Thursday 11 March 2021

Movie : Perversities of late (stage) Capitalism – PARASITE movie

 Movie : Perversities of late (stage) Capitalism – PARASITE movie

పెట్టుబడీదారీ వృధ్ధదశ - ‘పారసైట్’ సినిమా

 

దక్షణ కొరియా దర్శకుడు బోంగ్ జూన్ హో 2019లో నిర్మించిన ‘పారసైట్’ సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. కొందరైతే దీనిని  2010వ శతాబ్దపు మహోన్నత సినిమాగా భావిస్తున్నారు. ఇంగ్లీషు సినిమా కానప్పటికీ బెస్ట్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ మూవీ విభాగాల్లో ‘పారసైట్’ నాలుగు ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది.  తాత్విక ప్రగాఢతతోపాటూ వర్తమాన సమాజాన్ని కొత్త కోణంలో చిత్రించడం ఈ సినిమాలొ ఒక విశేషం.

 

సృష్టిలో ప్రతిజీవికీ తన జీవికను కాపాడుకోవడం ప్రాధమిక ధర్మం. మనం ఇప్పుడు ఆహార సేకరణ సమాజంలో లేము; ఆహార ఉత్పత్తి సమాజంలో వున్నాం. వర్తమాన సమాజంలో జీవికను నిలబెట్టుకోవడానికి ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆర్ధిక  కార్యకలాపాన్ని సాగించాల్సి వుంటుంది. తద్వార కనీసం బతకడానికి అవసరమైన మేరకయినా సంపాదించాల్సి వుంటుంది.

 

ఆహార సేకరణ సమాజంలో మనిషికి ప్రకృతి ప్రధాన ఆదాయ వనరుగా వుంటుంది. ఆహార ఉత్పత్తి సమాజంలో ఆ వెసులుబాటు అంతరించిపోతుంది. పైగా, మనిషికి  ప్రకృతి పరాయిది అయిపోతుంది.  అంచేత సమాజంలోని ప్రతి వ్యక్తీ తప్పనిసరిగా ధనాత్మక నికర ఆస్తిని కలిగివుండాలి; Positive networth!. రుణాత్మక నికర ఆస్తిని అంటే negative networth కలిగిన వ్యక్తి బతుకు బానిసకన్నా హీనంగా మారిపోతుంది.  భారతదేశంలో ఎవరయినా ఆర్థిక కార్యకలాపం సాగించడానికి ఆర్థిక పెట్టుబడి (ఫైనాన్షియల్ కేపిటల్) ఒక్కటే సరిపోదు. సామాజిక పెట్టుబడి (సోషల్ కేపిటల్ ) కూడ కావాల్సివుంటుంది.

 

పెట్టుబడి అనగానే దాన్ని వెంటనే విమర్శించేయాలి అనుకోవాల్సిన పనిలేదు. కొత్త విధానాలన్నీ సమాజంలోనికి  ఏవో కొన్ని ఆదర్శాలు, విలువలతో ప్రవేశిస్తాయి. లేకుంటే వాటికి ఆమోదాంశం, ఆదరణ దొరకదు. పెట్టుబడీదారీ విధానం కూడ కొన్ని అలాంటి ఆదర్శాలతోనే రంగప్రవేశం చేసింది. ఆధునికత,  ప్రగతిశీలత, ప్రజాస్వామికత, ఉత్పత్తిలో వేగం పెరగడం, అభివృధ్ధి మొదలైనవన్నీ దాని తొలినాటి నినాదాలు. డబ్బు సంపాదించడానికి కూడ కొన్ని నైతిక విలువలు పాటించాలనీ 20వ శతాబ్దపు మధ్యభాగం వరకు భావించేవారు. ఒక విధంగా అది మనకు స్వాతంత్రం వచ్చిన కాలాన్ని దీనికి మైలురాయి అనుకోవచ్చు. 

 

పెట్టుబడీదారీ వ్యవస్థ వయస్సు పెరిగే కొద్దీ తొలినాటి విలువలన్నీ ద్వంసం అయిపోతుంటాయి. అప్పటి వరకు విలువలుగా కొనసాగినవన్నీ విలువలు కాకుండాపోతాయి. ఆధునికానంతర (post-modern) భావనలు బలపడతాయి. మనదేశంలో 1980వ దశకం మధ్యలో పాతవిలువల విధ్వంసం వుధృతంగా సాగింది.  జాతీయంగా రాజీవ్ గాంధీ పాలనను, ప్రాంతీయంగా కారంచేడు దురాగతాన్ని, ఉద్యమాల్లో పీపుల్స్ వార్ చీలికను, విజయవాడ అల్లర్లను వీటికి కొన్ని మైలురాళ్ళుగా చెప్పుకోవచ్చు.

