Muslim HERO
Notes on Vemplle Shariff stories
collection ‘TOPI JABBAR’
తెలుగు కథాసాహిత్యంలో ముస్లీం కథానాయకుడు
Danny Talking Points
సభాధ్యక్షులు
....................... గారికీ వేదిక మీద వున్న పెద్దలకూ, వేదిక ముందున్న
పెద్దలకు అందరికీ నమస్కారం.
తన పుస్తకావిష్కరణ
సభలో ప్రధాన ఉపన్యాసం ఇవ్వడానికి నన్ను ఎంచుకుని ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు
కథకుడు, ఈనాటి పెళ్ళికొడుకు వేంపల్లె షరీఫ్ కు ముందుగా దన్యవాదాలు.
నేను రానేమో అనుకుని
నా మెడకూ, కాళ్ళకూ ఒక తలుగు తగిలించాడాయన. ఈ కథా సంకలనంలో తలుగు కథ కూడా వుంది
సార్ అన్నాడు. ఇటీవలి కాలంలో నేను చదివిన కథల్లో నాకు ఇష్టమైన వాటిల్లో
అదొకటి.
రెండోది
విజయవాడలో మాట్లాడడం నాకు వ్యక్తిగతంగా ఆనందంగా వుంటుంది. మొదటిది;
ఇది నా హోం పిచ్ గాబట్టి. రెండోది, విజయవాడ ఆలోచనాపరులు ప్రధానంగా సామ్యవాదులు.
వాళ్లతో సంభాషిస్తున్నపుడు మాతృభాషలో మాట్లాడుతున్నట్టు
వుంటుంది.
అయితే నన్ను అదుపు
చేసే కార్యక్రమం కూడా ఇక్కడ వుంది. ముగ్గురు నలుగురు కేంద్ర సర్వీసు అధికారులు
వేదిక మీద వున్నారు. ముస్లీం ఆదికవి ఖాదర్ మొహియుద్దీన్ వేదిక మీద వున్నాడు. కథలని
భుజాన మోసుకుంటూ తిరుగుతున్న ఖదీర్ బాబు వేదిక మీద వున్నాడు. దళితవాద కథ నిర్మితి
క్షుణ్ణంగా తెలిసిన పసునూరి రవీందర్ ఇక్కడే వున్నాడు. మరో ప్రసిద్ద కవి బండ్ల
మాధవరావు వేదిక మీదున్నాడు. మాటల మాంత్రికుడు సీతారాం ఇక్కడే వున్నాడు. ఇక
ఇంతకన్నా పెద్దలు వేదిక ముందూ వున్నారు. ఇంతమంది కవులు, కథకులు, పెద్దల మధ్యన ఒక
సమాజ విశ్లేషకుడు సాహిత్య విమర్శ చేయడం సాహసమే అవుతుంది. నేను సాహసం
చేయక తప్పదు.
ఇందులో మొత్తం
పదకొండు కథలున్నాయి.
i.
దారి తప్పిన కల (1916)
ii.
అమ్మ బొమ్మ (2013)
iii.
గోళ్ళు (2012)
iv.
ఇద్దరు తల్లుల బిడ్డ (2014)
v.
కోయేట్ లెక్క (2012)
vi.
ఒంటి చెయ్యి ( 2014)
vii.
తలుగు (2014)
viii.
వింతశిశువు (2017)
ix.
టోపీ జబ్బార్ (2012)
x.
దహనం (2015)
xi.
అంకెలు (2017)
ఈ పదకొండు కథల్ని
స్థూలంగా ఐదు విభాగాలుగా చూడవచ్చు.
1. ముస్లీం పాత్రలున్న
కథలు.
2. ముస్లిం
పాత్రలులేని కథలు.
3. మతమైనారిటీవాద
కథలు.
4. ముస్లీం పాత్రలుండి
మతమైనారిటీవాదం లేని కథలు.
5. ముస్లీం
పాత్రలు లేకపోయినా మతమైనారిటీవాదంవున్న కథలు.
దారి తప్పిన కల (1916)
1.
చాందినీ మనోహర్ తో వెళ్ళిపోయింది – అనే షాకింగ్ న్యూస్ తో ఈ కథ
మొదలవుతుంది.
2.
తల్లిదండ్రులు తమకు మగపిల్లలు కావాలని కోరుకుంటారు. ఆడపిల్లలు యుక్తవవస్సు
రాగానే గోషా పెట్టాలని కోరుకుంటారు.
3.
విడిగా చూస్తే ఇవి తిరోగమన భావాలుగా కనిపిస్తాయి.
4.
ఇవన్నీ రాయలసీమ నీటి కరువులోండి పుట్టిన కోరికలని వేంపల్లె షరీఫ్ ఒక కొత్త
జీవన వాస్తవాన్ని ఆవిష్కరిస్తాడు.
5.
నలుగురు మగపిల్లలు పుడితే బోరు దగ్గర నాలుగు బిందెల నీళ్ళు కొట్టి తెచ్చి
ఇంట్లో పడేస్తారు అని తల్లి దండ్రుల ఆశ.
6.
ఎప్పటికయినా తనను గోషా పెట్టి నీళ్ళు తెచ్చే బాధను తప్పించే
మొగుడ్నికట్టుకోవాలనేది ఆడపిల్లల కల. అలా చాందినీ తన క్లాస్ మేట్ కుమ్మరాంపల్లి
రాంరెడ్డి కొడుకు మనోహర్ తో వెళ్ళిపోతుంది.
