మైనారిటీ కవిత్వ చారిత్రక నేపథ్యం
-
ఉషా యస్ డానీ
విమెన్ ట్రాఫికింగ్ మీద Human Development Research Centre (HDRC) మార్చి 21న ఢిల్లీలో జాతీయ స్థాయి మీడియా వర్క్ షాపు నిర్వహించింది. అందులో కీలక పత్రాన్ని సమర్పించిన అపర్ణా శ్రీవాత్సవ ఒక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించారు. వేశ్యా వాటికలు నడిపే ముఠాలు ఆడపిల్ల్ని ఎత్తుకుని వచ్చి వాళ్లకు రజియా, సైరాబానో వంటి ముస్లిం పేర్లను పెడతారట. విటుల్ని ఆకర్షించడానికి ఇది వాళ్ల వ్యాపారాభివృద్ది తంత్రం అట. అయితే,
విటులకు ముస్లిం యువతులు అంటే అంత ఆకర్షణ దేనికి? అనేది ఎవరికైనా రావాల్సిన సందేహమే. సాంస్కృతిక జాతీయవాదం ఎంతటి వికృత రూపాన్ని దాలుస్తున్నదో చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
సాంస్కృతిక జాతీయవాదం పేరిట అన్ని రంగాలలో ముస్లింల మీద సాగుతున్న అమానుషత్వాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం వాదం ముందుకు వచ్చింది. 1980వ దశకం ద్వితీయార్ధంలో ఆరంభమైన ఈ క్రమం, ఇప్పుడు దేశంలోని అన్ని భాషల్లోనూ ఏపుగా పెరుగుతోంది.
గడిచిన రెండు దశాబ్దాల కాలంలో కొన్ని వందల మంది ముస్లిం కవులు తెలుగులో పుంఖానుపుంఖంగా కవితలు రాశారు. వాగ్గేయకారులు పాటలూ రాశారు. వేదికలెక్కి గానం చేశారు. డజన్ల కొద్దీ కథకులు అనేక కథలు రాశారు. ఆలోచనాపరులు రాసిన వ్యాసాల సంఖ్య కూడా తక్కువదేం కాదు. ఉపన్యాసాన్ని ఒక కళగా గుర్తిస్తే ఆ
రంగంలో ముస్లింలు జరిపిన సృజన కూడా అత్యంత విస్తారమైనది. ఇటీవలి కాలంలో ముస్లింవాదంతో ఒక కవితా సంకలనంగానీ, వ్యాస సంపుటిగానీ రాని నెల లేదంటే అతిశయోక్తికాదు.
ఈ సాంప్రదాయానికి సహజమైన కొనసాగింపుగా, డాక్టర్ ఎస్. షమీవుల్లా ‘మైనార్టీ కవిత్వం : తాత్విక నేపధ్యం’ పేరిట ఒక సిద్దాంత వ్యాసాన్ని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి సమర్పించారు.
“సాహిత్య ప్రక్రియలన్నింటిలోనూ కవిత్వానికి అభివ్యక్తి సౌలభ్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే సమాజ పరిణామాలు ఇతర ప్రక్రియలకన్నా ముందుగా కవిత్వంలో ప్రతిఫలిస్తాయి”
అంటారు షమీవుల్లా. అందుకే కాబోలు వారు
రచనా సౌలభ్యం కోసం ముస్లిం మైనార్టీ కవిత్వాన్ని సిద్దాంత పరిశోధనకు స్వీకరించారు. 1986- 1998 మధ్య కాలంలో తెలుగులో వచ్చిన ముస్లిం మైనార్టీ కవిత్వానికి తాత్విక నేపధ్యాన్ని ఆవిష్కరించడం ఇందులో ప్రధానాంశం.
