మా బావ తమ్ము పెద్దిరాజు
1979లో రాడికల్ యూత్ లీగ్ (ఆర్ వైఎల్) కృష్ణాజిల్లా అధ్యక్షునిగా
ఎంపికయ్యాను. హైస్కూలు రోజుల నుండే పుస్తకాలు చదవడం, కథలు, నాటికలు, వ్యాసాలు రాసే
అలవాటువుంది.
రచయితలకు రాడికల్స్ కు మధ్యన ఏర్పడిన గ్యాప్ ను పూడ్చడానికి అప్పటి విరసం కార్యదర్శి కేవి రమణా రెడ్డి విజయవాడ వచ్చి మా రాడికల్ యూనిట్ తో సమావేశమయ్యారు. ఆయుధాలు పట్టిన కవుల గురించీ, గొప్ప కవిత్వం రాసిన అజ్ఞాతవీరుల గురించి వారు వివరించారు. విరసంను విడిగా చూడవద్దనే కేవిఆర్ అప్పీల్ నాకు నచ్చింది. గాడిద పని కుక్క పని అనే విభజనను చెరిపేసి రెండు పనులూ చేయాలనుకున్నాను.
అప్పటి పీపుల్స్ వార్ (అప్పటికి అది ఆర్ ఓ సి) కృష్ణాజిల్లా బాధ్యులు, నాకు గురువు అయిన వాసిరెడ్డి కృష్ణారావు ప్రోత్సాహంతో విరసంలో చేరాను. విరసం విజయవాడ యూనిట్ లో అప్పుడు కృష్ణాబాయి, తమ్ము పెద్దిరాజు ముఖ్యులు. ఇద్దరిలో ఒకరు విరసం కార్యవర్గ సభ్యులు, మరొకరు కృష్ణాజిల్లా యూనిట్ బాధ్యులు. కొల్లి సత్యనారాయణ మరో సభ్యులు. నేను నాలుగవ వాడిని. నేను పాల్గొన్న తొలి విరసం మహాసభ తిరుపతి. అక్కడే త్రిపురనేని మధుసూదనరావు విరసం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మధుసూదన రావును గురువుగా స్వీకరించాను. అనుభవాన్నీ, మన ముందున్న డేటాను సూత్రీకరించే నైపుణ్యాన్ని త్రిపురనేని మధుసూదనరావు నుండే నేర్చుకున్నాను.
విరసం సభ్యులందరూ కార్మికవర్గ పక్షపాతంతో సాహిత్యాన్ని సృష్టిస్తుంటారు.
అది వారి విధానం. అయితే, విరసం సభ్యుల్లో అత్యధికులు కార్మికులు కాదు. తమ్ము పెద్దిరాజు
అచ్చమైన కార్మికుడు. సామాజికవర్గం రీత్యా బహుజనుడు. అంటే బి.సి. (మత్స్యకారుడా? కమ్మరా?)
వృత్తి రీత్యా వెల్డర్. ఫ్యాబ్రికేషన్ రంగంలో మంచి నిపుణుడు. ఆరంగంలోని సంక్లిష్ట పనుల్ని
అవలీలగా చేసేవాడు. వృత్తి రీత్యా నేనూ అప్పట్లో ఒక ఫ్యాబ్రికేషన్స్ సంస్థలో సూపర్ వైజర్
గా పనిచేస్తుండేవాడిని. మేమిద్దరం విరసం సభ్యులుగానూ
కలుస్తుండేవాళ్ళం, వృత్తి రీత్యానూ కలుస్తుండేవాళ్ళం. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరం
చాలా సన్నిహితులమైపోయాము. నేను తనను బావా అని పిలవడం మొదలెట్టాను. విప్లవోద్యమంలో బంధుత్వంతో
పిలిచింది పెద్దిరాజు ఒక్కడ్నే.
పెద్దిరాజు నల్లగా బొద్దుగా పొట్టిగా వుండేవాడు. ఖాఖీ ప్యాంటు, తెల్ల
చొక్కా, నల్ల కళ్ళజోడు ఇదీ తన అప్పెరెల్. చూడగానే గోర్కీ నవలల్లోని కార్మిక పాత్రలు
గుర్తుకొచ్చేవి.
పెద్దిరాజు చాలా గొప్ప హాస్యప్రియుడు. మనిషెప్పుడూ నవ్వుతూ వుండేవాడు.
ప్రతిసంఘటనలోనూ తనకు హాస్యమో అపహాస్యమో కనిపించేది.
అసలు ప్రపంచంలో ప్రతీదీ అసంబధ్ధంగా నడుస్తున్నదనేది
తన ఫిలాసఫీ. అసంబధ్ధాన్ని సరిచేయడమే విప్లవం అనేవాడు. అతని తత్త్వం ఇంత సూటిగా సరళంగా వుండేది. స
అప్పట్లో ఇబ్రహీంపట్నంలో విజయవాడ ధర్మల్ పవర్ స్టేషన్ (విటిపిఎస్)
పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆ పరిసరాల్లోని గ్రామాల్లో పెద్దిరాజు, నేను మా కంపెనీల పనులు చేస్తుండేవాళ్ళం.
