Wednesday, 5 September 2018

Another National Movement


Another National Movement
మరో జాతియోద్యమం
డానీ (ఫిదాయి)

“భారతదేశం ఒక  ఉపఖండం. భిన్నత్వంలో ఏకత్వం దీని లక్షణం”. ఈ మాటల్ని ఎవరన్నప్పటికీ వీటిల్లో మొదటిది వర్తమాన వాస్తవం. రెండవది భవిష్యత్ ఆకాంక్ష.

జాతి వేరు జాతీయవాదం వేరు. మతం వేరు మతవాదం వేరు. జాతీయవాదం మతవాదం రెండూ ఆధునిక భావనలు. భూస్వామ్య విధానం అంతరించి పెట్టుబడీదారీ విధానం అభివృధ్ధి చెందే క్రమంలో ఈ భావనలు రూపొందాయి. ఈ అర్ధంలో వీటిని పెట్టుబడీదారీ రాజకీయ భావనలు అనవచ్చు. మధ్య యుగాల మనుషులకు మతం, మత బోధనలు తప్ప మరో భావజాలం తెలీదు.  వాళ్ళు అప్పట్లో జరిపిన యుధ్ధాలను, పాప పుణ్య కార్యాలను ఆధునిక సిధ్ధాంతాల దృష్టితో పరిశీలించడం చరిత్ర శాస్త్రంలో నేరం.
మతం ఒక సమూహపు విశ్వాసాల సమాహారం. మతతత్వం రెండు మత సమూహాల మధ్య సంబంధం. మతం మనిషి పుట్టుకకు ముందు, చావు తరువాత ఉంటుందనుకునే వ్యవహారాల మీద విశ్వాసం. మతతత్వం ఇహలోక ప్రయోజనాల కోసం జరిపే సంఘటన. మతం భౌతిక జీవనానికి దూరంగా వుంటుంది. మతతత్వం భౌతిక సమాజంలోని వర్గవైరుధ్యాల పైన, వర్గ పాలన పైన ఆధారపడి వుంటుంది. ప్రతి మతం జాలి దయ నీతి న్యాయం త్యాగం ప్రేమ సౌభ్రాతృత్వం వంటి సాధారణ విలువలను బోధిస్తుంది. మతత్వం పరమతస్తుల మీద ద్వేషాన్ని రగిలిస్తుంది.  మతం అంతర్గత వ్యవహారం. మతతత్వం బాహ్యాత్మక వ్యవహారం. మతం నైతికం. మతతత్వం రాజకీయార్ధికం.
ఆధునిక పరిశ్రమలు, వాటికి కావల్సిన ముడిపదార్ధాలు, వాటిల్లో ఉత్పత్తి అయ్యే సరుకుల అమ్మకానికి అవసరమైన మార్కెట్  - ఇవి మూడూ ఆధునిక జాతులకు జీవన్మరణ సమస్యలు. నిజానికి పెట్టుబడీదారీవర్గం మార్కెట్ లోనే జాతీయత గురించి ఓనమాలు నేర్చుకుంటుంది.  ఆ తరువాత జాతీయ చైతన్యం పెరగడం, జాతియోద్యమాలు పెల్లుబకడం, జాతి అణచివేత అంతటికీ  వ్యతిరేకంగా పోరాటం కొనసాగడం, అంతిమంగా జాతీయ రాజ్యాలు ఏర్పడడం అంతా ఒక చారిత్రక క్రమం.  ఈ క్రమం మొత్తం జాతుల అభివృధ్ధి చరిత్రలో మొదటి దశ మాత్రమే. ఈ దశలో జాతులు వేటికవి విడిగా, స్వయం సమృధ్ధంగా బతక గలవు. ప్రతి జాతి తన జీవితాన్ని భవిష్యత్తును తన ఇష్టమైన పధ్ధతిలో తీర్చి దిద్దుకో గలదు. అలాంటి సంపూర్ణ అభివృధ్దిని  సాధించిన తరువాత జాతుల ఎదుగుదలలో రెండవ దశ ఆరంభం అవుతుంది.
రెండవ దశలో జాతుల మధ్య అడ్డుగోడలు కూలిపోతాయి. వివిధ జాతుల మధ్య ఇచ్చి పుచ్చుకునే సంబంధాలు అవసరమై అన్ని రంగాలల్లోనూ అంతర్జాతీయ సమైక్యత ఏర్పడుతుంది. వివిధ దేశాల భౌతిక ఉత్పాదితాలు ప్రపంచ ప్రజల సమిష్టి ఆస్తిగా మ్సారిపోతాయి. వివిధ దేశాల సాహిత్యం క్రమంగా విశ్వసాహిత్యంగా అభివృధ్ధి చెందుతుంది.

ఈ రెండు దశలు కుడా జాతుల సమస్యకు సంబంధించిన రెండు సాధారణ చారిత్రక ధోరణులు మాత్రమే. ఈ విషయమై అనేక దేశాల్లో అనేక ప్రత్యేకతలు వుంటాయి. మొదటి దశలో వున్న జాతులు స్వయం నిర్ణయాధికారం, విడిపోయే హక్కును కోరుకుంటాయి. రెండవ దశలో వున్న జాతులు జాతుల సమైక్యత సమగ్రతల గురించి నొక్కి చెపుతుంటాయి. సాధారణంగా ఏ జాతికి అయినా ఈ రెండు దశలు తప్పవు. విడిపోవడం అనేది స్వయం సమృధ్ధిని సాధించిన తరువాత  కలవడం కోసమేనని గుర్తించదం అవసరం. నిజానికి ఒక జాతి కోర్కెలను బట్టి ఆ జాతి ఏ దశలో వుందో సులభంగా గుర్తు పట్టవచ్చు.
భారత దేశంలో జాతీయ చైతన్యానికి నూరేళ్లకు పైబడిన చరిత్ర ఉన్నప్పటికీ, 1905లో బెంగాల్ విభజన సందర్భంగా ఈ అంశం ప్రస్పుటంగా నుందుకు వచ్చింది. అయినా,  ప్రత్యక్ష వలస పాలన అంతమయ్యే నాటికి భారత జాతుల్లో బహు కొన్ని మాత్రమే  జాతీయ రాజ్యాలు ఏర్పాటు చేసుకోగల స్థాయికి చేరుకోగలిగాయి.  మిగిలిన అసంఖ్యాక జాతులు అప్పటికి అంతగా అభివృధ్ధి కాలేదు. ఫలితంగా వలస పాలన అనంతరం ఉపఖండంలో  బహుజాతుల సమాఖ్య (ఫెడరేషన్) ఏర్పడింది. దేశ విభజన పేరున భారత ఉపఖండంలో ఏర్పడిన రెండు దేశాలు కూడా నిజానికి జాతుల సమాఖ్యలే. అంటే, తమకు ఒక మార్కెట్ ఉండాలనే అవసరానికి అనుగుణంగా కొన్ని జాతులు ఏకమయ్యాయని అర్ధం.

