ్య ముస్లిం సమాజంలోని బహుభార్యత్వాన్ని ఎద్దేవ చేస్తూ “హమ్ పాంచ్; హమారే పచ్చీస్” (మేము ఐదు; మావాళ్లు పాతిక)  అంటున్నారు. కులగణన నిర్వహిస్తే దేశంలో ముస్లిం జనాభా పెరుగుదల రేటు పెరిగిపోతున్నదో, తరిగిపోతున్నదో తేలిపోతుందిగా? దానికి మాత్రం ప్రధాని సిధ్ధంగాలేరు. 

ఇప్పుడు కులగణన ‘ఇండియా కూటమి’కి  కొత్త అస్త్రంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి ప్రతి సభలోనూ  “జిత్నీ ఆబాదీ; ఉత్నా హక్”,  “జిస్కి జిత్ని భాగేదారీ; ఉస్కీ ఉత్నీ హిస్సేదారీ” (ఎంత జనాభో అంత హక్కు) అంటున్నారు. 

కొత్త మిలినియంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రాంతీయవాదం బలపడింది. రాష్ట్ర విభజన తరువాత  రెండు తెలుగు రాష్టాల్లోనూ కులాల కుమ్ములాట మొదలయింది. తెలంగాణలోకన్నా ఆంధ్రప్రదేశ్ లో దీని మోతాదు మితిమీరింది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం అభిమానులు సహితం ఈ పరిణామాల్ని జీర్ణం చేసుకోలేకపోయిన సందర్భాలూ వున్నాయి. 

వైస్సార్ సిపి రాజకీయంగా ఎన్డియే లో భాగస్వామికాదు. పార్లమెంటు వ్యవహారాల్లో ఎన్డీయేతో వుంటున్నది. బిజెపికి నచ్చని కులగణన కార్యక్రమాన్ని చేపట్టడం వైయస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే. అది విజయవంతంకావడం రాజకీయంగా వైసిపికికన్నా సమాజానికి మరింత మేలు చేస్తుంది. 

డానీ

సమాజ విశ్లేషకులు

రచన : 19 నవంబరు 2023

Saturday, 21 October 2023

Palestine an Unending Story

 Palestine an Unending Story 830/ 6,000

 *ఈ యుద్ధం ఈనాటిది కాదు, ఆగేదీ లేదు*

     ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం, క్రైస్తవం, ఇస్లాం మతాలు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలు కలిసే అరబ్ ప్రాంతంలో ఆవిర్భవించాయి. మూడు మతాలూ అరబ్బు ప్రాంతానికి చెందిన సెమిటిక్ (Semitic) భాషలయిన హెబ్రూ, అరబ్బి, అరామయికలను పవిత్ర భాషలుగా భావిస్తాయి. భాషా సంస్కృతుల పరంగా ఇవి సెమిటిక్ సంచార జాతులు. ఈ మూడు మతాలకూ ఆదిపురుషుడు ఆదాము, ఆధ్యాత్మిక మూలపురుషుడు ప్రవక్త అబ్రహాం.

 మూల పురుషుడు ఒకరే కావడంతో వీటిని ‘అబ్రహామిక్’ మతాలు అంటారు. ఇవి ఏకేశ్వరోపాసన మతాలు. యూదుల ‘తోరా’, క్రైస్తవుల ‘బైబిల్’ (ముఖ్యంగా ‘పాతనిబంధన’లో), ముస్లింల ‘ఖురాన్’లో ఉమ్మడి చారిత్రక ఘట్టాలు అనేకం వుంటాయి. మోజెస్, జీసస్‌లను ఇస్లాం కూడ తన ప్రవక్తలు (పైగంబరు మూసా, ఈసా)గా భావిస్తుంది. 

జెరూసలేంలోని ‘పశ్చిమగోడ’ (Wailing Wall) యూదులకు పుణ్యక్షేత్రం. మరోవైపు, జెరూసలేం క్రైస్తవులకు, ముస్లింలకు కూడ పుణ్యక్షేత్రమే. అయితే వేల సంవత్సరాలుగా యూదులు పాలస్తీనాలో నివసించడంలేదు. యూరప్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాలకు వాళ్ళు వలస వెళ్ళిపోయారు. దాదాపు రెండు వేల ఏళ్ళుగా పాలస్తీనాలో అరబ్బు జాతే నివాసం ఉంటున్నది. 

