Fascism grows stronger not only from its victories but also from its defeats
విజయాల నుండే కాదు ఓటమి నుండి కూడ ఫాసిజం బలపడుతుంది
ఫాసిస్టు శక్తులు
సృష్టించే ఆనందోన్మాదం (Euphoria) చాలా శక్తివంతమైనది.
అది విజయాల నుండి ఎలాగూ బలపడుతుంటుంది. విచిత్రంగా అది ఓటముల నుండి కూడ బలపడుతుంటుంది.
ఫాసిస్టు శక్తుల రాజకీయ వేదికగావున్న బిజెపి తనంతట తానుగా పుంజుకున్నది తక్కువ. కాంగ్రెస్
తదితర తన రాజకీయ ప్రత్యర్ధుల వైఫల్యాల మూలంగా పెరిగింది ఎక్కువ.
బలహీనవర్గాలెప్పుడూ
ఫాసిస్టుశక్తులు బలపడకుండా అప్రమత్తంగా వుండాలి. ఫాసిస్టు శక్తుల్ని నిలువరించే క్రమంలో
బలహీనవర్గాలకు ప్రాతినిథ్యం వహించే సంస్థలు/ సంఘాలు/ పార్టీలు ఎన్నికల ఎత్తుగడల్లో
చాలా అప్రమత్తంగా వుండాలి. చిన్న పొరపాటుకు కూడ చాలా పెద్ద శిక్షను అనుభవించాల్సి వస్తుంది.
ఎన్నికల రంగంలో ఫాసిస్టులకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజకీయ పార్టీని
తమ స్వయంశక్తి మీద గెలవగల అవకాశాలు లేనప్పుడు రంగంలోవున్న మరో
పెద్ద పార్టీని బలహీనవర్గాల పార్టీలు సమర్ధిస్తాయి. ఇలాంటి సంఘీభావం కొన్ని విజయాలను
కూడ తెస్తుంది. ఇక్కడే అసలు ప్రమాదంవుంది. అలా గెలిపించిన పార్టిలు చేసే తప్పిదాలన్నింటికీ బలహీనవర్గాల పార్టీలే నిందను మోయాల్సి వుంటుంది.
ఈ నైతిక సంక్షోభం ఫాసిస్టు శక్తులు మరింత బలాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. గతంలో
మనం కేజ్రీవాల్, మమతా బెనర్జీల ఉదాహరణలు చూశాం. ఇప్పుడు కేసిఆర్ వంతు వచ్చింది.
వీటికి గత
అనుభవాలు కూడ వున్నాయి. 1982 అసెంబ్లీ ఎన్నికల్లో నక్సలైట్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా
తెలుగుదేశం పార్టిని సమర్ధించాయి. 1984లో ఎన్టీ రామారావు ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు
నక్సలైట్ పార్టీలు ఆయన్ను తిరిగి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టడానికి ఒళ్ళు హూనం
చేసుకుని శ్రమపడ్డాయి. 1985 ఎన్నికల్లోనూ నక్సలైట్లు ఎన్టీఆర్ పక్షాన నిలిచారు. అదే
ఎన్టీఆర్ హయాంలో కారంచేడు హింసాకాండ జరిగింది. రాష్ట్రంలో నక్సలైట్ల ఆటాపాటాను బంద్
చేశారు ఎన్టీఆర్. 1989 ఎన్నికల్లో నక్సలైట్లు ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా చెన్నారెడ్డి
కాంగ్రెస్ ను బలపరిచారు. ఆ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్ల మీద ఉక్కుపాదం మోపింది.
1984 ఎన్నికల్లో మళ్ళీ నక్సలైట్లు టిడిపిని బలపరిచారు. చంద్రబాబు హయాంలో నక్సలైట్లను
తీవ్రంగా అణిచివేశారు. 2004 ఎన్నికల్లో నక్సలైట్లు వైయస్ రాజశేఖర రెడ్డి పక్షం వహించారు.
ఆయన వాళ్ళతో శాంతి చర్చలు కూడ జరిపారు. వైయస్ హయాంలోనే నక్సలైట్లు చావుదెబ్బ తిన్నారు.
ఆ తరువాత తెలంగాణ ఉద్యమాన్ని నక్సలైట్లు “ముందు భౌగోళిక తెలంగాణ – తరువాత సామాజిక తెలంగాణ”
అంటూ అతి ఉత్సాహంతో బలపరిచారు. ఉద్యమ కాలంలో “నక్సలైట్ల ఎజెండాయే మా ఎజెండా” అన్న కేసిఆర్
భౌగోళిక తెలంగాణ ఏర్పడగానే సామాజిక తెలంగాణ ఊసెత్తకుండ రాష్ట్రంలో నక్సలైట్లకు ఉనికి లేకుండా చేశారు.
