Friday 12 March 2021

Movie : Is Mother’s Love a Commodity – Chinese movie ‘Hi Mom!’

 Movie : Is Mother’s Love a Commodity – Chinese movie ‘Hi Mom!’

 తల్లి ప్రేమ కూడ సరుకేనా?  - చైనా సినిమా ‘హాయ్ మామ్’

 

ప్రపంచంలో కొన్నింటికి ఉపయోగపు విలువ మాత్రమే వుంటుంది. కొన్నింటికి ఉపయోగపు విలువతోపాటు మారకపు విలువ కూడ వుంటుంది. తల్లి ప్రేమకు ఉపయోగపు విలువ వుంటుంది; మారకపు విలువ వుండదు. తల్లి ప్రేమకు విలువకట్టలేం అంటే దానికి విలువే లేదని కాదు.

 

సమాజంలో ప్రతీదీ సరుకుగా మారిపోయాక తల్లిదండ్రుల ప్రేమను కూడ సరుకుగా చూసే సాంప్రదాయం మొదలై చాలా కాలం అయింది. మనం ఏ ఇంటికి వెళ్ళినా యజమాని గది (మాస్టర్ బెడ్ రూం), పిల్లల గది, వంటగది,  లివింగ్ రూం వంటివి కనిపిస్తాయి. కొన్ని చోట్ల గెస్ట్ రూములు కూడ వుంటాయి. కానీ చాలా అరుదుగా మాత్రమే పేరెంట్స్ రూమ్ వంటివి కనిపిస్తాయి. అనేక ఇళ్ళల్లో వరండాల్లో వృధ్ధుల మంచం వుంటుంది. అంతకన్నా హీనంగా వృధ్ధులు చూరు కింద నివశిస్తున్న  ఇళ్ళు కూడ కనిపిస్తాయి. తల్లిదండ్రుల్ని కొందరు వృధ్ధాశ్రమాలలో చేరుస్తున్నారు. ఇంకొందరు ఆనాధాశ్రమాలకు వదిలేస్తున్నారు. వ్యవసాయరంగంలో ట్రాక్టర్ల రాకతో ఇటీవలి కాలంలో పల్లెటూర్లలో గొడ్ల పాకలతో అవసరం తీరిపోయింది. ఇప్పుడు కొందరు తమ వృధ్ధ తల్లితండ్రుల్ని ఆ గొడ్ల పాకల్లో వుంచుతున్నారు.

 

అందరూ అలా చేస్తున్నారని చెప్పడం సరైనది కాదుగానీ కొంతమంది అయినా అలా చేస్తున్నారు అనేది వాస్తవమే. సమాజంలో ఒక్కరు అలా చేసినా అది అమానవీయమే. అది వ్యాపిస్తే మానవ సంక్షోభం తలెత్తుతుంది. ప్రభుత్వాలు వృధ్ధాప్య పెన్షలు ఇస్తున్నాయిగాబట్టి ఒక ప్రమాదం వాయిదా పడుతోందిగానీ లేకుంటే వృధ్ధ తల్లిదండ్రుల జీవితాలు మన సమాజంలో మరింత దయనీయంగా వుండేవి.

 

మనిషి జీవితంలో తల్లి ప్రాధాన్యతను ప్రపంచానికి చెప్పడానికి చైనా హాస్యనటి జియా లింగ్ ‘హల్లో, లీ హ్యూయాన్ యింగ్’ సినిమా తీసింది. ఇంగ్లీషులో ఈ సినిమా టైటిల్చ ‘హాయ్ మామ్’.  చైనా కొత్త సంవత్సరం సందర్భంగా ఫిబ్రవరి 12న విడుదలైన ఈ సినిమాకు కథ, దర్శత్వ బాధ్యతల్ని కూడ తనే నిర్వహించింది జియా లింగ్.   