7.
కూతురు లేచిపోవడం ఒక బెంగ అయితే, “ఇంతకీ మనోహర్ అయినా చాందినీని గోషా
పెడతాడా?” అనేది మాబున్నీకి అంతకన్నా పెద్ద బెంగ.
అమ్మ బొమ్మ (2013)
1.
అక్షరమాల దగ్గర నుండే మతాన్ని ఎక్కించే తీరును చెప్పే కథ ఇది.
2.
కథ చిన్నదే అయినా చర్చించిన అంశం చాలా పెద్దది.
3.
మన స్కూళ్ళలో విజయ దశమికి పప్పుబెల్లాలు పంచుతారు. బుక్కా
బాణాలతో ఆడుతారు. శ్రీరామ నవమికి వడపప్పు, పానకం చేస్తారు.
4.
రంజాన్ కు సేమియా పాయసం, క్రిస్మస్ కు కేకులు చేయడం ఎప్పుడూ చూడలేదు.
5.
దీనివల్ల ఇది హిందువులదేశం అని పిల్లలకు బాల్యం నుండే తలకు ఎక్కించినట్టు
అవుతుంది.
6.
ఇతర మతస్తులకు ఇక్కడ స్థానం లేదనేది దీని పరోక్ష సందేశం. దాని దుష్ఫలితాలను
ఇప్పుడు మనం చూస్తున్నాం.
గోళ్ళు (2012)
1. అబలలకు ఒక ఆయుధం
వుండాలని చెప్పేకథ.
2. 1980లలో నేను రాసిన
ఆయుధాగారం కథ గుర్తుకొచ్చింది.
ఇద్దరు తల్లుల బిడ్డ
(2014)
1. ఆకాశవాణిలో సీనియర్
వ్యాఖ్యాత ఒకామే ఉద్యోగానికి వచ్చిన ముస్లీం కుర్రాడిని అవమానించడం ఇందులో కథాంశం.
2. భాషా వివక్షను
దాదాపు ప్రతి ముస్లీం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించే వుంటాడు. నాకు కూడా ఇలాంటి
అనుభవం వుంది.
3. ఎలిమెంటరీ స్కూలులో
అగ్నిహోత్రావధానులుగారు మిడిల్ స్కూలులో యూసఫ్ మాస్టారు, సెకండరీ స్కూలులో
విద్వాన్ పేరి రామారావుగారు నా తెలుగు గురువులు.
4. నేను తొలిదశలో చినబాలశిక్ష
చదివా. తెలుగు వ్యాకరణం కూడా బాగానే వచ్చేది. నన్ను మెచ్చుకుంటూ విద్వాన్ పేరి
రామారావుగారు నన్ను ముద్దుగా సాయిబు శాస్త్రులు అనేవారు.
5. ఇదంతా నన్ను నేను
పొగుడుకోవడం. అయితే నాకు రెండు బలహీనతలు వుండేవి. మొదటిది; ఆంధ్రాప్రాంతంలో
ముస్లీంలు ఇంట్లో ఉర్దూ వాతావరణంలోనూ స్కూళ్ళలో తెలుగువాతావరణంలోనూ జీవిస్తుంటారు.
ఒక విధంగా ఇదొక అడ్వాంటేజే. అయితే, ఒక భాషా ప్రభావం మరో భాషమీద పడుతూ
వుండడంవల్ల ఉచ్చారణలు స్వల్పంగా మారుతుంటాయి. అవి ఒక్కోసారి అవమానానికి కూడా
దోహదపడుతుంటాయి.
6. పర్షియన్ భాషల్లో
‘స’ అనే అక్షరం విడిగా వుండదు. ఇంగ్లీషులో ‘క్యూ’ అక్షరానికి ‘యు’ తోడు వున్నట్టు
ఉర్దూలో ‘స’ అక్షరానికి ముందు ‘ఇ’ అక్షరం తోడు వుంటుంది. నిజానికి ఇంగ్లీషులో కూడా
‘స’ విడిగా వుండదు. ‘యస్’ అనే రెండక్షరాలు కలిసి ఒకటిగా వుంటాయి. ఉర్దూ ప్రభావం వున్న
వాళ్ళు ‘స్కూల్’ను ‘ఇస్కూల్’ అంటారు. దానితో మా హిందూ స్నేహితులు మమ్మల్ని
ఆట పట్టించేవారు.
7. నాకు శారీరకంగా ఇంకో
బలహీనత వుంది. పుట్టుక నుండే ఆస్తమా వుంది. చలికాలం దాని ప్రభావం కొంచెం ఎక్కువగా
వుంటుంది. అంచేత శ్వాస సహకరించక పోవడంవల్ల కొన్ని పదాలను ఉఛ్ఛరించడం ఇబ్బంది అయి
తడబడేవాడిని. దానితో కొంత లాఫింగ్ స్టఫ్ గా మారేవాడిని. నేను స్వతహాగా మొండివాడిని
కనుక అనేక బ్రీదింగ్ ఎక్సర్ సైజులు చేసి ఆ బలహీనతను చాలా వరకు
అధిగమించానుగానీ ఇంకొకరయితే ‘ఇస్కూలు’ వదిలి పారిపోయేవారు!.