తత్త్వశాస్త్రంలో
ఐక్యత-ఘర్షణ అనే ఒక పెద్ద చర్చవుంది. వైరుధ్యం అధ్యాయంలో కార్మికుల్లోనూ అంతర్గతంగా ఒక పెట్టుబడీదారుడు వుంటాడనే
హెచ్చరికా వుంది. మనం తరచూ శత్రువునీ మిత్రుల్ని నలుపు తెలుపుల్లో మాత్రమే చూడడానికి
అలవాటుపడ్డాము. నలుపులో కొంత తెలుపు వుంటుందనీ, తెలుపులో కొంత నలుపు వుంటుందని గుర్తించడానికి
మనం చాలా ఇబ్బంది పడతాం. కమ్యూనిస్టు పార్టీలు, వాటి నాయకులు గంగిగోవు, భగవద్గీత, ఖురాను,
బైబిలు వంటి పవిత్రులు అనేది చాలామంది నమ్మే నేరేటివ్. ఆ పార్టీల మీద బలహీనవర్గాలకు నమ్మకాలు సడలి బయటికి
పోతుంటే తప్పు ప్రజలదే అంటారుతప్ప ఆ పార్టీల
పాలసీలదీ, వాటికి నాయకత్వం వహిస్తున్నవారిదీ అని ఎవ్వరూ అనరు. ఎవరయినా ఆ వాస్తవాన్ని ముందుకు తెస్తే ముందుగా వాళ్ళ
మీద కమ్యూనిస్టు వ్యతిరేకి అని ముద్రవేస్తారు.
జాతియోద్యమ
కాలం నుండే కమ్యూనిస్టులు ఈ తప్పులు చేస్తూ వస్తున్నారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టి
ఆఫ్ గ్రేట్ బ్రిటన్ కు రజనీ ఫామీ దత్త్ ప్రధాన కార్యదర్శిగా వుండేవారు. ఆయనే భారత కమ్యూనిస్టు
పార్టీకి అనధికార వ్యూహకర్త (Strategist) గానూ వుండేవారు. రెండవ ప్రపంచ యుధ్ధకాలంలో
నాజీ జర్మనీ, ఫాసిస్టు ఇటలీ, ఇంపీరియల్ జపాన్ ల అక్షరాజ్యలకు(Axis Powers) వ్యతిరేకంగా
రష్యా, అమెరిక, ఇంగ్లండ్ తదితర దేశాలు మిత్రపక్షాలు (Allies)గా ఏర్పడ్డాయి. అంతర్జాతీయంగా కమ్యూనిస్టు రష్యాకు ఇంగ్లండ్ మిత్రపక్షంగా
వుంటున్న కాలంలో, ఇండియాలో కమ్యూనిస్టు పార్టి బ్రిటీష్ వలస వ్యతిరేక పోరాటం చేయడం సబబు కాదని ఫామిదత్ ఒక సిధ్ధాంతం చేశారు. సరిగ్గా
ఆ సమయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ అధ్యక్షతనవున్న జాతీయ కాంగ్రెస్ వలస పాలకుల మీద అంతిమపోరుగా
క్విట్ ఇండియా ఉద్యమాన్ని వుధృతంగా సాగిస్తోంది.
ఫామీదత్ సూచనల మేరకు భారత కమ్యూనిస్టు
పార్టి క్విట్ ఇండియా ఉద్యమానికి దూరంగా వుండిపోయింది. అంతర్జాతీయంగా పాసిస్టు వ్యతిరేక
యుధ్ధానికి మద్దతు; జాతీయంగా వలసవాద వ్యతిరేక ఉద్యమానికి మద్దతు అని చెప్పే తెగువ నాటి
కమ్యూనిస్టు పార్టీకి లేకపోయింది. ఆ పాప ఫలితం ఇప్పటికీ కొనసాగుతోంది.
మజ్లిసే ఇత్తహదుల్
ముస్లిమీన్ (ఎంఐఎం) ప్రధానంగా ముస్లింల రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పడిన పార్టి. ముస్లింలతోపాటూ
ఇతర బలహీనవర్గాల ప్రయోజనాలను కూడ కాపాడాలనేది ఆ పార్టి విధానం. దాని అధినేత అసదుద్దీన్
ఓవైసీ ‘జైమీమ్ –జై భీమ్’ అనే నినాదాన్ని ప్రచారంలోనికి
తెచ్చారు. ముస్లిమేతరుల ప్రయోజనాలను, ముఖ్యంగా దళితుల ప్రయోజనాలను కూడ కాపాడకపోతే ఆ
పార్టి గత 40 ఏళ్ళుగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ, అందులోని ఏడు అసెంబ్లీ
సెగ్మెంట్లలోనూ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటూ రావడం సాధ్యంకాదు. ఆ నియోజకవర్గంలోని
ఓటర్లలో ముస్లింల సంఖ్య ఎక్కువేగానీ; వాళ్ళే మెజారిటి కాదు. ఇటీవల ఎంఐఎం మహారాష్ట్ర,
బీహార్ లో కూడ ఓ పది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. మహారాష్ట్ర ఔరంగాబాద్ లో ఆ పార్టీకి మరో ఎంపి కూడ వున్నాడు. ఈ ఫలితాల ఉత్సాహంతో
ఎంఐఎం ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ పాల్గొంటున్నది.
