Capital and Communalism
పెట్టుబడి
- మతతత్వం
డానీ
పెట్టుబడీదారులు పరాన్న
జీవులు. వాళ్ళు ఒకవైపు కార్మికుల మీద మరొకవైపు సహజ సంపద మీద ఆధారపడి బలుస్తుంటారు. మానవవనరుల్ని,
సహజ వనరుల్ని, దేశసంపదని పెట్టుబడీదారులకు ధారాదత్తం చేయడం పెట్టుబడీదారీ ప్రభుత్వాల
ప్రధాన కర్తవ్యం. మార్క్సిస్టు పరిభాషలో చెప్పాలంటే పెట్టుబడీదారీ రాజ్యం పెట్టుబడీదారీ
ఆస్తి హక్కును కాపాడుతుంది.
పెట్టుబడీదారులు అత్యాశపరులు
మాత్రమే కాదు దురాశాపరులు కూడ. వాళ్ళ దురాశను సంతృప్తి పరచడం సాంప్రదాయ పెట్టుబడీదారీ
ప్రజాస్వామిక ప్రభుత్వాలకు ఒక్కోసారి సాధ్యం కాదు. పార్లమెంట్రీ ప్రజాస్వామిక ప్రభుత్వాలన్నీ
నాలుగేళ్ళకో, ఐదేళ్ళకో ఒకసారి ఎన్నికలు అనే
పరీక్షలు రాసి ప్రజల ఆమోదాన్ని పొందాల్సి వుంటుంది. ఓటర్లలో పెట్టుబడీదారులు చాలా చాలా
తక్కువగానూ, సామాన్య ప్రజలు చాలాచాలా ఎక్కువగానూ వుంటారు. ప్రభుత్వం పెట్టుబడీదారులకు
మాత్రమే సేవలు చేస్తూ వుంటే ప్రజలు ఊరుకోరు. అచ్చంగా ప్రజల కోసం పనిచేస్తానంటే పెట్టుబడీదారులు
ఊరుకోరు. అప్పటి వరకు ప్రభుత్వాలకు వుండే నామ
మాత్రపు స్వతంత్ర ప్రతిపత్తిని కూడా పక్కకు పెట్టి పెట్టుబడీదారులే నేరుగా ప్రభుత్వాన్ని
నడపడం మొదలెడతారు. పెట్టుబడీదారీ ప్రజాస్వామ్యంలో ఇదొక సంక్షోభ దశ. ఈ సంక్షోభాన్ని
కప్పిపుచ్చడానికి పెట్టుబడీదారులు ఫాసిజం, నాజిజం వంటి మతత్వాన్ని ఆశ్రయిస్తారు. అంటే పెట్టుబడీదారీ నియంతృత్వం ఈ దశలో పెట్టుబడీదారీ
మతతత్వ నియంతృత్వంగా మారుతుంది. విద్యావంతుల్లో చాలామంది మతతత్వ నియంతృత్వంలో సాంస్కృతిక,
ధార్మిక అంశాలనే చూస్తారుగానీ దాని సారాంశమయిన పెట్టుబడీదారీ వ్యవస్థ మూలాన్ని చూడరు.
పెట్టుబడీదారీ మతతత్వ నియంతృత్వం సమాజాన్ని ’మేము - వాళ్ళు,’ ‘మనము – ఇతరులు’ అనే
ప్రాతిపదికన విభజించి, ఆ ఇతరులను తాను అణిచివేస్తానని చెపుతుంది. అలా ఇతరుల్ని అణిచివేయడంవల్ల
వచ్చే అదనపు సంపదను ‘మనం’ పంచుకుని ‘మన’ జీవనస్థాయిని పెంచుకుని సౌఖ్యంగా బతకవచ్చు
అని ఆశపెడుతుంది. ఈ లక్ష్యాలను కొన్ని ప్రభుత్వాలు
ప్రచ్చన్నంగా ప్రకటిస్తే కొన్ని ప్రభుత్వాలు బాహాటంగా ప్రకటిస్తాయి. ఈ ప్రచార ప్రభావంలో
పడిపోయిన మెజారిటీ మతానికి చెందిన సామాన్య సమూహం పెట్టుబడీదారీ వ్యవస్థ మీద పోరాటాన్ని
వదిలివేసి ఆ ‘ఇతరుల్ని’ తన ప్రధాన శత్రువుగా భావించి వాళ్ళ మీద ద్వేషాన్ని కొనసాగిస్తుంది.
ఇలా ప్రజల మధ్య ద్వేషభావం కొనసాగుతున్నంత కాలం ప్రభుత్వం పెట్టుబడీదారులకు మరింత ఎక్కువగా
సేవ చేయగలుగుతుంది. ఈ లక్ష్యాలను సాధించడానికే ఆరెస్సెస్ రెండవ సర్సంగ్ ఛాలక్ ఎం.ఎస్.
