Wednesday 24 May 2023

Aryasamaj, Congress , Communist Party and the Telangana armed struggle

 సూత్రధారి ఆర్యసమాజ్ 

పాత్రధారి కాంగ్రెస్ 

కాల్బలం కమ్యూనిస్టు పార్టి

 

-       డానీ

 

'కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టు పార్టీలు వేరు'  శీర్షికతో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏప్రిల్ 26 నేను రాసిన వ్యాసం మీద సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి మే 3  సాయుధ పోరాటంపై అవాస్తవాలు, వక్రీకరణలు!’ అంటూ స్పందించారు. ‘వీర తెలంగాణపై విపరీత వ్యాఖ్యలుఅంటూ ఆర్. రాజేశమ్ (మే13),  మహత్తర పోరాటాన్నిమతదృష్టికి కుదిస్తారా?! అంటూ జతిన్ కుమార్ (మే18) స్పందించారు.

వ్యాసానికి ‘కమ్యూనిజం వేరు; కమ్యూనిస్టుపార్టీలు వేరు’ అని శీర్షిక పెట్టినప్పుడే అందులోని ఆరోపణలన్నీ కమ్యూనిస్టు పార్టీల నాయకుల మీదనేగానీ, పోరాటంలో పాల్గొన్న సామాన్య ప్రజల మీద కాదని  సులువుగా అర్ధం అవుతుంది. ఈ అంశాన్ని తారుమారు చేసి లబ్దిపొందాలని విమర్శకులు ప్రయత్నించారు.

ప్రతి ఉద్యమానికీ అనేక పార్శ్వాలుంటాయి. సాధారణంగా ఆ ఉద్యమాల గురించి వ్యక్త సమూహాలన్నీ తమ సామాజిక అస్తిత్వం నుండి ఏర్పడిన చైతన్యం నుండి రాస్తాయి. అప్పటికి అవ్యక్తంగా వుండిపోయిన  సమూహాలు కొన్నాళ్ళకు వ్యక్తంగా మారినప్పుడు తమ అస్తిత్వం నుండి ఆ ఉద్యమాల చరిత్రను తిరగరాస్తాయి (Subaltern studies). 1984 నాటి ఢిల్లీ అల్లర్ల తరువాత భారత సామాజికరంగంలో అస్తిత్వ సమూహాలు తమ భావోద్వేగాలను వ్యక్తం చేసే దశ ఆరంభం అయింది.

సాయుధ పోరాట పంథాను భారత కమ్యూనిస్టు పార్టి అధికారికంగా విరమణ చేసి, పార్లమెంటరీ పంథాను చేపట్టింది. అంతకు ముందు సాయుధ పోరాటానికి పిలుపిచ్చిన పార్టి జాతీయ ప్రధాన కార్యదర్శి బిటి రణదివెను ‘వామపక్ష దుందుడుకువాది’ (Left Adventurist)గా ముద్దరేసి ఏకంగా పార్టి నుండి బయటికి పంపించేసింది. ‘తెలంగాణలో రైతు కూలీ రాజ్య స్థాపన’ అనే లక్ష్యం నెరవేరకుండానే వీరోచితంగా విరమణ చేసిన పోరాటాన్ని ‘మహత్తర’ అనే నైతిక హక్కు భారత కమ్యూనిస్టు పార్టికి లేదు. ఆ తరువాత పుట్టిన మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీల దృక్పథాలు వేరు.

