Sunday, 7 March 2021

'ముస్లిం సోషల్ మూవ్మెంట్’ – ఓ పరామర్శ

ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఎజెండ – ఓ పరామర్శ

 

 ‘ముస్లిం చైతన్య ఎజెండా పేరిట ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ‘ ‘7 పాయింట్ల ఫార్ములా ఒకదాన్ని గత ఏడాది సెప్టెంబరు 1న ప్రకటించింది.  రచయిత-కవి స్కైబాబ దీనికి కన్వీనర్. షాజహానా మరో ఐదుగురు ఇందులో సభ్యులు. “ముస్లింలు ఈ దేశ మూలవాసులు అనేది ఈ జాబితాలో మొట్టమొదటి అంశం. “ముస్లింలు ప్రత్యేక ఐడెంటిటీని నిలబెట్టుకుంటూనే బహుజన  ఐడియాలజీతో ముందుకు సాగాలిఅనేది ఇందులో చివరి అంశం. ‘ముస్లిం రిజర్వేషన్ ను’ ఒక ప్రత్యేక అంశంగా చేర్చే సాహసం చేయలేక చివరి అంశానికి ఒక తోకగా  “అన్ని రంగాల్లో జనాభా దామాషా ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేయాలి” అని తగిలించారు.

 

జనాభా దామాషా ప్రాతినిధ్యం గురించి మాట్లాడే సమయంలో ఎస్టీ, ఎస్సీ, బిసిలు, మైనారిటీల గురించి మాత్రమే మాట్లాడడం సంకుచితత్వం. జనాభా దామాషా అన్నప్పుడు బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైశ్యులు మాత్రమేగాక కమ్మ, రెడ్డి, వెలమ తదితర యజమాని కులాలు, అనేకానేక ఇతర సమూహాలూ కూడ వస్తాయి.  వాళ్ళందరికీ స్థానం కల్పించాలి. ఈ ఎజెండాలో వాళ్ళకు స్పేస్ ఇవ్వకపోవడం అవగాహన రాహిత్యం. 

వర్తమాన భారత ముస్లిం సమాజంలోని అత్యధికుల పూర్వికులు ఎస్టి, ఎస్సి, బిసిల నుండి ఇస్లాంను స్వీకరించిన వారేనన్నది పరిమిత జ్ఞానం. ఇది ఒక కాల దశకు  మాత్రమే సంబంధించిన అంశం. ఇంకో వెయ్యేళ్ళో రెండు వేల యేళ్ళో వెనక్కి వెళితే ఇప్పటి యజమాని కులాలు కూడ ఒకప్పటి ఆదివాసులే అని స్పష్టం అవుతుంది. ఇంకో వెయ్యేళ్ళు వెనక్కి వెళితే ఇప్పటి ప్రపంచ జనాభా మొత్తం ఒకే దంపతుల సంతతి అని కూడ తేలుతుంది. పశ్చిమ  ఆసియాలో యూదులు, అరబ్బులు ఒక్కరే అని అర్ధం అవుతుంది.  ఇద్దరూ, ఇబ్రాహీం, మూసా ప్రవక్తల అనుయాయులే అని బోధపడుతుంది. కానీ, వాళ్ళ మధ్య వర్తమాన సంబంధాలు దానికి పూర్తి విరుధ్ధంగా వున్నాయి.

 

మానవ సమూహాలకు కొత్త అస్తిత్వాలు వచ్చేశాక పురాతన అస్తిత్వాలు పనిచేయవు. తెలుగు, తెలంగాణ అస్తిత్వాలు ఏర్పడి పట్టుమని రెండు మూడు శతాబ్దాలు కూడ అయ్యుండవు. ఆ రెండు అస్తిత్వాల మధ్య ఒక పెద్ద ఘర్షణ జరగడాన్ని మనం గత దశాబ్దంలో చూశాం. తెలంగాణ అస్తిత్వంతో తెలుగు అస్తిత్వం మీద విరుచుకుపడిన స్కైబాబకు ఈ అస్తిత్వ జ్ఞానం కొంచెం ఎక్కువగానే వుండాలి మరి.  రెండు వందల ఏళ్ళ అస్తిత్వాన్ని కూడ వదులుకోలేని స్కైబాబకు 14 వందల ఏళ్ళ అస్తిత్వాన్ని వదులుకోమని ముస్లిం సమాజానికి పిలుపు ఇచ్చే నైతిక అర్హత లేదు.