తరచూ ఇబ్రహీంపట్నం సర్కిల్లో కలిసి టీ తాగుతూ కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అంత ఎత్తు
విటిపిపిఎస్ పొగగొట్టాన్ని చూసి ఒకసారి నేను ఆశ్చర్యపోయాను. “ఎలా పైకి వెళ్ళారూ? ఎలా కట్టారూ?
అని అడిగాను, “ఇందులో ఆశ్చర్యపోవాల్సింది ఏమీలేదు. మొదటి వర్ర వేయడమే కష్టం. ఆ తరువాత
ఒకదాని మీద మరొకటి పేర్చుకుంటూ ఆకాశం లోనికి వెళ్ళిపోవచ్చు” అన్నాడు బావ. మనిషి పొట్టివాడేగానీ
ఆ క్షణంలో తను చాలా ఎత్తుగా కనిపించాడు.
తను అంతటితో ఆగలేదు. “విప్లవోద్యమం కూడ అంతే. మొదటి సభ్యుడు చేరడమే
కష్టం. ఆ తరువాత వందలు వేలు లక్షలు వచ్చి చేరుతారు” అన్నాడు. కార్మికులు తమ వృత్తులు
అనుభవాల నుండే సమాజాన్ని అర్ధం చేసుకుంటారు.
పెద్దిరాజు అలాంటి కార్మికుడు.
ఇప్పుడు ఇబ్రాహీంపట్నం-కొండపల్లి
ప్రాంతంలో రెండు మూడు పవర్ స్టేషన్లు వచ్చాయి. పొగగొట్టాల సంఖ్యా పెరిగింది. హైదరాబాద్
వస్తూపోతూ వాటిని చూసినపుడు బావ మాటలు గుర్తుకొస్తాయి. ఒక ఆశాభావం కూడ కలుగుతుంది.
అప్పట్లో ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ గావున్న పురాణం సుబ్రహ్మణ్యశర్మ ‘ఇల్లాలి ముచ్చట్లు’ కాలంలో కొన్నాళ్ళు విరసం వ్యతిరేక
ప్రచారం సాగించారు. అప్పట్లో విరసం సభలు క్రమం తప్పకుండ నెల నెలా జరిగేవి. కొన్నిసార్లు
నెలకు రెండు సభలు కూడ జరిగేవి. విరసం సభల్లో పురాణం కాలాన్ని పెద్దిరాజు వదిలేవాడుకాదు. అసలే
పురాణంది వెటకార ధోరణి. పురాణాన్ని మించిన వెటకారం పెద్దిరాజుది. పురాణం ఒక మాటంటే
పెద్దిరాజు రెండు మాటలు అనేవాడు. ఓ వారం పురాణం
ఏకంగా మామీదే ఒక కాలం రాశారు. దాని శీర్షిక ‘దానయ్య అని మావాడే’ అని గుర్తు. దానయ్య
అంటే డానీ అన్నమాట.
తమ్ము పెద్దిరాజు ఎక్కువగాకాదుగానీ రెండు మూడు కథలు రాశాడు. సృజనలో
అచ్చయిన కథ “విలువలు’ అనుకుంటాను. చాలా తక్కువ పదాలుండే చిన్నచిన్న వాక్యాలు తనవి.
మాటకూ, రాతకూ తేడా లేని శైలి అతనిది. కథలు తెలివిగా కాకుండ అమాయికంగా నిరాడంబరంగా వుండాలని
ఓ నియమం పెట్టుకున్నాడు తను.
కథల్లో సాధారణ పాఠకుడు గమనించలేని అనేక సూక్ష్మ అంశాల్ని పెద్దిరాజు
చాలా గొప్పగా పట్టుకునేవాడు. రష్యన్ కథకుడు ఆంటోన్ చెఖోవ్, చైనా రచయిత లూసన్ రచనల్లో
ఒక్క పదాన్ని దాటేసినా కథ ప్రాణం మొత్తం పోతుంది
అనేవాడు.
లూసన్ రాసిన ఓ కథలో ప్రమాదంలో గాయపడి రోడ్డు మీద పడున్న ఓ వ్యక్తిని
ఓ రిక్షావాడు లేపి హాస్పిటల్ కు తీసుకునిపోతుంటే
దూరం పెరిగే కొద్దీ కంటికి అతని రిక్షా సైజు చిన్నదవకపోగా పెద్దదవుతూ వుంటుంది. ఈ చివరి
వాక్యంలోని సూక్ష్మాన్ని ఓ సభలో పది నిముషాలు వివరించాడు పెద్దిరాజు.
ఎప్పటి అనుబంధమోగానీ పీపుల్స్ వార్ నాయకత్రయం అయిన కొండపల్లి సీతారామయ్య,
కేజి సత్యమూర్తి. ఐవి సాంబశివరావులతో పెద్దిరాజు చాలా సన్నిహితంగా వుండేవాడు. వాళ్ళ
కుటుంబ సభ్యునిగా వుండేవాడు.
