Tuesday 30 May 2023

*‘బంచ్ ఆఫ్ థాట్స్’ సమీక్ష మీద సమీక్ష*

 *‘బంచ్ ఆఫ్ థాట్స్’ సమీక్ష మీద సమీక్ష*

 మిత్రులారా!

ఈ లేఖలోని అంశాలు సామాజిక ప్రాధాన్యాన్ని కూడ కలిగి వున్నాయి. అంచేత సుభహాన్ గారి అనుమతితో దీనిని బహిరంగపరుస్తూ చర్చను ఆహ్వానిస్తున్నాను.

 

డానీ, కన్వీనర్ MTF

 


 

*‘బంచ్ ఆఫ్ థాట్స్’ సమీక్ష మీద సమీక్ష*

మిత్రులు కెఎంఎ సుభహాన్ గారికి,

 

ఎంఎస్ గోల్వార్కర్ 1966లో ప్రచురించిన ‘బంచ్ ఆఫ్ థాట్స్’ మీద మీ విమర్శ ప్రీ-పబ్లిషిడ్ కాపీని చూశాను. ప్రచురణకు ముందు ఈ పుస్తకాన్ని పరిశీలించడానికి నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు.

 

పుస్తక సమీక్షకు అయినా, విమర్శకు అయినా కొన్ని సాంప్రదాయాల్ని పాటించడం అవసరం. ఒక విధంగా వీటిని నియమాలు అనవచ్చు.

 

రచయిత ఏ సందర్భంలో  ఆ పుస్తకాన్ని ఏ లక్ష్యంతో రాశాడో ముందు చెప్పాలి. ఆ పుస్తకాన్ని ఇప్పుడు సమీక్షించాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చిందో చెప్పాలి.

 

మూల పుస్తకం ప్రభావశీలం కాకపోతే అసలు దాన్ని పట్టించుకోవాల్సిన పనేలేదు. ఇన్నాళ్ళ తరువాత కూడ పట్టించుకుంటున్నామంటే మూల పుస్తకం ప్రభావశీలంగా వుందనే అర్ధం. అలా వుండడానికి దానికి కొన్ని సానుకూల లక్షణాలు వుంటాయి. రచయిత సామాజిక అభిప్రాయాలతో మనకు విబేధం వుండవచ్చు కానీ అతని రచనా సామర్ధ్యాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు.

 

ఆరెస్సెస్ కు ఏంఎస్ గోల్వార్కర్ దాదాపు మూడున్నర దశాబ్దాలు సర్సంఘ్ ఛాలక్ గా వున్నారు. ఆయన్ను సంఘపరివారం గురూజీ అని గౌరవంగా సంభోదిస్తారు.

 

ఎం. ఎ.  వెంకటరావు ముందు మాటతో వచ్చిన బంచ్ ఆఫ్ థాట్స్ ఇంగ్లీషు వెర్షన్ ను చదివాను. గోల్వార్కర్ గొప్ప ప్రవచనకారులు. ఇంగ్లీషులో ఆయన ధారణ శక్తి ఒక ప్రవాహంలా సాగుతుంటుంది. ఈ పాజిటివ్ అంశాలను సమీక్షలో తప్పక రాయాలి.

 

నా గురించి మీ మాటల్లోనే  చెప్పాలంటే నేను ముస్లింని మాత్రమేగానీ ధార్మిక ముస్లింను కాదు. మీరు ధార్మిక ముస్లిం. మీలాగే గోల్వార్కర్  ధార్మిక హిందువు.   మీ ఇద్దరికి ఏకాభిప్రాయం గల అంశాలూ ‘బంచ్ ఆఫ్ థాట్స్’ లో అనేకం వున్నాయి. మాలాంటివాళ్ళకు అర్ధ, కామ లక్ష్యాలు నెరవేరితే – కొన్ని డబ్బులు వచ్చి, కొన్ని కోరికలు తీరి, కొన్ని  హక్కులు దక్కితే - సరిపోతాయి.  ధార్మికులకు అదనంగా ధర్మ, మోక్షాలు కూడ కావాలి. అవి మీకూ కావాలి; గోల్వార్కర్ కూ కావాలి. వీటిని మీ సమీక్షలో ప్రస్తావిస్తే బాగుంటుంది.

