Friday, 29 September 2023

MS Swaminathan - A Revolution and a Controversy

936 Words / 7484 characters

స్వామినాథన్ – ఒక విప్లవం ఒక వివాదం

     జనాభా పెరుగుదల కుందేలులా (geometric rate) పరుగులు తీస్తుంటే ఆహారోత్పత్తి పెరుగుదల తాబేలులా (arithmetic rate) నిదానంగా సాగుతుందనీ అందుచేత కరువు కాటకాలు వచ్చి మనుషులు చనిపోక తప్పదని ఇంగ్లండుకు చెందిన థామస్ మాల్థస్ 18 శతాబ్దంలో  సిధ్ధాంతం చేశాడు. 

మనం చరిత్రను పరిశీలిస్తే భారత ఉపఖండంలో మహా  కరువుల్లో అత్యధిక భాగం బ్రిటీష్ వలస పాలన కాలంలోనే సంభవించాయి. ఇందులో ప్రభుత్వ వైఫల్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి. థామస్ మాల్థస్ జనాభా సిధ్ధాంతం అర్ధశాస్త్రంలో ఒక దిక్కుమాలిన ప్రతిపాదన. మనిషి పొట్ట పెట్టుకుని తినడానికి మాత్రమే పుట్టడు; ఉత్పత్తి స్థాయిని పెంచడానికి ఒక మెదడు, రెండు చేతులతోనూ పుడతాడు. 

విధిరాత జనాభా సిధ్ధాంతాన్ని కొందరు 1943 నాటి బెంగాల్ కరువుకు అన్వయిస్తుంటారు.  మనం గుర్తించుకోవాల్సిన విషయం ఏమంటే బెంగాల్ ప్రజలు ఏడాది ధ్యాన్యం పండక చనిపోలేదు.  పండిన ధాన్యాన్ని వలస ప్రభువులు రెండవ ప్రపంచ యుధ్ధం కోసం యూరోప్ కు తరలించడంతో పౌరసరఫరాలు స్థంభించి ఆహారం అందక జనం చనిపోయారు. 

భూమి మీద స్వర్గం అంటూ వుంటే అది భారత ఉపఖండమే. మనకు రాత్రీ పగలు సమానంగా చెరో 12 గంటలు, మూడు కాలాలూ సమానంగా చెరో నాలుగు నెలలు, సారవంతమైన భూములు, కావలసినంత నదీజలాలు. మన దేశంలో ఒక్క వరిలోనే అక్షరాల  లక్ష రకాల వంగడాలు వున్నాయని అంచనా. ఇలాంటి దేశం మరో చోట కనిపించదు. లోపం మన పకృతిలో లేదు; ప్రభుత్వాల నిర్వహణలో వుంది. 

1840 చివర్లో ఉత్తర భారత దేశ ప్రజల్లో వలస పాలన మీద తీవ్ర అశాంతి నెలకొంది. ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైన్యాన్ని అక్కడ మొహరించింది. దాదాపు అదే సమయంలో కృష్ణా, గోదావరి మండలాల్లోనూ కరువు, ఉప్పెనలు వచ్చాయి. దక్షణాదిలో చెలరేగబోయే అంశాతిని మొగ్గలోనే అణిచివేయడానికి కంపెనీ గవర్నర్ జనరల్ కొందరు సైనికాధికారుల్ని అక్కడికి పంపించాడు.  ఆబృందంలో వాడే కెప్టెన్ ఆర్ధర్ కాటన్. 

అశాంతిని ఆయన ఆయుధాలతో కాకుండా ఆహారంతో చల్లార్చాలనుకున్నాడు.  1852లో గోదావరి నది మీద ఓ మూడు నాలుగు అడుగుల  చిన్న ఆనకట్ట కట్టేస్తే జనం ఆహారం పండించుకుని తింటూ ప్రశాంతంగా బతికేస్తారు. ఆపైన ప్రత్తి కూడ పండిస్తే మాంచెస్టరు బట్టల మిల్లులకు కావలసినంత ముడిసరుకు చవగ్గా లభిస్తుందని కూడా భావించాడు. బెజవాడ ఆనకట్టను రూపొందించింది కూడ కాటనే. 