భూభాగం, భాష, ఆర్ధిక జీవితం, సంస్కృతి, భావోద్వేగాలు, చారిత్రక క్రమం, స్థిరమైన ప్రజా సమూహం  వంటి ఏడు లక్షణాలు కలిసి ఆధునిక జాతుల్ని రూపొందిస్తాయి. ఇవి సాధారణ లక్షణాలు. కనుక ఇవన్నీ అన్ని జాతుల్లోనూ ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్ని జాతులలో కొన్ని లక్షణాలు నేరుగా కనిపించకపోవచ్చు. కొన్ని లక్షణాలు అసాధారణ రూపంలో ఉండవచ్చు. భారత ఉపఖండంలో దళితులు అన్ని రాజ్యాలలోనూ దాదాపు సమాన స్థాయిలో ఉండడం ఇందుకు ఒక ఉదాహరణ.

జాతుల చారిత్రక అభివృధ్ధి దశల్లో ఒక్కోసారి ఒక్కొక్క లక్షణం కొట్టొచ్చినట్టు ముందుకువచ్చి ఇరత అంశాల ప్రాముఖ్యాన్ని తాత్కాలికంగా తగ్గించవచ్చు.  ఆయా  దశల్లో నిర్ణయాత్మక పాత్రను వహిస్తున్న అంశాన్ని బట్టే వివిధ జాతుల మధ్య ఐక్యత, ఘర్షణలు నిర్ణయం అవుతుంటాయి.   పొరుగు దేశాలతో యుధ్ధ సమయంలో ఉపఖందంలోని వివిధ జాతుల్ని ఐక్యం చేయడంలో భూభాగం అనే లక్షణం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అట్లే, సంస్కృతిలో మతం నిర్ణయాత్మక పాత్రను పోషించే స్థాయికి చేరుకున్నప్పుడు బహుజాతులున్న దేశాల్లో మతకల్లోలాలు చెలరేగే ప్రమాదం ఉంటుంది.

బహుజాతులకు నిలయమైన దేశాల్లో రాజకీయాధికారం ఏ జాతి చేతుల్లో వుందనేది పట్టించుకోవాల్సిన ప్రధాన సమస్య. రాజకీయాధికారాన్ని సాధించిన జాతే ఆ దేశపు సమగ్రతను, విభజనను నిర్ణయిస్తుంది.

రాకీయంగా అధిపత్యాన్ని సాద్ఝించిన జాతి ఇతర జాతుల పెట్టుబడి, మార్కెట్ల విస్తరణపై అనేక పరిమితుల్ని విధిస్తుంది. దేశంలో లభ్యమయ్యే వనరులు అన్నింటినీ తానే హస్తగతం చేసుకుంటుంది. సూటిగా సరళంగా వుండే సమస్యల్ని పనిగట్టుకొని గందరగోళ పరచి వివాదాస్పదంగా మారుస్తుంది.  ఆర్ధికపోరాటాన్ని రాజకీయపోరాటంగా మారుస్తుంది. రాజకీయ పోరాటాన్ని సాంస్కృతిక పోరాటంగా మార్చేస్తుంది.  భాషను, మతాన్ని దేనినయినా సరే తన ఆధిపత్యాన్ని కాపాడే  రక్షణ కవచంగా మార్చుకుంటుంది. ఇతర జాతులపై రకరకాల నిర్బంధాలని ప్రయోగిస్తుంది. దానితో జాతుల సమాఖ్యగా వున్న దేశం జాతుల బందీఖానాగా మారిపోతుంది.

సాధారణ లక్షణాలను తెలుసుకున్నంత మాత్రాన జాతుల సమస్య అర్ధమైనట్టుకాదు. ప్రత్యేకతల్ని గుర్తించకుండా ఏ సమస్యనైనా పరిష్కరించడం  సాధ్యం కాదు. ఉపఖండంలో వనరులు, మార్కెట్ పై ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న జాతిని పరికల్పనగా అయినా గుర్తించడం తొలి కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా జాతులు విముక్తి దిశగా ఒక్క అడుగు అయినా  ముందుకు సాగడం అసాధ్యం.