గోల్వార్కర్ 1939లో WE and Our Nationhood Defined పుస్తకాన్ని రాశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రభుత్వం
ఏర్పడ్డాక దేశంలో మత అసహన వాతావరణం పెరిగింది. సరిగ్గా ఈ సమయంలోనే అంబానీలు, ఆడానీలు
వంటి భారత మెగా కార్పొరేట్ల సంపద అనేక రెట్లు
పెరిగింది. మరోవైపు దేశంలో నిరుపేదల సంఖ్య పెరిగింది. ఈ మూడు పరిణామాల మధ్య నున్న లంకెను మనం తరచుగా మరిచిపోతుంటాం.
ప్రధాన స్రవంతి మీడియా మనల్ని అలా మరచిపోయేలా చేస్తుంది. భారతదేశంలో ప్రాయోజిత పెట్టుబడీదారీ
విధానాలవల్ల అత్యధికంగా లాభపడి ప్రపంచ మహాసంపన్నుల జాబితాలో చేరిన ముఖేష్ అంబానీయే భారత దేశపు అతి పెద్ద మీడియా సంస్థకు
యజమాని కావడం యాధృఛ్ఛికం ఏమీ కాదు.
ఇటలీ, జర్మనీల్లో
క్రైస్తవ మతతత్వం యూదుల్ని ‘ఇతరులు’గా ప్రచారం చేస్తే, భారతదేశంలో హిందూ మతతత్వం ముస్లింలను
‘ఇతరులు’గా ప్రచారం చేసింది. దీని ఫలితంగా అణగారిన సమూహాలుగా మారిన మైనారిటీలు తమ ఉనికిని
కాపాడుకోవడానికి రెండు విధానాలను అవలంబిస్తాయి.
మొదటిది, మతతత్వ ప్రభుత్వాలను తమకు వీలయిన పధ్ధతుల్లో వ్యతిరేకించడం. రెండోది, సాధారణ మెజారిటీ మత సమూహాలతో మత సామరస్యాన్ని కోరుకోవడం.
ప్రాయోజితకర్తలు వుండని కారణంగా ఈ రెండు విధానాలు మొదట్లో పెద్దగా ప్రభావాన్ని చూపవు.
అయితే పాలకవర్గాలు సాగించే దుష్ప్రచార ప్రభావం మెజారిటీ మత సమూహాలలోని సామాన్య ప్రజల
మీద ఎక్కువ కాలం కొనసాగదు. మెజారిటీ మతతత్వ
ప్రభుత్వాల వల్ల తమకు ప్రయోజనాలకన్న నష్టాలే ఎక్కువ అని త్వరలోనే మెజారిటీ మత సమూహంలోని సామాన్య ప్రజానీకం గుర్తిస్తుంది. అప్పుడు
మాత్రమే మతతత్వ నియంతృత్వపు మరణం ఆరంభమవుతుంది. మతసామరస్యం వికాసం వుధృతమౌతుంది.
ఇంతటి క్రమంలో కమ్యునిస్టులపాత్ర
ఏమిటనేది కీలకమైన ప్రశ్న.
కులం మతం ప్రాంతం
జాతి లింగ బేధాలను కమ్యూనిస్టులు పాటించరాదని ఒక తప్పుడు భావజాలం ప్రచారంలోవుంది. ఇడేమీ
కమ్యూనిస్టు సిధ్ధంతం కాదు. నాస్తికులు, హేతువాదులు మన మనసుల్లో నాటిన నకిలీ విత్తనాల ప్రభావం ఇది. కమ్యూనిస్టులు
కేవలం ఆర్ధిక అణిచివేతను మాత్రమే కాక అన్ని
రకాల అణిచివేతల్ని కూడా పట్టించుకోవాలి. కార్ల్ మార్క్స్, ఫ్రెడ్రిక్ ఎంగిల్స్ ఆర్దిక
శాస్త్రవేత్తలు మాత్రమే కాదు సమాజ శాస్త్రవేత్తలు, రాజకీయ శాస్త్రవేత్తలు, తత్వ శాస్త్రవేత్తలు
వగయిరా వగయిరా. ఫలానా విషయాన్నిగానీ, ఫలానా
సమస్యను గానీ పట్టించుకోము అని ఎవరయినా అంటే వాళ్ళు కమ్యూనిష్టులు కారు. వాళ్ళు పలాయనవాదులు,
సమస్యను పక్కదారి పట్టించేవాళ్ళు. అలాకాకుండా, సమస్త రంగాలలో అణిచివేతకు గురయ్యే (vulnerable) సమూహాల పక్షాన నిలబడడమే
మార్క్సిస్టుల కర్తవ్యం.
ఆర్ధిక రంగంలో శ్రామికులు
అనేవాళ్ళు అణిచివేతకు గురయ్యే సమూహాలు అయినట్లే,
లింగవ్యవస్థలో స్త్రీలు, కులవ్యవస్థలో ఆదివాసులు, దళితులు, బహుజనులు, మతవ్యవస్థలో
మైనారిటీలు అణిచివేతకు గురయ్యే సమూహాలు అవుతాయన్న అవగాహనకు రావడానికి నక్సలైట్లతోసహ
భారత కమ్యూనిస్టు పార్టీలకు చాలా కాలం పట్టింది.