8. ఇప్పటికీ నేను ఒక
ఉపన్యాసం ఇవ్వడానికి ముందు ఓ అరగంటయినా బ్రీదింగ్ ఎక్సర్ సైజ్ చేస్తాను. ఎందుకంటే
ఏదైనా పదం తడబడితే మీరు అది నా ఊపిరితిత్తుల సమస్య అనుకోరు, ముస్లీం
గాబట్టి తెలుగు పలక లేకపోతున్నాడు అనుకుంటారు.
9. కొందరికి
వెజిటేరియన్లు తెలివైనవారనీ నాన్ వెజిటేరియన్లు మొరటోళ్ళనే అభిప్రాయం వుంటుంది. చాలామందికి
తెలియని విషయం ఏమంటే మనం జ్ఞానానికి కొలమానంగా భావించే నోబెల్
బహుమతిగ్రహితల్లో తొంభయి తొమ్మిది శాతం మంది మాంసాహారులే. వాళ్లలోనూ
అత్యధికులు గొడ్డుమాసం తినేవారే.
కోయేట్ లెక్క (2012)
1.
మెరుగయిన బతుకు ఆశతో క్వయిట్ కు వెళ్ళి అసలుకే ఉప్పుతెచ్చుకుంటున్న
ముస్లీంల జీవితాలను చిత్రించే కథ ఇది.
2.
వాణిజ్య అవసరాల కోసం వివాహేతర సంబంధాలను ప్రోత్సహించడం ఇందులో
కనిపిస్తుంది.
3.
ముస్లింల జీవితాల్లో కంప్యూటర్లు వుండవు. ఆన్ లైన్లో ఫండ్స్ ట్రాన్స్ఫర్ లు
వుండవు. మనీ ఆర్డర్లే గతి. క్వయిట్ నుండి ఎవరికి మనీ ఆర్డర్ వచ్చినా ముందుగా
తెలిసేది పోస్ట్ మ్యాన్ ఖాదర్ బాషాకే. అతనికి తన చెల్లెలి కూతుర్ని తగిలిస్తుంది
వడ్డీ వ్యాపారి కమల. ఇన్ఫర్మేషన్ నెట్ వర్క్. స్ట్రింగ్ ఆపరేషన్.
4.
భూషణం నవల ‘కొండగాలి’లో కూడా ఇలాంటి సన్నివేశం వుంటుంది. ఫారెస్టాఫీసర్లకు
వినోదాన్ని పంచడం కోసం కిరాణా కొట్టాయన ఓ వయసులో వున్నామెను దగ్గర
వుంచుకుంటాడు.
5.
కథ చివర్లో పోస్ట్ మ్యాన్ మాట మారుస్తాడు. ఎందుకు మార్చాడో కథకుడు చెప్పడు
కానీ ఆ విషయం రెండు పాత్రలకు తెలుసు అంటాడు.
6.
కథను ఆసక్తిగా ముగించడంలో ఇదో చిట్కా. కథ చదివిన తరువాత కూడా పాఠకుడు
ఆ పాత్రల గురించి ఆలోచిస్తుంటాడు.
7.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడూ?లాంటి టీజర్.
8.
పిక్చర్ అభీ బాఖీ హై.
ఒంటి చెయ్యి ( 2014)
1.
పిల్లల్ని కొట్టకండి అని చెప్పే మ్యాజికల్ రియలిజమ్ కథ ఇది.
2.
ఎవరయినా దౌర్జన్యం చేస్తుంటే నిస్సహాయులు ఏంచేస్తారూ? “నీ చేతులు పడిపోనూ”
అని శపిస్తారు. అదే నిజంగా జరిగితే? అనే ఊహతో రాసిన కథ ఇది.
3.
మ్యాజికల్ రియలిజమ్ ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్.
తలుగు (2014)
1.
భూస్వామి వెంకటప్ప కర్రెనుము పురిట్లో దూడ అడ్డంపడి చావడానికి సిధ్ధమైంది. ఎనుము చచ్చాక ఉచితంగా మాదిగలకు ఇవ్వడంకన్నా కొనఊపిరి వుండంగానే నాలుగు డబ్బులు ఛేసుకోవాలనుకున్నాడు. రాత్రికిరాత్రి బోరేవాలా సాయిబు దౌలూను పిలిపింఛాడు. చచ్చిందాన్ని సాయిబులు కోయరు తినరు. తెల్లారేదాకైనా బతుకుద్దోలేదో తెలీని ఎనుమును కొనడానికి దౌలు ససేమిర అన్నాడు. మరీ జులుం చేసి ఎనుమును పన్నెండు నూర్లకు అంటగట్టాడు వెంకటప్ప. వేంపల్లె షరీఫ్ తలుగు కథకు ఇదీ సందర్భం.
2.
దౌలా పెరట్లో కథ మలుపు తిగింది. మృత్యుముఖంలో కర్రెనుము ఈనింది. చచ్చిందనుకున్న ఎనుము దూడను ఈని పాలు కూడా ఇస్తున్నదని తెలిసి వెంకటప్ప అసహనంతో ఊగిపోయాడు. మనుషుల్ని పంపించి, ఎనుమునూ, దూడనూ తనింటికి తోలించేసుకున్నాడు. పన్నెండు నూర్ల రూపాయలూ ఎగ్గొట్టాడు. ఇద్దరు పెద్ద మనుషుల్ని తీసుకుని వెంకటప్ప ఇంటికి న్యాయం చేయమని వచ్చాడు దౌలూ. అదీ ఘర్షణ.
3.
దౌలూ, ఎనుము కలిసి వెంకటప్ప మీద తిరుగుబాటుకు సిధ్ధం కావడంతో కథ ముగుస్తుంది. అదీ పరిష్కారం.