గుజరాత్-రాజస్థాన్ భూభాగాల్లో , హిందీ భాషతో, భారీ పెట్టుబడీదారీ ఆర్ధిక విధానంతో, వైదీక మత సంస్కృతితో చారిత్రకంగా ఏర్పడిన ప్రజా సమూహంలోని ఉన్నత వర్గాన్నే స్థూలంగా భారత ఉపఖండంలో వనరులు, మార్కెట్ పై  ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న జాతి అనవచ్చు. వీరితో ఆర్థికంగా, సాంస్కృతికంగా, మానసికంగా ఏకీభావం వున్న ప్రాంతీయ ప్రతినిధులు ఉపఖండం అంతటా వ్యాపించి వున్నారు. ప్రాంతీయ ప్రతినిధులతో సహా ఈ సమూహాన్ని వాడుక భాషలో బ్రాహ్ణ-బనియాలు అనవచ్చు. దాని అర్ధం, దేశంలోని బ్రాహ్మణ బనియాలు అందరూ ఈ జాబితాలోనికి వస్తారనికాదు. భారత ఉపఖండంలో ఈ జాతి జనాభా అత్యల్పం ఐదు శాతంకన్నా తక్కువ. అయితే, ఇది పాలక జాతి కావడంవల్ల   ఈ జాతి భావజాలమే ఉపఖండంలో అధికార భావజాలంగా చెలామణి అవుతున్నది.  భారత ఉపఖండంలో ప్రధాన స్రవంతి అంటే ఆచరణలో  బ్రాహ్మణ బనియా సంస్కృతికి బానిసలుగా మారిపోవడంతప్ప మరొకటి కాదు.  జమన్ లాల్ బజాజ్ 1915లో జాతీయోద్యమంలో  ప్రవేశించినపుడే ముందుముందు ఏర్పడబోయే స్వతంత్ర భారతదేశంలో బనియాజాతి ఆధిపత్యానికి అవసరమైన పునాది పడింది. గాంధీ-నెహ్రు ఒక కుటుంబంగా ఎర్పడినప్పుడు బనియా-బ్రాహ్మణ ఆధిపత్యానికి బాటలు బలపడ్డాయి అనడం అతిశయోక్తి కాకపోవచ్చు.
బ్రాహ్మణ-బనియాలకు దేశం అంటే అబేధ్యమయిన ఏకశిలా నిర్మాణం. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే  స్వంత జాగీరు వంటి సురక్షితమైన మార్కెట్. దేశభక్తి అంటే  బ్రాహ్మణ-బనియాల ఆధిపత్యం మీద తిరుగులేని విధేయత, ఆమోదం మాత్రమే.

ఉపఖండంలో ప్రతి జాతీ తన ఇష్టమొచ్చినట్టు  కోర్కెలు కోరడం, ఆంక్షలు పెట్తడం మొదలెడితే గుత్త పెట్టుబడీదారీ వ్యాపారం నడవదు. బహు జాతులున్న ఉపఖండంలో ఒకే శాసన కేంద్రాన్ని ఏర్పరచడం అంత సులభమైన పనికాదు.

ప్రాంతీయ జాతుల్ని కలుపుకుని రావడానికి 370వ  అధీకరణ వంటి హామీలు, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ల వంటి రాయితీలు, పర్సనల్ వంటీ సాంస్కృతిక జీవన భద్రతల్ని కల్పించాల్సి వుంటుంది. ఇలాంటి భద్రతలు లేకుండా కలిసి వుండడానికి వివిధ జాతులు అంగీకరించవు. ఈ హామీలు, రాయితీలను అమలుపరచడానికి  గుత్త పెట్టుబడీదారీ ప్రయోజనాలు అంగీకరించవు. ఈ హామీలన్నీ ‘కలపడం’ వరకు మాత్రమే. కలిసాక ఇతర జాతులన్నీ స్వచ్చందంగానో బలవంతంగానో బ్రాహ్మణ-బనియాల్లో ‘విలీనం’ కావాలి. బ్రాహ్మణ-బనియాలను  డేశాన్నీ ఏకార్ధకాలుగా నమ్మాలి. తమకూ బ్రాహ్మణ-బనియాలకు మధ్య అద్వైతాన్ని సాధించుకోవాలి.
బ్రాహ్మణ-బనియాలు బలప్రయోగంతో తమను పోలిన ఉపఖండాన్ని సృష్టించాలనుకుంటారు. బ్రాహ్మణ-బనియాల ఇఛ్ఛే మిగిలిన జాతులన్నీ అనుసరించాల్సిన ఉమ్మడి పౌర అవుతుంది. గుత్తపెట్టుబడీదారీ ఆధిపత్యవాదం ఆధ్యాత్మిక రంగంలో వైదీకమత అధిపత్యవాద రూపం దాలుస్తుంది. వైదీక మతంలోని మోక్షం స్థానాన్ని ‘బనియా జాతిని అప్రతిహతమైన శక్తిగా నిర్మించే కర్తవ్యం’ ఆక్రమిస్తుంది. సాక్షాత్తు పారలౌకిక ధర్మమే లౌకిక ప్రయోజనాలను సాధించడానికి ముందుకు వచ్చినపుడు లౌకిక వాదనలన్నీ సహజంగానే ‘నకిలీ’ ‘కుహన’ . అయిపోతాయి. 

గుత్త పెట్టుబడీదారీ జాతీయతత్వం  పైకి దేశాంతర అధికారాన్ని దెబ్బతీస్తున్నట్టు కనిపించినా, అంతర్గతమైన స్థానిక అధికారాన్ని క్రూరంగా అణిచివేయడమే దానికి ప్రధానం.  పెట్టుబడి వికేంద్రీకరణను గుత్త పెట్టుబడిదారీతత్వం ఎన్నడు సహించదు. చట్టాల ద్వార ప్రభుత్వ ఆధీనంలోని ఆర్ధిక సంస్థల ద్వార అది ఇతర జాతుల పెట్టుబడి పెరగకుండా చూస్తుంది. అది చాలదు. ఇతర జాతుల పెట్టుబడిని కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తుంది.