ఇప్పటికీ ఆ క్రమం అన్యమనస్కంగానే కొనసాగుతోంది. ఎన్నికల్లో లబ్ది కోసం దళితులు, బహుజనులు, మైనార్టీలు, వామపక్షవాదులు కలవాలి అని ఇప్పుడు అంటున్నారే తప్ప
నిజానికి కమ్యూనిస్టు పార్టీల నుండి దళితులు, బహుజనులు, మైనారిటీలను తరిమేసింది అక్కడ
తిష్టవేసిన భద్రలోకపు సమూహం అని ఇప్పుడయినా ఒప్పుకుంటున్నారా?
తొలి భారత కమ్యూనిస్టు
పార్టిని తాష్కెంట్ లో ప్రారంభించింది ముస్లింలుకాదా?
భారత కమ్యూనిస్టు పార్టి వ్యవస్థాపనలో ఖాజీ నజ్రుల్ ఇస్లాం, ముజఫ్ఫర్ అహ్మద్ నిర్వహించిన
పాత్రను ఎలా మరచిపోగలం? తొలితరం అభ్యుదయ రచయితల్లో 90 శాతం (అవును. మీరు వింటున్నది
నిజం) ముస్లింలేకదా? ఎందుకు ఆ పరిస్థితి తిరగబడిందీ? మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సమస్త రంగాలలోనికి
కమ్యూనిస్టు భావాలను వ్యాప్తి చేయకుండా సమాజ
విముక్తిని ఆశించలేం.
అణిచివేతకు గురయ్యే
అనేక సమూహాలు తమతమ సమస్యల పరిష్కారాన్ని ఆశిస్తూ కమ్యూనిస్టు పార్టీలను వెతుక్కుంటూ
వచ్చి చేరుతుంటాయి. ప్రతి సమూహం తన నిర్ధిష్ట సమస్యకు నిర్ధిష్ట కమ్యూనిస్టు పరిష్కారాన్ని
కోరుకుంటుంది. తమ సమస్య కమ్యూనిస్టు పార్టీల కార్యక్రమంలోనే లేదని తెలిసినపుడు ఆ సమూహాలన్నీ స్వంత గూటికి తిరిగి వెళ్ళిపోతాయి. వాటి ఫలితాలనే
ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈ సమస్య ఇతరదేశాల్లో ఈ స్థాయిలో లేదు.
రెండవ ప్రపంచ యుధ్ధంలో
రష్యా మీద హిట్ల ర్ దాడి చేయడానికి యూదు కోణం వుందని మనం మరచిపోకూడదు. రష్యన్ రైతులు
అత్యధికులు యూదులు. వాళ్ళ భూముల్లోనే వాళ్ళను వ్యవసాయ కూలీలుగా మార్చి, వాళ్ళు పండించిన
పంటను ఇటలీకి తీసుకుని పోవాలని హిట్లర్ ఆశించాడు. ఈ విషయాన్ని అతను చాలా కాలం ముందుగానే
తన పుస్తకం ‘మైన్ కెంఫ్’ లో స్పష్టంగా రాసుకున్నాడు. నాజీ వ్యతిరేక పోరాటంలో యూదుల ప్రాధాన్యతను
ఛార్లీ చాప్లిన్ 1930వ దశకంలోనే గుర్తించాడు.
1940లో విడుదలైన “ద గ్రేట్ డిక్టేటర్’ లో ప్రొటోగోనిస్ట్ ఒక యూదు మంగలి (పేరు ‘ప్రైవేట్’). రెండవ ప్రపంచ యుధ్ధ కాలపు రష్యన్ సాహిత్యంలోనూ మనకు
యూదు కథా నాయకులు తరచుగా కనిపిస్తారు.
చాప్లిన్ సినిమాను
మనం 78 సంవత్సరాలుగా చూస్తూనే వున్నాం. చూసిన ప్రతిసారీ దాన్ని విపరీతంగా మెచ్చుకుంటేనే
వున్నాం. హిట్లర్ ను ఎదుర్కొవాల్సిన వాడు ఒక యూదుడై ఎందుకు వుండాలి? అనే సందేహం మాత్రం మనకు ఎన్నడూ తట్టలేదు. అలా తట్టివుంటే
భారత దేశంలో హిందూత్వ మీద రాజీలేని పోరాటాన్ని
ఎవరు చేయగలరో సులువుగా తెలిసిపోయేది. కానీ ఆ సినిమాను చూసింది కమ్యూనిస్టులు
కాదుకదా! వాళ్ళు హేతువాద, నాస్తికవాద ముసుగుల్లో
దాగి “మేము కులమతాలను పట్టించుకోము” అని ఘనంగా ప్రకటించుకునే భద్రలోకపు సమూహం.
(రచయిత ముస్లిం ఆలోచనాపరుల
వేదిక కన్వీనర్)
రచన : హైదరాబాద్,
30 ఆగస్టు 2018
ప్రచురణ : మనతెలంగాణ, 7 సెప్టెంబరు 2018
No comments:
Post a Comment