4.
దళితులు, హిందూ వెనుకబడిన సామాజికవర్గాలకన్నా భారత ముస్లిం సామాజికవర్గాలు మరింత వెనుకబడివున్నాయని అధికారిక గణాంకాలే చెపుతున్న కాలంలో, ముస్లిం సమాజంలో మరింత వెనుకబడిన (యంబీసీ) బోరేవాలాల దయనీయ జీవితాన్ని చిత్రించిన కథ ఇది.
5.
ఏ రచనకయినా, ఆ మాటకు వస్తే శుష్కమైన వార్తలకైనా, ఉపన్యాసకళలకైనా భావోద్వేగాల ప్రసరణే ప్రాణప్రదమైన అంశం. పాత్రల్లో, సన్నివేశాల్లో భావోద్వేగాలని ఒడిసి పట్టుకోవడంలో షరీఫ్ కు మంచి నేర్పుంది. “పని కసాయిదైనా మనసు మనిషిదే” వంటి వ్యక్తీకరణలు పాఠకుల్ని ఉద్వేగానికి గురిచేస్తాయి. వేంపల్లెనే ఇంటిపేరు చేసుకున్న షరీఫ్ రాయలసీమ పల్లెభాష, యాసల్లో రాయడంవల్ల అతని కథల శిల్పం కొత్తగా వుంటుంది.
6.
యాసలో రాసేవాళ్ళు తరచూ ఒక తప్పు చేస్తుంటారు. తమకు మాత్రమే తెలిసిన పదాలను అతిగా వాడి పాఠకుల్ని ఇబ్బంది పెడతారు. అయితే, షరీఫ్ ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు. పదం కొత్తదయినా సందర్భాన్నిబట్టి స్థూలంగా అర్ధం చేసుకునే విధంగా దాన్ని ఉపయోగిస్తాడు. తలుగు, కాంతూలం వంటివి ఇంతకు ముందు మనకు తెలీని పదాలయినా సందర్భాన్నిబట్టి అర్ధం అయిపోతాయి.
7.
షేక్ హుస్సేన్
సత్యాగ్ని రాసిన
మలిమాట తలుగు
కథకు ఒక
బోనస్. “జీవితం
ఎట్లుంది అనేదికాదు
జీవితం ఇట్లా
ఎందుకుందో చెప్పాలి
” అంటూ
కథకులకు ఒక
ఆదేశాన్ని జారీ
చేశారాయన. నిజానికి
జీవితం ఎట్లుందో
రాయడానికి కథకుడు
దేనికీ?; కెమేరాలు
చాలు. జీవితం
ఇట్లా ఎందుకుందో
వివరించడానికీ, ఎట్లా వుంటే బాగుంటుందో చెప్పడానికే సమాజానికి కవులు,
కళాకారులు, రచయితలు,
ఆలోచనాపరులు కావాలి.
8.
తలుగులో
దౌలుతో వచ్చిన
ఆ ’పెద్దమనుషులిద్దర్నీ’ దళితులు
అనుకోవచ్చు. అదే
నిజమయితే, ఆ
విషయాన్ని కథకుడు
మరింత స్పష్టంగా
చెప్పివుండాల్సింది. ముస్లీం-దళిత్-ఆదివాసి
ఐక్యత (జై
మీమ్! జై
భీమ్!) నీల్ లాల్ హర్యాలీ సలామ్ (ఆర్. జీ. బీ.) అనేది
నేటి చారిత్రక
ఆవశ్యకత.
9.
ఆర్. జీ. బీ. కోవలో
ఇది తొలికథో
మలికథో చెప్పలేనుగానీ ఇది ఒక మంచి
కథ అనిమాత్రం
నిస్సందేహంగా చెప్పగలను.
వింతశిశువు (2017)
1.
టీ ఆర్ పీలు, బార్క్ రేటింగుల కోసం న్యూస్ ఛానళ్ళు ఎంతకైనా దిగజారుతారని
చెప్పే కథ.
2.
పేదవాళ్ళకు తినడానికే సరైన తిండి వుండదు. గర్భిణీ స్త్రీల పరిస్థితి మరీ
ఘోరం. అరుదుగానే కావచ్చుగానీ వాళ్ళకు జన్యులోపంతో పిల్లలు పుట్టే
అవకాశాలుంటాయి.
3.
దీన్నీ టీవీల వాళ్ళు తోకతో పుట్టిన శిశువు, హనుమంతుని అవతారం, వరాహావతారం
అంటూ బూస్ట్ చేస్తుంటాయి.
4.
ఓరోజు రాత్రి ఓ ప్రముఖ టీవీ ఛానల్ వాళ్ళు ఓ గొప్ప ఇన్వెస్టిగేటివ్
స్టోరీని ప్రసారం చేశారు. ఏమిటా స్టోరీ అంటే అల్లూరి శ్రీరామ రాజును బ్రిటీష్
వాళ్ళు చంపలేదనీ, ఆయన ఎనభై యేళ్ళు బతికాడనీ, నలుగుర్ని పెళ్ళి చేసుకున్నాడనీ
ఇలా సాగిందా కథ. గంట ప్రోగ్రాం అయిపోయిన తరువాత ఇలా ఆ ఊర్లో జనం చెప్పుకుంటున్నారు
అని ముగించారు.
5.