ఇప్పటి మధ్య ఆంధ్రా ప్రాంతంలో అలా కొత్తగా ఒకకాలువల సంతతి పుట్టింది. ఒకనాటికరువు ప్రాంతం’ ఆనకట్ట కట్టిన 50 ఏళ్లలో ఏకంగా బియ్యం ఎగుమతి కేంద్రంగా మారిపోయింది. గోదావరి డెల్టాలోని గ్రామాల్లో గుర్రం  ఎక్కిన సర్ ఆర్ధర్ కాటన్ విగ్రహం వుంటుంది. ఆయనకు ఇళ్ళల్లో పూజలు చేస్తారు, పూర్వీకులతో పాటు పిండ ప్రదానమూ చేస్తారునిత్యగోదావరీ స్నాన పుణ్య దోయోమహమతిః, స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథంఅంటూ శ్లోకాలు చదువుతారు. 

స్వాతంత్ర్యానంతరం కూడ 1960లలో మళ్ళీ ఆహార కొరత వచ్చింది.  వలస ప్రభువులు కట్టించిన రెండు మూడు ఆనకట్టలు, అప్పటికి మనం కట్టుకున్న నాగార్జునసాగర్, భాక్రా-నంగల్ వంటి బహుళార్ధకసాధక ప్రాజెక్టులు దేశ అవసరాల మేరకు ఆహారోత్పత్తి చేయడానికి సరిపోలేదు. అమెరికా పబ్లిక్ లా- 480 (పిఎల్ – 480) పథకం కింద సహాయంగా పంపించే బియం, గోధుమలు, పాలపిండితో  మనం కడుపు నింపుకోవాల్సిన ఒక దుస్థితి ఏర్పడింది. 

సరిగ్గా అప్పుడు ఒక అపద్బాంధవునిగా ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాధన్ ముందుకు వచ్చి అధికోత్పత్తి వంగడాల (HYV) సృష్టితో హరితవిప్లవాన్ని నడిపించాడు. ఇది భారత ఆహార రంగంలో పెను మార్పులు తెచ్చింది. ఓ ఇరవై యేళ్ళు తిరక్కుండానే మనం అధికోత్పత్తితో పాటు అదనపు ఉత్పత్తినీ సాధించాం. నిల్వచేయడానికి తగినన్ని గిడ్డంగులు లేక పండిన పంటలో దాదాపు 20 నుండి 30 శాతం ఎండకూ వానకు వదిలేసి కుళ్ళబెట్టి ముక్కబెట్టిన సందర్భాలున్నాయి.  కొత్త గిడ్డంగులు కట్టాలనీ లేకుంటే బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని సాక్షాత్తు సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని మందలించిన సందర్భాలున్నాయి. పిఎల్ – 480 దగ్గర  మొదలై ఆహార ధాన్యాలను నిల్వ చేసుకోలేనంతగా విరగ పండించేంత వరకు సాగినదంతా ఒక మహత్తర విప్లవం. దానితో స్వామినాధన్ పేరు అభినవ అన్నదాతగా దేశమంతా మారుమోగిపోయింది. 

అమెరిక మనకు పిఎల్ – 480 సహాయాన్ని అందిస్తున్న కాలంలోనే ఆ దేశంలో కొన్ని కీలక పరిణామాలు జరిగాయి. రిచర్డ్ నిక్సన్, గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షులుగా వున్న కాలంలో అమెరికా వ్యవసాయశాఖ సెక్రటరీగా ఎర్ల్ బట్జ్ అని ఒకడుండేవాడు. నిజానికి అతను రక్షణ మంత్రిగా వుండాల్సినోడు. “ఆహారాన్ని ఒక ఆయుధంగా ప్రయోగించే అవకాశమే వుంటే  ఆనందంగా ప్రయోగిస్తాము అంటుండేవాడు.  

 అప్పట్లో అమెరికాకు బియ్యంతో అస్సలు పనిలేదు. కానీ, బియ్యమే ప్రధాన ఆహారంగా బతికే ఆసియా ఖండపు ఆర్థికరంగాన్ని నియంత్రించాలంటే వరి పంట మీద గుత్తాధిపత్యాన్ని సాధించాలని అమెరికా మెగా కార్పొరేట్లయిన హెన్రీ ఫోర్డ్, రాక్ ఫెల్లర్ లకు స్పురించింది. రెండు సంస్థలు సంయుక్తంగా 1960లో ఫిలిప్పీన్స్ లో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (IRRI)ను నెలకొల్పాయి. ఆసియాఖండపు వరి ఉత్పత్తిని, దాని మీద జరిగే పరిశోధనల్ని, సదరు శాస్త్రవేత్తల్ని నియంత్రించాలని వారొక విధాన పత్రమే రాసుకున్నారు. వరి, గోధుమల్ని  ఎవరు పండించుకున్నా విత్తనాలు మొదలు ఎరువులు, పెస్టిసైడ్స్, ఎన్ సెక్టిసైడ్స్, ట్రాక్టర్లు ఇతర యంత్రపరికరాలన్నీ తమ దగ్గర కొనేలా చేసి ఆసియాలో ఒక సుస్థిర మార్కెట్ ను నెలకొల్పాలని ఈ సంస్థ పాలసీగా పెట్టుకుంది. ఈ విధాన పత్రాన్ని  స్వయంగా హెన్రీ ఫోర్డ్ రాసాడంటారు. 

