Tuesday, 4 September 2018

Women Liberation and Common Civil Code


Women Liberation and Common Civil Code
స్త్రీ విముక్తి - వుమ్మడి పౌరస్మృతి

ఉషా యస్ డానీ 

“భార్యా భర్తలు ఇద్దరూ అంగీకరిస్తే విడాకులు పొందిన స్త్రీలు మనోవర్తి కోసం సిఆర్ పిసిలోని 25 వ సెక్షన్ ను ఉపయోగించుకోవచ్చు”

మే 5న పార్లమెంటులో తానే ప్రవేశ పెట్టిన ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) బిల్లు-1986కు రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్  కేంద్ర ప్రభుత్వం చేసిన సవరణ ఇది. అయితే, ఇందులో ఒక తిరకాసు వుంది. “ఇద్దరూ అంగీకరిస్తే” అనే షరతును భర్త ఎలాగూ అంగీకరించడు. భార్య ఒక్కర్తే కోరుకున్నా అది చెల్లదు. 

పులి మేకను పోటీకు నిలబెట్టి షరతులు ఇద్దరికీ సమానమే అనంటే జరిగేదేమిటో మనందరికీ తెలుసు. మనందరికీ తెలిసింది ‘21వ శతాబ్దపు ప్రధాన మంత్రి’ గా పేరొందిన రాజీవ్ గాంధీకి తెలియకుండా పోదు. పార్లమెంటులో  తన పార్టి సభ్యులకు వ్హిప్ ను జారీ చేసి మరీ పంతంగా ఈ బిల్లు నెగ్గించుకుంది కాంగీ. అలాంటి పార్టి ఈ సవరణ కోరిందంటే ముస్లిం స్త్రీల విషయంలో ఆ పార్టి దృక్పథం స్పష్టంగానే తెలుస్తోంది. మనకు తెలియనిదల్లా భారత రాజ్యంగమే అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నది అన్నదే. 

షాబానో కేసు కావచ్చు, సినీనటి సరిత కేసు కావచ్చు స్త్రీ స్వేఛ్ఛా సమస్య వచ్చినప్పుడెల్లా కుటుంబ (పర్సనల్ లా) చట్టాలు పుట్ట నుండి పాముల్లా బయటికి వచ్చి బుసలు కొడుతుంటాయి. కారణం ఏమంటే, మతానికి, రాజ్యానికి కూడా కుటుంబం మూలాధారం. ఎంతటి మత ప్రసక్తి లేని దేశాల్లో  అయినా  మతం ‘కుటుంబం’  చూరు పట్టుకుని వేలాడుతూనే వుంటుంది.

షాబానో కేసును అవకాశంగా తీసుకుని చాలా మంది ముస్లిం మహిళల మీద సానుభూతిని ప్రకటించే నెపంతో ముస్లిం వ్యతిరేక ప్రచారానికి నడుం బిగించారు. సరిగ్గాఇలాగే వలస పాలన కాలంలో సతీసహగమనం, బాల్య వివాహాల నిషేధం కోసం ఉద్యమాలు సాగినపుడు వాటిని చాలా మంది హిందూ వ్యతిరేక ప్రచారానికి వాడుకున్నారు. మతాలన్నీ పితృస్వామిక వ్యవస్థలోనే ఇవ్వాల్టి రూపాన్ని ధరించాయి గనుక వాటన్నింటికీ సహజంగానే పురుషాధిపత్య స్వభావం వుంటుంది. ఆ విషయాన్ని నాటి హైందవేతరులు మరచిపోయినట్టే నేటి ముస్లిమేతరులూ గుర్తించ నిరాకరిస్తున్నారు. 
ఇదంతా తెలీక జరిగిపోతున్నదని అనుకోవడానికి కూడా వీలు లేదు. పురుషాధిపత్యాన్ని జాతి అస్తిత్వ అంశంగా చిత్రించి స్త్రీ విముక్తి సమస్యను అసలు చర్చనీయాంశమే కాకుండా  చెయ్యడం అన్ని మత సమూహాల్లోని పురుషులు అందరికీ అవసరం!.