ఆ ఛానల్ ఔట్ పుట్ ఎడిటర్ నాకు సన్నిహితుడు. నేనతనికి ఫోన్ చేసి ఏమిటీ
దారుణం? అని అడిగాను. “అంకుల్! న్యూస్ ఛానల్ అంటే ప్రాస్టిట్యూషన్ అని మీకు నేను
గుర్తుచేయాలా?” అని ఎదురు అడిగాడు.
6.
నేనూ అంగీకరిస్తాగానీ, ఈసాని వృత్తిలోనికి అల్లూరిని కూడా తీసుకురావడం
అవసరమా? అన్నాను.
టోపీ జబ్బార్ (2012)
1. ఇది ఇందులో లీడ్ కథ.
2. జబ్బార్ అనే ముస్లీం
కుర్రాడు, అమ్ములూ అనే హిందూ అమ్మాయికి మధ్య సాగే ఫస్ట్ క్రష్ కథ.
3. ఒకరి మత విశ్వాసాలని
మరొకరు గౌరవించుకోవడం ఇందులో కథాంశం.
4. మతం వేరు మతతత్త్వం
వేరు. మతం విశ్వాసం. మతతత్వం రాజకీయం. నేనూ వుంటా, నువ్వూ వుండు అంటుంది మతం. నేనే
వుండాలి నువ్వు వండడానికి వీల్లేదంటుంది మతతత్త్వం. బాబ్రీ
మసీదు-రామజన్మభూమి కేసులో హిందువుల పక్షాన కేసు వేసిన మహంతీ, ముస్లీంల
పక్షాన కేసు వేసిన ఆయనా ఇద్దరూ గొప్ప స్నేహితులు. కలిసి ఆడుకునేవారు. కలిసి
తిరిగేవారు. కలిసే ఒకే సైకిలు మీద కోర్టుకు వెళ్ళేవాళ్ళు. అవసరం పడినప్పుడు ఒకరి
లీవ్ పిటీషన్ ను మరొకరు వేసేవాళ్ళు. భారతీయ జనతా పార్టి ప్రవేశించాక మతం మతతత్త్వంగా
మారిపోయింది.
దహనం (2015)
1.
ఇది ఒక మ్యాజికల్ రియలిజమ్ కథ.
2.
ఆవు మీద చాలా కథలు వస్తున్నాయి.
3.
ఆవు సాధు జంతువు; పాలు ఇచ్చును. పాలూ శ్రేష్టమయిన ఆహారం అని చిన్నప్పుడు
చదువుకున్నాం.
4.
ఇప్పుడు ఆవు రాజకీయ జంతువు; ఆవు ఓట్లు తెచ్చును; ఓట్లు అధికారమును
తెచ్చును; అనేది కొత్త కథ.
అంకెలు (2017)
1.
పార్లమేంటరీ ప్రజాస్వామ్యం అంటేనే అంకెలు.
2.
ఎన్నికల రాజకీయాల్లో ముస్లింలను ఎలా వాడుకుంటాడో చెప్పే కథ ఇది.
రాజకీయార్ధిక సాహిత్య చరిత్ర
1.
జాక్ లండన్ నవల ప్రకృతి పిలుపుకు ఆనతోల్ ఫ్రాన్స్ / ఎడ్వర్డ్ ఫాక్స్
ముందుమాట రాస్తూ ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడు. జాక్ లండన్ రచనల్లో కనిపించే
పాత్రలకన్నా బలమైన మరో పాత్ర వుంటుందని అంటాడు. అదే ప్రకృతి. పెద్ద పర్యావరణంలో
మారుతున్న రుతువుల మధ్య ప్రకృతి పిలుపు నవల సాగుతుంటుంది. అలా కథ చుట్టూ రాయలసీమ
భాష యాసలతో ఒక గొప్ప పర్యావరణాన్ని వేంపల్లె షరీఫ్ చిత్రిస్తుంటాడు. పాఠకులు ముందు
అందులో లీనం అయిపోతుంటారు.
2.
స్పిన్నర్ బిషన్ సింగ్ బేడీ గురించి ఒక మాట వుండేది. అతను విసిరిన తరువాత
కూడా బంతిని నియంత్రిస్తాడేమో అని. అలాంటి శక్తి షరీఫ్ కథనానికి కూడా
వుందనిపిస్తోంది. ‘దారి తప్పిన కల’ తొలి వాక్యంలోనే ఒక సామాజిక ఘర్షణ వుంది.
సాయిబులమ్మాయి, రెడ్ల అబ్బాయితో వెళ్ళిపోయింది. సాయిబులు పేదవాళ్ళు, రెడ్లు
సాపేక్షంగా ధనికులు. ఈ ఘర్షణను తను ఎక్కడా రాయడు. కథంతా నీళ్ళు, కరువు, గోషా
మీద నడుస్తుంది. కానీ, కథ చదివిన తరువాత ఆ సామాజిక ఘర్షణ లోలోపల పాఠకుల్ని
వెంటాడుతుంది.
3.
ఛార్లెస్ డికెన్స్ సోషలిస్ట్ భావాలు ఆనాటి పెట్టుబడీదారుల కుటుంబాలకు
అస్సలు నచ్చేవికావు. అయినప్పటికీ వాళ్ళు డికెన్స్ రచనల్ని తెగ చదివేవారు.
