Saturday, 24 October 2026

ఫ్రాన్స్ ప్రజలు తిరుగుబాటు చేస్తే ముస్లింలను నిందిస్తారా?

 

ఫ్రాన్స్ ప్రజలు తిరుగుబాటు చేస్తే ముస్లింలను నిందిస్తారా?

డానీ

సమాజ విశ్లేషకులు

 

ప్రపంచ దేశాల్లో ఇప్పుడొక ఒక విచిత్రమైన సాంప్రదాయం కొనసాగుతోంది. తినడానికి తిండి దొరక్కపోతే. ఉద్యోగాలు లేకపోతే. పిల్లలకు మంచి చదువు అందకపోతే. రోగమొస్తే వైద్యం దొరక్కపోతే ప్రజలు పాలకుల్ని ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని పాలకులు ఆ నిందను ముస్లింల మొడకు చుట్టేస్తున్నారు.

 

ఫాన్స్, గీసు, ఇటలీల్లో ఇప్పుడు యువతరం పెద్ద ఎత్తున నిరసన ప్రధర్శనలు చేస్తున్నది. సెప్టెంబరులో మొదలయిన నిరసన ప్రదర్శనలు అక్టోబరులో విజృంభించాయి. యువతరం అసంతృప్తికి పరిష్కారం చూడమని  సలహా ఇవ్వాల్సిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “పారిస్ అతి త్వరలో ముస్లింల నగరంగా మారబోతోంది!” అని ఫాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయేల్ మాక్రాన్ ను హెచ్చరించాడు.

 

చీఫ్ ఎలక్షన్ కమీషనర్ ఆఫ్ ఇండియా గ్యానేశ్వర్ రాజీనామాను కోరుతూ అక్టోబరు 10న ఢిల్లీ జంతర్ మంతర్ లో నిరసన ప్రదర్శనకు కాక్రోచ్ జనతా పార్టి పిలుపు ఇచ్చినపుడు దాన్నీ ఆపడానికి  జెన్‌జీపై మోదీ సర్కార్‌ సాక్షాత్తు  ఉక్కుపాదం మోపింది. ఏకంగా 30 వేల మందికిపైగా పోలీసులు, సాయుధ బలగాల్ని మోహరించింది. నలుగురు కూడా గుమిగూడకుండా నిషేధాజ్ఞలు పెట్టింది. మొబైల్‌ ఇంటర్నెట్‌ సేవల్ని నిలిపివేసింది. దేశ రాజధాని నగరంలో 45 మెట్రో స్టేషన్లను మూసివేసింది. ఆ రెండు రోజుల్లో ఢిల్లీకి వచ్చే దాదాపు 250 రైళ్లను  రద్దు చేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కులేదా అని చాలా మంది అడగవచ్చు. ప్రభుత్వం దగ్గర దానికి ఒక గొప్ప సమాధానం వుంది. అది అప్పుడప్పుడు నోటితో చెపుతుంది. కుదరనప్పుడు సోషల్ మీడియా ద్వార చెపుతుంది. “ఈ రైళ్లలో ఒక నిర్దిష్ట వర్గానికి చెందిన ప్రయాణికుల రిజర్వేషన్లు సాధారణంగా కేవలం 10 నుండి 15 శాతం వరకు మాత్రమే ఉంటాయట. కానీ అక్టోబర్ 9, 10 తేదీల్లో ప్రయాణానికి  ఆ సంఖ్య ఏకంగా 40 నుండి 60 శాతానికి పెరిగిపోయిందట! ఎవరీ నిర్ధిష్టవర్గం.? ముస్లింలు అని చెప్పకనే చెప్పారు. ప్రభుత్వం నిందలు వేస్తుంది. ఆధారాలు చూపదు. అడిగితే క్లాసిఫైడ్ అంటుంది.

 

స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం అనేవి మన రాజ్యంగ ఆదర్శాలని మనకు తెలుసు. వీటి పుట్టినిల్లు 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం. ఇప్పుడు పుట్టినింటిలోనే ఈ ఆదర్శాలకు ముప్పువచ్చింది. ప్రస్తుత ఫ్రాన్స్ పరిస్థితి విక్టర్  హ్యూగో 1862లో రాసిన ‘లే మిజరబుల్స్’ ఫ్రెంచ్ నవలకు పోలివుందని సమాజ విశ్లేషకులు అంటున్నారు. ఈ నవల ప్రపంచ ప్రసిధ్ధి చెందింది. అనేక భాషల్లో అనేకసార్లు అనువాదం అయ్యింది. తెలుగులో ఏకంగా రెండుసార్లు బీదలపాట్లు పేరుతో  సినిమాగా వచ్చింది. మొదటిసారి చిత్తూరు నాగయ్య, రెండోసారి అక్కినేని నాగేశ్వరరావు నటించారు. పిల్లల ఆకలిని చూడలేక రొట్టెను దొంగిలించి జైలు పాలవుతాడు ప్రధాన పాత్ర జీన్ వాల్జీన్. పిల్లల్ని చూడాలని జైలు నుండి తప్పించుకునే ప్రయత్నం చేయడంతో శిక్షను 19 ఏళ్లకు పెంచుతారు.   

 

ఇటీవల ప్రపంచ దేశాలన్నింటిలోనూ సంపద పంపకాల్లో ఒక సాధారణ నియమం కనిపిస్తున్నది. దేశ సంపదలో అత్యధిక భాగం కొద్ది మంది కుటుంబాల చేతుల్లో కేంద్రీకృతమవుతోంది. అతి తక్కువ సంపదను అత్యధిక కుటుంబాలు పంచుకోవాల్సివస్తున్నది. గణాంకాలు ఓ ఐదారు శాతం అటూఇటూ కావచ్చుగానీ అనేక దేశల్లో ఇప్పుడు ఇదే పరిస్థితి వుంది.

 

ఫాన్స్ లో ప్రభుత్వ విద్యాసంస్థల్ని మూసేస్తున్నారు. క్లాస్ రూములు క్రిక్కిరిసి పోతున్నాయి. టీచర్లు లేరు. జీతాలు సాధారణ ఇంటి అద్దె  చెల్లించడానికి  కూడ సరిపోవడంలేదు. ఇంట్లో ఒక్కరికి వైద్య సమస్య వచ్చినా మొత్తం కుటుంబం రోడ్డున పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దయనీయ పరిస్థితుల మీద రాయిటర్ తో సహా అనేక పత్రికలు పుంఖాను పుంఖలుగా కథనాలు  ప్రచురించాయి. సెప్టెంబరులో అసహనం బద్దలయింది. అక్టోబరులో అది తారా స్థాయికి  చేరుకుంది. 

 

కాక్రోచ్ జనతాపార్టి నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల జుడీషీయల్ కష్టడీ కేసు విచారణకు వచ్చినపుడు ఢిల్లీ హై కోర్టు బెంచి ఒక ఆసక్తికర వ్యాఖ్య చేసింది. మీరిద్దరూ జెన్-జీ కాదుకదా? అని వ్యాఖ్యానించింది. 1997- 2012 మధ్య కాలంలో పుట్టిన వారిని జెన్-జీ అంటారు. వాళ్ళిద్దరూ అంతకన్నా ముందు పుట్టారు అని హైకోర్టు బెంచి గుర్తు చేసింది. ఫ్రాన్సులో  నిరసన ప్రదర్శనలకు నాయకత్వం వహిస్తున్న ర్యాధ్ రానీ ( ఫ్రెంచ్‍ పేర్లను ఇంగ్లీషు అక్షరాలతో సరిపెట్టుకోవాలి. వాళ్ల ఉచ్చారణ వేరుగా వుంటుంది.) 2007లో పుట్టాడు. అచ్చమైన జెన్- జీ. ముక్కుపచ్చలారని 19 యేళ్ళ కుర్ర విద్యార్ఢి.  హైస్కూలు విద్యార్ధి యూనియన్  యాక్టివిస్టు. జీన్ లక్ మెలెన్ చోన్ అనే ఓ సీనియర్ వామపక్ష నాయకుడు ప్రస్తుత ఉద్యమానికి గట్టి మద్దతుదారునిగా వున్నాడు.