ప్రభుత్వరంగ ఆర్ధిక సంస్థలు, జాతీయ బ్యాంకుల లావాదేవిలను ఏమాత్రం పరిశీలించినా మనకు ఈ విషయం స్పష్టంగా బోధపడుతుంది.  జాతీయ బ్యాంకుల్లో ఒకటయిన ఆంధ్రా బ్యాంకు విజయవాడ రీజియన్ డిపాజిట్లు 11 కోట్ల రూపాయలు. అడ్వాన్సులు 57 కోట్ల రూపాయలు. వీటిల్లో 13.67 శాతం అంటే 7.785 కోట్ల రూపాయలను సమగ్ర గ్రామీణాభివృధ్ధి పథకం, షెడ్యూల్డ్ కులాల యాక్షన్ ప్లాన్, మహిళలు, బలహీనవర్గాలు, మత అల్పసంఖ్యాకవర్గాలకు ఆర్ధిక సహాయం కింద  అందించినట్లు ఆ బ్యాంకు ఇటీవల ప్రకటించింది. వీటిల్లో మత అల్పసంఖ్యాకవర్గాలకు  ఈ బ్యాంకు రుణంగా ఇచ్చింది లక్షన్నర రూపాయలు అంటే 0.016 శాతం. మొత్తం అడ్వాన్సుల్లో  47.215 కోట్ల రూపాయల  భారీ మొత్తాన్ని86.33 శాతాన్ని ఎవరికి రుణంగా ఇచ్చిందో ఆ బ్యాంకు వెల్లడించలేదు.  ఆ బ్యాంకు ప్రకటించిన వివరాలను చూస్తే  ప్రభుత్వరంగ అర్థిక సంస్థలు అచ్చంగా బలహీనవర్గాల కోసమే పాటుపడుతున్నాయని ఎవరైనా భ్రమించే ప్రమాదముంది. అలాంటి భ్రమల్ని ప్రచారం చేయడమే బ్యాంకుల లక్ష్యం. వీటి అసలు లక్ష్యం ఏమిటంటే పెట్టుబడిని కేంద్రీకరించడం. ఈ లక్ష్య సాధనలో బ్యాంకులు ఇతర ఆర్ధిక సంస్థలు దివాళా తీయవచ్చు.  అప్పుడు ఆ నేరాన్ని బలహీనవర్గాలు, జాతులపై నెట్టి బ్రాహ్మణ-బనియాలు తప్పించుకోవడానికి ఇలాంటి భ్రమల ప్రచారం తోడ్పడుతుంది. ఈ 0.016 శాతం రుణాలనే బిజెపి పెద్దలు ముస్లిం సంతుష్టీకరణ అని ప్రచారం చేస్తుంటారు.
          పరిశ్రమలకు అవసరమైన వనరులు, మార్కెట్ పునాదుల మీదనే భారత జాతుల సమాఖ్య ఏర్పడిందనేది స్పష్టమే. వనరుల్లో కొరత, మార్కెట్ లో పోటీ పెరిగే కొద్దీ దేశంలో వివిధ జాతుల మధ్య  వైరం కూడా పెరుగుతూ వుంటుంది. ఫలితంగా, సరిపడ వనరులు వుండి, తమ ఉత్పాదితాలను అమ్ముకోగల మార్కెట్ ను సమకూర్చుకోగలిగిన జాతులు స్వయం నిర్ణయాధికారాన్ని  కోరడం ఆరంభిస్తాయి. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సిమ్రన్ జిత్ సింగ్ మాన్ వాదన ఈ కోవకు చెందిందే.


          పెట్టుబడిని కేంద్రీకరించే ఆతృత కొద్దీ గుత్త పెట్టుబడీదారీవర్గం సహజ వనరుల్ని విచక్షణా రహితంగా విధ్వంసం చేస్తుంది. వాటిని సక్రమంగా వినియోగించుకోవడానికి బదులు కొల్లగొడుతుంది. మరోవైపు పెట్టుబడి కేంద్రీకృతమయ్యేకొద్దీ ప్రజల్లో కొనుగోలుశక్తి పడిపోతుంది. వమ్నరులు తరిగిపోవడం, మార్కెట్లో  కొనుగోలు శక్తి క్షిణించిపోవడంతో  మూతపడే పరిశ్రమల సంఖ్య కూడా పెరిగిపోతుంది. భారతదేశంలో భ్స్రీ మధ్య తరహా పరిశ్రమలు 1976లో 289 మూతపడ్డాయి. 1987లో  మూతపడ్డ యూనిట్ల సంఖ్య 1712కు చేరింది.  చిన్నతరహ్ పరిశ్రమలు1976లో 8 వేల యూనిట్లు మూతపడ్డాయి. 1987లో ఒక లక్షా 58 వేల 226 యూనిట్లు మూతపడ్డాయని అంచన. 
  
          వనరుల కొరత, మార్కెట్ లో కొనుగోలుశక్తి క్షీణించడం ఒకేరకమైన సమస్యలు కావు. మార్కెట్ లో కొనుగోలుశక్తి క్షీణించినపుడు పరిశ్రమాధిపతులు సాధారణంగా లాకౌట్లను ప్రకటిస్తూ వుంటారు, బొంబాయి జౌళి పరిశ్రమాధిపతులు పదేళ్ల క్రితం అనుసరించిన విధానం ఇందుకు ఒక ఉదాహరణ. వనరుల్లో కొరత ఏర్పడినపుడు గుత్త పెట్టుబడీదారుల మధ్య పోటీ తీవ్రమౌతుంది. గుత్త పెట్టుబడీదాడులకు వుండే సాధారణ లక్షణం ఏమంటే తమ మాట వినని పారిశ్రామికవేత్తల మీద రకరకాల ఒత్తిళ్ళు తెచ్చి లోబరచుకుంటారు. లేకుంటే వాళ్ళను అంతం చేసేస్తారు. మార్కెట్ పోటీ  హత్యల వరకు దారి తీస్తుంది. ఈ క్రమంలో పెట్టుబడి కేంద్రీకృతమౌతూ వుంటుంది. ఇటీవల మార్కెట్ లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న రిలయన్స్‍ సంస్థ  తన సంపదలో పదిహేనవ వంతు కూడా లేని  బొంబే డయ్యింగ్ అధినేత నస్లీ వాడియా మీద జరిపిన హత్యాయత్నం ఇందుకు తాజా ఉదాహరణ.   