నైజాం అనేది చాలా పెద్ద సంస్థానం. అందులో తెలంగాణ ఒక భాగం. ఆ తెలంగాణలోనూ రెండు జిల్లాల్లో భూస్వామ్య వ్యతిరేక సాయుధ పోరాటం ప్రధానంగా సాగింది. మిగిలిన జిల్లాల్లో జరగలేదని ఆర్. రాజేశమ్, జతిన్ కుమార్ ఇద్దరూ ఏదో విధంగా ప్రస్తావించారు. ఆ రెండు జిల్లాల్లోనూ ఏఏ తాలుకాల్లో పోరాటం వుధృతంగా జరిగింది అని పరిశోధిస్తే దాని పరిధి ఇంకా తగ్గుతుంది. ఆ రెండు జిల్లాలు ఆనాటి ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దులోనివి. సాయుధ పోరాటాన్ని కొనసాగించితీరాలని పట్టుబట్టింది కూడ ఆంధ్రా ప్రాంత కమ్యూనిస్టు నాయకులే.  వాళ్ళను రావి నారాయణ రెడ్డివర్గం ‘బెజవాడ ముఠా’  (the Bezwada Clique) అంటూ ఎద్దేవ చేసేది. మొత్తం  తెలంగాణ పోరాటాన్ని  రావివర్గం వ్యక్తిగత హింసావాదం, అరాచక చర్యలుగా (The struggle was nothing more than individual terrorism and anarchist deeds) పేర్కొనేదని ఆనాటి మరో అగ్రనేత పుచ్చలపల్లి సుందరయ్య తన గుణపాఠాల్లో రాశారు. (Chapter XI, Withdrawal of Telangana Armed Partisan Resistance; Page 297). ఆ పోరాటంలో మితవాద ఆలోచనా ధోరణికి రావి నారాయణరెడ్డి నాయకత్వం వహించారని జతిన్ కుమార్ అంటే, వారిని మహానేతగా చిత్రించడానికి సురవరం చాలా తంటాలు పడ్డారు. ఇది అతివాదులు మితవాదుల వివాదం.

ఆర్యసమాజ్, జాతీయ కాంగ్రెస్ రెండూ మొత్తం నిజాం సంస్థానాన్నే భారత్ లో విలీనం చేయాలనుకున్నాయి. కమ్యూనిస్టు పార్టితో పోలిస్తే ఆ రెండు సంస్థల కార్యక్షేత్రమూ పెద్దది; లక్ష్యమూ పెద్దది. నెహ్రూ-పటేళ్ళ కేంద్ర ప్రభుత్వం వాటికి అండగా వుంది.  ఆర్యసమాజ్ ది మతకారణం అయితే; కాంగ్రెస్ ది రాజకీయ కారణం. తమ సంపదను అపారంగా పెంచుకోవడానికి ఇండియన్ యూనియన్ లో ఎక్కువ  అవకాశాలుంటాయని తెలిసాక నిజాం సంస్థానంలోని భూస్వామ్య- పెట్టుబడీదారీవర్గాలు కాంగ్రెస్, ఆర్యసమాజ్ లకు గట్టి మద్దతిచ్చాయి. మరోవైపు, కమ్యూనిస్టు పార్టిలోని మితవాదవర్గాన్ని కూడ ప్రోత్సహించాయి.

    నిజాం విలీనానికి సూత్రధారి ఆర్యసమాజ్, పాత్రధారి కాంగ్రెస్, కాల్బలం (infantry) భారత కమ్యూనిస్టు పార్టి.

దేశంలో వందల కొద్దీ సంస్థానాలుండగా నైజాంలో మాత్రమే సాయుధ పోరాటం ఎందుకు జరిగిందీ? నైజాం భారత యూనియన్ లో విలీనంకాగానే సాయుధపోరాటాన్ని కమ్యూనిస్టు పార్టి ఎందుకు విరమించింది? అనే రెండు సూటి ప్రశ్నలకు సమాధానాల్ని అందరూ దాటవేశారు.

దేవులపల్లి వేంకటేశ్వరరావు (డివి) ఆత్మవిమర్శలో భాగంగానే కావచ్చుగానీ ఆనాటి పార్టీలోని అనేక తప్పుడు ధోరణులను తన పుస్తకంలో రాశారు. వాటిల్లో, మత కోణం కూడ వున్నది అనేది ఒకటి. రాజకీయ పత్రాల్లోనే (డాక్యుమెంట్స్)కాక; తెలంగాణ పోరాట  కథలు, నవలలు (దాసరధి రంగాచార్య), కవితలు, పాటలలోనూ (సుద్దాల హనుమంతు) మతపక్షపాతం కనిపిస్తుంది. మిగిలిన అంశాలకన్నా ఇవి ముస్లిం సామాజిక అస్తిత్వ సమూహానికి  సహజంగానే ముఖ్యమైనవి.