డికెన్స్ ప్రసంగాల్ని టిక్కెట్టు కొని వినేవారు. ఎందుకంటే డికెన్స్ వాడే మోడెస్టీ
శైలీ వల్ల ప్రపంచమంతటికీ ఇంగ్లీష్ భాష మీద గౌరవం పెరుగుతోందని వాళ్ళు
ఆనందించేవారు. దాదాపు అలాంటి స్థితి ఇప్పుడు తెలుగు సమాజంలో వుంది. ఒకవైపు చాలా
బలంగా చాప కింద నీరులా ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమంగా ముస్లిం
వ్యతిరేక ప్రచారం సాగుతున్నప్పటికీ పాఠకులు ముస్లిం రచయితల రచనల్ని చాలా ఇష్టపడి
చదువుతున్నారు. దానికి పరధాన కారణం వాళ్ళు తెలుగు భాషను సుసంపన్నం చేయడమే. ఈరోజు
తెలుగు వాక్యాన్ని అందంగా రాస్తున్న పది మంది పేర్లను తీసుకుంటే అందులో సగానికి
పైగా దళిత ముస్లీంలు వుంటారు. ఈ వాస్తవాన్ని తెలుగు అధికార భాష సంఘం పెద్దలు
గమనించాల్సిన అవసరం వుంది. తెలుగు మాట్లాడడానికీ, రాయడానికీ ముస్లీంలు తడబడే
రోజులు పోయాయి. కొత్త కథాంశాలతో, కొత్త సన్నివేశాలతో కొత్త భాషతో తెలుగును
సుసంపన్నం చేస్తున్న వారిలో ఇప్పుడు ముస్లింలు అగ్రభాగాన వున్నారు. ఖదీర్ బాబు,
వేంపల్లె షరీఫ్, స్కైబాబా తదితరుల కథలు దీనికి సజీవ సాక్ష్యాలు. ఈ ఖ్యాతి
ముస్లీంల కథల్ని ఇంతగా ఆదరిస్తున్న తెలుగు పాఠకులకు దక్కుతుంది. తెలుగు పాఠకులు
చాలా గొప్పవాళ్ళు. ఎవరు రాస్తున్నారన్నది వాళ్లకు ముఖ్యం కాదు. ఎవరు గొప్పగా
రాస్తున్నారు అన్నది అన్నది వాళ్ళకు ముఖ్యం.
4.
మిత్రులారా! నేను కొంత కాలంగా ఒక గంభీరమైన విషయాన్ని గురించి కొన్ని
ఆలోచనలు చేస్తున్నాను. వాటిని బయటి ప్రపంచంతో పంచుకోవడానికి ఇది సరై సందర్భమూ,
సరైన వేదిక అని కూడా భావిస్తున్నాను.
5.
సాహిత్యం సమాజాన్ని ప్రతిబింబిస్తుంది, ప్రతిఫలిస్తుంది అంటారు. ఇది
పాక్షిక సత్యమే. సమాజానికీ సాహిత్యానికి మధ్య రచయిత అనే స్వయం నియమిత తనిఖీ
అధికారి ఒకడు వుంటాడు. అతను తనకు ఇష్టమైన వాళ్ళను సమాజంలో నుండి సాహిత్యంలోనికి
వెళ్ళనిస్తుంటాడు. తనకు నచ్చనివాళ్ళను ఆ గుమ్మం దాటనివ్వడు.
6.
దానివల్ల ఏమవుతుందంటే రచయిత కొరుకుంటున్న, అతన్ని పోషిస్తున్న
సామాజికవర్గాలే మనకు వున్నత విలువలుగల సమూహాలుగా సాహిత్యంలో కనిపిస్తుంటాయి.
మిగిలిన సామాజికవర్గాలు అసలు కనిపించవు. ఒకవేళ కనిపించినా అవి ఏ విలువలూ లేని
సమూహాలుగా కనిపిస్తుంటాయి.
7.
వీటికి కొలమానం కథానాయకుడు. ద హీరో. ప్రొటోగానిస్ట్. కథానాయకుడ్నిబట్టే
రచయిత కోరుకునే సమాజం, దాని విలువలు అవుతాయి.
8.
ఇదేదో రచయిత అభిరుచికి సంబంధించిన విషయం దానితో మనకు పనేంటీ అని సమాజం
అనుకుంటే కుదరదు. పాఠకులు సాహిత్య కథానాయకుడ్ని ఇష్టపడతారు. అతని అభిప్రాయాలని
గొప్ప విలువలుగా భావిస్తారు. అతని ప్రవర్తనని అనుసరిస్తారు. అలా అలా అతని
సామాజికవర్గం మీద ఒక సానుకూల దృక్పధాన్ని ఏర్పరచుకుంటారు.
9.
ఫలానా సామాజికవర్గం తెలివైనది, ఫలానా సామాజికవర్గం మాటంటే మాటే, ఫలానా
సామాజికవర్గం కొత్త భావాలను త్వరగా స్వీకరిస్తుంది, ఫలానా సామాజికవర్గం వాణిజ్య
అవకాశాలను త్వరగా అందిపుచ్చుకుంటుంది వంటి సానుకూల అభిప్రాయాలు మనకు సాహిత్యంవల్ల
కలుగుతుంటాయి. అలా. సాహిత్య కథానాయకుడు సమాజాన్ని ప్రభావితం చేస్తాడు. ఆ ప్రభావం
రాజకీయార్ధిక ఆధిపత్యాన్ని నిర్ణయిస్తుంది.
10.
సాహిత్యం, సమాజం, రాజకీయం, ఆర్ధికం వగయిరాల మధ్య సంబంధాన్ని మిగిలిన
ప్రాంతాల్లో వివరించడం కొంచెం కష్టం కావచ్చేమోగానీ, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని
వివరించడం చాలా సులభం.