వేల సంవత్సరాలుగా పాలస్తీనా వలస పాలనల్లోనే వున్నది. నాలుగవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి బైజాంటైన్ సామ్రాజ్యాన్ని నెలకొల్పినపుడు పాలస్తీనా అందులో భాగం. 1453లో బైజాంటైన్ సామ్రాజ్యం పతనమై యూరోప్, ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని విశాలమైన భూభాగంలో ఒట్టోమన్ టర్క్స్ సామ్రాజ్యం ఏర్పడింది. ఇది టర్కీ, గ్రీస్, మొదలు సిరియా, లెబనాన్, జోర్డాన్, పాలస్తీనా వరకు విస్తరించింది. 

ఇస్లాంలో వడ్డీ తీసుకోవడం, వడ్డీ చెల్లించడం రెండూ ‘మహాపాపం’. ఇలాంటి నిబంధన ఒకటి క్రైస్తవంలో కూడ వుంది. జుడాయిజంలో వడ్డీ మీద అలాంటి నిషేధం వున్నట్టు లేదు. కొన్ని యూదు కుటుంబాలు వడ్డీ వ్యాపారులుగా మారి యూరప్‌లోనే గాక యూఎస్‌లోనూ ఆర్ధికంగా బాగా బలపడ్డాయి. షేక్స్ పియర్ ‘మర్చెంట్ ఆఫ్ వెనిస్’లో ‘షైలాకో’, ఛార్లెస్ డికెన్స్ ‘ఆలివర్ ట్విస్ట్’లో ‘ఫాగిన్’ పాత్రలు యూదుల వడ్డీ వ్యాపారాన్ని చిత్రించాయి. యూదుల నుండి మహామేధావులు, విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎందరో పుట్టుకొచ్చినా వడ్డీ వ్యాపారం కారణంగా ఆ సమాజం మీద యూరప్, యూఎస్‌లలో తీవ్ర వ్యతిరేకత కొనసాగింది. దీనినే యాంటి– సెమిటిజం అంటారు. 

ఆస్ట్రియా సెర్బియాల మధ్య 1914 జూలైలో మొదలయిన చిన్న యుద్ధం క్రమంగా మొదటి ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. ఫ్రాన్స్, యూకే, రష్యా, యూఎస్, ఇటలీ ‘అలైస్ పవర్స్’గా, జర్మనీ, ఆస్ట్రియా–హంగేరి, బల్గేరియా, ఒట్టోమన్ ‘సెంట్రల్ పవర్స్’గా రంగంలో దిగాయి. నాలుగేళ్ళు యుద్ధం సాగింది. ఆయుధాలు తదితర యుద్ధ ఖర్చుల కోసం యుకె, యూఎస్‌లు యూదు పెట్టుబడిదారుల నుండి పెద్ద ఎత్తున నిధుల్ని స్వీకరించాయి. 

కలిసివచ్చిన అవకాశాన్ని యూదులూ సద్వినియోగం చేసుకున్నారు. అబ్రహాంకు (నాలుగువేల సంవత్సరాల క్రితం) యహోవా కలలో కనిపించి యూదులకు పాలస్తీనాను ప్రసాదిస్తున్నట్టు చెప్పాడట. ‘తోరా’లో ఆ వాక్యం వుందని విస్తృతంగా ప్రచారం సాగింది. యూదులు పాలస్తీనాను ఆక్రమించుకోవాలనే లక్ష్యంతో ఛైమ్ వ్యిజ్మన్న్ (Chaim Weizmann) జియోనిస్ట్ ఉద్యమాన్ని ఆరంభించాడు. 

జుడాయిజం అంటే మతం; జియోనిజం అంటే రాజకీయార్ధిక సాంస్కృతిక యుద్ధం. ఇప్పటి భాషలో సులభంగా అర్ధం చేసుకోవాలంటే హిందూ–హిందూత్వ అనుకోవచ్చు. ‘రాజకీయం అంటే రక్తపాతం లేని యుద్ధం. యుద్ధం అంటే రక్తపాతంతో కూడిన రాజకీయం!’. 

