Wednesday 19 September 2018

విముక్తి పోరాటాలకు దళిత ముస్లిం నాయకత్వమే నేటి అవసరం

విముక్తి పోరాటాలకు  దళిత ముస్లిం నాయకత్వమే నేటి అవసరం

మన దేశంలో కులోన్మాదానికి బలయ్యేది ప్రధానంగా  దళితులు.
మతోన్మాదానికి బలయ్యేది ప్రధానంగా ముస్లింలు.
ముప్పు ఎక్కువగా వున్న సమూహాలే విముక్తి పోరాటాలకు నాయకత్వం వహించడం సబబు.
కులోన్మాద వ్యతిరేక పోరాటాలకు దళితులు నాయకత్వం వహించాలి.
మిగిలిన అణగారిన సమూహాలు వాళ్లకు తోడుగా నిలబడాలి.
మతతత్వ వ్యతిరేక పోరాటాలకు ముస్లింలు నాయకత్వం వహించాలి.
మిగిలిన అణగారిన సమూహాలు వాళ్లకు  తోడుగా నిలబడాలి.
పెట్టుబడీదారీ  వ్యతిరేక పోరాటాలకు కార్మికులు నాయకత్వం వహించాలి.
మిగిలిన అణగారిన సమూహాలు వాళ్లకు  తోడుగా నిలబడాలి.
భూస్వామ్య   వ్యతిరేక పోరాటాలకు వ్యవసాయ కూలీలు నాయకత్వం వహించాలి.
మిగిలిన అణగారిన సమూహాలు వాళ్లకు  తోడుగా నిలబడాలి.

భారత శ్రామికవర్గంలో ST, SC, BC, మైనారిటీలు 95 శాతం.  ఇతర (పెత్తందారీ)  కులాలు 5 శాతం.

భారతదేశంలో   RSS, కమ్యూనిస్టు పార్టి రెండూ 1925లో ఆవిర్భవించాయి.  శ్రామికులకు నాయకత్వం పేరుతో  5  శాతంగా వున్న పెత్తందారీ కూలాలవాళ్ళే  కమ్యూనిస్టు పార్టీల  నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. గత 93 సంవత్సరాల్లో  కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలోవున్న ఈ పెత్తందారీకులాలు  భారత శ్రామికవర్గానికి చేసిన మేలు చాలా స్వల్పం. ST, SC, BC, మైనారిటీలకు కల్పించిన నిస్పృహ చాలా ఎక్కువ.

రాజా రామ్మోహన రాయ్ అయినా, అంబేడ్కర్ అయినా  తమ స్వీయ సమాజాల సంస్కరణలకు  వలస పాలకుల సహకారాన్ని తీసుకున్నారు.  మన దేశం లోనికి వలస పాలన రాకుంటే మన సమాజంలో ఈ సంస్కరణలు జరిగేవి కావు. అందులో సందేహం అక్కర లేదు. వలస పాలకుల సహకారంతో జరిగిన సంస్కరణలు కనుక వాటికి ఆ పరిమితి కూడా వుంటుంది. దాన్ని మనం గుర్తించాలి. హిందూ మత సంస్కర్తలకు సహజంగానే  వలసవాద వ్యతిరేక దృక్పథం లేదు.  వలసవాదుల్ని వ్యతిరేకించినవారు విచిత్రంగా  సంఘసంస్కరణల్ని కూడా వ్యతిరేకించారు. వలసవాదుల ప్రవేశంతో తమ సమాజం బాగుపడింది కనుక దళిత, బహుజన సంస్కర్తలు కూడా  వలసవాద సానుకూలతనే ప్రదర్శించారు.  వలస వ్యతిరేక విధానాలను రూపొందించలేదు. 

అలాగే కమ్యూనిస్టు పార్టీలు కూడ పెట్టుబడీదారీ వ్యవస్థకు అవసరం అయిన  మేరకే కార్మిక చట్టాలను సాధించ గలిగాయి.  భారత పాలకులైన పెట్టుబడీదారులు 1970వ దశకంలో సోషలిజాన్ని సహితం రాజ్యాంగంలో పొందుపరచాలనుకున్నారు. ఇది  పెట్టుబడీదారుల అవసరమో, కమ్యూనిస్టు  పార్టీల విజయమో తేల్చడం కష్టం. అందులో ఈ రెండు అంశాలూ వున్నాయి. ఈ కారణం వల్లనే భారత కమ్యూనిస్టు పార్టి ఆ దశలో భారత జాతీయ కాంగ్రెస్ కు గట్టి మద్దతుదారుగా నిలబడింది. కమ్యూనిస్టు పార్టీలు అంతకు మించి ముందుకు సాగలేకపోయాయి.