అస్తిత్వం అంటే పాలితుల వ్యవహారమేగానీ పాలకుల వ్యవహారం కాదు. నిజాం రాజరిక పాలనను ఆధునిక ముస్లింలు ఎవ్వరూ సమర్ధించరు. నిజాం పాలనలో ముస్లింలు సహితం తీవ్ర అణిచివేతకు గురయ్యారు. హిందువులు సహితం పెద్ద పెద్ద పదవుల్ని ఆస్వాదించారు. ఇతర సంస్థానాలతో పోలిస్తే నిజాం సంస్థానంలో ఆధునిక సౌకర్యాలు మెరుగ్గా వున్నాయి అనేదీ కాదనలేని వాస్తవం. దళిత నేతలు భాగ్యరెడ్డి వర్మ, బీఆర్ అంబేడ్కర్ లతో సఖ్యంగా వున్నాడు. యూనివర్శిటీని ఇంగ్లీషులో కాకుండ భారతీయ భాషల్లో నెలకొల్పితే బాగుంటుందని రబీంద్రనాధ్ టాగోర్ ఇచ్చిన సలహాను  పాటించాడు. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను చీఫ్ ఇంజినీర్ గా నియమించి నిజాం సాగర్, సింగూర్ డ్యామ్ లను, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లను నిర్మించాడు. విద్యుత్తు యూనిట్లు, రైల్వే మార్గాలను నిర్మించాడు. ప్రభుత్వ రంగంలో అనేక భారీ పరిశ్రమలు నెలకొల్పాడు.  నిజాం ఆధునిక ప్రాజెక్టుల మీద అనేక పరిశోధనా గ్రంధాలు ఇప్పుడు అందుబాటులో వున్నాయి.

సైనిక చర్యలో 3500 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారు. ఇది కిరాతకం. అయితే, తెలంగాణలోని కమ్యూనిస్టు ప్రభావిత ప్రాంతాలకు చేరుకోవడానికి ముందే భారత సైన్యం ఉస్మానాబాద్, నాందేడ్, గుల్బర్గా, బీదర్ జిల్లాల్లో 3500కన్నా అనేకరెట్లు ఎక్కువ సంఖ్యలో ముస్లింలను ఏరి ఏరి చంపేసింది. సామాజిక కార్యకర్త సుందర్ లాల్ బహుగుణ నాయకత్వాన అప్పటి ప్రధాని నెహ్రు వేసిన అధికారిక  నిజనిర్ధారణ  కమిటి ఈ మేరకు ఓ రిపోర్టును కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఇప్పుడు ఆ రిపోర్టు అందుబాటులో వుంది. ఆ పార్శ్వాన్ని వీరు పట్టించుకోలేదు; ఆ నొప్పి వీరికి తెలీదు. అస్తిత్వ సమూహాలు 1948 నాటి హైదరాబాద్ నరమేధాన్ని (Hyderabad Massacres) కూడ పట్టించుకుంటాయి.

దేశానికి ఫాసిస్టు ప్రమాదం ముంచుకొస్తున్న సందర్భంలో కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడడం ఆందోళనకరంఅంటూ ముస్లిం సామాజిక దృక్పధంతో రాసిన వ్యాసాన్ని సుధాకరరెడ్డి ఇస్లాం మత దృక్పథంఅని ఆరోపించారు. నూరేళ్ళ కమ్యూనిస్టు పార్టికి జాతీయ అగ్రనేతగా వెలిగిన వ్యక్తికి  భారత ముస్లింల సామాజిక దృక్పథానికీ’, ‘ఇస్లాం మత దృక్పథానికీతేడా తెలియకపోవడం విషాదకరం. భారతీయ ఫాసిజానికి అత్యంత బాధితులు ముస్లింలు. ఎంఎస్ గోల్వాల్కర్ పుస్తకం బంచ్ ఆఫ్ థాట్స్’  గురించిన ఎరుక వీరికి లేదు.  అసలు ఫాసిజం అనే పదమే ముగ్గురి వ్యాసాల్లో భూతద్దం వేసి వెతికినా  కనిపించలేదు. అస్తిత్వ సమూహాలతో కమ్యూనిస్టు పార్టిలు సరిగ్గా వ్యవహరించలేదనే ప్రధాన ఆరోపణను అందరూ తెలివిగా దాట వేశారు.

భారత కమ్యూనిస్టు పార్టీలు ఏవీ ఇంతవరకు భారత సమాజ స్వభావాన్ని, కుల మత తెగ  వ్యవస్థల్ని అర్ధం చేసుకోలేదు. వాటిని అర్ధం చేసుకోవడానికి కనీస  ప్రయత్నం కూడ చేయలేదు. శ్రామికవర్గం కూడ ఏదో ఒక సామాజిక అస్తిత్వంలోనే వుంటుందని అంగీకరించడానికి కమ్యూనిస్టు పార్టీల నాయకత్వాలకు ఇప్పటికీ బయటికి చెప్పుకోలేని ఏదో ఒక ఇబ్బంది వుంది.