 

మనకు భారతదేశం పితృభూమి, కర్మభూమి. అంతవరకు ఎవరికీ వివాదంలేదు. ముస్లింలు మక్కాను తప్ప భారతదేశాన్ని పుణ్యభూమిగా భావించరు అనే అపవాదు ఒకటుంది. నా వరకు నేను పుట్టిన నేలే  నా పుణ్యభూమి అనుకుంటాను. కొంచెం మనసులో మాట చెప్పాలంటే, గోదావరి నదిని నేను దేవత అనుకోకపోవచ్చుగానీ అది నాకు తల్లి సమానం. అందులో చేపలు తిని నేను పెరిగాను. నేను చనిపోయాక నా భౌతిక కాయాన్ని గోదావరి నదిలో పడేస్తే చేపలు తింటాయి. Ecological Life Cycle కొనసాగుతుంది.  పుణ్యభూమి మీద ధార్మిక ముస్లింల  విధానం ఏమిటో చెప్పాలి.

 

మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్న ఆదర్శాలు గొప్పవే అయినప్పటికీ ఇవి అమలు కావడంలేదు. మన వరస పాలకులు రాజ్యాంగాన్ని దారుణంగా విఫలం చేశారు. గోల్వార్కర్ కు ప్రజాస్వామ్యమూ నచ్చదు; కమ్యూనిజమూ నచ్చదు. భౌతికవాదం అంటే పడదు. నానాజాతి సమితి, ఐక్యరాజ్య సమితి కూడ నచ్చవు.  ‘బంచ్ ఆఫ్ థాట్స్’ తొలి అధ్యాయంలోనే వారు ఆ విషయాలను చాలా స్పష్టంగా చెప్పేశారు. యూరప్ లో రాచరికాన్ని అంతం చేసిన ప్రజలు ఇళ్ళ కప్పులు ఎక్కి “స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం” అని అరిచారు. ఏమయిందీ? ఆధునిక యంత్రాల అభివృధ్ధితో ఆ హక్కులన్నీ పొయాయి; యంత్రాల యజమానులే మరింత శక్తివంతులయ్యారు అంటారు. భారత రాజ్యాంగ ఆదర్శాలను వారు సిధ్ధాంత పరంగానే వ్యతిరేకిస్తున్నారు. మనం వాటి అమలు తీరును మాత్రమే వ్యతిరేకిస్తున్నాము.

 

మీ పుస్తక సమీక్షలో ఈ స్పష్టత వుండాలని నా సూచన. 

 

బంచ్ ఆఫ్ థాట్ లో గోల్వాలక్ర్‍ వ్యక్తం చేసిన అభిప్రాయాలమీద , ప్రతిపాదించిన కార్యక్రమాల మీద అప్పటి నుండి ఇప్పటి వరకు  సమాజ ఆలోచనాపరులు  అనేక మంది స్పందిస్తున్నారు. మీ పుస్తకం కూడ దానికి కొనసాగింపు.

 

రాజ్యాధికారం, అధికార పార్టీల మీద గొల్వార్కర్ చేసిన విమర్శలకూ, ఆయన అనుయాయులైన  ఇప్పటి ప్రభుత్వాధినేతలు అమలు చేస్తున్న విధానాలకూ పొంతన లేదు.  ఆయన ఏం చెప్పారూ? ఇప్పుడు ఆయన అనుచరులు ఏం చేస్తున్నారూ? అనేది కూడ ముఖ్యమే. ఈ అంశం మీద ఒక తులనాత్మక పుస్తకం  రావలసిన అవసరం వుందనుకుంటున్నాను.

 

మనం కలిసినపుడు మరింత వివరంగా మాట్లాడుకుందాము.

 

అల్లా హాఫీజ్

 

డానీ

 

విజయవాడ

27 మే 2023

No comments:

Post a Comment