ఆర్ధిక సహకారం కోసం అప్పటి బ్రిటన్ ప్రధాని డేవిడ్ లాయడ్ జార్జ్, విదేశాంగ కార్యదర్శి ఆర్ధర్ బ్లాఫోర్ ఇద్దరూ జియోనిజం డిమాండ్లకు లొంగిపోయారు. యుద్ధానంతరం ‘యూదు ప్రజలకు ఒక దేశాన్ని ఏర్పాటు చేస్తాము’ అని వారు ప్రకటించారు. దీనినే బ్లాఫోర్ ప్రకటన అంటారు. 

యుద్ధంలో ఒట్టోమన్ ఎంపైర్, జర్మనీ ఘోరంగా ఓడిపోయాయి. యూకే, యూఎస్, ఫ్రాన్స్ లబ్ధిపొందాయి. ఫ్రాన్స్‌లోని సేవ్రెస్– వర్సేయిల్స్‌లో జరిగిన శాంతి ఒప్పందాల్లో పాలస్తీనా మీద యుకేకు ప్రత్యేక అధికారాలు (Mandate) వచ్చాయి. పాలస్తీనాలో స్వయం పరిపాలన ఏర్పాటు చేయాలనే నిబంధన వున్నా దాన్ని బ్రిటన్ పట్టించుకోలేదు. ప్రపంచశాంతి–భద్రతలను పరిరక్షించడానికి 1920లో ఏర్పడిన నానాజాతి సమితి (League of Nations) కూడ బ్రిటన్‌ను నియంత్రించలేకపోయింది. 

బ్లాఫోర్ ప్రకటన ప్రభావంతో వివిధ దేశాల నుండి పాలస్తీనాకు యూదుల వలసలు పెరిగాయి. యూదులతో అరబ్బులకు అప్పటికి ఎలాంటి పేచీలేదు. మొదటి దశలో వాళ్లు సహృదయంతో యూదుల రాకను ఆహ్వానించారు. కానీ, ఒక పథకం ప్రకారం యూదులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అరబ్బులకు అనుమానం వచ్చి వివాదం మొదలయింది. 

ఏసుక్రీస్తును శిలువ వేశారని క్రైస్తవుల్లో అనాదిగా యూదుల మీద ఒక కోపం వుంది. యూదు వ్యతిరేకతను జర్మనీలో తన రాజకీయార్ధిక నియంతృత్వాన్ని పటిష్ఠం చేసుకోవడానికి నాజీ హిట్లర్ బాగా వాడుకున్నాడు. యూదుల మీద హిట్లర్ అత్యంత క్రూరమైన నరమేధం సాగించాడు. ఈలోగా రెండో ప్రపంచయుద్ధం ఆరంభమయింది.

అప్పటికే అమెరికా ఆర్ధిక వ్యవస్థను, మీడియాను శాసించే స్థాయికి చేరుకున్న యూదు పెట్టుబడిదారులు హిట్లర్ నరమేధానికి వ్యతిరేకంగా భారీ ప్రచారాన్ని సాగించారు. ఇందులో అనేక అతిశయోక్తుల్ని కూడ జోడించారు. జియోనిస్టుల ప్రచారానికి రెండు లక్ష్యాలున్నాయి. మొదటిది; యూదుల మీద సానుభూతిని పెంచడం. రెండోది; పాలస్తీనాను యూదులకు స్వాధీనం చేయడం. వాళ్ళు పాలస్తీనాను యూదులకు ‘వాగ్దానం చేయబడిన భూమి’ (Promised Land)గా ప్రచారం మొదలెట్టారు. ‘భూమి లేని ప్రజలకు ప్రజలు లేని భూమి’ (A land without a people for a people without a land) అనే నినాదాన్ని ముందుకు తెచ్చారు. ఇది శుద్ధ అబద్ధపు ప్రచారం. పాలస్తీనాలో ప్రజలు లేకపోలేదు; యూదుల నివాసానికి దేశాలూ లేకపోలేదు. 

రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఏర్పడిన ఐక్యరాజ్యసమితి 1947 నవంబరు 29న 181వ తీర్మానం ద్వార బ్రిటీష్ మాండేట్‌గా వున్న పాలస్తీనాను విభజించింది. అప్పటికి పాలస్తీనా విస్తీర్ణం 27 వేల చదరపు కిలోమీటర్లు. అందులో 56 శాతం (15,120 చదరపు కిలోమీటర్లు) ఇజ్రాయిలఖకూ, 43 శాతం (11,610 చదరపు కిలోమీటర్లు) పాలస్తీనాకు కేటాయించారు. మిగిలిన ఒక శాతం (270 చదరపు కిలోమీటర్లు) ప్రాంతాన్ని జెరూసలెంకు కేటాయించి అంతర్జాతీయ ఉమ్మడి స్థలంగా వుంచారు. 

పాలస్తీనా విభజనే అన్యాయం అనుకుంటే అది అక్కడితో ఆగలేదు. ‘ఒంటె– ఎడారిలో గుడారం’ కథ పాలస్తీనాలో పునరావృతం అయింది. అనేక తప్పుడు చట్టాలు, విధానాలతో పాలస్తీనా నుండి పాలస్తీనియన్లను ఇజ్రాయిల్ పథకం ప్రకారం తరిమేయడం మొదలెట్టింది. ఈ రోజు పాలస్తీనాలో 10 శాతం నేల కూడ పాలస్తీనియన్ల ఆధీనంలో లేదు. వాళ్ళు లెబనాన్, జోర్డాన్, సిరియా, ఈజిప్టు దేశాల్లో శరణార్ధులుగా వుంటున్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిన రోజు నుండే ఇజ్రాయిల్–పాలస్తీనా యుద్ధం మొదలయింది. ప్రపంచ పటం మీద మాతృభూమిని కోల్పోయిన సమూహం పాలస్తీనియన్లు. నిలబడడానికి నేల కోసం 75 సంవత్సరాలుగా యుద్ధం చేస్తున్న సమూహం వాళ్ళు. 

    సామాజిక ఆర్ధిక రంగాల్లో విఫలమైన రాజ్యాధినేతలు దేశప్రజల్లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నించడాన్ని పలు దేశాల్లో చూస్తుంటాం. ఇజ్రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ఇప్పుడు అలాంటి ప్రయత్నాల్లో వున్నాడు. 1948లో ఇజ్రాయిల్ అతిభయంకరంగా దాడులు జరిపి వందల మంది పాలస్తీనియన్లను చంపేసింది, మిగిలినవాళ్ళను తరిమేసింది. ఈ నరమేధాన్ని (catastrophe)  అరబ్బీలో ‘నక్బా’ అంటారు. తనమీద ఇజ్రాయిలీల్లో పెరుగుతున్న అసంతృప్తిని తొలగించడానికి ‘మరో నక్బా సృష్టిస్తాం’ అంటూ నెతన్యాహు ఇటీవల తరచూ అంటున్నాడు. 

    ‘మరో నక్బా’కు సిద్ధమవుతున్న ఇజ్రాయిల్ మీదకు హమాస్ అకస్మాత్తుగా వేల రాకెట్లను ప్రయోగించింది. ఇజ్రాయిల్ నిఘా భద్రతా పరికరాలకు మించిన సాంకేతిక పరిజ్ఞానం తమ దగ్గరా ఉందని హమాస్‌ ఇలా చాటిచెప్పడం అంతర్జాతీయ మార్కెట్లో ఇజ్రాయిల్‌కు పెద్ద ఎదురుదెబ్బ. 

ఇజ్రాయిల్‌పై అక్టోబరు 7న హమాస్ జరిపిన రాకెట్ దాడులతోనే ఈ యుద్ధం ఆరంభం కాలేదు. గాజాస్ట్రిప్ మీద ఇజ్రాయిల్ కురిపించిన బాంబుల వర్షంతో ఈ యుద్ధం ముగిసేది కూడ కాదు. ఈ ఘర్షణ పాలస్తీనా–ఇజ్రాయిల్‌లకు పరిమితమవుతుందని కూడా చెప్పలేం. 

డానీ

సీనియర్ జర్నలిస్టు 

రచన : 21 అక్టోబరు

ప్రచురణ : 27 అక్టోబరు 2023

https://www.andhrajyothy.com/2023/editorial/this-war-is-not-today-it-will-never-stop-1158756.html