 

ఇప్పుడు ఇదొక ట్రెండ్. పటిష్టమైన నిర్మాణాలున్న వ్యక్తులు, సంస్థలు చేయలేని అద్భుతాలను ఏ నిర్మాణమూ లేని ‘కుర్రకుంకలు’ చేసేస్తున్నారు.  వీళ్లు ఎంత కాలం నిలబడతారూ వంటి ప్రశ్నలు సహజంగానే ముందుకు వస్తాయి. సిజేపి నాయకుడు అభిజిత్ దీప్కే ఎంతకాలం నిలబడతాడూ  వంటి గుసగుసలు మనదగ్గర కూడ అప్పుడే మొదలయ్యాయి. నిజానికి అతను చేయ్యాల్సిన పనిని ఈ పాటికే చేసేశాడు. సింహాసనాన్ని వణికించాడు. ప్రజల్లో సింహాసనం మీద  కొనసాగుతున్న భయాన్ని పోగొట్టేశాడు. సిజెపి రాజకీయాల్లో నిలదొక్కుకుంటుందా? ఎవరితో జత కడుతుంది? వగయిరాలన్ని ఊహాగానాలే. అవి జరగవచ్చు, జరక్కపోనూ వచ్చు. అయినప్పటికీ అభిజిత్ దీప్కే ఈపాటికే చేసిన పని చరిత్రలో నిలిచిపోతుంది.

 

అమెరికాతోసహా యూరప్ లోని అనేక దేశాల్లో ప్రస్తుతం ముస్లింలు, కమ్యూనిస్టులు అనేవి పర్యాయ పదాలుగా వాడుతున్నారు. ఫ్రాన్స్ నిరసన ప్రదర్శనల్లో మనకు టోపీవాలాలు, బుర్ఖా మహిళలు కనిపించరు. కానీ, ట్రంప్ వంటివాళ్ళు వాళ్లందర్ని ముస్లింల ఖాతాలో వేస్తున్నారు.

 

కొత్త పౌరసత్త్వ చట్టానికి వ్యతిరేకంగా సాగిన షాహీన్ బాగ్ ఉద్యమం అచ్చంగా ముస్లిం మహిళలు నడిపిన కార్యక్రమం. ఇప్పుడు సాగుతున్న జంతర్ మంతర్ ఉద్యమం అలా కాదు. మనకు ఆ నిరసనల్లో చాలా అరుదుగా మాత్రమే ముస్లింలు కనిపిస్తారు. అయినప్పటికీ ముస్లింలే దాన్ని నిర్వహిస్తున్నారని ప్రభుత్వవర్గాలు ప్రచారం చేస్తున్నాయి.

 

సాధారణంగా పోలీసులకు ఒక అపధ్ధర్మ నియమం వుంటుంది. "round up the usual suspects." “ఎప్పుడూ అనుమానించేవాళ్లనే మళ్లీ పట్టుకోండి!”  ఏదైనా ఒక పెద్ద సంఘటన జరగ్గానే వాళ్ళు హడావిడిగా కొందరిని అరెస్టు చేసి పోలీసులు అప్రమత్తంగా వున్నారనే సంకేతాన్ని ఇస్తుంటారు.

 

2007 మే నెలలో హైదరాబాద్  మక్కా మసీదులో   పేలుడు జరిగినపుడు పాత బస్తీలో అనేక మంది ముస్లింలను అరెస్టు చేసి జైళ్లకు పంపించారు. ఈ సమాచారంతో మీడియా చెలరేగిపోయింది. కొంతకాలం తరువాత ఆ సంఘటన వెనుక అభినవ భారత్ అనే హిందూత్వ సంస్థ పేరు బయటికి వచ్చింది. స్వామీ ఆసీమానంద తదితరుల్ని అరెస్టు చేసి ముస్లింలను విడుదల చేశారు.

 

2020 మార్చి నాటి సంచలన నిజాముద్దీన్ మర్కజ్ – కరోనా సూపర్ స్ప్రెడర్ కేసు కూడ ఇలాంటిదే. మర్కజ్ లో ముస్లింలు కరోనాను ‘సోకించుకుని’ దాన్ని దేశమంతా వ్యాపింపచేయాలని కుట్ర చేశారనేది ఆరోపణ.  ఈ మాత్రం ఉప్పు అందగానే  ‘ఒళ్ళో మీడియా’ (గోదీ మీడియాకు తెలుగు) చెలరేగిపోయింది.  ఆ సందర్భంగా మర్కజ్ లో వున్న 70 మందిని అరెస్టు చేశారు. విచిత్రం ఏమంటే వైద్య పరీక్షలు నిర్వహించగా వారిలో ఒక్కరికీ కరోనా పాజిటివ్ రిపోర్టు రాలేదు. ఢిల్లీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు ఈ కేసుల్ని, అనేక ఎఫ్ ఐఆర్ లను, చార్చి షీటుల్ని  నిరాధారంగా తేల్చి  కొట్టిపడేశాయి. ఈ లోపు ముస్లిం ఫోబియో తెగ ప్రచారం అయిపోయింది.

 

మార్క్సిస్టు రాజకీయ ఆర్థికశాస్త్రం మనకు ఒక ముఖ్యమైన పాఠం చెబుతుంది. దేశ సంపద పెరిగినంత మాత్రాన ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని అనుకోవడానికి వీల్లేదు. జాతీయ ఆదాయం పెరగవచ్చు. కార్పొరేట్ లాభాలు పెరగవచ్చు. స్టాక్ మార్కెట్లు ఎగబాకవచ్చు. కానీ ఆ సంపదలో సామాన్యులకు ఎంత వాటా దక్కుతోంది? అనేది ప్రధాన ప్రశ్న.  ద్రవ్యోల్బణం అంటే కేవలం మార్కెట్లో ధరలు పెరగడం కాదు. ఆదాయాలు, ఖర్చుల మధ్య సంబంధం కూడా ముఖ్యం. ధరలు పెరుగుతున్నప్పుడు ఆదాయం పెరగకపోతే, ప్రజల వాస్తవ కొనుగోలు శక్తి పడిపోతుంది. అది అనేక అనర్ధాలకు దారితీస్తుంది. 

 

ఫ్రాన్స్ ఆందోళనకారులు ఇప్పుడు మూడే ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక ఉపాధ్యాయుడి జీతంతో కుటుంబ ఖర్చులు తీరుతున్నాయా? ఒక విద్యార్థి భవిష్యత్తుకు సమాన అవకాశాలు ఉన్నాయా? ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికేవరకు ర్యాద్ రానీ కాకపోతే మరొకరు జనాన్ని రోడ్ల మీదికి తీసుకుని వస్తారు. ఇది చర్యకు ప్రతిచర్య. చర్యను ఖండించని వారు ప్రతిచర్యను ఖండించడం సబబుకాదు.