 

1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ  (WTO)  ఏర్పడ్డాక రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాలలో విలువల పతనానికి ఒక సరుకు విలువ వచ్చింది. భుకబ్జాలు, పన్ను ఎగవేతలు, బ్యాంకు మోసాలు, హత్యలు సాగించే నేరచరితులకు సమాజంలో గౌరవం పెరిగింది. నేర చరితులు మాత్రమే మనకు నాయకత్వం వహించగలరనే నమ్మకమ పెరిగింది. ఫ్యాక్షనిజం, గూండాయిజాలకు గిరాకీ పెరిగింది. నేర చరితుల్నే ఎన్నుకుని చట్టసభలకు పంపించే సాంప్రదాయం మొదలయింది.

 

1960లకు ముందు ఉద్యోగాలు ఎక్కువ, విద్యావంతులు తక్కువగా వుండేవారు. ఆ తరువాత విద్యావంతులు పెరిగారు; ఉద్యోగాలు తగ్గిపోయాయి. నిరుద్యోగం, ఉపాధి నుండి తొలగింపు, సామూహిక స్థాన భ్రంశం (mass displacement), పేదరికం అన్నీ కలిసి గతంలో ఎన్నడూ ఊహించలేని వికారాలు సమాజంలో ఆమోదాశాంశాన్ని పొందడం మొదలయింది. బతకడానికి మనిషి ఏపనిచేసినా సమర్థనీయమే అనేది కొత్త విలువ. నేతి యువతలో ఈ భ్రష్టత్వాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈ అవకరాలన్నీ  వృధ్ధ పెట్టుబడీదారీ వ్యవస్థ వైపరీత్యాలు ; perversities of late (stage) capitalism. పెట్టుబడీదారులు తమ సాంప్రదాయ విలువల్ని పాటించనపుడు శ్రామికులూ తమ సాంప్రదాయ విలువల్ని పాటించరు. వర్గ సమాజంలో వుభయ భ్రష్టత్వం కొనసాగుతుంది. 

 

పెట్టుబడీదారీ వ్యవస్థ పతన లక్షణాలని పారసైట్ సినిమా  కళాత్మకంగా, వినోదాత్మకంగా చిత్రించింది.  సినిమా చూస్తుంటే నవ్వు వస్తుంది, దిగులు వేస్తుంది, భయం కలుగుతుంది, పేదరికం నుండి బయటపడడానికి పనివాళ్ళు, వేసే ఎత్తుకు పై ఎత్తుల్ని, ప్రదర్శించే చాకచక్యాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మనుషులు ఇంత దుర్భరంగా బతుకుతున్నారని తెలిసి దిగ్భ్రాంతి కలుగుతుంది. నవ్వులాంటి ఏడుపు; ఏడుపు లాంటి నవ్వు ప్రేక్షకులని చుట్టుముట్టుతాయి. దీనినే బ్లాక్ కామెడి అంటున్నారు.

 

పారసైట్ అంటే పరాన్నజీవులు; మరొకరి మీద ఆధారపడి బతికేవారని అర్థం. పేదలేకాదు ధనవంతులు కూడ పరాన్న జీవులే అని అని బోంగ్ జూన్ హో వివరిస్తాడు. పేదలు ఉపాధి కోసం ధనవంతుల మీద ఆధారపడతారు; ధనవంతులు తమ పనులు చేసిపెట్టడం కోసం పేదల మీద ఆధారపడతారు. ఐశ్వర్యవంతులయిన పార్క్ కుటుంబంలో ఆశ్రయం పొందడానికి కిమ్, మూన్ ల పేద కుటుంబాలు పడే ఆరాటమే ఈ సినిమా కథ.  చివర్లో మూన్ భ్రత చనిపోతూ యజమానితో “నీ తిండి తిని బతికాను; ధన్యవాదాలు” అంటాడు. నిజానికి పేదలు లేకుండ ధనవంతులూ బతకలేరని  గుర్తు చేస్తుంది పారసైట్.

మనుషుల్ని వర్గం, కులం, మతం విభజిస్తాయని మనకు ఇంతకుముందే తెలుసు. వాసన కూడ మనుషుల్ని విడగొడుతుందని పారసైట్ కొత్తగా గుర్తు చేస్తుంది.

 

https://www.youtube.com/watch?v=SItRjTN-tEo

 

No comments:

Post a Comment