 

ముస్లిం వ్యతిరేక ప్రచారం మన దేశంలో చాలా ఉధృతంగా సాగుతోంది. ముస్లింలు ఆధునిక విద్యను ఆహ్వానించరనీ. ఆడపిల్లల్ని అణిచివేస్తారని, మత ఛాందసులనీ సాగుతుంది ఆ ప్రచారం. ఆ ప్రచారం నిజమని నమ్ముతున్నట్టుంది ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’.

 

దేశరాజధానికి వచ్చే ప్రధాన రహదారుల్ని దిగ్బంధించి వర్తమాన నిరంకుశ కేంద్ర ప్రభుత్వంతో ఎలా పోరాడాలో  నేర్పింది ముస్లిం మహిళలే. దేశంలో ఏ ఇతర సామాజికవర్గానికీ రాని ఒక మహత్తర ఆలోచన ముస్లిం మహిళలకు మాత్రమే వచ్చింది. వెనుక భారత రాజ్యాంగాన్ని, ఒళ్ళో అంబేడ్కర్ ఫొటోను పెట్టుకుని, ఒక చేత్తో జాతీయ జెండా పట్టుకుని, ఇంకో చేత్తో పిడికిలి బిగించి “న్యాయము, స్వేఛ్ఛ, సమానత్వము, సోదరభావము” అని నినదించారు షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు.  అది దేశ వ్యాప్త ఉద్యమంగా మారింది. ప్రతి పట్టణంలో షాహీన్ బాగ్ వేదికలు ఏర్పడ్డాయి. సమీపగతంలో ఇలాంటి ఉద్యమం ఒక్కటంటే ఒక్కటీ లేదు.

 

షాహీన్ బాగ్ ముస్లిం మహిళలు చూపిన బాటలోనే ఇప్పటి రైతుల ఆందోళన ఢిల్లీలో సాగుతోంది. అయినప్పటికీ, అది షాహీన్ బాగ్ లా దేశవ్యాప్త వుద్యమం కాలేదు. షాహీన్ బాగ్ ఉద్యమం నాడు వెలసినన్ని వేదికల్లో పదవ వంతు పట్టణాలలో అయినా రైతు ధర్నా వేదికలు ఏర్పడ్డాయా? ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమమూ అంతే; దాదాపుగా విశాఖపట్నానికి పరిమితమైపోయింది.

 

ఇంకా కళ్ళ ముందు కదలాడుతున్న షాహీన్ బాగ్ ఉద్యమ వాస్తవాన్ని దాచిపెట్టి ముస్లిం మహిళలు వెనుకబడివున్నారు, ముస్లింలు భారత రాజ్యాంగం, జాతీయ పతాకం చేతబూని పురోగమించాలని  పిలుపివ్వడాన్ని మించిన బూటకం ఎక్కడయినా వుంటుందా? ఓ ఏడుగురిని సామాజిక మార్గదర్శకులుగా పేర్కొన్నవాళ్ళు షాహీన్ బాగ్ వ్యవస్థాపకుల పేర్లను ఎందుకు దాచారూ? కనీజ్ ఫాతిమా, రఫత్ ఖాన్, బడీదాదీల  నుండి కాన్సెప్ట్ ను దొంగిలించి ముస్లిం మహిళలు వెనుకబడి వున్నారంటారా? ఇదేమి సోషల్ హైజాకింగ్ ?  చెలం ఒక సందర్భంలో అన్నట్టు “మనం ఎవరి నుండి దొంగిలిస్తామో వాళ్ళను ఎన్నటికీ క్షమించలేము” !!!

 

స్కైబాబ ఉద్దేశిస్తున్న ముస్లిం సమాజం ఏదీ? అనేది కూడ ఒక కీలక అంశం. తెలుగు ముస్లిం సమాజంలో ఒక చిన్న భాగం గురించి మాత్రమే స్కైబాబాకు తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఉర్దూ ముస్లిం సమాజం గురించి ఆయనకు తెలీదు. భారత ముస్లిం సమాజం గురించి బొత్తిగా తెలీదు. కొందరికి కొంచెం అతిగా కనిపించవచ్చుగానీ, స్కైబాబ కు ‘ముస్లిం’ అనే పదానికి అర్థం కూడ తెలీదు. అనుమానం వున్నవాళ్ళు వారినే అడిగి నిర్ధారణ చేసుకోవచ్చు.