భారతీయ కమ్యూనిస్టు పార్టి అనే పేరును కొనసాగిస్తే భారత సమాజ ప్రత్యేక స్వభావాలను అర్ధం చేసుకోవడానికి దోహదపడి వుండేది అనే సూచనను సురవరం తిరస్కరించారు. స్వదేశీగడ్డ, విదేశీగడ్డ అని ఒక వింత సిధ్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. విచిత్రం ఏమంటే,  స్వదేశీగడ్డ మీద పుట్టిన పార్టీలు  కొన్నాళ్ళు రష్యామార్గం, మరికొన్నాళ్ళు చైనామార్గం అంటూ విదేశీ విప్లవ కేంద్రాలకు ఇక్కడి అనుచరులుగా బతికేశాయిగానీ స్వదేశీ సమాజాన్ని లోతుగా అర్ధం చేసుకునే ప్రయత్నాలు ఏమాత్రం చేయలేదు. అంతర్జాతీయ దృక్పథం గొప్ప ఆదర్శమేకావచ్చుగానీ, దాని కోసం దేశీయ అస్తిత్వాన్నివదులుకోనక్కరలేదు.  

కమ్యూనిస్టు  పార్టీల నాయకులకు  ఫాసిజం-నాజిజం అంటే 1930ల నాటి ఇటలీ, జర్మనీలే గుర్తుకొస్తాయి. దేశాధినేతలు సైనిక దుస్తులు వేసుకోకపోయినా, నల్లజాతీయులో, యూదులో బాధితులుగా లేకపోయినా దేశం లోనికి ఫాసిజం వచ్చినట్టుకాదు అన్నట్టు వ్యవహరిస్తుంటారు. వందేళ్ళ తరువాత ప్రతీదీ ప్రాంతీయ కొత్త రూపాల్ని సంతరించుకుంటాయనే స్పృహ వాళ్ళలో కనిపించదు.   భారతీయ ఫాసిజం అంటూ ఒకటుంటుందనీ, దానికి ఇక్కడి మత అల్పసంఖ్యాకవర్గాలు ప్రధాన బాధితులుగా వుంటారని వాళ్ళ ఆలోచనలకు తట్టదు. ఇది అసలు విషాదం.

వర్తమానం (సమస్య) – గతం (ఉదాహరణ) – భవిష్యత్తు (పరిష్కారం) అనేది ఏ చర్చకయినా ప్రాతిపదిక విధానం కావాలి.  మనం గతాన్ని పరామర్శించేది గతం కోసం కాదు; మెరుగైన భవిష్యత్తు కోసం. ఈ నియమాన్ని విమర్శకులు ముగ్గురూ మరిచిపోయారు. వర్తమాన భారతీయ ఫాసిజానికి విరుగుడు మీద చర్చలో భాగంగా అలనాటి నిజాం,  రావి నారాయణ రెడ్డిల ప్రస్తావనను తెస్తే అందరూ  గతం లోనికి వెళ్ళిపోయారుగానీ అక్కడి నుండి వర్తమానానికి తిరిగి రాలేదు. ఇక భవిష్యత్తు గురించి ఏం మాట్లాడుతారూ?

మతం గురించి కూడ కమ్యూనిస్టు పార్టిల నాయకులకు చాలా గందరగోళం వున్నది. మతానికి ఒక సామాజిక ప్రయోజనం వుందన్నాడు మార్క్స్. కష్టకాలంలో నిస్సహాయులకు మతం ఒక ఉపశమనాన్ని ఇస్తుందన్నాడు. ఒక ప్రయోజనం వుంది కనుకే అది సమాజంలో కొనసాగుతుందన్నాడు. సమాజంలో వర్గాలు నశించినపుడు నిస్సహాయులు వుండరు కనుక వారికి ఉపశనం అందించాల్సిన అవసరం కూడ వుండదు. అప్పుడు మతం సహజంగానే అంతరించి పోతుందన్నాడు. దీని సారాంశం ఏమంటే సమాజంలో వర్గాలు అంతరించాక మతం అంతరిస్తుందని. అంతేతప్ప మతం అంతరిస్తే వర్గాలు అంతరిస్తాయని కాదు.