11.
తెలుగు కథా నవలా సాహిత్యం ఆరంభంలో మనకు అన్నీ బ్రాహ్మణ కథానాయకులే కనిపిస్తుంటారు. ఆ కాలంలో
రాజకీయ రంగంలోనూ బ్రాహ్మణ సామాజికవర్గానిదే అధిపత్యం వుండేది. దేశానికి స్వాతంత్రం
వచ్చిన తరువాత దాదాపు అన్ని రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులు బ్రాహ్మణ
సామాజికవర్గానికి చెందిన వారే. వాళ్ళ గురించి సాహిత్యం సృష్టించిన సానుకూల
వాతావరణం కారణంగానే ఇది సాధ్యం అయింది.
12.
ఆ తరువాత వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన కథానాయకులు మనకు సాహిత్యంలో కనిపిస్తారు. ఆ కాలంలో అటు రాజకీయాల్లోనూ ఆ
సామాజికవర్గాల ప్రాబల్యం పెరగడాన్ని మనం చూడవచ్చు.
13.
వ్యవసాయం అన్నిప్రాంతాలనూ వుంటుందిగానీ, కృష్ణా గోదావరి మండలాల వ్యవసాయ కుటుంబాలకు
చెందిన కథానాయకులే మనకు ఎక్కువగా కనిపిస్తారు. అలా తెలంగాణ, రాయలసీమ,
ఉత్తరాంధ్రా వాళ్లకు సాహిత్య కథానాయకుడు లేకుండాపోయాడు.
14.
ఇక ఆదివాసులు, దళితులు, బహుజనులు, మత మైనారిటీలకు కథానాయకుడు ఎక్కడి నుండి
వస్తాడు. సాహిత్య కథా నాయకుడు లేకుండా వాళ్ల మీద సానుకూల దృక్పథం ఎలా
ఏర్పడుతుంది. ఇది తెలుగు కథా నవలా రచయితలు పరిష్కరించాల్సిన ప్రధాన సామాజిక
సమస్య.
15.
1990వ దశకం భారత రాజకీయాల్లోనేగాక తెలుగు సాహిత్యంలోనూ పెను మార్పులు తెచ్చింది. దీనికి బాబ్రీ మసీదు కూల్చివేత ఒక మైలురాయి. సాధారణంగా చారిత్రక దశల్ని బీసీ, ఏడి అని విభజిస్తుంటారు. భారత రాజకీయార్ధిక సాహిత్య చరిత్రను కూడా బిఫోర్ డెమోలిషన్ (బీడి) ఆఫ్టర్ డెమోలిషన్ (ఏడి) అని విభజించాల్సి వుంటుంది.
16.
రాజకీయార్ధిక అంశాల వివరాల్లోనికి లోతుగా పోవడానికి ఇది సందర్భంకాదు కనుక మనం సాహిత్యం కళలకే పరిమితం అవుదాం. బిఫోర్ డెమోలిషన్ తెలుగు సాహిత్యంలో మనకు ముస్లింలు సాధారణంగా కనిపించరు. ఒకవేళ కనిపించినా మొరటు కసాయిలు కనిపిస్తారు. లేదా అసలు కనిపించరు. ఇదో రకం సాహిత్య వివక్ష. ముస్లిం పాత్రలకు తెలుగు సాహిత్యంలో చోటే లేనప్పుడు ఇక ముస్లిం కథానాయకుడు
ఎక్కడి నుండి వస్తాడూ?
17.
తెలుగు సాహిత్యం పాటించిన నిబంధనల్నే తెలుగు సినిమాలూ పాటించాయి. అనార్కలీ, లైలామజ్నూ, ఆలీబాబా నలభై దొంగలు వంటి సినిమాల్లో తప్పదు కనుక
హీరో ముస్లీంగా వుంటాడు. మిగిలిన చోట్ల ఎక్కడా ముస్లీం కనిపించడు. పాతాళ భైరవి
సినిమా కథను కూడా అరేబియన్ నైట్స్ నుండే తీసుకున్నారు. పాత్రల్ని
మతాంతీకరణ చేశారు. యన్టీ రామారావు నటించిన ‘ఒకే కుటుంబం’లో సినిమా అంతా హీరో
ముస్లింగా వుంటాడుగానీ చివర్లో అతను హిందూవని తేలుస్తారు. మిస్సమ్మ సినిమాలో
కథానాయకీ పాత్రా అంతే. సినిమా అంతా ఆమె క్రైస్తవురాలుగానీ చివర్లో హిందువే అని
తేలుస్తారు.
18.
మైనారిటీలంటే భారత దేశంలో మరీ తక్కువ మంది ఏమీకాదు. నిజానికి మనకు
సాహిత్యంలో కనిపించే అనేక సామాజికవర్గాలకన్నా ముస్లీంల జనాభా పెద్దది. దేశ
జనాభాలో 15 శాతం పైగావున్న వారిని తెలుగు సాహిత్యం పట్టించుకోకపోవడం
అన్యాయం. ఇరవైకోట్ల జనాభావున్న ఒక సమూహాన్ని దాచిపెట్టేయడాన్ని ఏమనాలీ? మినహాయింపు లేకుండా మన సాహిత్యకారులందరూ ఈ పాపానికి ఒడిగట్టినవారే.
19.