ఎంఐఎం రంగంలో
దిగగానే ఆ పార్టీ చుట్టూ ముస్లింలు పోలరైజ్
అవుతున్నారని బిజెపి ఉధృతంగా ప్రచారం చేస్తుంది. కనుక దానితో, హిందువులంతా బిజెపి చుట్టూ
పోలరైజ్ కావాలనేది దాని వ్యూహం. హిందూ లేదా ముస్లీం బైనరి పనిచేస్తే బిజెపికే విజయావకాశాలు
పెరుగుతాయి. ఈ వ్యూహంతో అనేక విజయాలను బిజెపి
సులువగా తన ఖాతాలో వేసుకుంటున్నది.
ఈ కథ ఇక్కడితో
ఆగదు. ఎంఐఎంను ‘బిజెపి బి-టీమ్’ గా బిజెపియే ప్రచారం చేయిస్తుంది. ఇటీవలి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలు రావడం మొదలవగానే
ఎంఐఎం ఓ వంద నియోజక్వర్గాల్లో బిజెపిని గెలిపించినట్టు
అంకెలతోసహా సోషల్ మీడియాలో ప్రచారం సాగింది. ఇది వాస్తవం కాదు. చాలా తక్కువ నియోజక్వర్గాల్లో
మాత్రమే బిజెపికి వచ్చిన మెజారిటీకన్నా ఎక్కువ ఓట్లు ఎంఐఎంకు పడ్డాయి. నిజానికి ఇలా
అన్ని ఎన్నికల్లోనూ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో
కొన్ని చోట్ల టిడిపి మీద వైయస్సార్ సిపికి దక్కిన మెజారిటీకన్నా జనసేన పార్టికి ఎక్కువ
ఓట్లు పడ్డాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ ను ఏ ఒక్కరూ జగన్ బి-టీమ్ అనలేదు. ఒవైసీ మీద మాత్రం
ఇలాంటి ప్రచారం నిరాఘాటంగా సాగుతోంది. పరిస్థితి ఏ దశకు వెళ్ళిందంటే ఇప్పుడు ముస్లింల్లో
ఒక భాగం ఒవైసీని బిజెపి బి-టీమ్ అని నమ్ముతున్నాయి. గతంలో కాంగ్రెస్ మీద కూడ ముస్లింల
పార్టి అని ప్రచారం సాగించారు. ఆ దెబ్బ కాంగ్రెస్ కు గట్టిగానే తగిలింది. ఇప్పుడు ఇలాంటి
ముప్పు ఎస్పి, బిఎస్పి, జేడియు, ఆర్జేడిలకు కూడ వుంది. ఇలాంటి నిందల్ని తప్పించుకోవడానికి
ఆప్, టిఎంసి పార్టిలు కొత్త మనువాదాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఆ మేరకు ఫాసిస్టు శక్తుల
వ్యూహం ఫలించినట్టే.
ఇప్పటిదాక
ఫాసిస్టు శక్తుల్ని బలహీనపరచడానికి బలహీనవర్గాలు చేపట్టే చర్యలు పరోక్షంగా ఫాసిస్టు
శక్తులు బలపడడానికే వుపయోగ పడుతున్నాయి. ఇకనైనా బలహీనవర్గాల ఆలోచనాపరులు దీనికి ఒక
విరుగుడు కనిపెట్టాలి. ఇదే ఇప్పుడు పెద్ద సవాలు. బలహీనవర్గాలు అంటే ఎస్టి, ఎస్సీ, బిసి,
మైనారిటీలు, మహిళలు, శ్రామికులు ప్లస్ భాషా సాంస్కృతిక బాధితులు, కార్పొరేట్ రంగంలో
తస్మదీయులు. ఈ జాబితా భవిష్యత్తులో ఇంకా పెరగవచ్చు.
డానీ
సీనియర్ జర్నలిస్టు, సమాజ విశ్లేషకులు
9010757776
హైదరాబాద్
10 నవంబరు 2022
No comments:
Post a Comment