ఆదివారం ఆంధ్రజ్యోతి లో ప్రచురణకు పరిశీలించగలరు.
పర్షియన్ సినిమాకు తిరుగుబాటే ప్రాణం
డానీ
ప్రపంచ సాంస్కృతిక కదలికలకు ఇరాన్ ఒక భారమితి. ఇరాన్ ను గమనిస్తేచాలు ప్రపంచ సాంస్కృతిక వాలు ఎటుందో అర్ధం అయిపోతుంది. గాలివాటం తూర్పు నుండి పశ్చిమానికి వుందో, పశ్చిమం నుండి తూర్పుకు వుందో తేలిపోతుంది.
ఇరాన్ లో రాత్రికి రాత్రి పబ్బులు, క్లబ్బులు, క్యాసినోలు వెలుస్తాయి. హఠాత్తుగా అవన్నీ మాయమైపోయి ఒక ఛాందస సంస్కృతిక వాతావరణం నెలకొంటుంది. ఇలాంటి ఆటుపోట్ల మధ్యన ఇరాన్ సినిమా ఎదుగుతూ వుంటుంది. అక్కడి రాజకీయ వాతావరణాన్నీ, సాంస్కృతిక నిబంధనల్ని, ప్రభుత్వ నిర్బంధాన్నీ అర్ధం చేసుకోకుండా ఇరాన్ సినిమాలను అర్ధం చేసుకోలేము. ఆ నిర్బంధం నుండి పుట్టడంవల్ల కావచ్చు ఈరాన్ సినిమాలు భిన్నంగానేగాక, భావోద్వేగాల్ని లోతుగా గట్టిగా ఒడిసి పట్టుకుంటుంటాయి.
అన్నిదేశాల్లోనూ వున్నట్టే ఇరన్ లోనూ వాణిజ్యసినిమా, కళాత్మక సినిమా అనే రెండు విభాగాలుంటాయి. ఇరాన్ వాణిజ్య సినిమాల గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిందేమీలేదు. అవన్నీ హాలివుడ్ పోకడలతో మన తెలుగు సినిమాల్లానే వుంటాయి. ఇరాన్ సినిమాల గురించి చెప్పుకోవాల్సింది అక్కడి కళాత్మక సినిమాల గురించి. ప్రఖ్యాత ఆస్ట్రియా దర్శకుడు మైఖేల్ హనెకె, జర్మన్ ఫిల్మ్ మేకర్ వెర్మర్ హర్జోగ్ తదితరుల మాటల్లో చెప్పాలంటే “ఇరానియన్ సినిమా అంటే ప్రపంచపు గొప్ప కళాత్మక సినిమా”.
బర్హమ్ బెజాయి
ఇప్పుడు ఇరాన్ కళాత్మక సినిమా డైరెక్టర్లు గొప్పవాళ్లని మనం కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. వాళ్ళు గొప్ప తిరుగుబాటుదారులు కూడా. తిరుగుబాటుల నుండే గొప్ప డైరెక్టర్లు పుడతారన్నా తప్పుకాదు. 1960వ దశకంలో ప్రారంభమయిన ఇరాన్ కళాత్మక సినిమా సాంప్రదాయపు మొదటి తరానికి బహరమ్ బేజాయ్, నాసర్ తగ్వాయి ప్రాతినిధ్యం వహంచగా, రెండో తరానికి కరీమ్ మాసిహీ, అబ్బాస్ కయిరోస్టామీ ప్రాతినిధ్యం వహించారు. ఇప్పటి తరానికి రఫీ పిట్స్, అస్గర్ ఫర్హదీ, మాజిద్ మాజిద్ తదితరులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి సంఖ్య ప్రతి ఏడాదీ ప్రుగుతూనేవుంది.
