యంత్రాలు నాకు మంచి మిత్రులు
Machines are my best friends
నా హాబీల్లో అన్నింటికన్నా పాతది మెకానికల్ ఇంజినీరింగ్. కొత్త యంత్రాలు
వాటి పనితీరును అర్ధం చేసుకోవడం చాలా బాగుంటుంది. ఏ మాత్రం తీరిక దొరికినా నేను యంత్రాల
మధ్య గడపడానికి ఇష్టపడతాను.
మనుషులు తమకు సంతానం కలిగినపుడు
సంతోషించినట్టే, కొత్త పనిముట్లను పొందినప్పుడు అంతే సంతోషిస్తారు. నా మనుగడను సుత్తీ,
దాగలి, కటింగ్ ప్లేయర్లు శాసించిన దశ ఒకటి వుంది. బ్రిటీష్ కాలం నాటి సింగర్ మిషిన్
K15 కొన్నాళ్ళు నా జీవనోపాధిగా వుండింది. స్టేట్
జాబర్ హ్యాండిల్ ప్రింటర్ కొన్నాళ్ళు నాకు బతుకుతెరువు ఇచ్చింది. దాన్ని నేను థ్రెడిల్
గా మార్చుకుని పనిచేశాను. ఆర్ధిక ఇబ్బందులు వచ్చినపుడు కొన్నింటిని అనివార్యంగా అమ్ముకోవాల్సిన
పరిస్థితులు వచ్చాయి. అప్పుడు సోదరుల్ని కోల్పోయినంత దుఃఖ్ఖం కలిగింది. వాటిని కౌగలించుకుని
ఏడ్చేశాను. మెకానిక్ అన్నవాడు పనిముట్లను అమ్ముకోడు; ప్రేమిస్తాడు. నేను వాడిన పనిముట్లు
కొన్నింటిని ఇప్పటికీ భద్రంగా దాచివుంచాను. అదో అనుబంధం. అవి నా ఉనికి. ఔకాత్ !
యంత్రాల అభివృధ్ధి సమాజ ఉత్పత్తి స్థాయినీ జ్ఞాన పరిధినీ, వ్యక్తీకరణ
శైలిని ప్రభావితం చేస్తుంటాయి. చారిత్రక భౌతికవాదంలో ఇది చాలా కీలకమైన పార్శ్వం. కార్ల్
మార్క్స్ చెప్పిన means of production and relations of production లో ఇది మొదటి మెట్టు.
చాలా మంది మార్క్సిస్టులు ఈ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంటారు.
నేనేమీ నియత విద్యగా మెకానికల్ ఇంజినీరింగ్ చదవలేదు. బాహ్యదహన (external
combustion) యంత్రాలు అంటే ఆవిరియంత్రాల గురించి మానాన్న దగ్గర నేర్చుకున్నాను. ఆయనతో
కలిసి కొన్నాళ్ళు పని చేశాను. నేనొక మెకానిక్ కొడుకుని అని చెప్పుకోవడం చాలా గర్వంగా
వుంటుంది. అంతర్దహన (Internal combustion) యంత్రాలు అంటే ఆటోమోబైల్స్. ఆ రంగంలో ఏకంగా
ఎనిమిదేళ్ళు పనిచేశాను. అయితే, నా జ్ఞాన పరిమితి తొలి రెండు తరాల యంత్రాలకు (external
combustion and Internal combustion engines) సంబంధించింది మాత్రమే.
1980వ దశకంలో మూడవతరం యంత్రాల రాకతో ఎలక్స్ట్రానిక్ యుగం ఆరంభం అయింది. ఇవి మార్మిక యంత్రాలు.
వీటి పనితీరు చాలా సంక్లిష్టమైనది. వీటిని అర్ధం చేసుకోవడం అంత సులభం కాదు. మనకాలపు
టెక్నాలజీని మనం స్థూలంగా అయినా అర్ధం చేసుకోకపోవడం ఒక చారిత్రక నేరం అవుతుంది. ఈలోపం
నాకు ఉండకూడదని అనుకున్నాను. మా ఇంట్లో ముందుగా
నా భార్య అజిత కంప్యూటర్స్ రంగంలో ప్రవేశించింది. ఆమె తరువాత మా ఇద్దరు కొడుకులు అందులో
ప్రవేశించారు.
