Monday, 31 July 2023

*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు* Kondapalli Seetharamaiah

 

*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు*

 


*డబ్బులు లేక ఉద్యమాలు ఆగవు*

 

“ఉద్యమాలు మనుషులులేక ఆగవచ్చుగానీ, ఆయుధాలు లేక, వాటికోసం డబ్బులు లేక ఆగవు” అని కొండపల్లి సీతారామయ్య తరచూ చెప్పేవారు. 

 

నేను తలపెట్టిన  కార్యక్రమం ఎన్నడూ డబ్బులు లేక ఆగలేదు.

 

చేతికి ఉంగరం వుందనే ధైర్యంతో 1970లు 80లలో ఇండోర్ మీటింగులుకాదు;  ఏకంగా బహిరంగ సభలు ప్రకటించేసేవాడిని.  ఆదివారం సభకు ఒక్కోసారి రెండు మూడు రోజులు గడువు కూడ వుండేది కాదు. నాది అతివాదం అతినమ్మకం అనేవారు.  కామ్రెడ్ ప్రభుదాస్ కు వుంగరం తీసి ఇచ్చి 100 రూపాయలు తెమ్మంటే అడ్వాన్సు వడ్డి 10 రూపాయలు పోనూ 90 రూపాయలు తెచ్చి ఇచ్చేవారు.  40 రూపాయలు ఇప్పటి టివి సెలబ్రెటి అనలిస్టు రంగావఝాల భరద్వాజకు, దళిత మహాకవి యువక అనే కలేకూరి ప్రసాద్ కు ఇచ్చేవాడిని. 

 

50 డెమ్మీ సైజు లిథో వాల్ పోస్టర్లు, మైదాపిండి జిగురు, రెండురోజులు సైకిలు అద్దె, భరద్వాజ ప్యాకేజి!. నాలుగు బల్లలు, నాలుగు కుర్చీలు, షామియానా, రెండు లైట్లు, ఒక మైక్రో ఫోను, నాలుగు స్పీకర్లు కలేకూరి ప్రసాద్ ప్యాకేజి. అప్పట్లో ఆ ప్యాకేజీల ధర అంతకన్నా చాలా ఎక్కువే వుండేది. అది రాడికల్స్ కు స్పెషల్ రేటు కాంట్రాక్టు.

 

నాటి రద్దీ ప్రాంతం న్యూ ఇండియా హొటల్ సెంటర్ మా మీటింగు స్థలం.  ఇప్పుడు అక్కడ హొటల్ ఐలాపురం వచ్చింది. ఆ పక్కనే పాపులర్ షూ కంపెనీ గొడౌను వుండేది. ఒక రోజు ముందు చెపితే వాళ్ల గొడౌను కీపర్ వచ్చి కరెంటు కనెక్షన్ ఇచ్చేవాడు. ప్రముఖ క్రిమినల్ అడ్వకేట్ కర్నాటి రామ్మోహనరావుగారు, చలసాని ప్రసాద్ మాకు ఆస్థాన ఉపన్యాసకులు. ఒక్క రోజు ముందు చెప్పినా కాదనే వారుకాదు. సందర్భాన్నిబట్టి వరవరరావు, త్రిపురనేని మధుసూదనరావు, కేవి రమణారెడ్డిలను పిలిచేవాళ్ళం. నేను అప్పట్లో ఎదుగుతున్న స్పీకర్. ఇంగ్లీషు, ఉర్దూ యాసలో తెలుగు మాట్లాడుతాడుగానీ, పాయింట్ ను కొత్తగా చెపుతాడని నా మీద విమర్శలాంటి ప్రసంశ వుండేది. కృష్ణాజిల్లాకు మదార్ నాయకత్వంలో వాసు, పొట్టి జయరాజులతో కలిపి జననాట్యమండలి శాఖ వుండేది. పాటల వ్యవహారం వాళ్ళు చూసుకునేవారు. మదార్ కు బోలెడు నత్తి. కానీ పాట ఎత్తుకుంటే నత్తిపోయేది. అదో విచిత్రం. నాకు ఉబ్బసం. ఇంట్లో వుంటే ఉబ్బసం వస్తుందిగానీ ఉద్యమం కోసం బయలుదేరితే అది భయపడిపోతుంది. ఉద్యమాల్లో ఇలాంటి విచిత్రాలు, మహాత్యాలు చాలా వుంటాయి.

 

సభకు కనీసం 3, 4 వందల మంది వచ్చేవారు. బెజవాడ సెలబ్రెటీలు అనేకులు వచ్చి జనంలో సామాన్యులుగా కూర్చొని ప్రసంగాలు వినేవారు. ఒక్కొసారి తెగ జనం వచ్చేసే వారు. ఆ రోడ్డు క్రిక్కిరిసి పోయేది. మా జననాట్యమండలి సభ్యులు ఎర్రజెండా పట్టుకుని జనంలోనికి వెళితే కనీసం మూడు వందల రూపాయలు వచ్చేవి. మరునాడు ఉంగరం విడిపించి, మిగిలిన డబ్బులతో ఇద్దరు హోల్ టైమర్లకు నెలకు సరిపడా బియ్యం, పప్పులు కొనే వాళ్ళం.

