This is not the dawn what we
have dreamt
మనం కలగన్న ఉషోదయం ఇది కాదే! - 1
(‘పరాయి’ నాటకం చూసొచ్చాక ఒక నిద్రరాని రాత్రి)
ప్రపంచ కథా రచయితలంటే మనకు మొపాస, మంటో గుర్తుకొస్తారు. మనుషుల్లోని క్రూరత్వాన్నీ, దయనీయ నిస్సహాయ జీవితాలని ఒకే సంఘటనలో చెప్పిన మంటో కథ ‘ఖోల్దో’ (విప్పు /తెరువు). ఖోల్దోతోపాటు మంటోదే మరో కథను తీసుకుని వర్తమాన భారత సమాజానికి అన్వయిస్తూ అనంతు చింతలపల్లి, ప్రియాంక పుతంబేకర్ ‘పరాయి’ పేరిట నాటకంగా మలిచారు.
వినోద్ శర్మ సమర్పణలో ఉస్మాన్ ఘని దర్శకత్వంలో ఈ నాటకాన్ని ఈరోజు రాత్రి గచ్చీబౌలీ రంగ్ భూమి థియేటర్ లో బి- స్టూడియోస్ ప్రదర్శించింది.
దేశవిభజన సమయంలో జరిగిన అల్లర్లలో ప్రాణాలు అరచేత పట్టుకుని ఎక్కిన ప్రయాణికులతో క్రిక్కిరిసిపోయి భారంగా ఊగుతున్న రైలు పెట్టెలో నాటకం మొదటి సీన్ మొదలవుతుంది. ఒక్కసారిగా ప్రేక్షకులందర్నీ 1947 ఆగస్టు నెలలోని పంజాబ్ సరిహద్దులకు తీసుకుపోతుంది నాటకం.
ఓపెనింగ్ ఇమేజ్ నుండి క్లోజింగ్ ఇమేజ్ వరకు అనుక్షణం ఈ నాటకం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. దేశ విభజన నాటి సన్నివేశాలనూ, వర్తమాన సమాజంలో వాటి ప్రతిఫలనాలనూ కలిపి స్టేజ్ ప్లే తయారు చేయడం ఒక విశేషం. నాన్ లీనియర్ పధ్ధతిలో నాటకాన్ని ప్రదర్శించడం పెద్ద సాహసం. దాన్ని ప్రేక్షకులు ఆస్వాదించేలా చేయడం మరో పెద్ద విజయం. అందుకు దర్శకుడు ఉస్మాన్ ఘనిని ఎంత మెచ్చుకున్నా తక్కువే.
నాటకంలో ప్రొటోగోనిస్టు పాత్రలో షేక్ జాన్ బషీర్ అద్భుతంగా ఒదిగిపోయాడు. షేక్ జాన్ బషీర్ కూడ స్వతహాగా సీనియర్ దర్శకుడు. సాదత్ హసన్ మంటోను పోలిన పాత్ర, అద్దె ఇంటి కోసం తిరిగే బషీర్ పాత్ర, వేశ్యా గృహంలో బ్రోకర్ పాత్ర మనకు కొంతకాలం గుర్తుండిపోతాయి. సకీనా పాత్ర ఖోల్దో కథలో పాఠకుల్ని పిండేసినట్టుగానే ‘పరాయి’ నాటకంలోనూ ప్రేక్షకుల గుండెల్ని పిండేస్తుంది.
సంభాషణలు ఈ నాటకానికి జీవంపోశాయి. ఆ ఘనత అనంతు చింతలపల్లిది. తను ఇందులో ఫైజ్ అహ్మద్ ఫైజ్, సాహిర్ లూధియాన్వీ కవితల్ని కూడ తెలుగులో జొప్పించాడు. అవి కూడ నాటకానికి ఒక భావోద్వేగాన్ని సృష్టించాయి. సౌండ్ విభాగాన్ని కూడ దర్శకుడు ఉస్మాన్ ఘని నైపుణ్యంతో నిర్వహించాడు. లైటింగ్ విభాగం గొప్పగా పనిచేసింది. 20 మంది కళాకారులు, మరో పదిమంది సాంకేతిక నిపుణులు కలిసి అందించిన ఒక గొప్ప అనుభూతి ఇది. భటుడి పాత్రతో సహా ప్రతి పాత్రధారీ నాటకానికి జీవంపోశారు. ప్రేక్షకులు గొప్పగా ఆస్వాదించారు. హాలు నిండిపోవడమేగాక కొందరు ప్రేక్షకులు నడక దారిలో కూర్చొని నాటకాన్ని ఆస్వాదించారు.