మాజిద్ మాజిద్
Photos of
ఇరాన్ సినిమా సృష్టికర్తలు అనేక దేశాల్లో అనేక అవార్డులు, ప్రశంసలు అందుకున్నప్పటికీ స్వదేశంలో వాళ్ళ పరిస్థితి వేరు. ఇరాన్ సినిమా సృష్టికర్తలు పశ్చిమ దేశాలకు చెందిన ఉదారవాదుల ప్రభావంతో సినిమాలు తీస్తున్నారని అక్కడి ఛాందసవాదులు తరచూ విమర్శిస్తుంటారు. ఇలాంటి అపవాదుల కారణంగా అనేకమంది దర్శకులు అరెస్టు అయ్యారు. లేదా దేశం వదిలిపోయారు. అయినప్పటికీ ఇరాన్ లో కళాత్మక సినిమా స్రవంతి నిరాఘాటంగా కొనసాగుతూనే వుంది.
జుదాయి (Separation)
అస్గర్ ఫర్హదీ తీసిన ‘సెపరేషన్’ (జుదాయి) సినిమా 2012లో అస్కార్ అవార్డుల ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్ పొందినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇరాన్ సమాజం తీవ్ర కల్లోలాన్ని ఎదుర్కొంటున్నట్టూ, ఇరాన్ సమాజంలో దాంపత్య జీవితం విఛ్ఛిన్నం అవుతున్నట్టూ, ఇరాన్ యువతరం దేశాన్ని వదిలి వెళ్ళిపోవడానికి సిధ్ధం అవుతున్నట్టూ ఈ సినిమాలో చూపించారని ఛాందసులు పెద్ద ఎత్తున విమర్శలు కురిపించారు.
అస్గర్ ఫర్హదీ
ఆ ఏడాది ఇజ్రాయిల్ కు చెందిన ‘ఫుట్ నోట్’ సినిమా ఇచ్చిన గట్టిపోటీని తట్టుకుని ‘సెపరేషన్’ సినిమా అంతిమ విజయాన్ని సాధించింది. దానితో ఇరాన్ లో ఛాందసులు కూడా సంతృప్తి చెందారు. ఇజ్రాయిల్ ను అరబ్ దేశాలు శత్రుదేశంగా భావిస్తాయని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇరాన్ లో సినిమా తీయడం కత్తి మీద సాములాంటిదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే.
ప్రపంచ వ్యాప్తంగా ప్రాచూర్యంలోవున్న అనేక ప్రేమకథలకు ఆద్యుడు పన్నెండవ శాతాబ్దపు పర్షియన్ కవి నిజామీ గంజావీ. లైలా -మజ్నూ, షీరీన్- ఖోస్రో (ఫర్హాద్) తదితర ప్రేమకావ్యాల్ని పర్షియన్ భాషలో రాసింది అతనే. ప్రేమ, విరహం, వియోగం తదితర భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి పర్షియన్ భాషలో వున్నన్ని వ్యక్తీకరణలు మరే భాషలోనూ లేవంటారు. అప్పటి పర్షియానే ఇప్పటి ఇరాన్ ప్రాంతం.
ప్రేమ కథా చిత్రాలు చూసి యువతరం పాడైపోతున్నదని ఆమధ్య ఈరాన్ లో ఛాందసవాదులు పెద్ద ఆందోళన వ్యక్తం చేశారు. వీటి ప్రభావం పురాతన కావ్యాలకు కూడా తాకింది. ఇరాన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ ఆ మధ్య షీరీన్- ఖోస్రో కావ్యం పునర్ ముద్రణకు అనుమతి నిరాకరించింది. యుధ్ధంలో ఖోస్రో చనిపోవడంతో షీరీన్ ఆత్మహత్య చేసుకుంటుంది. అంతకు ముందు ఆమె ఖోస్రో భౌతిక కాయాన్ని కౌగలించుకుని ఏడుస్తుంది. ఆ సన్నివేశం మీద ఇరాన్ సాంస్కృతిక వ్యవహారాల శాఖ అధికారులు తీవ్ర ఆక్షేపణ తెలియజేశారు. దానితో ఆ పుస్తక ప్రచురణ ఆగిపోయింది. దాదాపు వెయ్యేళ్ళ తరువాత ఆ పుస్తకం నిషేధానికి గురయింది.
