Wednesday 17 March 2021

Swearing-in Ceremony

 Swearing-in Ceremony


ప్రమాణ స్వీకారం 

కథ-కథనం-సంభాషణలు

డానీ


దర్శకత్వం

వివియన్ సతీష్ 


Studio 

Amaravati Digital Studios


DOP  

Arun IKC 


Producer

Anil AKC


Web Partner







ప్రమాణ స్వీకారం 



పాత్రలు పాత్రధారులు

  1. సీయం - వేములవాడ అప్పల నాయుడు భరద్వాజ ఆర్. 

  2. ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  

  3. ఎంఎల్ ఏ- కేసముద్రం కేశవరావు   

  4. ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   

  5. గవర్నర్




SCENE - 1

RAJBHAVAN  – DAY (Morning) – EXT 


మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరుగుతోంది.

రాజ్ భ్వన్ ఆవరణ గవర్నర్, ముఖ్యమంత్రితోపాటూ, శాసన సభ్యులు, అధికారులు, పార్టీ ప్రముఖులతో కిటకిటలాడుతోంది.  


గవర్నర్ :

ఐ …


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

చింతకాయల రవి ప్రసాద్ అనే నేను మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. ముఖ్యమంత్రి అనుగ్రహంతోవల్ల దొరికిన ఈ పదవి ద్వార నాకు లభించిన దానిలో సరిగ్గా సగభాగాన్ని తూకం వేసి ఎప్పటికప్పుడు వారి సీక్రెట్ బ్యాంకు ఖాతాలో జమ చేయగలవాడను. 


గవర్నర్ :

ఐ …


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

చింతకాయల రవి ప్రసాద్ అనే నేను మెలుకువలోగానీ, కలలోగానీ మా ముఖ్యమంత్రి సీక్రెట్ బ్యాంకు అకౌంట్  నెంబరును ఏ కోర్టు ముందుగానీ, ఏ కమీషన్ ముందుగానీ, ఏ మీడియా ముందు గానీ, చివరకు నా భార్య పిల్లలతోగానీ చెప్పనుగాక చెప్పనని మా ముఖ్యమంత్రి మీద ప్రమాణం చేసి చెపుతున్నాను.



ప్రమాణ స్వీకారం పూర్తికాగానే  చింతకాయల రవి ప్రసాద్ వెళ్ళి పక్కనే వున్న ముఖ్యమంత్రికి నమస్కారం చేశాడు. 


ముఖ్యమంత్రి  :

ప్రసాద్! మన పార్టీ  సాంప్రదాయం నిలబడి నమస్కారం చేయడంకాదు. నేను దేన్నయిన సహిస్తాను గానీ విలువల్ని మరచిపోతే సహించను. విలువలు ముఖ్యం.


చింతకాయల రవి ప్రసాద్ వెంటనే ముఖ్యమంత్రి కాళ్ల మీద పడ్డాడు. 

ఆ తరువాత తన సీటు వైపుకు వెళ్ళిపోయాడు. 

ఇప్పుడు మరో శాసన సభ్యుడు వచ్చాడు.   


గవర్నర్ :

ఐ …


ఎంఎల్ ఏ కేసముద్రం కేశవరావు   :

కేసముద్రం కేశవరావు  అనే నేను మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడుగారి కుమారుడు వేములవాడ చినబాబుగారి  మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. చినబాబు  అనుగ్రహంవల్ల దొరికిన ఈ పదవి ద్వార నాకు లభించిన దానిలో సగభాగాన్ని ఎప్పటి కప్పుడు ఎవరికీ తెలియకుండా వారికి చేరవేయగలవాడను.  


గవర్నర్ :

ఐ …


ఎంఎల్ ఏ కేసముద్రం కేశవరావు   :

కేసముద్రం కేశవరావు  అనే నేను మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడుగారి కుమారుడు వేములవాడ చినబాబు గారికి తెలియకుండా ఒక్క ఫైలుపై  కూడా సంతకంగానీ, వేలిముద్రగానీ, కాలిముద్రగానీ, ముట్టిముద్రగానీ, గిట్టముద్రగానీ వేయనని ప్రమాణం చేస్తున్నాను. 


ప్రమాణ స్వీకారం కాగానే కేసముద్రం కేశవరావు  ముఖ్యమంత్రి  దగ్గరికిపోయి కాళ్ల మీద పడి తన సీటు వైపుకు వెళ్ళిపోయాడు.  

ఇప్పుడు ఇంకో  శాసన సభ్యుడు వచ్చి నిలబడ్డాడు.    



గవర్నర్ :

ఐ …

ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

చిడతల అహోబిలరావు  అనే నేను మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడుగారి చినబావమరిది గుద్దుల సాయి నాయుడు గారి  మీద ప్రమాణం చేసి చెపుతున్నాను. చినబావమరిది అనుగ్రహంవల్ల దొరికిన ఈ పదవి ద్వార నాకు లభించే దానిలో సగభాగాన్ని ముందుగానే వారి ఇంటికి స్వయంగా చేరవేయగలవాడను.  