ఐవి సాంబశివరావుకు లూసన్ అంటే ఇష్టం. వారు అనువాదం చేసిన లూసన్ కథలు కొన్ని సృజనలో అచ్చు
అయ్యాయి. ఆ కథల్లోని ఆ పదాల్లోని సూక్ష్మాల్ని పెద్దిరాజు విడమరచి చెపుతుంటే ఆశ్చర్యం
వేసేది. ఐవి, పెద్దిరాజూ ప్రభావంతో నేనూ లూసన్ అభిమానిని అయిపోయాను. అది నాకు చాలా
ఉపయోగపడింది. 1981 అక్టోబరులో జేఎన్ యూ విదేశీ భాషల విభాగం లూసన్ శత జయంతోత్సవాలను నిర్వహించినపుడు నన్నూ ఒక
వక్తగా ఢిల్లీకి పిలిచారు.
వాస్తవ జీవిత సంఘటనల్లో సమస్య వుంటుంది, గొప్ప నాటకీయత కూడ వుంటుంది.
కథ రాయడానికి ఉత్తేజం కూడ కలుగుతుంది. గానీ అనేక వాస్తవ సంఘటనలు డైనమిక్ గా మొదలయ్యి
స్టేల్ గా ముగుస్తుంటాయి. నక్సల్ బరీ నాయకుడు జంగల్ సంతాల్ జీవిత చరమాకం ఏమాత్రం ఉత్తేజకరంగా
వుండదు. అలాగే కొన్ని వాస్తవ సంఘటనలు, సమస్యలు దారిలేని సొరంగం లోనికి దూరి దిక్కుతోచని
స్థితిలో పడిపోతాయి. వాస్తవ సంఘటనల్ని తీసుకుని కథలల్లే సమయంలో ముగింపు కోసం నేను మేజికల్
రియలిజం సాంప్రదాయాన్ని పాటించడం మొదలెట్టాను. అది మా ఇంట్లో ఖురాను కథలు, అరేబియన్ నైట్స్ విన్న
అనుభవం నుండి అబ్బిన సాంప్రదాయం.
ఒకవైపు, తరుముకుంటూ వస్తున్న పిరౌన్ (ఫారో) సైన్యం. మరోవైపు దాట
శక్యంకాని ఎర్రసముద్రం, చుట్టూ తనను నమ్ముకున్న జనం. ప్రవక్త మూసా (అలైహిస్సలాం) దైవాన్ని
నమ్ముకున్నారు. ఒక మహాత్యంగా ఎర్ర సముద్రం చీలిపోయింది. మూసా అనుచరులు సముద్రాన్ని
కలినడకన దాటారు. అది అప్పుడు దేవుని మహాత్యం. ఇప్పుడు రాస్తే మేజికల్ రియలిజం. మార్మిక
వాస్తవికత.
అయితే, మేజికల్ రియలిజం పెద్దిరాజుకు నచ్చేదికాదు. ముగింపులో అందమైన
భాషనూ, తెలివినీ వాడుతున్నావు అని విమర్శించేవాడు. నేను విద్యావంతులయిన మధ్యతరగతిని
సంభోదిస్తూ రాస్తున్నాననేది తన అభియోగం. శ్రామికుల కోసం రాసే కథలు నేల మీదే నడవాలి
అనేవాడు.
1980ల మధ్యలో ఎక్కడో తను బాగా డిస్టర్బ్ అయ్యాడు. విరసం కార్యకలాపాలకేగాక
ప్రజాజీవితానికి దూరమయ్యాడు. ఆ తరువాత చాలా అరుదుగా ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే
కలిశాం. విరసం మీద, విప్లవోద్యమం మీద అతని పాజిటివ్ దృక్పథం అలానే వుండేది. .
తెలుగు సామాజిక చరిత్రలో 1975-85 మధ్యకాలం ఒక గొప్ప దశ. గొప్ప దశల్లో మన చుట్టూ గొప్పవాళ్ళే
వుంటారు. నియంత్రిత చర్యగానో, అనియంత్రిత చర్యగానో మనం కొన్ని చారిత్రక మహాకార్యాల్లో
భాగమైపోతుంటాము. నేను విప్లవోద్యమాన్ని చాలా గొప్పగా ఆస్వాదించిన రోజులవి. ఆ కాలపు
ఒక భావోద్వేగ సన్నిహితుడు బావ పెద్దిరాజు. ఆ కాలం నాకు గుర్తున్నంత కాలం పెద్దిరాజు
గుర్తుంటాడు.
(అనివార్య కారణాలవల్ల నేను అక్టోబరు 2-6 తేదీల్లో హైదరాబాద్ లో వుండాల్సి
వచ్చింది. వెళ్ళని సభకు ఇలా ప్రసంగాన్ని రాసి పంపడం ఇదే మొదటిసారి.)
ఉష
యస్ డానీ
హైదరాబాద్
5 నవంబరు
2022
కామ్రేడ్
అరసవిల్లి కృష్ణా,
నా
నోట్ ను అచ్చువేయాలనుకుంటే ఈ కింది లింకు నుండి తీసుకోండి.
అప్
డేట్ వెర్షన్ ఇందులో వుంటుంది.
https://khanyazdani.blogspot.com/2022/11/tammu-peddiraju.html
No comments:
Post a Comment