అబ్బాస్ కియారోస్తామీ
ఇరాన్ సినిమా దర్శకులు తెలివైనవాళ్ళు. ప్రభుత్వ ఆక్షేపణల నుండి తప్పించుకోవడం వాళ్లకు బాగా తెలుసు. సుప్రసిధ్ధ ఇరాన్ దర్శకుడు అబ్బాస్ కియారోస్తామీ ఒక కొత్త ఎత్తుగడతో 2008లో షీరిన్ అనే సినిమా తీశాడు. ఈ సినిమాలో షీరిన్ వుండదు, ఖోస్రో వుండడు. అసలు ఆ కావ్యానికి చెందిన ఒక్క పాత్ర కూడా వుండదు. ఒక సినిమా హాలులో షీరీన్ అనే ఒక పాత సినిమాను ప్రదర్శిస్తుంటారు. హాలు నిండా మహిళా ప్రేక్షకులే వుంటారు. మొత్తం సినిమాలో ఒక్కసారి కూడా తెరను చూపరు. మాటలు, గుర్రాల సకిలింపులు, యుధ్ధంలో కత్తుల ఘర్షణ వగయిరాలన్నీ నేపథ్యంలో వినపడుతుంటాయి. షీరీన్ సినిమా చూస్తున్న మహిళా ప్రేక్షకుల భావోద్వేగాలను అత్యంత దగ్గర నుండి చూపడమే అబ్బాస్ కియారోస్తామీ సినిమా ప్లాట్.
షీరిన్ (2008)
అరబ్, ఫ్రాన్స్ దేశాలకు చెందిన దాదాపు వంద మంది హీరోయిన్లు ఇందులో నటించారు. దాదాపు అందరూ ఒకే రకమైన దుస్తుల్లో వుంటారు. అన్నీ క్లోజప్ షాట్లే వుంటాయి. లాంగ్ షాట్, మీడియం షాట్ వగయిరాలు ఏమీ వుండవు. కెమేరా ప్యాన్, టిల్ట్, రొటేట్ కూడా అవ్వదు. జూమ్ అనే ప్రసక్తే లేదు. కెమేరాను ఒక చోట పాతేసి ఒక్కో నటిని దాని ముందు కూర్చోబెట్టి సన్నివేశానికి తగ్గట్టు భావోద్వేగాల్ని ప్రదర్శించమన్నాట్టా అబ్బాస్ కియారోస్తామీ. ఈ సినిమాను అబ్బాస్ లివింగ్ రూమ్ లోనే తీశారంటారు. అలా వుంటుంది పర్షియన్ దర్శకుల తిరుగుబాటు.
ఇరాన్ లో నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న మరో దర్శకుడు జఫర్ పనాహి. అబ్బాస్ కియారోస్తామీ దగ్గర చాలాకాలం సహాయకునిగా పనిచేసిన జఫర్ 1995లో స్వీయదర్శకత్వంలో నిర్మించిన తొలిచిత్రం వైట్ బెలూన్ తోనే తన సామర్ధ్యాన్ని చాటి చెప్పాడు. ఓ ఏడేళ్ళ చిన్న పిల్ల కొత్త సంవత్సరం రోజు ఇంట్లో అక్వారియంలో పెంచుకుందామని గోల్డ్ ఫిష్ కొనడానికి వెళ్ళి పడిన పాట్లను చిత్రించిన ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్రలో గొప్ప స్థానాన్ని సాధించేసింది.