 

కథ విషయానికి వస్తే, జియా గ్జియాయోలింగ్ ముఫ్ఫయ్యవ పడిలోవున్న రచయిత్రి. ఇరవయ్యేళ్ళ క్రితం తను పదేళ్ల పాపగా వుండగా ఓ ట్రక్కు యాక్సిడెంట్ లో ఆమె తల్లి  లీ హ్యూయాన్ యింగ్ చనిపోతుంది. తన తల్లి అకాల మరణాన్ని పొందడమేగాక, జీవించిన కాలంలోనూ ఆమె ఆనందంగా లేదని గుర్తుకొచ్చి జియా తరచూ బాధపడుతూ వుంటుంది. ఇదీ ఈ సినిమా సెటప్.

 

హఠాత్తుగా జియాకు ఒక విచిత్రమైన ఆలోచన వస్తుంది. తన తల్లి జీవితంలోని విషాదాన్ని తొలగించాలనుకుంటుంది. ఆలోచిస్తే మార్గం కనిపిస్తుంది అన్నట్టు ఒక అద్భుతం జరిగి  ఆమె గతం లోనికి  ప్రయాణించి 1981లో ప్రవేశిస్తుంది. తన తల్లి లీ హ్యూయాన్ యింగ్ పనిచేస్తున్న ఫ్యాక్టరీ గేటు ముందు పడుతుంది. అప్పటికి లీ హ్యూయాన్ యింగ్ ఇరవై యేళ్ళ యువతి. ఆమెకు ఇంకా పెళ్ళి కాలేదు. స్నేహం చేసి లీ కి దగ్గ్ర అవుతుంది జియా.

 

తన తల్లి తన తండ్రినే పెళ్ళాడితే ఇక పాత కథే కొనసాగుతుంది కదా! అలా జరగకూడదనుకుంటుంది జియా. తన తల్లి తన తండ్రిని ఎక్కడ పెళ్ళాడేస్తదోనని జియా దిగులుపడిపోతుంది. తన తల్లి ఎలాగూ అందంగా వుంటుంది. తల్లికి కాబోయే భర్త అందంగా వుంటేనే పిల్లలు అందంగా పుడతారు. అతను ఐశ్వర్యవంతుడు అయితేనే పిల్లలకు మెరుగైన జీవితం దొరుకుతుంది. అతను మంచివాడయితేనే తన తల్లి సుఖపడుతుంది. తన తండ్రికన్నా అందగాడు, స్థితిమంతుడు, మంచివాడు అయిన వ్యక్తిని వెతికి తన తల్లిని ప్రేమించేలా చేస్తుంది.

 

హాయ్ మామ్ సినిమాలో ప్రొటోగోనిస్టు కూతురుగా జియా లింగ్ నటించింది. ఆమె తల్లి లీ హ్యూయాన్ యింగ్ గా గ్జియాఓఫీ ఝాంగ్ నటించింది.

 

తల్లిప్రేమ, మన జీవితాల్లో తల్లి ప్రాధాన్యత గురించే కాకుండ స్త్రీ స్వేఛ్ఛ సమానత్వం గురించి కూడ ఈ సినిమా చర్చిస్తుంది. అయితే, ఒక గంభీరమైన అంశాన్ని ఇలా ప్రహసనంగా చెప్పడం ఏమిటీ అని విమర్శిస్తున్న వారూ వున్నారు. అయితే, జియా లింగ్ మాత్రం తన సినిమా మీద సంతృప్తితోవుంది. తనకు తెలిసిన ప్రక్రియ హాస్యం. ఆ ప్రక్రియలోనే తను చెప్పాల్సింది చెప్పిందామె. “నా సినిమా చూశాక ప్రేక్షకులు తమ జీవితంలో తల్లి ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు” అంటున్నదామె.

 

ఈ వివాదం ఎలావున్నా ప్రేక్షకులు మాత్రం ‘హాయ్ మామ్’ను చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నారు.  చైనా సినిమా చరిత్రలో అత్యధిక కలెక్షన్లు సాధించిన రెండవ సినిమాగా ఇది నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించిన వంద సినిమాల జాబితాలో చోటు దక్కించుకుంది.  

No comments:

Post a Comment