సరిగ్గా ఆ సమయంలోనే  పెట్టుబడీదారీ వ్యవస్థ బలిసి సామ్రాజ్యవాద దశకు చేరుకుంది. సామ్రాజ్యవాదంతో ఎలా వ్యవహరించాలో భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వానికి  అంతుబట్టలేదు.  తరిమెల నాగిరెడ్డి వంటివారు తాకట్టులో భారతదేశం వంటి కొన్ని పుస్తకాలు రాశారుగానీ అవి సామ్రాజ్యవాదం మీద ఒక నిస్సహాయపు నిట్టూర్పే తప్ప పోరాటంకాదు. నాగిరెడ్డి పార్టి సహితం ఎన్నడూ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలను చేపట్టిందీ లేదు.

అమెరికా ఏకధృవ సామ్రాజ్యవాదిగా ఎదగడానికి క్రైస్తవమతతత్వం, యూదుమతతత్వం దానికి   బాసటగా నిలిచాయి.  ఆ కూటమికి వ్యతిరేకంగా  ఇస్లాం (మతతత్వం అన్నా ఈ సందర్భంలో తప్పేమీకాదు)  నిలబడిందనే  ఒక గ్లోబల్ సత్యాన్ని కమ్యూనిస్టు పార్టీలు ఇప్పటికీ గుర్తించలేదు.

1970ల నాటి భారత కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం శ్రామికవర్గమూ కాదు;  ST, SC, BC, మైనారిటీల్లా సాంస్కృతికంగా అణగారిన సమూహమూ కాదు.  మార్క్సిస్టు మహోపాధ్యాయుల  బోధనల్ని వర్తమాన శ్రామికవర్గపు అవసరాల మేరకు పదును పెట్టే శక్తి  ఆ నాయకత్వానికి లేదు.  సామ్రాజ్యవాదం ప్రపంచీకరణకు సిధ్ధమైన దశలో  కమ్యూనిస్టు సిధ్ధాంతం దయనీయంగా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వం చేతుల్లో బందీ అయిపోయింది.

1970వ దశకంలో చారు మజుందార్, 1980వ దశకంలో కొండపల్లి సీతారామయ్య కమ్యూనిజానికి మళ్ళీ జీవం పోయడానికి గట్టిగా ప్రయత్నించారు. ఈనాడు సామాజిక వ్యవస్థలో కొత్తగా చెలరేగుతున్న అనేక సాంస్కృతిక అంశాల ప్రస్తావన వాళ్ల రచనల్లో పిండదశలో కనిపిస్తాయి. కానీ అప్పటికే  వాళ్ళిద్దరి వయస్సు పెరిగిపోయింది; ఆరోగ్యం పాడయిపోయింది.

పెట్టుబడీదారీ అణిచివేతకన్నా కుల మత వ్యవస్థలు తమపైన సాగిస్తున్న సాంస్కృతిక అణిచివేతనే ST, SC, BC, మైనారిటీలు  తీవ్రంగా భావిస్తుంటాయి.  భారత ఉపఖండంలొ శ్రామిక సమూహాల్లో    కుల, మతాల రూపంలో  వుండే   కీలక  సాంస్కృతిక పార్శ్వాన్ని  మొండిగా నిరాకరించడంవల్ల కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాసంగికతను కోల్పోయాయి. అలా కమ్యూనిస్టు పార్టీలు వదిలేసిన జాగా (space) లోనే ప్రాంతీయ హిందూమతతత్వం సహకారంలో అంతర్జాతీయ క్రైస్తవ, యూదు మతతత్వాల మద్దతుతో సామ్రాజ్యవాదం విజృభించింది. ఇప్పుడు సామ్రాజ్యవాదం అంటే పెట్టుబడీదారీ వ్యవస్థ అత్యున్నత దశ మాత్రమే కాదు; క్రైస్తవ, యూదు, హిందూ మతతత్వాల సఖ్యత కూడా.

No comments:

Post a Comment