 

ట్రంప్ మక్రాన్ ను హెచ్చరించాడుగానీ అతని భయాలు అతనికి వున్నాయి. ప్రస్తుతం అమెరికా జిడిపి 32 ట్రిలియన్ డాలర్లు. అమెరికా జాతీయ రుణం 41 ట్రిలియన్ డాలర్లు. డెట్ టు జిడిపి రేషియో 127 శాతం. అంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయని అర్ధం. ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ  నిరసనలు త్వరలో అమెరికాలోనూ చెలరేగే అవకాశం వుందని అనేక సూచికలు చెపుతున్నాయి. ముందుజాగ్రత్తగానే ట్రంప్ దానికో బ్లేమ్ గేమ్ మొదలెట్టారు. ఇప్పటికే ఆయన న్యూయార్క్ ముస్లింల నగరంగా మారిపోయిందని అంటున్నారు. రేపు అమెరికా ముస్లింల దేశంగా మారిపోయిందని అంటారు. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు. 

 

23-10-2026

Respected Mayor, please grant me permission to enter your city

 “Respected Mayor, please grant me permission to enter your city.” - Prime Minister Indira Gandhi on 30 Oct 1982 at Gannavaram Airport.

నగరానికి ఒక మేయర్ వుంటారు. నగర పరిధిలో మూడు నాలుగు అసెంబ్లీ స్థానాలుంటాయి. మొన్నటి వరకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 24 అసెంబ్లీ సిగ్మెంట్లు వుండేవి. ఇప్పుడు వాటిని మూడు నగరాలుగా విభజించారు గానీ ఇంకా మేయర్ల ఎన్నికలు జరగలేదు. ఎలా చూసినా మేయర్ ఓటర్ల బేస్ శాసన సభ్యులకన్నా చాలా పెద్దది. అయినప్పటికీ శాసన సభ్యులకున్న విలువ మేయర్లకు వుండడంలేదు. ఇటీవలి కాలంలో రాజకీయాల్లో వచ్చిన మార్పు ఇది. ఏదో ఒక మినిస్టర్ అండతో మేయర్లు అయ్యే సాంప్రదాయం వచ్చింది.
మేయర్ పాత్రలు మనకు అలనాటి ఇంగ్లీషు, ఫ్రెంచ్ నవలల్లో చాలా శక్తివంతంగా కనిపిస్తుంటాయి. ఇంగ్లండ్ లో లార్డ్ మేయర్ అంటారు. మోనార్క్ తరువాత అంత గౌరవనీయమైన పదవి అది.
బెజవాడియన్లకు ఒక సంఘటన గుర్తుండే వుంటుంది. 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముందు 1982 అక్టోబరు 30న గన్నవరం ఎయిర్ పోర్టులో జరిగిన సంఘటన ఇది. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్) రెండో దశ యూనిట్ ను జాతికి అంకితం చేయడానికి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విజయవాడ వచ్చారు. విజయవాడ 1981లో నగరంగా మారింది. భారత కమ్యూనిస్టు పార్టికి చెందిన టి. వెంకటేశ్వర రావు తొలి మేయర్ గా ఎన్నికయ్యారు. విజయవాడ నగరంగా మారేక ప్రధాని రావడం అది మొదటిసారి. పైగా, అది ప్రధాని అధికార పర్యటన.
ప్రధాని ప్రత్యేక విమానం ల్యాండ్ కాగానే ఇందిరా గాంధీని రిసీవ్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి, విజయవాడ ఎంపి చెన్నుపాటి విద్య, కొందరు మంత్రులు, కాంగ్రెస్ నేతలు రన్ వే వైపుకు పూలదండలతో హడావిడిగా వెళ్ళారు. ఇందిరాగాంధీ వాళ్లను వారించి “మేయర్ ఎక్కడా?” అని అడిగారు. కాంగ్రెస్ నాయకులు షాక్ తిన్నారు. ప్రధాన మంత్రికి మేయర్ తో ఏం పనో వాళ్లకు అర్ధం కాలేదు. పైగా ఆయన కమ్యూనిస్టు పార్టీకి చెందినవారు.
ఇక్కడ బి-స్టోరి వుంది. వారం రోజుల క్రితమే విజయవాడ మేయర్ కార్యాలయానికి పియంఓ నుండి మెజెస్ వచ్చింది. ప్రధాని అధికార పర్యటన మీద విజయవాడ వస్తున్నారు. వారి నగర ప్రవేశానికి అనుమతి ఇవ్వండి అనేది దాని సారాంశాం. ఆ మెసేజ్ ప్రకారం మేయర్ టి. వెంకటేశ్వర రావు అందరికన్నా ముందుగానే ఎయిర్ పోర్టుకు చేరుకుని వెయిటింగ్ రూములో కూర్చున్నారు. కాంగ్రెస్ నాయకులు వారిని పట్టించుకోలేదు. వారు కూడ ప్రధాని కోసం వచ్చి వుంటారనే ఆలోచన రాలేదెవరికీ.
కొన్ని నిముషాలైనాక మేయర్ కూడ రన్ వే దగ్గరకు చేరుకున్నారు. అప్పుడు ప్రధాని ఇందిరాగాంధి చాలా మర్యాదగా “Respected Mayor, please grant me permission to enter your city.” అన్నారట. దానికి మేయర్ కూడ అంత మర్యాదగా “ నా నగరం మీకు ఆహ్వానం పలుకుతోంది” అన్నారట.. అప్పట్లొ అది కొన్నాళ్లు టాక్ ఆఫ్ ద సిటి. మేయర్ కు ఇంత కత వుందా? అనుకునేవారు.
జంధ్యాల శంకర్ మేయర్ గా వున్నకాలంలో మేయర్ స్థాయి గురించి చాలా చెప్పేవారు. అప్పట్లో వారు హెలీకాప్టర్లతో విజయవాడ కొండల మీద విత్తనాలు చల్లించినపుడు చాలా మంది వారిని అమెరికా మేయర్ అంటూ ఎద్దేవ చేశారు. ఆ విత్తనాలు ఇప్పుడు భారీ చెట్లుగా మారి విజయవాడ ఉష్ణోగ్రతను అదుపులో వుంచుతున్నాయి. 1970లనాటి విజయవాడ ఎండలకు రోకళ్ళు బద్దలయిపోయేవి. రోడ్లు పగిలిపోయేవి. అచ్చమైన రాజకీయులు కాకుండ కొంచెం ముందుచూపు వున్నవాళ్ళు బాధ్యత గల స్థానాల్లో వుంటే దాని కతే వేరు.
Photo Curtsy : Budiga Jamindar

Monday, 19 October 2026

గతం తెలిస్తే చాలదు; భవిష్యత్తును నిర్మించాలి!

 గతం తెలిస్తే చాలదు; భవిష్యత్తును నిర్మించాలి!

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

‘వందేళ్ల భారత కమ్యూనిస్టు ఉద్యమం: గతం, వర్తమానం, భవిష్యత్తు’ అనే అంశంపై సోషల్ సైన్సెస్ ట్రస్టు, ప్రోగ్రెసివ్ ఫోరం సంయుక్తంగా అక్టోబరు 17, 18 తేదీల్లో విజయవాడలో ఒక సదస్సు నిర్వహించాయి. నాలుగు సెషన్లలో పన్నెండుమంది ప్రసంగించారు. విస్తృతంగా చర్చలు కూడ జరిగాయి. కమ్యూనిస్టు ఉద్యమం సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలను వక్తలు సమర్థంగా వివరించారు. అయితే, భారతదేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తు కాడ్యక్రమం ఏమిటి? అనే ప్రశ్నకు మాత్రం ఆశించినంత స్పష్టమైన సమాధానాలు లభించలేదు.