మనుషుల్ని నాలుగు అంతస్తులుగా తానే సృష్టించినట్టు సాక్షాత్తు దేవుడి చేతే చెప్పించిన మతాలు మనకు తెలుసు. అందుకు భిన్నంగా, దేవుని ముందే కాదు తమలో తాముగా కూడా మనుషులందరూ సమానమే అంటుంది ఇస్లాం. ఇహపర లోకాల్లో తామంతా సమానులమనే భావమే ముస్లింల మధ్య సౌభ్రాతృత్వానికి (మిల్లత్ ) పునాది. ముస్లింల ఐదు విశ్వాసాలు, ఐదు విధుల వివరణతో ఆరంభమైన షమీవుల్లా పరిశోధన వ్యాసం ఆరు అధ్యాయాలుగా ముందుకు సాగింది.
ఇస్లాం వాదం, ముస్లింవాదం పేరిట ముస్లిం తెలుగు కవుల్ని ఆవరించిన సిద్దాంత గందరగోళాన్ని తొలి అధ్యాయంలోనే పటాపంచలు చేశారు షమీవుల్లా. తర్వాతి అధ్యాయాల్లో మైనార్టీ కవిత్వ ప్రాముఖ్యం, వికాసం, వస్తు వైవిధ్యం,
కొత్త వ్యక్తీకరణల్ని విస్తృతంగా పరిశోధించిన రచయిత స్త్రీలు సృష్టించిన మైనార్టీ కవిత్వం కోసం ప్రత్యేకంగా ఒక అధ్యాయాన్ని కూడా కేటాయించారు. తెలుగు సాహిత్యంలో ముస్లిం మైనార్టీ కవిత్వ విస్తృతీ, వైవిధ్యాలను అర్ధం చేసుకోడానికి, తెలుగు సమాజంపై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చదవాల్సిన పుస్తకం ఇది.
ముస్లింవాదం అనేది దేశ రాజకీయాల్లో ఒక అత్యంత ప్రధానమైన సామాజిక సంఘటన. ప్రభుత్వాలు ముస్లింల విషయంలో
బుజ్జగింపు ధోరణుల్ని అనుసరిస్తున్నాయంటూ,
వీటిని నిలవరించాలంటూ లాల్ కిషన్ అద్వానీ, రాజ్ నాధ్ సింగ్ లు దేశంలో తలోదిక్కు నుంచీ రధయాత్రలు మొదలు పెట్టిన ప్రస్తుత తరుణంలో ఇది మరింత వాస్తవం, ప్రతి సామాజిక ఉద్యమ లక్ష్యం రాజ్యాధికారంలో న్యాయమైన భాగాన్ని సాధించడమే కనుక సామాజిక ఉద్యమాలన్నీ సారాంశంలో రాజకీయ చర్యలే అవుతాయి. కారణాలు ఏమైనాగానీ
మైనార్టీ సాహిత్యానికి ఉన్న రాజకీయ పార్శ్వాన్ని షమీపుల్లా సిద్దాంత వ్యాసం పెద్దగా పట్టించుకోలేదు. ఏ చారిత్రక నేపధ్యంలో ఏ లక్ష్యాల సాధన కోసం మైనార్టీ సాహిత్యం ఆవిర్భవించింది? గమ్యం దిశగా దాని ప్రయాణం సాగుతోందా? లేదా? అనే అంశాలను పట్టించుకోకపోవడం న్యాయం కాదు.
స్వతంత్ర భారతదేశంలో
ముస్లింలు తొలి నలభై యేళ్లు మూగగా దేశ విభజన శిలువను మోస్తూ గడిపారు. కొత్త తరం ముస్లింలు నోరు విప్పడానికి దాదాపు నాలుగు దశాబ్దాలు పట్టింది. 1986 నాటి షబానో కేసు ముస్లింలకు తొలిసారిగా మాట నేర్పింది. ఆ కేసు ముగిసిన తీరు ఎలా ఉన్నప్పటికీ, భారతీయ ముస్లింల మనోభావాను వ్యక్తం చేయడానిక అదొక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది.
ఈ పరిణామాలకు కొంచెం ముందుగా శిక్కుల మీద కొంతకాలం కొనసాగిన ద్వేష ప్రకరణం ఢిల్లీ అల్లర్లతో ముగిసింది. దానితో, చిరకాల సాంస్కృతిక శత్రువులైన ముస్లింలను మరలా రంగం మీదికి తీసుకురాడానికి సంఘ పరివారం సిద్దమైంది.