          గుత్త పెట్టుబడీదారుల మధ్య పోటీ తీవ్ర స్థాయికి చేరినంత మాత్రాన అది తప్పని సరిగా ఫాసిస్టు రూపం దాలుస్తుందని తీర్మానించడం సరికాదు. అయితే, పోటీలోని తీవ్రత ఒకానొక దశలో ఫాసిస్టు రూపాన్ని దాల్చే అవకాశం మాత్రం ఒకటుంటుంది. మైనారిటీ సమూహం నామమాత్రంగా వున్న దేశాల్లోకన్నా మైనారిటీ సమూహం మెజారిటీ సమూహానికి తగిన పోటీ ఇవ్వగల స్థాయిలో వున్నదేశాల్లో  ఫాసిజం రావడానికి అవకాశాలు ఎక్కువ. భారత దేశంలో ముస్లీంలు మైనారిటేలేగానీ దేశ జనాభాలో 16, 17 శాతంగా వున్న సమూహాన్ని అంత తేలిగ్గా తీసిపడేయడం కుదరదు.

          మార్కెట్ పోటీలో భాగంగా గుత్త పెట్టుబడీదారులు తమ  ప్రత్యర్ధుల్ని అణిచివేస్తూ, చంపుకుంటూ ముందుకు సాగుతారని ఇంతకు ముందే చూశాం. గుత్త పెట్టుబడీదారులు  తమ మార్కెట్ ను సుస్థిర పరచుకోవడానికీ, విస్తరింపచేయడానికీ జాతి మత భావోద్వేగాలను సాంస్కృతిక కవచాలుగా   మలుచుకోవడమే ఫాసిజం.  సూటిగా చెప్పాలంటే గుత్త పెట్టుబడీదారీ ప్రయోజనాల సాధన కోసం మతాన్ని వాడడం ఫాసిజం. పెట్టుబడీదారి నియంతృత్వం ఫాసిస్టు దశలో పెట్టుబడీదారి మతతత్వ నియంతృత్వంగా మారుతుంది.

          ఫాసిజాన్ని తామే స్వయంగా, నేరుగా అమలుపరచడానికి సాధారణంగా గుత్త పెట్టుబడిదారులు ఇష్టపడరు. ప్రత్యర్ధుల్ని చంపడానికి కిరాయి హంతకుల్ని వాడుకున్నట్టే, ఫాసిజాన్ని ప్రవేశపెట్టడానికి రాజకీయ పార్టీలను వాడుకుంటారు. అది అధికారపార్టీ కావచ్చు;  ప్రతిపక్ష పార్టీ కావచ్చు. రాజ్యం ద్వార, రాజ్యం సహకారంతో సమాజంలో ఫాసిజాన్ని ప్రవేశపెట్టడానికి గుత్త పెట్టుబడిదారులు ప్రయత్నిస్తారు. ఎప్పుడయినా ప్రజల్లో ఫాసిజం మీద వ్యతిరేకత వచ్చినపుడు ఆ ముప్పు రాజకీయ పార్టిల మీదకు పోవాలేతప్ప  తమ వరకు రాకూడదని ముందుగా జాగ్రత్త పడతాయి. ఫాసిజం తాత్కాలికం, వాణిజ్యం శాస్వితం అని వాళ్ళకూ తెలుసు.

          నస్లీ వాడియా అల్పసంఖ్యాక వర్గానికి చెందిన పారశీయుడని గుర్తు చేసుకుంటే భారత సామాజిక రంగంలో ప్రవేశిస్తున్న ఫాసిజాన్ని పసికట్తవచ్చు. దేశంలో ప్రస్తుతం అమ్మకాల్లో సాలీన 10 వేల కోట్ల రూపాయలతో అగ్ర స్థానంలోనూ, ఆస్తుల్లో 96 వేల కోట్ల రూపాయతో రెండవ స్థానంలోనూ ఉన్న టాటా సంస్థకు సహితం అల్పసంఖ్యాక వర్గ సమస్య తప్పడంలేదు.  భారత పారిశ్రామిక రంగంలో టాటా సంస్థ ప్రాబల్యం క్రమంగా అంతరించిపోతున్నది.
          పారిశ్రామిక రంగంలో గుత్తాధిపత్యం అనేది కేవలం ఆస్తుల్లో అమ్మకాల్లో ర్యాంకింగ్ వ్యవహారం కాదు. అమ్మకాలపై  లాభాల శాతమే నిజానికి ఆర్ధిక రంగంలో ఆధిపత్యాన్ని నిర్ణయిస్తూవుంటుంది. ఐతే, మొదటి ఇరవై ర్యాంకుల్లో కొత్తగా ఎవరు చేరుతున్నారూ? పాత వాళ్ళ లో ఎవరు ర్యాంకుల్ని కోల్పోతున్నారూ?  కొత్తగా పైకి ఎగబాకడానికీ, కిందికి పడిపోవడానికీ   జాతిపరమైన సంబంధం ఏదైనా వుందా అనేది జాతుల సమస్యలో కీలకమైన ప్రశ్నలు.
          జాతుల స్వాతంత్ర్య పోరాటాలు తలెత్తడానికి కారణాలను పరిశీలించడానికి ముందు, భారత పాలకవర్గాలకూ ప్రభుత్వాలకూ మధ్యన వున్న సంబంధాన్ని పరిశీలించదం అవసరం. గుత్త పెట్టుబడీదాడులు, భూస్వాములు, ప్రభుత్వ కార్యనిర్వాహకవర్గం,  వృత్తి నిపుణుల్ని కలిపి స్థూలంగా  భారత పాలకవర్గంగా పేర్కొనవచ్చు. వీరికి అశేష ప్రజానీకానికి మధ్య వైరుధ్యం వుంటుందని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సమాజంలో పాలకవర్గానికీ, అశేష ప్రజానీకానికీ మధ్య సాధ్యమయినంత శాంతియుతమైన వాతావరణాన్ని నెలకొల్పడమే ప్రభుత్వాల బాధ్యత. మరోమాటల్లో చెప్పాలంటే, ప్రజల్లో శాంతిని, పాలకవర్గాల భద్రతను పరిరక్షించడమే ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం.