నలభై వేల రూపాయలకు పైగా ఖర్చుతో ప్రదర్శించిన ఈ నాటకం అనుక్షణం ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంది. తెరపడగానే రంగ్ మంచ్ ధియేయేటర్ ప్రేక్షకుల చప్పట్లతో మార్మోగిపోయింది.
హైదరాబాద్
కు చెందిన ఒక కొత్తరం ఈ నాటకాన్ని చూడడానికి
తరలి వచ్చింది. అది మనకు భవిష్యత్తు మీద ఒక నమ్మకాన్ని కలిగించింది.
మనం కలగన్న ఉషోదయం ఇది కాదే! - 2
(‘పరాయి’ నాటకం చూసొచ్చాక ఒక నిద్రరాని రాత్రి)
ముస్లింలు కర్కసులు; లక్షమంది హిందువులను క్రూరంగా చంపేశారు అని హిందువులు అనుకుంటుంటారు. హిందువులు కర్కసులు; లక్షమంది ముస్లింలను క్రూరంగా చంపేశారు అని ముస్లింలు అనుకుంటుంటారు. దేశ విభజన గురించి ఇప్పటికీ మనలో సాగుతున్న నేరేటివ్స్ ఇవి. ఒకే అపార్ధం రెండు రకాలుగా రెండు ప్రజా సమూహాల్లో ఇన్నాళ్ళు కొనసాగడం మనుషులుగా మనకూ మంచిదికాదు; దేశానికి మంచిదికాదు.
ఈ నేరేటివ్స్ అబధ్ధాలు కాదు. వాస్తవాలు. ఈ వాస్తవాలు సంపూర్ణం కాదు. అర్ధ సత్యాలు. ఆ ఘోరాన్ని ఒక పీడకలగా మరచిపోవడమే మేలని మనం అనుకున్నాం. అలా మరచిపోదాం అనుకున్నాం గాబట్టే ఎనిమిది దశాబ్దాలుగా కలిసి బతకగలుగుతున్నాం. పరిపక్వత కలిగిన మనుషులుగా ఓ పదేళ్ళ తరువాత అయినా ఇరు సమూహాలు ఒక సంవాదాన్ని కొనసాగించి వుండాల్సింది.
కర్కసులు ముస్లింలలోనూ వున్నారు; హిందువులలోనూ వున్నారు; మంచివాళ్ళు హిందువులలోనూ వున్నారు; ముస్లింలలోనూ వున్నారు అనే ఒక సంపూర్ణ సత్యాన్ని అందరూ అర్ధం చేసుకునే అవకాశం వుండేది. రెండు సమూహాలు కర్కసుల్ని పక్కన పెట్టాల్సింది; మంచివాళ్లను కాపాడుకోవాల్సింది. అలా జరగలేదు. పాత నేరేటివ్స్ మన భావోద్వేగాల్లో కొనసాగుతూ వుండడంవల్ల అవి వర్తమాన రాజకీయరంగంలో ఓటర్ల సమీకరణకు దారితీసి కొన్ని పార్టీలకు బలవర్ధక ఆహారంగా మారాయి. ఆ పార్టీలు మన భవిష్యత్తుని నిర్మించవు; పదే పదే గతకాలపు అర్ధసత్యాలను గుర్తుచేస్తూ రెండు సమూహాల మధ్య చిచ్చు రేపుతూ రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు తమ శక్తులన్నీ ఉపయోగిస్తాయి.
మనం ఇప్పుడయినా అర్ధసత్యాల స్థాయిని దాటి సంపూర్ణ సత్యాలను ఆవిష్కరించుకోవాలి. Better late than never. రెండు సమూహాల మధ్య ఒక సంవాదం సాగాలనే ఆలోచన చాలా కాలంగా వుంది. అది తక్షణం జరగాలని రాత్రి బి-స్టూడియోస్ వారు ప్రదర్శించిన ‘పరాయి’ నాటకం మరోసారి గుర్తు చేసింది.
హైదరాబాద్
12-11-20022
No comments:
Post a Comment