 

అప్పట్లో ఎంసెట్ పరీక్షలు కొత్తగా వచ్చాయి. ప్రింటింగ్ లో ఆఫ్ సెట్ టెక్నాలజీ వచ్చింది. కానీ టైపింగ్ / కంపోజింగ్ లో ఆల్ జీబ్రా రాలేదు. కాలేజీ తోజుల్లో నాది ఎంపిసి గ్రూపు. ఇంగ్లీషు హ్యాండ్ రైటింగ్ కొంచెం బాగుండేది. ఏ-4 కాగితాల మీద ఇండియన్ ఇంకుతో మ్యాథ్స్ గైడ్స్ కోసం  ప్రింట్ కాపీ రాసిపెట్టేవాడిని. పేజీకి 7-8 రూపాయలు. ఒక రాత్రికి రెండు మూడు పేజీలు రాసేవాడిని. ఆరోజుల్లో అది  లగ్జరీ కిందే లెఖ్ఖ. అదంతా అపెరల్స్ (డ్రెస్సులు, బూట్లు) మీద పెట్టే వాడిని. దాని మీదా కొన్ని విమర్శలు వుండేవి. నా డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ గురించి, సిగరెట్ తాగే విధానం గురించీ  ఐదు రోజుల క్రితం విజయవాడ  బహిరంగ సభలో ఒకరు ప్రస్తావించారు కూడ.

 

కలిసిన ప్రతొక్కరు మర్యాదగా నాకో పుస్తకం కొనిపెట్టేవారు. నా గది పుస్తకాలతో నిండిపోయేది. గెస్ట్స్ వచ్చినపుడు టవలు కప్పి పుస్తకాల మీదే పడుకునేవారు. ప్రయాణాల్లో నా టిక్కెట్లు ఎవరో కొనేవారు. సినిమా కెళ్ళినా అంతే. ఎవరో ఒకరు టిక్కెట్టు కొనేవారు.

 

నా తిండి బట్టల గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నాకు ఆప్యాయంగా మంచి భోజనం పెట్టి అరపెట్టె సిగరెట్లు కూడ ఇచ్చే వీరాభిమాని హోటల్ సుబ్రహ్మణ్యం వుండేవారు.

 

నేను కొండపల్లి సీతారామయ్య చెప్పిన మాటల్ని ఇప్పటికీ నమ్ముతాను. డబ్బుల కోసం ఉద్యమాలు ఆగవు.  ప్రైవేటు కాలేజీలు వచ్చి ఉద్యమాల్లో స్టూడెంట్స్ బేస్ ను దెబ్బతీశాయి. టివీలు, క్రికెట్టు వచ్చి మన యువతరం సమయాన్ని హైజాక్ చేసేశాయి. సరుకుల మాయ సమూహాన్ని వ్యక్తులుగా మార్చేసింది. నాయకత్వాల ఇగో క్లాష్ లతో పార్టీలు ముక్కలు చెక్కలయ్యాయి. ఎవర్ని నమ్మాలో, ఎవరి వెనుక నడవాలో తెలీక అభిమానులు సంధిగ్ధంలో పడిపోయారు.

 

సామాజిక సంక్షోభం వచ్చినపుడు నాకో ఖురాన్ / ఓల్డ్ టెస్టామెంట్  కథ  ఒకటి గుర్తుకు వస్తుంది. వెనుక నుండి పారో భీకర సైన్యం తరుముకుని వస్తున్నది; ముందు తోవ లేదు. ఎర్రసముద్రం అలలు భయంకరంగా ఎగిసిపడుతున్నాయి. అప్పుడే ఒక మూసా (అలెహిస్సలాం) అవసరం అవుతారు. వారే ఎర్ర సముద్రాన్ని చీలుస్తారు. అది దైవ మహాత్యం అనుకోవచ్చు. ఇలాంటి మహత్తర సంఘటనలే చరిత్రను మలుపు తిప్పుతాయి. “అప్పుడు కాలం కడుపుతోవుంది కార్ల్ మార్క్స్ ను కనింది”. అన్న మయకోవిస్కి మాటలు నాకు తరచూ వినబడుతుంటాయి.

 

1970-80ల నాటి మిత్రులు హఠాత్తుగా గుర్తుకొచ్చారు. ఈ అనుభవం ఇప్పుడూ కొందరికి పనికిరావచ్చు.

 

30 జులై  2023


No comments:

Post a Comment