 

కష్టాల్లో వున్నవాళ్ళు బాధితులుగా ఒకచోట చేరుతారు. బాధితులంతా ఒక్కటే అని భావిస్తారు. అందరి కన్నీళ్ళు ఉప్పగానే వుంటాయని గుర్తిస్తారు. ఒకరి కన్నీళ్ళను మరొకరు తుడుస్తారు. “కార్మికులారా ఏకంకండు” అన్నట్టు “బాధితులారా ఏకంకండు” అంటూ నినాదాలు కూడ ఇస్తారు.  వాళ్ళ మధ్య ఐక్యత అంత వరకే.  తక్షణ ఉమ్మడి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి అవి పనికివస్తాయి. అయితే, విభిన్న బాధిత సమూహాల దీర్ఘకాలిక ఆకాంక్షలు ఒకటికావు.

 

ముస్లింల సామాజిక ఎజెండ మత అణిచివేతను నిర్మూలించి  మతసామరస్యాన్ని నెలకొల్పడం. ఎస్సీ, బిసిల సామాజిక ఎజెండ కులనిర్మూలనను సాగించి కులరహిత సమాజాన్ని నిర్మించడం. ఎస్టీల సామాజిక ఎజెండ మైదాన దోపిడిని నిర్మూలించడం. మహిళల సామాజిక ఎజెండ పితృస్వామ్య వ్యవస్థను నిర్మూలించడం. ఇవన్నీ భిన్నమైన సామాజిక ఎజెండాలు. కొన్ని సందర్భాలలో ఇవి పరస్పర విరుధ్ధమైనవి కూడ.

 

విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో జనాభా దామాషా ప్రాతినిధ్యం అంశం మీద ఎస్సీల్లోని ఉపకులాలు ఓ పాతికేళ్ళుగా తగువు పడుతున్నాయి. ఇప్పటి వరకు ఒక కనీస అవగాహనకు కూడ అవి రాలేకపోతున్నాయి. అంబేడ్కర్ ను తప్పుపట్టేంత వరకు వాళ్ళ వాదనలు సాగుతున్నాయి.  బిసీలు, ఎస్టీల్లోను అలాంటి సన్నివేశమే కొనసాగుతూ వుంది. విద్యా, ఉపాధి, రాజకీయ రంగాలలో ముస్లింలకు 14.2 శాతం (అదే  వాళ్ళ జనాభా దామాషా) రిజర్వేషన్ ను ఎస్టీ, ఎస్సీ, బిసిలు సమర్ధించే సన్నివేశం వర్తమాన సమాజంలో వుందని ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ నమ్మబలుకుతోంది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లిం వెనుకబడిన తరగతులకు 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించినపుడు న్యాయస్థానాల్లో దాన్ని అడ్డుకున్నదెవరో ఈ మేధావులకు తెలీదా? ఆ కేసులు ఇప్పటికీ తేలలేదు. ఫలితంగా ముస్లీం రిజర్వేషన్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో కోర్టు  స్టేల మీద నడుస్తున్నది.

 

విచిత్రం ఏమంటే ఆ కేసులకు కౌంటర్ గా కే బాలగోపాల్ ఇంకో కేసు వేశాడు. అందులో స్కైబాబనే పిటీషనర్ గా పెట్టాడు. స్కైబాబ వాయిదాలకు హాజరు కావడంలేదని బాలగోపాల్  మదనపడ్డ సందర్భాలున్నాయి.