గవర్నర్ :

ఐ …


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

చిడతల అహోబిలరావు అనే నేను మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు గారి చినబావమరిది గుద్దుల సాయినాయుడుగారికి తెలియకుండా ఊపిరి కూడా పీల్చనని ప్రమాణం చేస్తున్నాను. 



చిడతల అహోబిలరావు కూడా ముఖ్యమంత్రి కాళ్ల మీద పడి తన సీటు వైపుకు వెళ్ళీపోయాడు.  


SCENE - 1

CM CHAMBER – DAY (Evening) – INT 


కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు.

ముఖ్యమంత్రి తన సీట్లో కూర్చొని వున్నారు. 

కొత్తగా మంత్రి పదవులు దక్కించుకున్నవారు ఆయన ముందు చేతులుకట్టుకుని నిలబడి వున్నారు. 


ముఖ్యమంత్రి :

చూడు చింతకాయల రవి ప్రసాద్! నీ నాలుక ఒకసారి చూపించూ. 


రవి ప్రసాద్ నాలుక సాగదీసి చూపించాడు. 


ముఖ్యమంత్రి :

ఇంకాస్త సాగదియ్యి. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

ఆ. 

అంటూ నాలుకను ఇంకా సాగదీశాడు. 

ముఖ్యమంత్రి :

గుడ్. నేను మనిషిని బట్టి పదవులు ఇవ్వను. అర్హతను బట్టి పదవులు ఇస్తాను. మన ఎమ్మెల్యేల్లో అందరికన్నా పెద్ద నోరు, అందరికన్నా పొడుగాటి నాలుక నీకే వున్నాయి.  అందుకే నీకు మంత్రిపదవి ఇచ్చాను. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

సార్! ఇంతకీ నా శాఖ ఏమిటో చెప్పలేదు. 


ముఖ్యమంత్రి :

బ్రదర్ ! నీకు కీలకమైన శాఖ ఇస్తున్నాను. తిట్లశాఖ. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

తిట్ల శాఖా!


ముఖ్యమంత్రి :

అవును బ్రదర్! పనిచేయడానికి చాలా స్కోప్ వున్న శాఖ. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

సార్! నాకు తిట్ల మీద మంచి పట్టువుంది. ఇక చూడండి అదరగొట్టేస్తా. 


ముఖ్యమంత్రి :

నువ్వు డైలీ  ఐదుసార్లు ప్రతిపక్ష నేత మీద తిట్ల దండకం చదవాలి.  ఉదయం లేవంగానే తిట్టాలి. మధ్యాహ్నం భోజనానికి ముందు ఒకసారి, భోజనం తరువాత ఇంకోసారి తిట్టాలి. సాయంత్రం చిరుతిండి తినడానికి ముందు నాలుగోసారి తిట్టాలి. ఇక రాత్రి పడుకోవడానికి ముందు ఐదోసారి తిట్టాలి. సింపుల్ జాబ్. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

సార్! చిన్న ప్రాబ్లం. ప్రతి రోజూ  ఐదుసార్లు ప్రతిపక్ష నేతను తిట్టాలంటే అంత కంటెంట్ మన దగ్గర వుండదుసార్. తిట్టిందే తిట్టాలి. 


ముఖ్యమంత్రి :

బ్రదర్! నువ్వు ప్రతిపక్షనేతను తిడుతుంటే చాలు. ఏం తిట్టాలి అన్నది మా అబ్బాయి చూసుకుంటాడు.  పవన్ కళ్యాణ్ కు డైలాగులు త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసినట్టు నీకు తిట్లు మా అబ్బాయి రాసి పెడతాడు. 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

చాలా థ్యాంక్స్ సార్! ఈమాత్రం కోఆపరేషన్ వుంటే చెలరేగిపోతా. 

ముఖ్యమంత్రి :

దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గరి నుండి. అధికార పక్షం ప్రతిపక్షాన్ని, ప్రతిపక్షం అధికారపక్షాన్ని ఎప్పుడెప్పుడు ఏఏ తిట్లు తిట్టిందో మా అబ్బాయి దగ్గర టోటల్ డిజిటల్ రికార్డు వుంది. ఆ సీడీ తీసుకుని మీ దగ్గర వుంచుకోండి. రిఫరెన్స్ గా వుంటుంది. మీరంతా హైటెక్కుగా మారాలి బ్రదర్! 


ఎంఎల్ ఏ - చింతకాయల రవి ప్రసాద్  :

సార్!  రేపటి నుండి మీరే చూస్తారుగా నా నాలుక పవరేంటో. 


ముఖ్యమంత్రి :

దట్ షుడ్ బీ ద స్పిరిట్. అవసరం అయితే మా అబ్బాయితో స్పెషల్ క్లాసులు అరేంజ్ చేస్తాను. 


చింతకాయల రవి ప్రసాద్  పరవశించిపోయాడు. 

ముఖ్యమంత్రి కేశవరావువైపు చూశాడు. 


ముఖ్యమంత్రి :

కేశవరావు!  నీకు చాలా మంచి శాఖ ఇస్తున్నాను. అబధ్ధాల శాఖ 


ఎంఎల్ ఏ కేసముద్రం కేశవరావు   :

నేనంటే మీకు ఎప్పుడూ అభిమానమే సార్! నేను ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడే పనిలో దిగిపోతా. 