 

అది వక్తల తప్పు కాదు. మనం ఒక చారిత్రక కూడలిలో ఉన్నాం. ఓడిపోయి నిలబడ్డాం. రాజ్యాంగబద్ధంగా, ఎన్నికల ద్వారా అధికారాన్ని చేపట్టిన పాలక వ్యవస్థ మతతత్త్వ రాజకీయాలు నడుపుతూ, కార్పొరేట్ ప్రయోజనాలు  నెరవేరుస్తూ అధికార కేంద్రీకరణను సాగిస్తొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎటు వెళ్లాలో తేల్చిచెప్పడం అంత సులభం కాదు. కానీ ఆ ప్రశ్నను వాయిదా వేయడమూ సాధ్యం కాదు.

 

ఉత్పత్తి నైపుణ్యం పెరిగినప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు, తక్కువ శ్రమతో ఎక్కువ ఉత్పత్తి సాధ్యమవుతుంది. మానవాళికి సుఖసౌకర్యాలు పెరగాలి. పని గంటలు తగ్గాలి. మనుషులకు విశ్రాంతి, సృజనాత్మకత, సామాజిక జీవితానికి ఎక్కువ సమయం లభించాలి. కానీ వాస్తవంలో అలా జరుగుతున్నదా?

 

ఉత్పత్తి ప్రక్రియలో శ్రమ విభజన అనివార్యం. అయితే శ్రమ విభజన అనివార్యంగా వర్గ విభజనకు దారితీయాలని నియమం ఏదీలేదు. ఉత్పత్తి సాధనాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఉత్పత్తి ఫలితాలను ఎవరు స్వాధీనం చేసుకుంటున్నారు? నిర్ణయాధికారం ఎవరికి ఉంది? నిర్ణయాధికారాన్ని ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారూ? ఈ ప్రశ్నలే వర్గ సంబంధాలను అర్థం చేసుకోవడానికి కీలకం.

 

 

యూరప్‌లో, ముఖ్యంగా ఇంగ్లండ్‌లో, భూస్వామ్య సంబంధాల నుంచి పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానానికి జరిగిన పరివర్తనను కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్ లోతుగా అధ్యయనం చేశారు. పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థలో పెట్టుబడిదారులు, వేతన శ్రామికుల మధ్య వైరుధ్యాలను విశ్లేషించారు.

 

మార్క్స్ భవిష్యత్ సమాజాన్ని కేవలం ఊహించలేదు. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానంలోని అంతర్గత వైరుధ్యాలను విశ్లేషించి, దాని స్థానంలో వర్గాధిపత్యం లేని సమాజం ఏర్పడే అవకాశాలను పరిశీలించాడు. అయితే ఆ కొత్త సమాజాన్ని నిర్మించడానికి అవసరమైన ఒక సంపూర్ణ కార్యక్రమాన్ని ఆయన రూపొందించలేదు.

 

1875లో రాసిన *Critique of the Gotha Programme*లో కమ్యూనిస్టు సమాజపు తొలి దశలో శ్రమకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని, మలి దశలో అవసరాలకు అనుగుణంగా పంపిణీ సాధ్యమవుతుందని వివరించాడు. “ ప్రతి ఒక్కరి నుంచి వారి సామర్థ్యం మేరకు; ప్రతి ఒక్కరికీ వారి శ్రమకు అనుగుణంగా.”“ప్రతి ఒక్కరి నుంచి వారి సామర్థ్యం మేరకు; ప్రతి ఒక్కరికీ వారి అవసరాల మేరకు.” అన్నాడు.

 

మార్క్స్ చెప్పిన సోషలిజం ఆదర్శం ప్రపంచమంతటా కష్టజీవుల్నీ, శ్రామికుల్నీ, అణగారిన సమూహాలనీ, సమస్యల్లోవున్న వారిని  విపరీతంగా ఆకర్షించింది. వీళ్లందరూ తాము ఎదుర్కొంటున్న సమస్యలకు విముక్తి దొరుకుతుందని మార్క్సు అభిమానులుగా మారారు.  అలా కమ్యూనిస్టు పార్టీలు ఏర్పడ్డాయి. వాళ్ల నాయకత్వంలో అనేక పోరాటాలు, ఉద్యమాలు  జరిగాయి. తక్షణ సమస్యలకు తక్షణ పరిష్కారాలేతప్ప సోషలిస్టు సమాజాన్ని ఎలా నిర్మించాలో ఏ కమ్యూనిస్టు పార్టీకీ ఇప్పటి వరకు అర్ధం కాలేదు. ఎవరికి వాళ్ళు తమకు తెలిసిన ప్రపంచం నుండి, తమకు తెలిసి సమస్యల నుండి  తమకు తెలిసిన విముక్తి మార్గాల నుండి తమతమ పార్టీ కార్యక్రమాల్ని రూపొందించుకున్నారే తప్ప అవి సోషలిస్తు సమాజాన్ని నిర్మిస్తాయనే నమ్మకం లేదు.

 

మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత రష్యాలో సోషలిస్టు విప్లవం విజయవంతం అయిందని ప్రచారం సాగింది. రెండవ ప్రపంచ యుధ్ధంలో  ఫాసిజం, నాజిజాలను అంతం చేయడంలో రష్యా చాలా కీలక పాత్ర పోషించింది.  భారత కమ్యూనిస్టు పార్టి  ప్రతినిధి బృందం రష్యా వెళ్ళి  తమకు మార్గదర్శనం చేయమని స్టాలిన్ ను కోరింది. నిజానికి తమది సోషలిస్టు సమాజమో కాదో స్టాలిన్ కే నమ్మకంగా తెలీదు. అయితే ఆయన నిజాయితీపరుడు. తమను అనుసరించవద్దనీ, భారతదేశ వాస్తవ స్థితిగతుల్ని లోతుగా అధ్యయనం చేసి ఆ ప్రకారం స్వంత కార్యక్రమాన్ని రూపొందించుకోవాలని సలహా ఇచ్చి పంపించేశాడు.

 

ఇదే సన్నివేశం నక్సలైట్ ఉద్యమంలోనూ 1967లో పునరావృతమైంది. చారు మజుందార్ కూడ ఒక ప్రతినిధివర్గాన్ని మావోను సంప్రదించడానికి చైనా పంపించాడు. సరిగ్గా స్టాలిన్ చెప్పిన మాటల్నే మావో కూడ నక్సలైట్ ప్రతినిధివర్గానికి  చెప్పి పంపించాడు.

 

1926 నాటి చైనా సమాజాన్ని మావో అర్ధవలస - అర్ధ భూస్వామ్య సమాజంగా అంచనా వేశాడు.  దాన్ని అంతం చేయడానికి ఓ పదమూడేళ్ళు శ్రమించి 1940లో నూతన ప్రజాస్వామిక విప్లవం అనే పరిష్కారాన్ని సూచించాడు.  1949లో అది విజయవంతం అయిందనికూడ ప్రకటించాడు. తరువాతి పరిణామాలు చైనాలో మరో పెట్టుబడీదారీ వ్యవస్థను సృష్టించాయి.