నేను రిటైర్ అయ్యాక డాక్యుమెంటరీ మేకర్ గా మారాలనే ఉద్దేశ్యంతో ఓ
ఆరేళ్ళ క్రితం మూడు పీసీలు, రెండు Sony A 7 S II కెమేరా యూనిట్లు, మంచి ఆడియో సిస్టమ్ తో హై-ఎండ్ ప్రొజెక్టర్ యూనిట్, గింబల్స్, షోగన్,
ఆస్మోలు, ప్లే అవుట్, లైటింగ్ అరేంజ్ మెంట్
వగయిరాలు దాదాపు 15 లక్షల రూపాయలు పెట్టి కొన్నాను. వాటిలో కొన్నింటిని మాత్రమే ఇప్పుడు నా యూట్యూబ్
ఛానల్ కు వాడుతున్నాను. పోస్ట్ - కరోనా కష్టకాలంలో మిగిలిన వాటిని అమ్మేస్తే కొన్ని
డబ్బులు వస్తాయిగానీ నాకెందుకో వాటిని క్యాష్ చేసుకోవాలనిపించడం లేదు. వుండనీ అవి మన
సంతానం అనిపిస్తుంది నాకు. ఆ పరికరాల్ని భద్రంగా దాచి వుంచడానికి ప్రత్యేకంగా ఒక ఇంటిని
అద్దెకు తీసుకున్నాను. అదేమీ ఇకనామికల్లీ వయబుల్ కాదు. అయినా అదో అనుబంధం. నన్నెవరయినా
భావుకుడ్ని అనుకున్నా అభ్యంతరం లేదు.
ఎలక్ట్రానిక్స్ రంగంలో ముఖ్యంగా మూవీస్ కెమెరా విభాగంలో మా పెద్దవాడు అరుణ్ ఇక్బాల్ ఖాన్
చౌదరి కొన్ని ప్రయోగాలు చేశాడు. కమల్ హాసన్ ‘ఈనాడు’, నాగార్జున ‘గగనం’, మహేష్ బాబు
‘ఆగడు’, రామ్ గోపాల్ వర్మ ‘ఐస్ క్రీం’, శేఖర్ కమ్ముల ‘ఫిదా’ మాధవన్ ‘నిశ్శబ్దం’ సినిమాల్లోని
కొన్ని కీలక షాట్లలో అరుణ్ పనితనం కనిపిస్తుంది. వాడు ఓ మూడేళ్ళుగా Performance
Capture విభాగంలో పరిశోధనలు చేస్తున్నాడు.
ఇప్పుడు believable, emotionally engaging digital
charactersను సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
Performance Capture అనగానే ఎవరికయినా గుర్తుకు వచ్చే పేరు Andy
Serkis. ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’లో ‘గొల్లామ్’ గా, ‘కింగ్ కాంగ్’ లో కింగ్ కాంగ్ గా, ‘ప్లానెట్ ఆఫ్ ఏప్స్’లో సీజర్’ గా నటించింది అతనే.
తన గురించి చెప్పాలంటే చాలా పెద్ద జాబితా అవుతుంది. Performance Capture కోసం అతను
లండన్ లో The Imaginarium Studios నిర్మించాడు. ఈ స్టూడియో త్వరలో ‘జార్జ్ ఆర్వెల్’
నవల ‘యానిమల్ ఫార్మ్’ ను Performance Capture టెక్నాలజీలో believable, emotionally engaging digital charactersతో సినిమాగా
తీస్తున్నది.
కొన్ని హిందీ సినిమా ప్రాజెక్టుల కోసం ప్రస్తుతం అరుణ్ ముంబాయిలో
వుంటున్నాడు. ఈలోగా హైద్రాబాద్ లో అత్యవసరంగా Performance Capture టెక్నాలజీలో ప్రయోగాత్మకంగా
కొన్ని షాట్స్ తీయాల్సిన అవసరం వచ్చింది. అరుణ్ ముంబాయి నుండి రావడం కుదరలేదు. ఆ షాట్లకు అపధ్ధర్మంగా నన్నే డైరెక్షన్ చేసేయమన్నాడు. ఇదొక బిగ్ ఛాలెంజ్. అయితే నేను ప్రతి సవాలునూ ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను. నిన్న రాత్రి షూట్
పూర్తిచేసేశాను. షాట్స్ బాగానే వచ్చాయి అని తొలి రిపోర్ట్ వచ్చింది. కంప్లీట్ రిపోర్ట్
రావల్సి వుంది.
రాత్రి షూట్ లో నటించిన మిమిక్రి కళాకారుడు రవికాంత్ కూ, నాతో సహకరించిన
భరద్వాజ రంగావఝ్ఝాలకు ధన్యవాదాలు.
ఆధునిక టెక్నాలజీలో పనిచేయడం చాలా థ్రిల్ గా అనిపించింది. ఆ ఆనందాన్ని
పూర్తిగా ఆస్వాదించాను. కొత్తతరంతో పనిచేస్తే రెండు లాభాలు; కొత్త విషయాలు తెలుస్తాయి;
వయసు కొంచెం తగ్గుతుంది.
హైదరాబాద్
3 నవంబర్
2022
No comments:
Post a Comment