ముఖ్యమంత్రి :

మీడియావాళ్ళు ఏ ప్రాజెక్టు గురించి అయినా సరే ఎప్పుడు చేస్తారు? అని నిన్ను అడగగానే “ఎప్పుడో చేసేశాం” అని చెప్పడమే నీపని. ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని నిర్మాణం ఎప్పుడు మొదలెడతారూ? అని మీడియావాళ్ళు అడిగారనుకో. అది పూర్తయి పాతికేళ్ళు అయిందని చెప్పాలి. 


ఎంఎల్ ఏ కేసముద్రం కేశవరావు   :

మన రాజధానిలో అభివృధ్ధి రేటు ఫోర్ డిజిట్ వుందని కూడా చెపుతాను. 


ముఖ్యమంత్రి :

నాకు తెలుసు కేశవరావు!  నేను ఒకటి చెపితే చాలు నువ్వు నాలుగు చేస్తావు. 


ఎంఎల్ ఏ కేసముద్రం కేశవరావు   :

థ్యాంక్యూ సార్! 


ముఖ్యమంత్రి ఒక చిరునవ్వి అహోబిలరావు  వైపు చూశాడు. 


ముఖ్యమంత్రి :

అహోబిలరావూ! నీకు ఏ శాఖ కావాలీ? 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

సార్ నాకు ఏ శాఖా వద్దు. కేబినెట్ మీటింగులో నన్ను మీ  కాళ్ళ దగ్గర వుండనివ్వండి. అది  చాలు నాకు. 


ముఖ్యమంత్రి :

అన్నీ ఆలోచించి నీకు భజన శాఖ ఇస్తున్నాను. 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

నా నుండి మీరు ఏం ఆశిస్తున్నారో నాకు తెలుసు సార్! మీరు ఊ అనండి ఇప్పుడే రంగంలో దిగిపోతాను. 


ముఖ్యమంత్రి :

బ్రదర్! ఇప్పుడు కొన్ని భజనలు వినిపించు. 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

అమేరికాను కనిపెట్టింది కొలంబస్ అయితే, కొలంబస్ అమేరికా చేరడానికి  మ్యాప్ గీసి ఇచ్చింది మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు.


ముఖ్యమంత్రి :

గుడ్. 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

ఆరోజుల్లో బిల్ క్లింటన్ హైదరాబాడ్ వచ్చి అమేరికా ప్రెసిడెంట్ అవ్వమని మా ముఖ్యమంత్రిని కాళ్ళావేళ్ళాపడి బతిమాలాడు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం అమేరిక అధ్యక్ష పదవిని వదులుకున్న మహానుభావుడు మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు.


ముఖ్యమంత్రి :

గుడ్. అయితే ఇంకోటి కూడా యాడ్ చేయాలి. అప్పుడు ఆ సలహాను నాకు మా అబ్బాయి ఇచ్చాడు. 




ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

బిల్ గేట్స్ కు కంప్యూటర్ క్లాసులు చెప్పిన ఘనుడు మా ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు.


ముఖ్యమంత్రి :

బిల్ గేట్స్ కంప్యూటర్లో వైరస్ వస్తే బాగుచేయడానికి నన్నే పిలుస్తాడు. ఇది కుడా యాడ్ చేయి. 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

రాష్ట్రంలో కరువును తరిమికొట్టిన మహానుభావుడు మా  ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు. గంగా - బ్రహ్మపుత్రా  నదుల్ని లాక్కొచ్చి తెలుగు నదులతో అనుసంధానం చేసిన కలియుగ భగీరధుడు మా  ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు.


ముఖ్యమంత్రి :

చూడు బ్రదర్ దీని కూడా కొంత యాడింగ్ చేయాలి.


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

మీరు చెప్పండి సార్ వెంటనే యాడ్ చేసేస్తాను.


ముఖ్యమంత్రి :


నాది ఇంటర్నేషనల్ ఇమేజి. చైనా నుండి యాంగ్సీ నదిని, అఫ్రికా నుండి నైలు నదిని, యూయస్ నుండి మిస్సోరి, మిసిసిపి నదుల్ని సౌత్ అమేరికా నుండి అమేజాన్ నదిని తెచ్చి మన నదులతో  అనుసంధానం చేస్తా. 


ఎంఎల్ ఏ -  చిడతల అహోబిలరావు   :

సార్!  ఆ పేర్లన్నీ గుర్తు పెట్టుకోవడం నాకు చాలా కష్టం. అంచేత సింపుల్ గా ఒక పని చేస్తా. ఒక్క ముక్కలో ఈ సృష్టిని సృష్టించిందే మా  ముఖ్యమంత్రి వేములవాడ అప్పల నాయుడు అని చెపుతా. 


ముఖ్యమంత్రి :

అది కూడా మా అబ్బాయి సలహా మేరకు సృష్టించాను అని చెప్పు.


అహోబిల రావు కళ్ళు తేలేశాడు.

ముఖ్యమంత్రి చిద్విలాసంగా నవ్వారు. 


END


No comments:

Post a Comment