 

అయితే మేలేమి జరగలేదా అంటే చాలా మేలు జరిగింది. అటు రష్యాలోనూ, ఇటు చైనాలోనూ అందరికీ క్వాలిటీ విద్య అవకాశాలు వచ్చాయి. వైద్య సదుపాయాలు అందరికీ అందుబాటులోనికి తెచ్చారు. స్త్రీలకు సమానత్వం లభించింది. సమాజంలో మానవీయ విలువలు పెరిగాయి. జీవనస్థాయి మెరుగుపడింది.  

 

విచిత్రం ఏమంటే; స్టాలిన్ వారించినా సరే రష్యామార్గమే తమ మార్గమని నాటి సిపిఐ నిర్ణయించుకున్నట్టు,  మావో వద్దన్నా సరే చైనా మార్గాన్నే తమ మార్గంగా సిపిఐ ఎంఎల్  ఎంచుకుంది. అది అంతటితో ఆగలేదు; చైనా ఛైర్మనే తమ ఛైర్మన్ అని కూడ  ప్రకటించింది. దానికి కొనసాగింపే సిపిఐ మావోయిస్టు పార్టి. చరిత్రలో కొన్ని ఫన్నీ సీన్స్ ఇలా చాలా సీరియస్ గా జరుగుతుంటాయి. అవి తమ సహజమైన ముగింపుకు చేరుకోక తప్పదు.

 

సమాజాల్లో పనిచేసేవారు, పని చేయించుకునేవారు; పాలితులు, పాలకులు అనే విభజనలు వివిధ రూపాల్లో కనిపిస్తాయి. కొన్ని సమాజాల్లో సామాజిక చలనశీలతకు అవకాశం ఉంటుంది. మరికొన్ని సమాజాల్లో జన్మ ఆధారిత స్థానం, వారసత్వ హక్కులు, సామాజిక నిషేధాలు అసమానతలను స్థిరపరుస్తాయి. భారతీయ మత వ్యవస్థ, కుల వ్యవస్థ ఈ రెండో లక్షణాన్ని చారిత్రకంగా బలంగా ప్రదర్శించింది.

 

వర్గ సమస్యను ఆర్ధిక సంబంధాల ప్రాతిపదికగా అధ్యయనం చేస్తే భారత సమాజం పూర్తిగా అర్థం కాదు. మతం, కులం, సంపద మీద అధికారం  సామాజిక గౌరవం, రాజకీయ అధికారం మధ్య సంబంధాలను కూడా పరిశీలించాలి.

 

హిందూసమాజం విస్తృత సేవక సమూహాలను ఏర్పరచుకుని అనాదిగా ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. రాజ్యాంగం ఈ సేవక సమూహాలకు పూర్తి స్వేచ్చను ఇవ్వలేదుగానీ,  ఏదో ఒక స్థాయిలో సర్దుబాటు చేసుకుంది. అలా ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి *హిందూ సమాజానికి వెలుపలవున్న   ముస్లింలు, ఆదివాసుల్ని కొత్త సేవక సమూహంగా మార్చే ప్రక్రియ అరంభం అయింది. ఇది ఇటీవలి కాలంలో వేగాన్ని పుంజుకుంది. దీనివల్ల పాలకులకు ఆర్ధిక ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు, సాంస్కృతిక ప్రయోజనాలు మూడూ వున్నాయి. వర్తమాన భారత సమాజంలో ముస్లింలను ప్రధాన బాధితులుగా గుర్తించని మార్క్సిస్టులు ఎన్నటికీ భారత సమాజానికి విముక్తి మార్గాన్ని సూచించలేరు*.

 

భారత రాజకీయార్ధిక సామాజిక  సాంస్కృతిక రంగాల్లో మూడు బలమైన ధోరణులు కన్పిస్తున్నాయి. మొదటిది; దామోదర్ వినాయక్ సావర్కర్ ప్రతిపాదించిన హిందూత్వ సిధ్ధాంతం. భారతదేశంలోని సమస్తరంగాల్లో హిందువులు పాలకులుగా వుండాలి; ఇతరులు పాలితులుగా వుండాలి లేదా దేశం విడిచి వెళ్ళిపోవాలి అనేది దీని సులభ తాత్పర్యం. అయితే హిందూ సమాజంలో భాగమైనవారిలోనూ ఈ సిధ్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నవారి సంఖ్య ఎక్కువగానే వుంది. రెండవది; హిందూ సమాజనికి దూరంగా అడవుల్లో తమదైన సమాజాన్ని కొనసాగించుకోవాలని ఆదివాసులు భావిస్తున్నారు. మూడవది; నూతన ఆర్ధిక విధానాలు వచ్చాక కార్మికుల స్వభావ స్వరూపాలు మారిపోయాయి. గిగ్ వర్కర్లు, అస్థిర కార్మికులు (ప్రికారియేట్) పెరుగుతున్నారు.

 

నాలుగవది;  మత సామరస్యమే ప్రామాణికం కావాలనే వాదన కూడ ఒకటి ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది. దీనిని ప్రధానంగా భారత ముస్లిం సమాజం కోరుకుంటున్నది. హిందూ సమాజంలోని ఉదారవాద సమూహాలు సహితం దీన్ని సమర్ధిస్తున్నాయి. అలాంటి వారు ఎంత  బలంగా వున్నారు అనేది  వేరే చర్చ.

 

కుల సమస్యను హిందూ సమాజపు అంతర్గత వ్యవహారంగా పరిమితం చేసి. హిందూ- ముస్లిం బైనరీతో రాజ్యాధికారాన్ని కొనసాగించాలనే తలంపులతో నేటి పాలకవర్గాలు వున్నాయి. ప్రజలు కులం, మతం  వివాదాల్లో మునిగి వున్నప్పుడు సహజవనరులన్నింటినీ తమ ఖాతాల్లో వేసుకునే పనిలో కార్పొరేట్ సంస్థలున్నాయి. వీటిల్లో మెగా కార్పొరేట్లు ప్రభుత్వ ఆశిస్సులతో మరీ చురుగ్గా వున్నాయి.  మెగా కార్పొరేట్ల ఆశిస్సులతోనే ప్రభుత్వాలు నడుస్తున్నాయనే వాదన కూడ బలంగానే వుంది.  

 

హిందూ సమాజం లోపల  ఎస్సీలు, బిసిలు, హిందూ సమాజం వెలుపల ఆదివాసులు, మత మైనారిటీలు, గిగ్ వర్కర్లు నేటి అణగారిన సమూహాలు. వీరి విముక్తికి ఏవైనా ఆచరణాత్మక కార్యక్రమాన్ని  కమ్యూనిస్టు పార్టీలు రూపొందించాలి. లేకుంటే …. ???  