1988-89 నాటి సల్మాన్ రష్డీ పుస్తకం సాటానిక్ వర్సెస్ పై చెలరేగిన వివాదం కూడా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేంతగా ముస్లింల వాదనను బలంగా ముందుకు తెచ్చింది. ముస్లింల గొంతును మొగ్గలోనే తుంచేయాలని బావించిన సంఘ పరివారం సంతుష్టీకరణ నెపాన్ని వేసింది.
సరిగ్గా ఈ సమయంలోనే భారత రాజకీయాలు మరో కీలకమైన మలుపు తిరిగాయి. 1982లో మండల్ కమిషన్ సిఫార్సుల్ని, గుజరాత్ లో ప్రయోగాత్మకంగా అమలు చేసి చూడాలని అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం భావించింది. వెంటనే గుజరాత్ అంతటా అణగారిన కులాలపై పెత్తందారీ కులాలు దాడులు కొనసాగించాయి. గుజరాత్ ఘర్షణల్లో పెత్తందారీ కులాల పక్షం వహించిన బీజేపి, సహజంగానే అణగారిన కులాల ఆగ్రహానికి లోనైంది. 1984 ఎన్నికల్లో ఆ పార్టీకి, లోక్ సభలో కేవలం రెండు స్థానాలు మాత్రమే దక్కాయి. రాజకీయాల్లో బ్రతికి బట్ట కట్టాలంటే బలహీనవర్గాలను కూడగట్టక తప్పదని గుర్తించిన సంఘపరివారం దాని కోసం ఒక ద్విముఖ వ్యూహాన్ని రచించింది. ఇందులో అణగారిన కులాలను ఆకర్షించడం ఒక ఎత్తయితే అణగారిన కులాల్లో రగులుతున్న అసంతృప్తిని ముస్లింల వైపుకు మళ్లించడం మరో ఎత్తు. ఫలితంగా హిందూత్వ నినాదంతో పాటూ బాబ్రీ మసీదు వివాదం ముందుకు వచ్చింది.
1989లోక్ సభ ఎన్నికల తర్వాత వామపక్షాలు, బీజేపి బయటి నుండి
ఇచ్చిన మద్దతుపై కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడింది. అయితే వి.పి సింగ్ ప్రభుత్వం 1990 అగస్ట్ 7న బిజెపి అభీష్టానికి వ్యతిరేకంగా మండల్ కమిషన్ సిఫార్సుల్ని ఆమోదించింది. రిజర్వేషన్ల ఆశ నుంచీ అణగారిన కులాల దృష్టిని మళ్లించడానికి బాబ్రీ మసీదుపై అశ్వమేధ యాత్రకు బయటు దేరారు అద్వానీ. మండల – కమండల్
వ్యూహం ఫలించింది. మరో రెండేళ్ల తర్వాత బాబ్రీ మసీదును కూల్చివేశారు.
ఆ సమయంలో ప్రాంతీయంగా ఆంధ్రప్రదేశ్ లోనూ చరిత్ర దిశను మార్చగల కొన్ని పరిణామాలు సంభవించాయి. అప్పటి వరకు యువతరం భావాలకు వేదికగా ఉన్న పీపుల్స్ వార్ 1985లో నిలువునా చీలిపోయింది. ఆ తరువాత ఆ పార్టీతో పాటు అతివాద వామపక్ష భావాల విశ్వసనీయత కూడా బీటలువారింది. అప్పటి వరకు అతివాద వామపక్ష భావాలతో భావబంధాలను కొనసాగించిన ఆలోచనాపరులు కొత్త అస్తిత్వాన్వేషణ ఆరంభించారు. ఆ ఏడాది జులై 17న జరిగిన
కారంచేడు దురంతం వర్గేతర అణచివేతల్ని చర్చావేదికలపైకి తెచ్చింది.