సైంటిస్టులు అంత సులువుగా లోబడతారా? అనే అనుమానం చాలామందికి వుంటుంది. “అప్పటివరకు భక్తి మర్యాదలతో గౌరవమిస్తున్న వృత్తులకు వుండే అందమైన తొడుగులన్నింటినీ బూర్జువావర్గం పీకిపడేసింది. వైద్యుడినీ న్యాయమూర్తినీ మతగురువునీ కవినీ శాస్త్రవేత్తనీ (the man of science) డబ్బు తీసుకుని తనకు ఊడిగం చేసే కిరాయి కూలీలుగా మార్చివేసింది” అంటాడు కార్ల్ మార్క్స్ ఒక సందర్భంలో. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆసియాదేశాల్లో ఆ పని చేయడానికే పుట్టింది; ఆ పనే చేసింది. చాలా మంది సైంటిస్టుల్ని ఆకర్షణీయమైన ప్యాకేజీలిచ్చి కొనిపడేసింది. 

1980ల ఆరంభంలో హరిత విప్లవ ఫలితాల మీద కొన్ని అనుమానాలు పొడచూపాయి. ఆహారోత్పత్తి భారీగా పెరిగిందిగానీ, వ్యవసాయ రంగంలో ఇన్ పుట్ కాస్ట్ కూడా భరించలేనంతగా పెరిగింది. రైతులకన్నా ఇన్ పుట్స్ ఉత్పత్తిదారులకు ఎక్కువ మేలు జరిగింది. దీని వెనుక హెన్రీ ఫోర్డ్, రాక్ ఫెల్లర్ల కుట్ర వుందనే మాట కూడ వెలుగులోనికి వచ్చింది. మరో వైపు, క్లాడ్ ఆల్వరెస్ (Claude Alvares) వంటి పర్యావరణ వేత్తలు హరిత విప్లవం దుష్ఫలితాలను గురించి విమర్శలు సంధించడం మొదలెట్టారు. మన  సైంటిస్టులు ఇక్కడి సహజ వరి వంగడాల జెర్మ్ ప్లాజంను (germplasm)  సేకరించి IRRIకి అందించారనేది ఈ సందర్భంగా ప్రధానంగా వినిపించిన ఆరోపణ. తెగుళ్ళను తట్టుకోగల (Resistant) స్వదేశీ వంగడాలను పిలిప్పీన్ కు ఎగుమతి చేసి,  రోగ నిరోధక శక్తి తక్కువగా వుండే (Susceptible) విదేశీ వంగడాలను దిగుమతి చేశారనేది ఇంకో విమర్శ. 

ఈ సమయంలోనే,  స్వామినాధన్ పిలిప్పీన్స్ కు వెళ్ళి 1982-88 మధ్య కాలంలో ఇర్రీ డైరెక్టర్ జనరల్ పదవిని స్వీకరించారు. దానితో ఆయన విమర్శకుల ఆరోపణలకు ఒక బలం చేకూరినట్టయింది. 

ఇర్రిలో పదవీ విరమణ చేసి పిలిప్పేన్ నుండి తిరిగి వచ్చిన  స్వామినాధన్ సతత హరిత విప్లవం అమృతాన్నేగాక హాలాహలాన్ని కూడ ఇచ్చిందని గమనించారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయనీ, తాను ఊహించని  కొన్ని కొత్త రోగాలు కూడ విజృంభించి ఫార్మా కంపెనీల పంట పండిస్తున్నాయనీ అర్ధం అయింది. 