          ప్రభుత్వం పాలకవర్గానికి అనేక సౌకర్యాలు కల్పించాల్సి వుంటుంది. అదవులు, గనులు, ప్రభుత్వ భూములు తదితర సహజ సమిష్టి వనరుల్ని క్రమంగా పాలకవర్గపు వ్యక్తిగత ఆస్తిగా మార్చాల్సి వుంటుంది. గుత్త పెట్టుబడీదాడులకు ఎగుమతులు, దిగుమతులకు రాయితీలు ఇవ్వాల్సి వుంటుంది. వారి పరిశ్రమలకు నిరాఘాటంగా విద్యుత్ సరఫరా చేయాలి. ఉత్పాదితాలకు మార్కెట్ హామీ ఇవ్వాలి. ప్రోత్సాహకాలు, సబ్సిడీలు అందించాలి. భూస్వాముల కోసం భారీ నీటి పారుదలా ప్రాజెక్టుల్ని నిర్మించాలి. వ్యవసాయానికి నామమాత్రపు ధరకు విద్యుత్ సరఫరా చేయాలి. ఎరువులు, ట్రాక్టర్లు, విత్తనాలు, పురుగు మందులపై సబ్సిడీలు ఇతర  ప్రోత్సాహకాలు ఇవ్వాలి. వీరితోపాటూ కార్యనిర్వాహకవర్గం, వృత్తి  నిపుణుల వేతనాలు, ఆదాయం పెంచాలి. విద్యా, వైద్య సౌకర్యాలను పెంచాలి.  విరివిగా సంక్షేమ ఒథకాలు చేపట్టాలి. వీటన్నింటినీ అమలు జరపడానికి ప్రభుత్వానికి భారీ ఆర్ధిక స్తోమత వుండాలి. అలాంటి స్తోమతను సమకూర్చుకోవడం ఒక సమస్య అయితే, పరస్పర విరుధ్ధమైన పాలకవర్గ ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాల మధ్య  ఒక సామరస్యతను కాపాడడం మరో సమస్య.
          సంక్షేమ పథకాలను అమలు జరపాలంటే పాలకవర్గంపై కొత్త పన్నులు విధించాలి. ఆదాయపు పన్ను, ఆస్తిపన్నులు పెంచాలి. దానికి పాలకవర్గం ససేమిరా అంగీకరించదు. పాలకవర్గాన్ని  ప్రోత్సహించాలంటే సంక్షేమ పథకాలకు తిలోదకాలు ఇవ్వాలి. దాన్ని ప్రజలు అంగీకరించరు. ఆందోళనకు పూనుకుంటారు. పరిస్థితి ఆందోళన స్థాయికి చేరుకున్నప్పుడు ప్రభుత్వానికి రెండే రెండు మార్గాలు ఉంటాయి. సంక్షేమ పథకాలని విరివిగా అమలు జరపడం. లేదా క్రూరమైన చట్టాలు, హింసతో ప్రల ఆందోళనల్ని అణిచివేయడం. ఈ రెండు మార్గాలు గుత్త పెట్టుబడిదారీ నియంతృత్వానికి రెండు పార్శ్వాలే. ఈ రెండు మార్గాల్లో  ప్రభుత్వానికి మొదటి దానికన్నా రెండోది కీలకమైనది. భారతీయ జనతా పార్టి    నాయకుడు వెంకయ్య నాయుడు మాటల్లో చెప్పాలంటే “(కాంగ్రెస్) ప్రభుత్వం సంక్షేమ పథకాల  అమలులో కొంత జాప్యం చేసిందంటే అర్థం చేసుకోవచ్చు.  కానీ, లా అండ్ ఆర్డర్ సమస్య అలా కాదే. ఒక్క క్షణమైనా జాప్యం జరగడానికి వీలులేదు”.

          ప్రజాందోళనల్ని పాశవిక చట్టాలతో, హింసతో అణిచివేయదలచినపుడు ఒక దశలో  సంస్కృతిని, మతాన్ని కూడా రాజ్యం తన హింసకు అనుగుణంగా మలుచుకుని ఫాసిస్టు రూపం దాల్చవచ్చు. అప్పుడు ప్రజల్లోని వివిధ వర్గాల్లో అభద్రతా భావన, అస్తిత్వ సంక్షోభం ఏర్పడి జాతి ప్రాతిపదికపై విముక్తి పోరాటం రూపం దాల్చవచ్చు.

          భారత దేశంలో భారీ పరిశ్రమలన్నీ దాదాపుగా ప్రభుత్వ రంగంలొ వున్నాయి. మధ్య తరహా పరిశ్రమలు గుత్త పెట్టుబడీదారుల చేతుల్లో వున్నాయి. చిన్న తరహా పరిశ్రమల్లోనూ బనియాల ప్రాబల్యమే వున్నప్పటికీ    అల్పసంఖ్యాకవర్గాలకు వీటిల్లో కొంత స్థానం దొరికింది. మొదట్లో గుత్త పెట్టుబడిదారులు చిన్న తరహా పరిశ్రమల మీద పెద్దగా ఆసక్తి చూపకపోవడమే అందుకు కారణం. ఈ పరిశ్రమలు సాధారణంగా  విడిభాగాలు, అనుబంధ సామాగ్రి, వినియోగ సరుకులు, వస్తువులు ఉత్పత్తి చేస్తుంటాయి.