16వ శతాబ్దపు తొలి రోజుల్లో పారిశ్రామిక విప్లవాలు వేగాన్ని పుంజుకున్నాయి. భూస్వామ్య విధానం స్థానంలో పెట్టుబడీదారీ విధానం వచ్చి ప్రజాస్వామిక రాజ్యాంగాలను ఏర్పరచింది. సరుకులను ఉత్పత్తి చేయడంలో, వాటిని మార్కెట్ చేయడంలో మత ప్రసక్తి ఆటంకం అవుతుంది. మార్కెట్ వ్యవహారాల్లో మత జోక్యాన్ని ఆధునిక రాజ్యాంగాలు నిరాకరించాయి. దాని అర్ధం అవి మతాన్ని నిర్మూలించాయని కాదు. సమాజాన్ని యధాతథంగా వుంచడానికి అవసరం అయిన చోటెల్లా అవన్నీ మతాలను పెంచిపోషించాయి.  

కుటుంబం విషయంలో బ్రిటీష్ వాళ్ళు చేసిందల్లా సాంప్రదాయిక ఆచారాలకు పర్సనల్ లా రూపం ఇచ్చి వాటిని లిఖితపూర్వక చట్టాలుగా మార్చడమే.

మన ‘స్వతంత్ర’ పరిపాలన విధానం మొత్తం బ్రిటీష్ పరిపాలనకు నకిలే గనుక భారత రాజ్యాంగం తన ఆదర్శం “మతప్రమేయంలేని సామ్యవాద ప్రజాస్వామ్యం” అని ప్రకటించుకున్నా మత స్వేఛ్ఛ అనేది ప్రాధమిక హక్కు అయింది; ఉమ్మడి పౌరస్మృతి అనేది ఆదేశిక సూత్రాల్లో ఒకటిగా (ఆర్టికల్ 44) మారిపోయింది.

ప్రాధమిక హక్కుల్ని ఎవరయినా వుల్లంఘిస్తే వాళ్లని న్యాయస్థానాల్లో ప్రశ్నించవచ్చు శిక్షించవచ్చు.  ఆదేశిక సూత్రాల విషయం అలా కాదు. ప్రభుత్వాలు వాటిని అమలు జరప వచ్చు; జరపక పోనూ వచ్చు.

ఆదేశిక సూత్రాలను కూడా ప్రాధమిక హక్కులతో సమానంగా పరిగణించాలని మినర్వా మిల్స్ కేసు వంటి సందర్భాలలో సుప్రీం కోర్టు  భావించింది. అయినా, ప్రభుత్వాలు వాటిని పాటించి తీరాలనే నియమం ఏమీలేదు. పాటిస్తే అడిగే ప్రశ్నేలేదు; పాటించకపోతే ప్రశ్నించే హక్కే లేదు.

ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) బిల్లు-1986 పాసై చట్టంగా మారేక ఉమ్మడి పౌరస్మృతి కావాలనే డిమాండ్ దేశంలో మరింత బలంగా ముందుకు వచ్చింది. పైకి ఇది సాధారణ విషయంగానే కనిపిస్తుంది. కానీ, ఇందులో  మతం, కుటుంబం వంటి మౌలిక అంశాలు అనేకం వున్నాయి. వాటికి సంబంధించి కఛ్ఛితమైన అభిప్రాయాల్ని ఎర్పరచుకోకుండా, సవరణలు, మార్పులు చేర్పుల మీద సభ్య సమూహాలు అందరిలో ఏకాభిప్రాయాన్ని సాధించకుండా ఉమ్మడి పౌరస్మృతిని రూపకల్పన చేయడం సాధ్యంకాదు. అందువల్లే పౌరస్మృతిని రూపొందించుకోవాలనే కోరిక ఇంతకాలం కేవలం ఊహల మీద ఆధారపడిన ఆదర్శంగానే వుండిపోతోంది. ఒక స్పష్టమైన ప్రతిపాదన అంటూ ఏదీ ఇంతవరకు లేకపోయినా కామన్ సివిల్ కోడ్ కు సంబంధించి అనేక అభిప్రాయాలు అడపా దడపా వినబడుతూనే వున్నాయి. 