అటల్ బీహారీ వాజ్ పాయ్  ప్రధానిగా వున్న కాలంలో దేశంలో రైతుల ఆత్మహత్యలు ఒక పరంపరగా సాగాయి. కేవలం 2004లోనే 18, 241 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు అధికారికంగా నమోదయింది. ఆ తరువాత అధికారాన్ని చేపట్టిన మన్మోహన్ సింగ్ – సోనియాగాంధీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకునేందుకు  ‘ద నేషనల్ కమీషన్ ఆన్ ఫార్మర్స్’  (NCF)ను నెలకొల్పింది. 2004 నవంబరు 18న ఆ సంస్థకు ఎంఎస్ స్వామినాధన్ ను ఛైర్మన్ గా నియమించింది. 

ఎన్ సిఎఫ్ ఛైర్మన్ గా ఆయన ప్రభుత్వానికి 10 సూచనలు చేశారు. వ్యవసాయోత్పత్తులకు సాగుబడికి అయ్యే ఖర్చుతోపాటూ రైతుకు 30 శాతం లాభం మిగిలేలా కనీస మద్దతు ధరను నిర్ణయించాలనీ, ఏక పంట విధానాన్ని వదిలి బహుళ పంటల విధానాలను అనుసరించాలనీ, నీటిపారుదలా సౌకర్యాన్ని కల్పించడమేగాక, నీటి యాజమాన్య నాణ్యతను  పెంచాలనేవి ఇందులో ముఖ్యమైనవి. 

అయితే, స్వామినాధన్ సిఫార్సుల్ని ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదు. సంకర విత్తనాలు. రసాయన ఎరువులు, ఇనార్గానిక్ క్రిమిసంహారక మందులకు మార్కెట్ సృష్టించే సైంటిస్టు స్వామినాధన్ కార్పొరేట్లకు కావాలిగానీ రైతుల పక్షాన నిలిచే స్వామినాధన్ వారికెందుకూ? 

ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలకు ఇంకో మెట్టు ఏమంటే,  నరేంద్ర మోదీజీ ప్రభుత్వం రైతులకు ఆమోదయోగ్యంకాని మూడు విధానాలను  రూపొందించి 2020 జూన్ 5న ఆర్డినెన్స్ జారీ చేసింది. అదే ఏడాది సెప్టెంబరు 14న వీటిని బిల్లు రూపంలో లోకసభలో ప్రవేశపెట్టారు. ఆరు రోజుల తరువాత ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా రైతు ఆందోళన సాగడంతో ఈ చట్టాల అమలును నిలిపివేశారు. 

ఆయన జీవితంలో ఇర్రి అధ్యాయం లేకుంటే మన దేశంలో  ఆర్ధర్ కాటన్ లా ప్రతి ఇంట్లోనూ స్వామినాధన్ ఫొటోలు వెలసి వుండేవి. 

డానీ

సమాజ  విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

9010757776

ప్రచురణ : 11 అక్టోబరు  2023 

స్వామినాథన్ఒక విప్లవం ఒక వివాదం

https://www.andhrajyothy.com/2023/editorial/sampadakeeyam/swaminathan-a-revolution-a-controversy-1152743.html


Thursday, 28 September 2023

1948 Police Action - Afsar Book intro

 1948 నాటి పోలీస్ యాక్షన్  

 

ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్ ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు. 

 

సెప్టెంబరు 26 రాత్రి హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.

 

రెండు తరాల ముందు నుండే వాళ్లది ఖమ్మం జిల్లాలో సాంప్రదాయ ముస్లిం ప్లస్ కమ్యూనిస్టు కుటుంబం. తనకు నాణేనికి రెండు పక్కలా తెలుసు. ఇప్పుడైతే తను తెలుగు కవిగా, కథకునిగా ప్రముఖుడయ్యాడుగానీ, పర్షియన్ భాషా వాతావరణంలో పుట్టి పెరుగుతున్న పిల్లోడు తెలుగు నేర్చుకోవడానికి పడ్డ కష్టాలు, ఎదుర్కొన్న అవమానాలను వివరిస్తుంటే ప్రేక్షకుల్లో కొందరి కళ్ళైనా చెమర్చి వుంటాయి. (నాది కూడ సేమ్ టు సేమ్ స్టోరీ. నన్నెందుకో మానాన్న చినబాల శిక్ష నేర్పమని అగ్నిహోత్రావధాన్లు అనే ఒక కఠోర మాస్టారి దగ్గర పడేశారు. నోటితోకన్నా పేక బెత్తంతో నేర్పితేనే తెలుగు బాగా వస్తుందని వారు గాఠిగా నమ్మేవారు). 

 

2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు. అంచేత ఇది పుస్తక సమీక్ష కాదు; రచయిత జూమ్ ప్రసంగం సందర్భంగా నాలో చెలరేగిన  భావాలు మాత్రమే. 