          ప్రైవేట్ రంగంలోని మధ్య తరహా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన భారీ పరిశ్రమలు ‘సమర్ధంగా’ పనిచేయలేకపోవడం సహజం. దేశీయ మార్కెట్ లో కొనుగోలు శక్తి పడిపోవడంతోపాటూ, విదేశీ ఎగుమతులకు అవకాశాలు తగ్గిపోవడంతో మధ్య తరహా  పరిశ్రమల లాభాల శాతం గణనీయంగా పడిపోయింది. భారత దేశంలో మార్కెట్ అంటే కేవలం అధికాదాయవర్గం మాత్రమే అనే పరిస్థితి ఏర్పడింది. దేశ జనాభాలో  15 శాతం కూడా లేని అధికాదాయ వర్గాన్ని లక్ష్యంగా పెట్టుకుని భారత పారిశ్రామిక విధానం కొత్త రూపు దిద్దుకుంది. ఈ నేపథ్యంలో వినియోగ వస్తువుల ప్రశ్రమ గిరాకీ పెరిగింది. ఈ రంగంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించే వీలు కలగడంతో గుత్త పెట్టుబడిదారులు , బహుళ జాతి సంస్థలు వినియోగ వస్తువుల మార్కెట్ లో ఆథిపత్యం  కోసం ఆతృతపడసాగారు.  సహజంగానే వీరికి ఈ రంగంలో చాలా కాలంగా వుంటున్న వారికి మధ్య ఘర్షణ మొదలైంది. పాతవాళ్ళలో కొందరు తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికీ, కొత్తవాళ్ళు ఈ రంగంలో  త్మ ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవడానికీ  జాతి మత  ప్రాతిపదిక మీద ఏకం కాసాగారు. పోటీదార్లను అణచి వేయడానికి జాతి మత ప్రాతిపదికన ఏకం కావదం పాసిస్టు లక్షణం.

          సమస్య వినియోగ వస్తువుల పరిశ్రమలో మొదలైనప్పటికీ, అది సాంస్కృతిక రూపందాల్చి ఇతర రంగాలు అన్నింటికీ పాకింది. దేశీయ వనరులు మార్కెట్ పై  బ్రాహ్మణ-బనియాల ఆధిపత్యాన్ని ఇరత జాతులు సవాలు చేసే పరిస్థితి 1970 ల తరువాత తీవ్రమైంది. అత్యవసర పరిస్థితి, ఆపరేషన్ బ్లూ స్టార్, ఇందిరా గాంధీ హత్య మొదలైనవన్నీ ఈ క్రమంలో జరిగిన ప్రధాన ఘట్టాలే. రాజీవ్ గాంధీ అధికారం లోనికి వచ్చాక సహితం ఈ ఘర్షణ తగ్గలేదు.  పాలకవర్గాల్లో అత్యాశ, ప్రజల్లో అసంతృప్తి, సమాజంలో అశాంతి ఎక్కువయ్యాయి.  ఈ సమస్యను ప్రభుత్వం సాధారణ పధ్ధతుల్లో పరిష్కరించలేకపోయింది. సమస్య పరిష్కారానికి అసాధారణ విధానాన్ని ఎంచుకున్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టి పునరుధ్ధరణ వాదానికి, మతోన్మాదానికి బాహాటంగా తలుపులు తెరచి వేసింది. 1986 ఫిబ్రవరి 1 సాయంత్రం బాబ్రీ మసీదు తాళాలు తీసి హిందువుల ప్రవేశాన్ని అనున్మతించింది. అదే నెల 25న ముస్లిం ఛాందసుల కోరిక మేరకు ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టింది.  ప్రజలు ఆందోళనలకు పూనుకోకుండా అడ్డుకోవడంతోపాటు  పాలకవర్గ ప్రయోజనాలను కాపాడడం ప్రభుత్వ కర్తవ్యం. ఆ రాజధర్మానికి అనుగుణంగానే రాజీవ్ ప్రభుత్వం ఈ రెండు చర్యలకు పాల్పడింది. మతతత్వం పాలకవర్గాల సంస్కృతిక రిజర్వు సైన్యం. ఐతే, అప్పటికే సమయం మించిపోయింది.  అత్యాశతో రగిలిపోతున్న పాలకవర్గాలను రాజీవ్ ప్రభుత్వం చూపిన పరిష్కారం సంతృప్తి పరచలేకపోయింది.

          షాబానో కేసులో ముస్లిం నాయకుల వాదన చాలా బలహీనంగా వుండొచ్చు. ముస్లింలు మొత్తంగా ఛాందసులనే అపవాదుకు గురై వుండవచ్చు. ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) బిల్లు వల్ల ముస్లింలకు కలిగిన ప్రయోజనం కూడా ఏమీ లేకపోయి వుండవచ్చు. రాజకీయార్ధిక శాస్త్రంలో ఇవి అంత ప్రధానమైన అంశాలుకావు. ముస్లింల ప్రతిపాదన ఎంత పస లేనిదయినప్పటికీ దాని మీద చర్చ సందర్భంగా  భారతీయ ముస్లింలలో ఒక కదలిక , సమీకరణ జరిగిందనేది గమనించాల్సిన అంశం. ప్రత్యక్ష వలస పాలన అనంతరం దేశవ్యాప్తంగా ముస్లింలను కదిలించిన అంశం తొలి  సందర్భం ఇదేనని గమనిస్తే ఈ సంఘటనకున్న చారిత్రక ప్రాధాన్యతను గుర్తించవచ్చు. ముస్లింల వాదనలకన్నా, బిల్లుకన్నా  ముస్లింల  సమీకరణే  మెజారిటీ మత సమూహానికి చెందిన పాలకవర్గాలకు మరింత ప్రమాదకరంగా తోచింది.

          ముస్లింలు పార్లమెంటును ఆశ్రయించి సుప్రీం కోర్టు తీర్పు నుండి తప్పించుకోవడం బ్రాహ్ణహ-బనియాల్లో అసహనాన్ని రేకెత్తించింది. రాజకీయ రంగంలో అల్పసంఖ్యాకవర్గాల ప్రాబల్యం పెరుగుతున్నదని వాళ్ళు పసిగట్టారు. అధికారంలో భాగం కోరాలనే ఆకాంక్ష ముస్లింలలో మేల్కొని అదొక ఉద్యమ రూపం దాల్చక ముందే ఆ సమూహాలను అణిచివేయాలని పాలకవర్గాలు మేల్కొన్నాయి. రాజ్యహింసను సాంస్కృతిక రూపంలో అమలు చేయడానికి ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థలు నడుం బిగించాయి. “ముస్లింలు పార్లమెంటుపై  వత్తిడి తెచ్చిన విధానమే” 1990లో తనను ‘రామ్ రథయాత్ర’కు పురికొల్పిందని బిజెపి మహారథి ఎల్ కె అద్వాని స్వయంగా ప్రకటించారు.