ఈ కాలంలో అంతర్జాతీయంగా జరిగిన కీలక పరిణామాలు కూడా జాతీయ పరిణామాలకు ఊపునిచ్చాయి. తూర్పు యూరప్ పరిణామాలు, సోవియట్ పతనం తరువాత
ప్రపంచపటంపై అమెరికా ఏక ధృవ విధానం ఆరంభమైంది. అమెరికా నుంచీ ఉత్తేజాన్ని పొందిన సంఘపరివారం భిన్న సంస్కృతుల నిలయంగా ఉన్న భారతదేశంలో ఏక మతస్వామ్యాన్ని నెలకొల్పడానికి సన్నద్దమైంది. తెలుగులో ముస్లింవాద సాహిత్యానికి జాతీయ, అంతర్జాతీయ నేపధ్యం ఇది. ముస్లింవాద
సాహిత్యంలో సామ్రాజ్యవాద వ్యతిరేకత, మరీ ముఖ్యంగా అమెరికా సామ్రాజువాద వ్యతిరేకత, సహజమైన అంతర్భాగం.
తెలుగులో అప్పటిదాక చెదురు మదురుగా వస్తున్న మైనార్టీ కవిత్వం బాబ్రీ మసీదు
విధ్వంసం ఫలితంగా బలం పుంజుకుని వేడెక్కింది. “మైనార్టీ కవిత్వానికి మ్యానిఫెస్టో అనదగ్గ కవిత తెలుగులో ఖాదర్ మొహియుద్దీన్ ‘పుట్టుమచ్చ’ “ అంటారు వ్యాసకర్త.
బాబ్రీ మసీదు ప్రభావాన్నీ, ‘పుట్టుమచ్చ’ ప్రత్యేకతనీ సరిగ్గానే అంచనా వేసిన షమీవుల్లా అందుకు భిన్నంగా ఇదే వ్యాసంలో ఒకచోట “దళిత కవిత్వంలో అంతర్భాగంగా మొదలైన ముస్లిం కవిత్వం 1996 ద్వితీయార్ధంలో ఒక ప్రధాన పాయగా రూపుదిద్దుకుంది”
అంటారు. ఇవి పరస్పర విరుద్ద ప్రకటనలు.
మైనార్టీ కవిత్వానికి మ్యానిఫెస్టో అని షమీవుల్లా
పేర్కొన్న ‘పుట్టుమచ్చ’ 1991లో వచ్చింది. ఆ
కవితను ప్రబావితం చేసిన దళిత కవిత ఏదో షమీవుల్లా ఉదహరించి వుండాల్సింది. వారు ఆ పని చేయలేదు. లేదా పుట్టుమచ్చ తరువాత 1996 వరకు వచ్చిన ముస్లింవాద
కవితలు దళితవాద కవిత్వాన్ని అనుసరించాయని చెప్పడం షమీవుల్లా వుద్దేశ్యమా?
షమీవుల్లా గమనించాల్సిన
ఇంకొక కీలక అంశం ఏమంటే, తెలుగునాట యస్సీ, యస్టీ, బీసీ, మైనార్టీ, స్త్రీ వాద సాహిత్యాలకు ఈనాడు నాయకత్వం వహిస్తున్న వాళ్లందరూ
పూర్వాశ్రమంలో కమ్యూనిజం
గూళ్ళకు చెందిన వారే. అస్తిత్వ సాహిత్య
ఆవిర్భావానికి సంబంధించి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఒక క్రెడిబిలిటీ ఇవాల్సి వస్తే అది నిజంగానే కమ్యునిస్టులకు దక్కాలి. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం ఎక్కడ ఆరంభమయ్యామో మరచిపోతే ఎన్నటికీ గమ్యానికి చేరలేం కనుక.
రచన : 7 ఏప్రిల్ 2006
ప్రచురణ :
ఆదివారం ఆంధ్రజ్యోతి 23 ఏప్రిల్ 2006
(మైనార్టీ కవిత్వం – తాత్విక నేపథ్యం, డాక్టర్ ఎస్. షమీవుల్లా, నవంబరు 2005, మొహరున్నీసా ప్రచురణలు, వెల 75 రూపాయలు. సోల్ డిస్ట్రిబ్యూటర్స్ నవోదయ బుక్ హైస్ హైద్రాబాద్ )
No comments:
Post a Comment