 

20-10-2026

Saturday, 17 October 2026

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

కపట మార్క్సిస్టులు విప్లవాలకు నాయకత్వం వహించలేరు

 

డానీ

సమాజ విశ్లేషకులు

 

 ‘విప్లవోద్యమం :  కామ్రేడ్ కేఎస్ తదుపరి నాయకత్వం’ శీర్షికతో ఎన్ రవి  రాసిన వ్యాసాన్ని అరుణతార 2026 అక్టోబరు సంచికలో  ప్రచురించింది. నక్సలైటు ఉద్యమం ముగియడం మీద ఇటీవల నేను వ్యక్తం చేస్తున్న అభిప్రాయాల్ని ఖండించడానికి రాసిన వ్యాసం ఇది. నా రచనల మీద వచ్చే కామెంట్లు, వ్యాసాలను సాధారణంగా పట్టించుకోను. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి స్పందించినపుడు మాత్రం ఒకసారి ప్రతిస్పందించాను. జంతర్ మంతర్ వద్ద జెన్ –జీ నిరసనల్నివిజయవంతంగా  నిర్వహించి, సింహాసనాన్ని వణికించి  దేశప్రజల్లో నియంతల పట్ల  భయాన్ని పోగొట్టినపుడు దళిత అభిజిత్ దీప్కే నేటి హీరో అని ప్రకటించాను.  దాన్ని ఖండిస్తూ ఓ కిరాయి కోటిగారు; సింహాసనం వణకలేదు; ప్రజాస్వామ్య విలువలతో ప్రతిస్పందించిందని ఓ వ్యాసం రాశారు. దాన్నీ పట్టించుకోలేదు. 


నక్సలైట్ ఉద్యమంలో ఎన్ రవి ఏ కీలక బాధ్యతలు నిర్వహించారో నాకు  తెలీదు. అలాంటివాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకున్నాను. వారి వ్యాసం అరుణతారలో వచ్చింది కనుక పట్టించుకోవాల్సివచ్చింది. ఇది నేను అరుణతారకు ఇస్తున్న గౌరవం; రవికి ఏమాత్రం కాదు.

 

కేఎస్, టిఎన్, సిపి, వీరన్న, లింపియావో, ఎంఎం, రవూఫ్ తదితర నాయకుల పేర్లతో నక్సలైట్ గ్రూపుల్ని సంభోదించే సాంప్రదాయం మనకు మొదటి నుండీ వుంది.  ఇంతకు  ముందు పీపుల్స్ వార్ ను కేఎస్ వర్గం అనేవారు; ఆ తరువాత గణపతి వర్గం అంటున్నారు. వర్గం అన్నప్పుడు ఒక్కడు అనికాదు ఒక బృందం అనే అర్ధం. అది ఏకవచనం కాదు; బహువచనం. ఇంత చిన్న వివరణ ఇవ్వడానికి ఒక వ్యాసం రాయాల్సిన పనిలేదు.

 

దాదాపు కాలి బూడిద అయిపోయిన విప్లవోద్యమాన్ని ఫీనిక్స్  పక్షిలా ప్రాణం పోసి ఏపుగా పెంచిన ఘనత కొండపల్లి సీతారామయ్యది. ఈ మాటను నాకన్నా ముందే చాలామంది చాలాసార్లు అన్నారు. నాకూ అదే అభిప్రాయం వుంది. దానికి కొనసాగింపుగా, “ఏపుగా పెరిగిన విప్లవోద్యమాన్ని కాల్చి బూడిద చేసిన ఘనత గణపతిది” అన్నాను. ఆ పని చేసింది గణపతి ఒక్కరేకాదు; నల్లా ఆదిరెడ్డి, చెరుకూరి రాజ్ కుమార్, మల్లోజుల కోటేశ్వరరావు, నంబాళ కేశవరావు, మల్లా రాజిరెడ్డిలతో కూడిన సమిష్టి నాయకత్వం ఈ పనిచేసింది అని జాబితాను పెంచారు ఎన్ రవి. ఒక్కరు చేసినా అరడజను మంది చేసినా జరిగింది ఒక్కటే. మల్లోజుల వేణుగోపాల్ తదితరులు నిర్వహించిన లొంగుబాటు జాతరకు ఈ నాయకత్వ బృందానికి సంబంధం లేదందామా? ఈ ప్రపంచంలో సంబంధం లేకుండా ఏదైనా వుంటుందా? ఆంటాలజీ!

 

‍ అతిశయోక్తులతో కేఎస్ ను నేను ఎన్నడూ పొగడలేదు. ఆయన్ను రాతలో విమర్శించిన సందర్భాలూ వున్నాయి.  ప్రతి ఒక్కరికీ ఒక చారిత్రక పరిమితి వుంటుంది. స్వయంగా కార్ల్ మార్క్స్ కు సామ్రాజ్యవాదం గురించి తెలీదు. ఆ విషయాన్ని లెనిన్ మాత్రమే చెప్పగలడు. ఇద్దరి కాలాలు వేరుకనుక. నా అంచనా మేరకు 1990ల ఆరంభం వరకే కేఎస్ పరిమితి. ఒకవేళ 1990 తరువాత కూడ ఆయన ఉద్యమ నాయకత్వంలో కొనసాగి వుంటే కొత్త ప్రపంచాన్ని అర్ధం చేసుకుని కొత్త సవాళ్లను అధిగమించేవారేమో  అన్నది ఒక ఊహాగానం మాత్రమే. హైపోథీసిస్.

 

1990ల ముందు కాలాన్ని కేఎస్ స్థూలంగా సరిగ్గానే విశ్లేషించారు. గణపతి బృందానికి వుండాల్సింది 1990ల తరువాతి కాలానికి సంబంధించిన లోతైన అవగాహన. అది వారికి లేదు. రవి వ్యాసంలోనే ఈ విమర్శలకు అనేక రుజువులున్నాయి.. “దేశంలో ఎన్నో ఆర్ధిక, సామాజిక మార్పులు సంభవిస్తున్నాయని గుర్తిస్తూ వాటిని అధ్యయనం చేయడానికి ప్రయత్నం జరిగిందిగానీ ఆ అధ్యయనంగానీ, దానికి అనుగుణంగా సాగాల్సిన ఆచరణగానీ మారిన పరిస్థితులకు సరిపోలలేదు”. “పార్టి నాయకత్వం సమిష్టిగానే విఫ్లలం అయ్యింది” .  “గత దశాబ్దకాలంలో ఓటమి తరువాత ఓటమిని ఎదుర్కొంటూ చివరకు సాయుధ ఉద్యమమే లేకుండా పోయింది” వంటి నిర్ధారణలు రవి వ్యాసంలో అనేకం కనిపిస్తాయి.

 

ఇంతకూ ఈ వ్యాసకర్త నాతో ఎక్కడ విభేదిస్తున్నట్టూ?  గణపతి ఒక్కరే కాదు; నాయకత్వంలో అందరూ విఫలం అయ్యారు అని చెప్పాడానికి మాత్రమే రవి ఈ వ్యాసం రాసినట్టున్నారు. రవి చేస్తున్న సవరణతో నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. నేను ఆమోదిస్తున్నాను. నా విమర్శల్ని ఆయన మరో మాటల్లో బలపరుస్తున్నారు. ధన్యవాదాలు రవి గారు!

 

ఇన్నాళ్ళూ నేను ఉద్యమానికి గర్భస్రావం జరిగిందనే భావనలో వున్నాను. ఈమధ్య తెలిసిన వివరాలు ఏమంటే మల్లోజుల బృందం ఉద్యమ గర్భసంచిని సహితం తొలగించి వచ్చిందట. దీనికి రవి చెప్పే సమిష్టి నాయకత్వం సమిష్టిగా బాధ్యత వహించదా?  