జఫర్ పనాహి
తన సినిమాల్లో ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నందుకు జఫర్ పనాహిని 2010లో అరెస్టు చేశారు. పౌరహక్కుల సంఘాల ఆందోళన ఫలితంగా అతనికి బెయిల్ వచ్చినప్పటికీ ఒక ఇరవైయేళ్ళపాటు సినిమాలు తీయకూడదనీ, విదేషాలకు వెళ్ళకూడదనీ నిషేధం కొనసాగుతూనేవుంది. అలాంటి నిర్బంధంలోనూ జఫర్ పనాహి సినిమాలు తీయడం మానలేదు. వాటి కోసం కొత్త టెక్నిక్ కగొన్నాడు. 2011లో తీసిన దిసీజ్ నాట్ ఏ ఫిల్మ్, 2013లో తీసిన క్లోజ్డ్ కర్టైన్ అతని ప్రసంసలు అవార్డులు తెచ్చిపెట్టాయి. ఆ వరసలో తీసిన డాక్యూ ఫిక్షన్ టాక్సీ (టాక్సీ టెహరాన్). గతేడాది బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా గోల్డేన్ బేర్ ను అందుకుంది.
టెహరాన్ జీవితాన్ని ఆవిష్కరించడమే పనాహి ట్రయాలజీ సినిమాల లక్ష్యం. టెహరాన్ లో టాక్సి డ్రైవరుకు కారులో సాగిన ఒకరోజు అనుభవమే ఈ సినిమా. నిబంధనల రీత్యా కెమేర ఎక్కడా కారు దిగదు. డ్రైవర్ స్థానంలో పనాహీ వుంటాడు. ట్యాక్సీ ఎక్కే రకరకాల ప్యాసింజర్స్ తో జరిగే సంభాషణే ఈ సినిమా. ప్యాసింజర్లలో ఆడవాళ్ళు, మగవాళ్ళు, పేదలు, ధనవంతులు, హైస్కూలు పిల్లలు, సనాతనులు, ఉదారవాదులు, పైరసీ సీడీలు అమ్మేవాళ్ళు, మానవహక్కుల కార్యకతలు వుంటారు. సినిమాలు ఎలా తీయాలనే చర్చతోపాటూ, క్రీడారంగంలో మహిళల ప్రాతినిధ్యం పెంచాలంటూ పోరాడుతున్న ఇరాన్ న్యాయవాది గొంచే ఘవామీ (Ghoncheh Ghavami) అరెస్టు గురించి కూడా ప్యాసింజర్లు చర్చిస్తారు. ఇందులో ప్యాసింజర్లుగా కనిపించేవారెవరూ వృత్తినటులు కాదు. మానవహక్కుల న్యాయవాది నస్రీన్ సొతౌదే, పనాహి మేనకోడలు హైస్కూలు విద్యార్ధి హనా సయీదీ తమ నిజజీవిత పాత్రల్లో కనిపిస్తారు. నిషేధం కారణంగా బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు జాఫర్ పనాహీ వెళ్లలేకపోయాడు. గోల్డేన్ బేర్ ట్రోఫినీ అతని మేనకోడలు హనా సయీదీ అందుకుంది. బెర్లిన్ జ్యూరీ అధ్యక్షుడు డారెన్ అరొనోఫ్ స్కీ ఉత్తమ చిత్రం అవార్డును అందజేస్తూ ‘టాక్సీ’ ని "a love letter to cinema...filled with love for his art, his community, his country and his audience." అంటూ కొనియాడాడు.
ఇరాన్ ఆర్ట్ ఫిలిమ్స్ ప్రేరణతో ఇటలీలో నియో రియలిజమ్ సినిమా వికసించిందని అందరికీ తెలుసు. ఇప్పుడిప్పుడే దీని ప్రభావం హైదరాబాద్ లోనూ కనిపిస్తోంది. జఫర్ పనాహీ మీద ప్రేమతో రోహిత్-శశి సంయుక్తంగా దర్శకత్వంలో అనిల్ అఖ్తర్ ఖాన్ చౌదరి నిర్మించిన ‘ఏ లవ్ లెటర్ టు సినిమా’ను ఇటీవల హైదరాబాద్ లో ప్రదర్శించారు. ఈ త్రయం హైదరాబాద్ మీద నిర్మించిన సినిమాలత్రయంలో ఇది మూడోది. హైదరాబాద్ లోని సినీజీవుల కష్టాల్ని ఈ సినిమా చిత్రిస్తుంది.
(రచయిత సీనియర్ పాత్రికేయులు)
మొబైల్ : 9010757776