భారత దేశానికి సంబంధించి ఉమ్మడి పౌరస్మృతి అంటే కొద్దిపాటి మార్పులతో హిందూ కుటుంబ చట్టమే అనే అభిప్రాయం ఒకటి చాలా మందిలో బలంగా వుంది. ఇది మెజారిటి మత సమూహం అహంకారంతో చేస్తున్న వాదన. ఈ వాదనకు పూర్తి భిన్నమైన వాదనని క్రీష్టియన్లు, మహమ్మదీయులు చేస్తున్నారు. హిందూ వ్యక్తిగత చట్టమే ఉమ్మడి పౌరస్మృతిగా మారే ప్రమాదంవుంది  గాబట్టి ప్రతి మత సమూహానికీ వాళ్ళవాళ్ళ  కుటుంబ చట్టాలు పటిష్టంగా వుంటేనే “సెక్యూలరిజం వర్ధుల్లుతుంది” అనేది వీరి భావన. మైనారిటీలు తమ ఆత్మరక్షణ కోసం చేస్తున్న వాదన ఇది.

మతాంతర వివాహాలు జరిగిన సందర్భాల్లో, లిఖిత చట్టాలు లేని సందర్భాల్లో కుటుంవ వివాదాలను పరిష్కరించడానికి మనకు భారతీయ వివాహ చట్టం, భారతీయ వారసత్వ చట్టం వంటివి వున్నాయి. వాటినే, ఉమ్మడి పౌర చట్టంగా రూపొందించాలనే వాదన మరొకటుంది. సమాజంకన్నా చట్టాలే గొప్పవని భావించే అమాయకుల వాదన ఇది. భారతీయ వివాహ చట్టం గానీ, భారతీయ వారసత్వ చట్టంగానీ ‘హిందూ పర్సనల్ లా’కు నకళ్ళే. 

అన్ని మతాలలో వున్న ప్రజాస్వామిక వాదులు -  పై మూడు వాదనల్ని కాదని  - మరో కొత్త ప్రతిపాదన చేస్తున్నారు. అన్ని మతాల వ్యక్తిగత చట్టాలలోని మంచి అంశాలను స్వీకరించి ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలనేది వాళ్ళ అభిప్రాయం. మిగిలిన వాళ్లకన్నా వీళ్ళ వాదన కొంత అభ్యుదయంగానే కనబడుతోంది. అయితే, ఇందులోనూ అనేక లోపాలు లేకపోలేదు.
స్త్రీని పురుషుడికి బానిసగా మార్చడమే కుంటుంబ వ్యవస్థ లక్షణం అయినపుడు, ఈ లక్షణాలను కాపాడడమే కుటుంబ చట్టాల  బాధ్యత అయినపుడు, వాటిలో ‘మంచి గుణాలు’ ఎన్నున్నా సారాంశంలో వాటివల్ల  స్త్రీలకు వచ్చే నికర ప్రయోజనం ఏమిటో చెప్పడానికి వీళ్ళ దగ్గర సమాధానం లేదు.

ఈ నాలుగు వాదనలు స్త్రీలకు కొత్తగా ఒరగబెట్టేదేమీ లేదు; ‘కుటుంబ వ్యవస్థ’ను మరింత పటిష్టం చేయడంతప్ప.

ఉమ్మడి పౌరస్మృతి నుండి బయలు దేరి కుటుంబాన్ని నియంత్రించేకన్నా కుటుంబ వ్యవస్థను మార్చడం ద్వార ఉమ్మడి పౌరస్మృతిని  రూపకల్పన చేయడం  కొంచెం ఆచరణ సాధ్యం కావచ్చు. బహుశ అప్పుడు ఉమ్మడి పౌరస్మృతి అర్థమే మారిపోవచ్చు.

కుటుంబ వ్యవస్థ బీటలు వారినపుడు తెగేవి స్త్రీల సంకెళ్ళు మాత్రమే కావు వ్యవస్థ సంకెళ్ళు సహితం తెగిపోతాయి. ఆ క్రమాన్ని యథాతథావాదులు సహిస్తారో పెనుగులాడుతారో అనేది ప్రశ్నే అయితే దానికి సమాధానాన్ని స్త్రీ విముక్తి పోరాటాలే ఇస్తాయి.

రచన : మే 1986
ప్రచురణ : ఉదయం దినపత్రిక, 27 మే 1986



ముస్లిం సంవాదాన్ని ఆరంభిస్తూ నేను రాసిన తొలి వ్యాసం ఇది. ఉదయం దినపత్రిక ఎడిట్ పేజీలో 1986 మే 27న ఈ వ్యాసం అచ్చయింది. 

No comments:

Post a Comment