మన కమ్యూనిస్టు నాయకులు నాస్తికులకు ఎక్కువ; మార్క్సిస్టులకు తక్కువ. మతాన్ని బయట వదిలిపెట్టి పార్టి కార్యాలయం మెట్లు ఎక్కాలని అంటుంటారు. సంఘపరివారం కూడ దాదాపు ఇదే మాటని  కొంచెం కరుకుగా మైనారిటీలకు అంటుంది. కష్టకాలంలో ఎంతోకొంత ఉపశమనంగావున్న మతాన్ని కూడ వదులుకోవడం ఇష్టంలేక మైనారిటి మత సమూహాలు కమ్యూనిస్టు పార్టిలకు దూరం అవుతున్నాయి.

ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలు చేయాల్సిందేమంటే తమ దేశాల్లోని మతవ్యవస్థల్లో వర్గ విశ్లేషణ చేయడం; ఏవి యజమాని మతాలో, ఏవి శ్రామికమతాలో నిర్ధారించడం. ఆపైన, శ్రామిక మత సమూహాల  పక్షాన నిలబడడం. ఫాసిస్టు దశలో ఇది మరీ అవసరం. అంతే తప్ప మార్క్స్ మతం ఎప్పుడో అంతరించిపోతుందన్నాడు గాబట్టి మతాన్ని ఇప్పుడు పట్టించుకోము అని బిగుసుకుని కూర్చుంటే యజమాని మత ఆధిపత్యాన్ని పరోక్షంగా సమర్ధించిన వారు అవుతారు. అంటే, తెలిసో తెలియకో ఫాసిస్టు శక్తుల్ని సమర్ధించిన వారు అవుతారు.

కమ్యూనిస్టు పార్టి 1925 చివర్లో పుట్టింది.  ఆర్ ఎస్ ఎస్ దానికన్నా మూడు నెలలు ముందు పుట్టింది. దేశాన్ని హిందూమత రాజ్యంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు తనకు అంతర్గత  శత్రువులని బాహాటంగా ప్రకటించింది. ఇటీవల ఢిల్లోలో జరిగిన వరల్డ్ హిందూ కాంగ్రెస్ తమకు అంతర్గతంగా 5 ముప్పులున్నాయని పేర్కొంది. వాటిని malicious-5 or M5 అంటున్నారు; Marxism, Macaulayism, Missionaries, Materialism and Muslims. బహిరంగంగా ముస్లింలు అనడానికి కొంచెం ఇబ్బందిపడి Muslim extremism అంటున్నారు.

ఇప్పుడు సంఘపరివార శక్తులు  అధికారంలోనికి వచ్చారు. దేశాన్ని వేగంగా మతరాజ్యంగా మార్చే పనిలో నిమగ్నమై వున్నారు. వాళ్లు శత్రువులుగా ప్రకటించినవారు మాత్రం ఎవరికివారే వుంటున్నారు. ఆ సమూహాల నాయకులు అప్పుడప్పుడు కొన్ని వేదికల మీద కలుస్తుంటారు; తమ సమూహాల ఐక్యత గురించి అందమైన ప్రసంగాలు చేస్తుంటారు.  వేదిక కింద ఆ సమూహాలు విడివిడిగానే వుంటున్నాయి. ఒక శతాబ్దకాలంగా మనం చేస్తున్న సామాజిక తప్పిదం ఇది.  ఇప్పుడు మనం చేయాల్సిందేమంటే సమాజపు అట్టడుగు పొరల నుండి అణగారిన సమూహాలను ఏకం చేయడం. లేకుంటే, ఓ వెయ్యేళ్ళు ‘నయా మనువాద – నయా ఫాసిస్టు’ రాజ్యంలో బతకాల్సి వుంటుంది.

(రచయిత సీనియర్ పాత్రికేయులు, సమాజ విశ్లేషకులు మొబైల్ : 9010757776)

రచన : 20 మే 2023

ప్రచురణ : 25 మే 2023

https://www.andhrajyothy.com/2023/editorial/sampadakeeyam/congress-is-the-protagonist-kalbalam-communist-party-mvs-1073759.html


No comments:

Post a Comment