 

వ్యవస్థ భరించలేనంతగా కుళ్ళిపోయినప్పుడెల్లా యువతరం తిరగబడడం కొత్తదేమీకాదు. 1960-70లల్లో చెలరేగిన నక్సల్బరీ ఉద్యమాన్ని నడిపింది బేబీ బూమర్సే. (నేను ఆ తరానికి చెందినవాడిని) 2026లో బేబి బూమర్స్ ల సాయుధ ఉద్యమం ముగియడం జెన్ జీలు నిరసనోద్యమాన్ని చేపట్టడం యాధ్డిఛ్ఛికం కాదు. అదొక చరిత్ర క్రమం. మళ్ళీ ఆంటాలజీ! ఒకటి ముగిసి మరొకటి మొదలవుతుంది.

 

సామాజిక, సాంస్కృతిక, ఆర్ధిక రంగాల్లో 1990లలో ఏర్పడిన కొత్త పరిణామాల సిండ్రోమ్ ను పీపుల్స్ వార్, / మావోయిస్టు పార్టిలు అధ్యయనం చేసి రూపొందించిన కొత్త సిధ్ధాంతాల డొల్లతనాన్ని అర్ధం చేసుకోవడానికి కూడ రవి వ్యాసంలో అనేక ఆధారాలున్నాయి.

 

సాంస్కృతిక అంశాల మీద నక్సలైట్ నాయకుల నిర్లిప్త వైఖరికి ప్రతిస్పందనగా అస్తిత్వ/ఉనికివాద ఉద్యమాలు వచ్చాయి. అస్తిత్వ ఉద్యమాల వ్యవస్థాపకులు నక్సలైట్/కమ్యూనిస్టు ఉద్యమాల నుండి వచ్చినవారే.  “మేమెంతో మాకంతా”, “జిస్కీ జిత్ని సంఖ్యాభారీ; ఉస్కి ఉత్ని హిస్సెదారి” నినాదాలు ఇచ్చారు వాళ్ళు.  “ప్రతి ఒక్కరికీ వారి శ్రమకు  తగినట్లుగా”అలాగే  “ప్రతి ఒక్కరి నుండి వారి సామర్థ్యానికి తగినట్లుగా, ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు తగినట్లుగా!” అనే సామ్యవాద సమాజపు నియమాలకు వర్తమాన  పరావర్తనాలే ఆ నినాదాలు. ఆ మాత్రం ఇంగితం పీపుల్స్ వార్ సమిష్టి నాయకులకు లేదు. బేబీ బూమర్స్ చాలా పెద్ద సంఖ్యలో ఈ ఉద్యమాల్లో చేరారు. వీటిని అడ్డుకోవడానికి  చాలా బలహీనమైన సిధ్ధాంతాలని పీపుల్స్ వార్ రూపొందించింది..

 

“(అస్తిత్వవాద)  పోరాటాలను బ్రాహ్మణీయ ఫ్యూడల్ భావజాలంతోపాటూ, సామ్రాజ్యవాద సంస్కృతికి వ్యతిరేకంగా, దానితోపాటు ఆ సంస్కృతికి పునాదిగా నిలచిన వ్యవస్థను కూలదోసే వర్గపోరాటంగా మలచినపుడు మాత్రమే అది సాధ్యపడుతుందనే సైధ్ధాంతిక పోరాటం చేయవలసివస్తున్నది”.

 

పెద్ద పెద్ద గంభీర పదాలు తప్ప ఇందులో ఏ సిధ్ధాంతమూ లేదు. పోనీ ఆ సిధ్ధాంతాన్ని వాళ్లు ఆచరించిన దాఖలాలూ లేవు. ఇంగ్లీషువాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడానికి మధ్యమధ్యలో లాటిన్ పదాలు వాడుతారు. ఈ ఆస్థాన మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు సంస్కృత పదాలను తెగ వాడుతారు. నేల మీదికి తీసుకునివస్తే ఈ సిధ్ధాంతం బలం ఏమిటో తేలిపోతుంది.

 

“కోటాలు కాదు; ఎర్రకోట కావాలి” అంటూ మహత్తర నినాదాన్ని రంగంల్లోనికి దించారు. “ఇప్పుడు కోటాలు కావాలి; అంతిమంగా ఎర్రకోట కూడ కావాలి” అనవచ్చుగా. ఎర్రకోటను స్వాధీనం చేసుకోవడానికి మీకు ఎన్నేళ్ళు కావాలీ? వందేళ్ళు సరిపోతాయా? ఇది జరిగి నాలుగు దశాబ్దాలు గడిచిపోయాయి. ఎర్రకోట కాదుకదా వున్న అబూజ్ మడ్ కూడ వదులుకుని సమూహంగా లొంగిపోయారు. మీరు చెప్పింది సాకారం చేసే దమ్ము మీకు లేనపుడు కోటాలు వద్దనే బూటకపు ప్రగల్భాలు దేనికీ? పైగా “ఇవన్నీ ఈ కాలంలో జరిగిన ప్రధాన సైధ్ధాంతిక పురోగతులలో కొన్ని మాత్రమే” అని ఘనంగా ముక్తాయింపు. ఇదా ప్రధాన సైధ్ధాంతిక పురోగతి!

 

అస్తిత్వవాద సమూహాల సామాజిక న్యాయం అంశం ముందుకు వచ్చినపుడు బేబీ బూమర్స్ సాయుధ ఉద్యమం నుండి బయటికి వచ్చి  వారి పక్షం వహించారు. 1984 ఢిల్లీ అల్లర్లు, 1985 కారంచెడు  హత్యాకాండ సమయంలోనే ఈ పరిణామాల్లో భాగం అయ్యాను. ఆపిదప బిఎస్ రాములు, గుంటూరు లక్షీ నరసయ్య, ఖాదర్ మొహియుద్దీన్, ఉసా  తదితరులు 1990లకు ముందే అస్థిత్వవాదులుగా ముందుకు వచ్చారు.

 

గణపతికి మద్దతుగా రవి ఒక హాస్యాస్పద అంశాన్ని ముందుకు తెచ్చారు. 1970లలో ప్రజాసంఘాలలో సభ్యత్వానికి కూడ మార్కిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానాన్ని ఆమోదించాలనే నియమం వుండేది. ఇలాంటి “అతివాద” విధానాన్ని తొలగించి గణపతి ప్రజాసంఘాల్లో సభ్యత్వాన్ని సరళీకృతం చేశారని రవి గొప్పగా చెప్పుకొచ్చారు. ఇక్కడ కీలక ప్రశ్న ఏమంటే, సభ్యత్వాన్ని  సరళీకృతం చేసిన తరువాత ప్రజలు గుంపులు గుంపులుగా  వచ్చి చేరారా? లేక వున్నవాళ్ళే గుంపులు గుంపులుగా  దూరమైపోయారా?  రెండవదే జరిగింది అని చరిత్ర చెపుతోంది. ఈ మాత్రం దానికి గేట్లు ఎత్తేశామని గొప్పలు చెప్పుకోవడం దేనికీ?  రవి మీద వ్యక్తిగతంగా సాఫ్ట్ కార్నర్ వుంది. వారు ఇంత అమాయకులని తెలీదు. అమాయకులు ఇతరులకు సిధ్ధాంతాలను బోధించే దుస్సహసాలకు పాల్పడ కూడదు!