అద్వానీ రథయాత్రలో మతతత్వం, అంతులేని అసహనం, దురుసుతనం, జనాన్ని రెచ్చగొట్టి కల్లోలాన్ని సృష్టించాలనే దుర్బుధ్ధి అంతిమంగా ముస్లిం వ్యతిరేకత వున్నాయి. నిజం చెప్పాలంటే, రామ్ రథయాత్ర ఆనాటి పాలకవర్గాల మానసిక స్థితికి అద్దం పట్టింది. ఆ దశలో, బిజెపి కాకపోతే ఇంకో పార్టి, అద్వానీ కాకపోతే ఇంకో నాయకుడు, రామ్ రథయాత్ర కాకపోతే ఇంకో యాత్ర చేసివుండేవారు అనడంలో సందేహం లేదు. వనరుల పంపకాలలో ప్రజలకు ధర్మ వాటా ఇవ్వడం ఇష్టంలేని పాలకవర్గాలు మతం చాటున తమ అకృత్యాలను ధర్మ కార్యాలుగా  ప్రచారం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటాయని గుర్తించడం అవసరం.
ఆధునిక సమాజంలో వనరులు, మార్కెట్ గురించి పట్టించుకోని జాతి క్రమంగా అంతరించిపోతుంది.  పీడిత జాతులకు సంబంధించిన ఒక సామాన్య లక్షణం ఏమంటే తమది అనుకునే ఆచార వ్యవహారాలను కాపాడుకోవడానికి వీరు ఎక్కువ ఆసక్తిని కనబరుస్రుంటారు. తమ సంస్కృతి గురించి వీరికి లోతుగా తెలిసివుండవచ్చు తెలియకపోనూ వుండవచ్చు. సామాజిక వాతావరణంలోని అభద్రత కారణంగా వీళ్ళు తమ సంస్కృతిని భద్రపరచుకోవడంలోనే తమ భద్రత వుందని భావిస్తారు.
ఆర్థిక రంగంలో సమస్త అధికారాల్ని కోల్పోవదంవల్లనే పీడిత జాతుల్లో తమ సంస్కృతి మీద వ్యామోహం పెరుగుతూ వుంటుంది. బయటి నుండి వివక్ష చుట్టుముడుతున్నప్పుడు జీవితంలో ఇతర అంశాలకన్నా తమకు సంస్కృతి, మతాలే ప్రధానమ్ని పీడిత జాతులు నమ్ముతాయి.
తనకు రాజకీయార్థిక విషయాలలో ఆసక్తి లేదనీ మతం, మతప్రచారమే తనకు ముఖ్యమని జమాతే ఇస్లామీ హింద్ అగ్రనాయకులు మౌలానా సిరాజుల్ హసన్ ప్రకటించడం ఈ సాంప్రదాయంలో భాగమే. హక్కుల్ని కోల్పోతున్నామనే స్పృహను సహితం పీడిత జ్సాతులు కోల్పోతాయి అనడానికి ఇదొక ఉదాహరణ.
జాతుల పోరాటం మార్కెట్ ఘర్షణల్లోంచి పుట్టినా  క్రమంగా ఈ పోరాటంలో సంస్కృతి కీలకాంశం అయిపోతుంది. తమకు మిగిలిన తమ సంస్కృతినైనా కాపాడుకోవాలని పీడిత జాతులు జీవన్మరణ పోరాటం సాగిస్తాయి. వాళ్ల నుండి ఆ సంస్కృతిని సహితం లాక్కొని పీడిత జాతుల్ని కట్టు బానిసలుగా మార్చేయాలని పీడక జాతులు తీవ్రంగా ప్రయత్నిస్తుంటాయి.  “హిందీ హిందూ హిందూస్తాన్ ! ముస్లిం భాగో పాకిస్తాన్!” వంటి నినాదాలు అందుకు తొలి హెచ్చరికలు మాత్రమే.

సంఘర్షణ ఈ దశకు చేరుకున్నాక భారత దేశం ఎవరిదీ? అనే ప్రశ్న సహజంగానే ముందుకు వస్తుంది. దీనికి రెండు రకాల సమాధానాలు ఉంటాయి. మొదటిది గతం నుండి వచ్చే సమాధానం; రెండోది భవిష్యత్తు నుండి వచ్చే సమాధానం.

భారత దేశంలో ఏ జాతి ఎప్పుడు ఆవిర్భవించిందో లక్ష ఆధారాలు చూపినా దానివల్ల ప్రయోజనం ఏమీ వుండదు.  పీడిత జాతుల చరిత్రను పీడక జాతులు ఒప్పుకోవు.   ముందే చెప్పినట్టు జాతీయవాదం ఆధునిక భావన. గత చరిత్ర అనేది ఎన్నడైనా వర్తమానానికి  కొంత సమాచారం మాత్రమే. అది తాత్కాలికంగా అపధ్ధర్మ వాదనకు కొంచెం  పనికిరావచ్చు. అంతకు మించి ఏమీలేదు.   

భవిష్యత్తులో భారత ఉపఖండంలో ఏ జాతి ఏవిధంగా జీవించాలి? అనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమే మరో జాతియోద్యమం రూపాన్నీ, విస్తారాన్నీ, తీవ్రతను నిర్ణయిస్తుంది.   

రచన : ఫిబ్రవరి, 1991 
ప్రచురణ : ప్రజాసాహితి మాసపత్రిక, మార్చ్ – జూన్ 1991

No comments:

Post a Comment