Friday 26 May 2023

*బంచ్ ఆఫ్ థాట్స్ మీద ఒక సామాజిక విశ్లేషణ*

 

*బంచ్ ఆఫ్ థాట్స్ మీద ఒక సామాజిక విశ్లేషణ*

రెండు రోజుల క్రితం  నా దగ్గరకు  రెండు పుస్తకాలు వచ్చాయి. మొదటిది అలనాటి కమ్యూనిస్ట్ నేత  పిసి జోషి సంపాదకత్వంలో  వచ్చిన Rebellion 1857- a Symposium.  ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామం జరిగి  వందేళ్లు అయిన  సందర్బగా పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్ 1957లో దీనిని ప్రచురించింది.  శ్రీశ్రీ విశ్వేశ్వర రావు దీనిని నాకు బహుమతిగా ఇచ్చాడు. అన్ని దానాల్లోనూ పుస్తక దానం గొప్పది కదా!  

ఇక  రెండోది మహాదేవ్ సదాశివరావు  గోల్వాల్కర్ ఉపన్యాసాల సంకలనం ‘బంచ్  అఫ్ థాట్స్’ మీద  కె ఎం ఎ సుబహాన్  రాసిన  విమర్శ ప్రీ-ప్రీంట్ కాపి. 

ఈ రెండు పుస్తకాలకు  ఒక అనుబంధం  వుంది. బ్రిటీష్ వలస  పాలన వ్యతిరేక ప్రాదేశిక జాతీయోద్యమానికి ముస్లింలు ఎలా పునాదులు వేశారు అన్నది మనకు మొదటి  పుస్తకంలో  కనిపిస్తుంది. ప్రాదేశిక జాతియొద్యమానికి వ్యతిరేకంగా సాంస్కృతిక జాతియోద్యమానికి సంఘపరివారం ఎలా పునాదులు వేసిందో రెండవ పుస్తకంలో  కనిపిస్తుంది.

పిసి జోషి  సంపాదకత్వం లో వచ్చిన  పుస్తకంలో   కేఎం ఆష్రాఫ్ రాసిన  Muslim Revivalists and the Revolt of 1957, Ghalib and the Revolt of 1857, ఎహెతేషాన్ హుస్సేన్ రాసిన  Urdu Literature and Revolt వ్యాసాలు ఒక ఎత్తు అయితే పిసి జోషి  రాసిన విస్తారమైన వ్యాసం 1857 In Our History ఇంకో ఎత్తు.

ఎం ఎస్ గోల్వర్కర్ అరెస్సెస్ రెండవ సర్సంఘ్  ఛాలక్. 1940-73 మధ్య కాలంలో దాదాపు 33 ఏళ్ళు ఆ పదవిలో కొనసాగారు. వి.డి. సావర్కర్ 1923లో ప్రచురించిన "Hindutva: Who is a Hindu?" పుస్తకంలో ద్విజాతి సిధ్ధాంతాన్నీ, హిందూ జాతీయవాదాన్నీ ప్రతిపదించారు. దానిని ఒక  రాజకీయార్దిక సాంఘీక  సిద్ధాంతంగా అభివృద్ధి  చేసిన ఘనత గోల్వాల్కర్ కు చెందుతుంది. సంఘపరివారం  ఆయన్ను గురూజీ అని పిలుచుకుంటుంది.

జర్మనిలో యూదులకు పౌరసత్వంతో సహా సమస్త పౌరహక్కుల్ని రద్దు చేస్తూ నాజీ హిట్లర్ 1935లో మతవివక్షపూరిత నూరెంబర్గ్ చట్టాన్ని తెచ్చాడు. ఆ ప్రేరణతో 1939లో గోల్వార్కర్ ‘We or Our Nationhood Defined’ అనే గ్రంధం రాసి ప్రచురించారు. ఇందులోనే అయన ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు భారతదేశంలోని హిందూ సమాజానికి సంభావ్య అంతర్గత ముప్పులు అని ప్రకటించారు. ఆ ప్రతిపాదనను విస్తారంగా వివరిస్తూ వివిధ  సందర్భాలలో గోల్వార్కర్ చేసిన  ప్రసంగాల సంకలనాన్ని 1966లో ‘బంచ్  అఫ్ థాట్స్’ పేరిట ప్రచురించారు.

19వ శతాబ్దం  భారత సామాజిక-ధార్మిక చరిత్రలో కీలకమైన దశ. 1857నాటి మహాసంగ్రామంలో హిందూ-ముస్లిం ఐక్యత బలపడడమేగాక ప్రాదేశిక భారతజాతి అనే భావన ఆవిర్భవించింది. తిరుగుబాటుదార్లు ఎర్రకోట ముందు నిలబడి తమకు నాయకత్వం వహించమని పండు ముసలివాడైన చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జాఫర్ ను అభ్యర్ధించారు. ఆ సంగ్రామం విఫలం అయిందిగానీ ఆ సందర్భంగా రాజకీయార్ధిక సాంస్కృతిక ధార్మిక రంగాల్లో కొత్తగా వచ్చిన భావనలే ఓ ముఫ్ఫయి యేళ్ళ తరువాత జాతియోద్యమ ఆరంభానికి ప్రేరణగా మారాయి. 

ప్రాదేశిక జాతీయవాదాన్ని వ్యతిరేకిస్తూ సాంస్కృతిక జాతీయ వాదాన్ని ప్రతిపాదిస్తూ సాగించిన మేధోమధనమే గోల్వాల్కర్  ఆలోచనల  సమాహారం. హిందూమతరాజ్య స్థాపన దీని లక్ష్యం. పరిపాలనలో మనుస్మృతిని పాటించాలనేది దీని ఆకాంక్ష. సాంస్కృతిక జాతీయవాదంవల్ల ముస్లింలు, క్రైస్తవులు, కమ్యూనిస్టులకేగాక ఆదివాసి, దళిత, బహుజన, శ్రామిక సమూహాలకు  సహితం  ఏర్పడే ముప్పుని కేఎంఏ సుబహాన్ చాలా విస్తారంగా వివరించారు. అవసరమైన చోట్ల మార్క్స్, లెనిన్, ఫూలే, అంబేద్కర్ తదితర సమాజశాస్త్ర ఉపాధ్యాయుల్ని వుంటింకిస్తూ తన వాదాన్ని సాగించారు. 

బంచ్ ఆఫ్ థాట్స్ చదివినవారూ, చదవనివారూ చదవాల్సిన పుస్తకం ఇది.

*డానీ*

కన్వీనర్, ముస్లిం థింకర్స్ ఫోరం (MTF)





No comments:

Post a Comment