 

ముస్లిం, శిక్కు సమూహాలకు దృశ్యమానత (vigibility) ఎక్కువ. వంద మందిలో పది మంది వున్నాసరే వాళ్ళే ప్రముఖంగా కనిపిస్తారు. హిందూ-ముస్లిం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు తాము ఏం చేస్తే ఏ నిందవస్తుందోననే సెల్ఫ్ సెన్సారింగ్, సెల్ఫ్ రిస్ట్రైనింగ్ మోడ్ లో ముస్లిం సమాజం దాదాపు పుష్కర కాలంగా మసులుకుంటున్నది. “జబ్ జబ్ మోదీ డరేగా – తబ్ తబ్ హిందూ ముస్లిం కరేగా” అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో జెన్-జీ బొద్దింకలు ముందుకు తెచ్చిన నినాదం ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది.  

హిందూ - ముస్లీం బైనరీ మీద దేశ రాజకీయాలు నడుస్తున్నప్పుడు దాన్ని ఎప్పుడయినా పీపుల్స్ వార్ / మావోయిస్టు పార్టి లోతుగా విశ్లేషించాయా?  కేవి రమణా రెడ్డి, కే బాలగోపాల్ వంటి కొందరు ఆలోచనాపరులు  ఆ మేధోమధనం గావించారు. పార్టీ లైన్ ఏమిటీ? అది ముఖ్యమైన ప్రశ్న.

మార్క్స్ ఏంగిల్స్ కమ్యూనిస్టు మానిఫెస్టో రాసే కాలంలో భార్యాభర్తలతో తొలి శ్రమ విభజన మొదలయిందని అన్నారు. ఓ 35 యేళ్ళ తరువాత ఏంగిల్స్ ‘కుటుంబము – వ్యక్తిగత ఆస్తి – రాజ్యాల పుట్టుక’ పుస్తకంలో దాంపత్యాన్ని మరింత లోతుగా అధ్యయనం చేశాడు. భర్త పెట్టుబడీదారీ వర్గం, భార్య శామికవర్గం అని నిర్ధారించాడు. వాళ్ల మధ్య వర్గ శతృత్వం కూడ వుంటుంది అన్నాడు.

వర్తమాన ఇండియాలో హిందూ సమాజం పెట్టుబడీదారీవర్గం; ముస్లిం సమాజం శ్రామికవర్గం, శిక్కులు శ్రామిక వర్గం, క్రైస్తవులు శ్రామికవర్గం బౌధ్ధులు శ్రామికవర్గం అని ఈ మహా మార్క్సిస్టు సిధ్ధాంతవేత్తలు  ఎప్పుడయినా తేల్చి చెప్పగలిగారా?  అలాగే మైదానవాసులు పెట్టుబడీదారీవర్గం; అడవివాసులు శ్రామికవర్గం అనాలి. పెత్తందారీకులాలు పెట్టుబడీదారీవర్గం; ఎస్సి, బీసిలను శ్రామిక వర్గం అనాలి. వీళ్ళు అనలేరు. కానీ, వీరికి అపర మార్క్సిస్టులుగా కీర్తి మాత్రం కావాలి. ఒక విధంగా వీళ్ళే మార్క్సిజంలో పోరాట స్వభావాన్ని నీరుగార్చి అందమైన మాటల గారడీగా మారుస్తున్నారు.

హిందూ- ముస్లిం బైనరీని గుర్తింపచేయడానికే కమ్యూనిస్టు పార్టీల మీద నేను తరచూ విమర్శల్ని ఎక్కుపెడుతున్నానని తెలియని వారు ఇప్పుడు ఎవరూ వుండరు. ఆ విషయం మిగిలినవారికన్నా రవికి ఇంకా బాగా తెలుసు.  విప్లవ విద్యార్ధి సంఘం యాభై యేళ్ళ సదస్సు సందర్భంగా వేదిక మీద ఆదివాసులు, ముస్లింలకు దక్కిన ప్రాతినిధ్యం ఎంత అని అడిగినపుడు చాలా రచ్చ జరిగింది. దాని నిర్వాహకుల్లో రవి ఒకరు. వారు చాలా తెలివైనవారు. ఆ సంఘటనను మరచిపోలేదు. మొత్తం వ్యాసంలో ముస్లిం అనే పదం మనకు ఎక్కడా కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. మైనారిటీలు, అల్పసంఖ్యాక వర్గాలు, శిక్కులు, క్రైస్తవులు, బౌధ్ధులు  అనే పదాలూ కూడ వారి వ్యాసంలో మనకు కనిపించవు. ఇంకా తరచిచూస్తే ఎక్కడా ఆదివాసులు అనే పదం కూడ కనిపించదు. జాతులు అంటారేతప్ప వాళ్లెవరో చెప్పరు. వెరసి వీరొక కపట మార్క్సిస్టు! కపట మార్క్సిస్టులు విప్లవాభిమానులు, ఉద్యమ నాయకులు, ఉద్యమ అధికార ప్రతినిధులు అయిపోతే నాకో గట్టినమ్మకం కలుగుతోంది. వెయ్యేళ్లకు కూడ వీరు ఏమీ సాధించలేరు. ఐ యామ్ ష్యూర్ !  

15-10-2026


నా మీద ఎన్ రవి వ్యాసాన్ని అరుణతార ప్రచురించింది కనుక 

దానికి నా ఖండననూ అరుణతార  ప్రచురిస్తే అదొక మంచి సాంప్రదాయం అవుతుంది. 

గతంలో బిఎస్ రాములు వ్యాసాన్ని నేను చాలా తీవ్ర పదజాలంతో  ఖండించినపుడు కూడ అరుణతార ప్రచురించింది. 

రవి మీద నాకు సాప్ట్ కార్నర్ వుంది. ఎక్కడా తీవ్ర పదజాలాన్ని వాడలేదు.  చర్చనీయాంశానికి కట్టుబడే వ్యాసం రాశాను.

నా విమర్శ ఒక్కటే  -

1990 వరకు మాత్రమే సమాజాన్ని కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలు అర్ధం చేసుకోగలిగాయి. దాన్ని సమర్ధంగా ఉద్యమ విజయంగా మార్చుకున్నాయా లేదా అన్నది వేరే అంశం. 

1990 తరువాత మారిపోయిన ప్రపంచాన్ని పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టీ మాత్రమే కాదు దేశంలోని ఏ కమ్యూనిస్టు పార్టి నాయకుడు కూడ అర్ధం చేసుకోలేకపోయారు. దానికి గణపతి మినహాయింపుకాదు. 

గణపతి చాలా ప్రయత్నించారు అని నాలుగు ఉదాహరణలు ఇచ్చిన ఎన్ రవి అంతిమంగా అవేవీ ఫలించలేదని ఆ వ్యాసంలో నాలుగుసార్లు అన్నారు. 

ఆ విఫలయత్న  వివరణ ప్రపంచానికి కావాలి. 

1990 తరువాత భారత రాజకీయార్ధిక, సాంస్కృతిక రంగాల్లో బలంగా రూపుదిద్దుకున్న హిందూ-ముస్లిం బైనరీనీ పీపుల్స్ వార్/ మావోయిస్టు పార్టి కప్పిపుచ్చిందనే అభిప్రాయం నాకు బలంగా వుంది. 

ఒకవేళ నా వ్యాసాన్ని ప్రచురించరాదని అరుణతార సంపాదకవర్గం భావిస్తే ఆ విషయాన్ని వెంటనే నాకు తెలియపరచండి. 

నేను మరో పబ్లిషర్ కు పంపిస్తాను. 

అరుణతార కాకపోతే మరో మార్గంలో అయినా నా రచన పాఠకుల దగ్గరికి వెళ్ళాలి.

-డానీ