 

ఒకవైపు ముస్లింలను దూరంగా పెడుతూనే మరోవైపు ముస్లింలు తమతో కలవరు అని నిందించే సాంప్రదాయం వర్తమాన సమాజంలో  వుంది.   ఈ బూటకాన్ని ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ పెద్దలు కూడ గట్టిగా నమ్ముతున్నట్టున్నారు. వర్తమాన భారత ముస్లిం సమాజంలోని 90 శాతం  ప్రజలు ఎస్టీ, ఎస్సీ, బిసీల నుండే వచ్చారని వీళ్ళే చెపుతున్నారంటే అందర్నీ ఇముడ్చుకునే స్వభావం అక్కున చేర్చుకునే సాంప్రదాయం ఇస్లాంలో అనాదిగా వుందనేగా? అంతకు మించి వీళ్ళు కొత్తగా ఏ ఐడియాలజీని  నేర్పదలిచారూ? ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ భారత ముస్లిం సమాజాన్ని ఒక స్వతంత్ర అస్తిత్వంగా గుర్తిస్తున్నట్టు కనిపించదు. “బహుజన  ఐడియాలజీతో ముందుకు సాగాలి” అని పిలుపిస్తుంది. అస్తిత్వం అంటేనే ప్రత్యేకత అని వీళ్ళకు ఎప్పుడు తెలియాలీ?

 

 బహుజన అనే పదం వర్తమాన రాజకీయాల్లో ఒక బ్రహ్మ పదార్ధం. ఎవరైనా ఎప్పుడైనా తమకు ఇష్టం వచ్చిన రీతిలో దాని పరిధిని పెంచుకోవచ్చు. తగ్గించుకోనూవచ్చు. దళితులంటే ఎస్సీలనీ, బహుజనులంటే బిసిలనే మాటలు ఇప్పుడు వాడుక అర్థంలో కొనసాగుతున్నాయి.    బహుజన పేరుతో ఒక రాజకీయ పార్టీయే వుంది. రిపబ్లికన్ పార్టి జెండా పట్టుకుని, బహుజన జెండా పట్టుకుని బిజెపితో పొత్తులు పెట్టుకున్నవారూ వున్నారు. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఇంతకీ ముస్లింలను బహెన్ మాయావతి వెంట నడవాలని చెపుతోందా? బహెన్ మాయావతిని వ్యతిరేకించాలని చెపుతోందా? రాందాస్ అథవాలేను అనుసరించాలని చెపుతోందా?  బలహీనవర్గాలన్నీ బౌధ్ధమతాన్ని స్వీకరిస్తే కులరహిత సమాజం ఏర్పడుతుందని బహుజన మేధావులు కొందరు ఇటీవల ప్రచారం చేస్తున్నారు. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ అటుగా అడుగులు వేస్తోందా?

 

భారత ముస్లింలను ఓ నాలుగు భూతాలు వెంటాడుతుంటాయి. మొదటిది; దేశాన్ని విభజించారనే నింద,  రెండోది;  మైనారిటీ సోషల్ స్టాటస్, మూడవది; పేదరికం, నాలుగోవది;  అసహన వాతావరణం. వీటివల్ల ఏర్పడే సర్దుబాట్లు, లొంగుబాట్లు, ఆందోళన, అభద్రత, వెనకడుగులు, కుంగుబాట్లు, అంతర్ముఖం వగయిరాలు అన్నీ వర్తమాన భారత ముస్లిం సమాజంలో పుష్కలంగా వున్నాయి. దేశంలో మరే సమూహానికి లేనంత ప్రాణ భయం కూడ ముస్లిం సమాజానికి వుంది. ఈ బంధనాల మధ్య ముస్లిం సమాజం అలాకాక మరోలా ఎలావుంటుందీ? ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ దీన్ని తలకిందులుగా చూస్తున్నది. అణిచివేత, పేదరికంవల్ల ముస్లిం సమాజం అలా వుందని కాకుండ ముస్లీం సమాజం తన వెనుకబాటుతనం వల్లనే పేదరికంలో కొట్టుమిట్టాడుతుందని ఈ సంస్థ భావిస్తున్నట్టు కనిపిస్తున్నది.

 

మతసామరస్యాన్ని సాధించడం సామాజిక ఎజెండాగా భావించి ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF) రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను సాగిస్తున్నది. ‘ముస్లిం సోషల్ మూవ్మెంట్’ ఆ దిశగా ఆలోచిస్తే ముస్లిం సమాజానికి కొంత మేలు జరగవచ్చు.

-        డానీ

కన్వీనర్, ముస్లిం ఆలోచనాపరుల వేదిక (MTF)

9 మార్చ్ 2021 

No comments:

Post a Comment