 

 

డానీ

సమాజవిశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు


https://www.sakshi.com/telugu-news/guest-columns/1948-police-action-another-perspective-1803645

1948 Police Action - 1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!

 మిత్రమా!

ఈ వ్యాసాన్ని ఇప్పుడే రాశాను.

దీనిని మరెక్కడా ప్రచురించలేదు

సాక్షి ఎడిట్ పేజీలో ప్రచురణకు పరిశీలించ గలరు.

 

సౌలభ్యం కోసం మూడు టైటిల్ ఆప్షన్స్ ఇచ్చాను.

 

అవసరాన్నిబట్టి టైటిల్ ను, ఆర్టీకల్ సైజును మార్చుకునే స్వేఛ్ఛ మీకు ఎలాగూ వుంటుంది.

 

ప్రచురణకు ఎన్నిక కాకుంటే వెంటనే తెలుప గలరు.

వేరే పత్రిక్కి పంపుకుంటాను.

 

-     డానీ

 

 

తెలంగాణ రైతాంగ సాయుధపోరాటానికి మరోకోణం!

తెలంగాణ మీద పోలీస్ యాక్షన్ కు మరోకోణం !

1948 పోలీస్ యాక్షన్ - మరోకోణం!

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, అది సృష్టించిన సాహిత్యం మన రాజకీయాల్లో, సాహిత్యంలో చివరకు మన జీవితాల్లోనూ విడదీయరాని భాగం. ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలకు రెండు తెలుగు రాష్ట్రాల చట్టసభల్లో ఒక్క ప్రతినిధి కూడ లేడు. అయినప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వామపక్ష భావజాలమే ఇప్పటికీ చాలా బలంగా వుంది. తెలుగు సాహిత్యంలో అత్యధిక భాగం ‘సామ్యవాద వాస్తవికత’ ప్రభావంలోనే వుందటే అతిశయోక్తికాదు.

 

భాషా ప్రయుక్త రాష్ట్రాల విధానం వచ్చాక 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రరాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేశారు. నిజాం సంస్థానం చాలా పెద్దది. అందులోని ఐదు ప్రధాన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణలోని నల్గొండ, వరంగల్ రెండు జిల్లాల్లో ప్రధానంగానూ, మరో ఒకటి రెండు జిల్లాల్లో స్వల్పంగానూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సాగింది. ఆనాటి చారిత్రక సంఘటనల మీద తమ అనుభవాలను గ్రంధస్తం చేసిన ఆ పోరాట అగ్రనాయకులు అందరూ తెలంగాణకు పరిమితమయ్యారు. తమ పుస్తకాలకు నిజాయితీగా ‘తెలంగాణ’ అనే శీర్షికలే పెట్టారు. మిగిలిన నిజాం సంస్థానాన్ని వదిలేశారు. దానికి రెండు కారణాలు మొదటిది; ఉర్దూ భాషా సమస్య, రెండోది; ముస్లిం మత సమస్య.

 

తెలంగాణేతర నిజాం సంస్థానంలోనేకాక, కమ్యూనిస్టుల ప్రభావం లేని తెలంగాణ జిల్లాల్లోనూ పెద్ద సంఖ్యలో ప్రజాస్వామికవాదులు, భారత జాతీయవాదులు, కమ్యూనిస్టులు వున్నారు. వీరిలో ముస్లింలు కూడ పెద్ద సంఖ్యలో వున్నారు.  వీరి గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలీదు.

 

నిజాం పాలన గురించి మనకు, ముఖ్యంగా, తెలుగు పాఠకులకు తెలిసింది చాలా తక్కువ. నిజాం సంస్థానంలో పెట్టుబడీదారీ అభివృధ్ధి గురించి పరిశోధనలు చేసిన ప్రొఫెషనల్స్ కొందరు లేకపోలేదు. వారిలో ఒకడైన సివి సుబ్బారావు నాకు మంచి మిత్రుడు. ఆ రోజుల్లో జవహర్ లాల్ నెహ్రూ వాగ్దానం చేస్తుండిన ఇండియాకన్నా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనలోని నిజాం సంస్థానంలో కొనసాగుతున్న అభివృధ్ధి మెరుగ్గా వుందనే నిర్ధారణకు వచ్చాడు తను.