ఆఫ్టర్ డిమోలిషన్ సన్నివేశం మారింది. నిజానికి బాబ్రీ మసీదు కూల్చివేతకు సన్నాహాలు మొదలయినపుడే తెలుగులో ముస్లీం సాహిత్యం అంకురార్పణ జరిగింది. నేను కొన్ని సిధ్ధాంత వ్యాసాలు రాశాను. ఖాదర్ పుట్టుమచ్చ దీర్ఘకవిత రాశాడు. ఆ తరువాత అనేక మంది కవులు. కథకులు చాలా వుధృతంగా ముస్లీం సాహిత్యాన్ని సృష్టించారు, సృష్టిస్తున్నారు. మనం ఈ రోజు కథా సాహిత్యానికే పరిమితం అవుదాం.
20.
ముస్లీం కథకుల్లో తొలుత ఖదీర్ బాబు పేరు బలంగా వినిపించింది. ఆ తరువాత స్కైబాబా, బా రహంతుల్లా, వేంపల్లె షరీఫ్ తదితరులు రంగప్రవేశం చేశారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి, ఒక్కో భావోద్వేగం, ఒక్కో దృక్పథం, ఒక్కో ఆసక్తి. దానివల్ల తెలుగు ముస్లీం సాహిత్యంలో విస్తారమైన వైవిధ్యం చోటుచేసుకుంది.
21.
దళిత-బహుజన-మతమైనారిటీ కథకుల ప్రవేశంతో ప్రధాన స్రవంతి తెలుగు కథా సాహిత్యం
మంచాన పడిపోయింది. అరవయ్యేళ్ల క్రితం చెలం కొంత సాహసించాడుగానీ, ఆ మాత్రం తెగింపు
కూడా వీళ్ళకెవరికీ ఇప్పుడులేదు.
22.
తెలుగులో గొప్ప కథ అనగానే కాళీపట్నం రామారావుగారి యజ్ఞమో అంతకు ముందున్న
పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథో
గుర్తుకు వస్తున్నదంటే కారణం ఏమిటీ? వర్తమాన ప్రధాన స్రవంతి రచయితలు వర్తమానంతో
అనుసంధానం కావడానికి జంకుతున్నారు. ఈలోటుని అస్థిత్వ కథలు పూడుస్తున్నాయి.
23.
వర్తమాన సమాజంతో అనుసంధానం కాని కథలు, నవలలు సమాజం మీద పెద్ద ప్రభావాన్ని
వేయలేవు. కొత్త రచయితలు లేరా? కొత్త కథలు రావడంలేదా? అంటే చాలా మంది వస్తున్నారు.
చాలా కథలు రాస్తున్నారు. అవెందుకో తల మీది నుండో కాళ్ల కింది నుండో
వెళ్ళిపోతున్నాయిగానీ మన మనసుకో, మెదడుకో తాకడంలేదు.
24.
గై డీ మపాసా 18వ శతాబ్దపు ఫ్రాంకో – ప్రష్యన్ యుధ్ధాల నేపథ్యంలో కథలు
రాశాడు కనుక ‘బౌలే సౌఫ్’ వంటి గొప్పకథ పుట్టింది. సాదత్ హసన్ మంటో తనకాలపు కల్లోల
సమాజాన్ని చిత్రించాడు కనుక ‘ఖోల్ దో’ కథ పుట్టింది.
25.
గ్యాట్ ఒప్పందం తరువాత ప్రపంచ వ్యాప్తంగా లిబరలైజేషన్ ,
ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ దశ ఆరంభమయింది. దీని ప్రభావం సమస్త రంగాల్లోనూ
పడింది. చివరకు స్త్రీపురుష సంబంధాల మీదా పడింది. నేను నిత్యం ఈ పరిణామాల్ని అతి
దగ్గరగా చూస్తున్నాను. వీటిని సానుకూల దృక్పధంతో చిత్రించే కథ నవల నా దృష్టికి
రాలేదు.
26.
కొందరు రచయితలు మరీ తెలివైనవారు. వారి పాత్రలు వర్తమానంలోనే వుంటాయి.
రచయితలు మాత్రం చెలం కన్నా వెనుకటి కాలపు పరిష్కారాలు చూపుతుంటారు. ఇదంతా తెలుగు
కథకు ఆవరించిన స్థబ్దతను తెలిపే అంశాలు.
27.
ఈరోజు తెలుగు సాహిత్యాన్ని బతికిస్తున్నది అస్థిత్వ కథలే అనంటే
అతిశయోక్తికాదు. గత మూడేళ్ళుగా కొన్ని శక్తులు దేశంలో అసహన
వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. వీటి ప్రభావం ఉత్తరాది నుండి దక్షణాది వరకు
వుంది. ఎంత మంది కథకులు ఈ వాతావరణాన్ని, దీని ప్రమాదాన్నీ తమ కథల్లో
చిత్రించారు. బహుశ, సతీష్ చందర్ ‘గోధనం’ నవల దీనికి మినహాయింపు కావచ్చు. అది కుడా
ఒక అస్థిత్వ రచయిత చేసిన ప్రయత్నమే.
28.
వర్తమాన సమాజాన్ని చుడాలంటే అస్థిత్వ రచనల్ని చదవాలి. ఇప్పుడు
ఆవిష్కరించిన వేంపల్లె షరీఫ్ కథల సంకలనం ‘ టోపీ జబ్బార్’ మనకు అలా
వర్తమాన సమాజాన్ని చూసే అవకాశాన్ని ఇస్తోంది.
మే, 2017
No comments:
Post a Comment