 

ఇంతకీ తెలంగాణ సాయుధ పోరాటం ద్వార భారత కమ్యూనిస్టు పార్టీ సాధించిందేమీటీ? వాదన కోసం; నిజాం రాచరిక పాలననో, జాగీర్దార్ల భూస్వామ్యాన్నో వాళ్ళు అంతం చేసేశారు అనుకుందాము.  భూస్వామ్య వ్యవస్థను అంతం చేశాక పెట్టుబడీదారీ వ్యవస్థ ఏర్పడుతుందని సాక్షాత్తు  ‘కమ్యూనిస్టు పార్టి ప్రణాళిక’లో కార్ల్ మార్క్స్ – ఫ్రెడరిక్ ఏంగిల్స్ చెప్పారు.

 

పెట్టుబడీదారీ వ్యవస్థ ఆవిర్భవించి, అందులో పారిశ్రామిక ఉత్పత్తి సంపూర్ణ, గరిష్ట స్థాయిలకు పెరిగి, ఒకవైపు; సమస్త సంపదను హస్తగతం చేసుకున్న పెట్టుబడీదారులు, మరోవైపు; ఎలాంటి సంపదాలేని శ్రామికులుగా సమాజం బరి గీసి విడిపోయినప్పుడు ఆ (పెట్టుబడీదారీ) వ్యవస్థను కూల్చితే సమసమాజ స్థాపన సాధ్యం అవుతుందని వాళ్ళు చెప్పారు. ‘ప్రణాళిక’లో ఇది కీలక అంశం మాత్రమేకాదు అదే దాని ప్రాణం.  భూస్వామ్య వ్యవస్థను కూల్చేస్తే సమసమాజం వస్తుందనో, కమ్యూనిస్టు రాజ్యం వస్తుందనో, కనీసం “రైతు-కూలీ రాజ్యం” వస్తుందనో వాళ్ళెక్కడా చెప్పలేదు.

 

తెలంగాణలో కమ్యూనిస్టు పార్టి రాచరిక – భూస్వామ్య వ్యతిరేక పోరాటం చేసిన తరువాత అక్కడ అత్యంత సహజంగానే పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ధి చెందడాన్ని మనందరం చూస్తున్నాం. మరోమాటల్లో చెప్పాలంటే; తెలంగాణలో పెట్టుబడీదారీ వ్యవస్థ పుట్టి పెరగడానికి  కమ్యూనిస్టు పార్టీలు తమ వంతు శ్రమదానం, ప్రాణదానం కూడ చేశాయి!!. ఓ 35 యేళ్ళ తరువాతి కాలంలో కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో నక్సలైట్ పార్టీలు చేసిందీ అదే; భూస్వాముల్ని పెట్టుబడీదారులుగా మార్చడం!!.

 

1940ల చివర్లో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానీ, 1980ల మొదట్లో నక్సలైట్ పార్టీలుగానీ వుద్దేశ్యపూర్వకంగా ప్రణాళిక బధ్ధంగా పెట్టుబడీదారీ వ్యవస్థను పెంచిపోషించాయని చెప్పడం సరికాదు. సమాజానికి తనదైన ఒక రోడ్ మ్యాప్ వుంటుంది. ఒకరు అనుకున్నా అనుకోకపోయినా అదలా సాగిపోతుందంతే. అయితే, ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించినవాళ్ళకు ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ సరిగ్గా అర్ధం కాలేదని మాత్రం చెప్పవచ్చు. పెట్టుబడీదారీ వ్యవస్థ పరిపక్వం కాకముందే, పారిశ్రామిక ఉత్పత్తి గరిష్ట స్థాయికి చేరక ముందే జరిపే సోషలిస్టు విప్లవాలు నిలదొక్కుకోలేవని రష్యా, చైనా అనుభవాలు చెపుతున్నాయి.

 

ఛత్తీస్ గడ్ లోని దంతేవాడ, బీజాపూర్, నారాయణ్ పూర్ జిల్లాల పరిధిలోని కొండలు-అడవులతో అబుజ్ మడ్ప్రాంతంలో  గిరిజనులు, ఆదివాసులతో తామొక ‘నమూనా సామ్యవాద సమాజం’ను స్థాపించినట్టు కొన్ని కమ్యూనిస్టు పార్టీలు చెపుతుంటాయి. కొండలు, ఆడవులు సమిష్టి సంపదగావుండే ఆదివాసి తెగల్లో ఆర్ధిక సామాజిక సమానత్వం (ఆర్గానిక్ సోషలిజం) సహజంగానే వుంటుంది. 4 వేల సంవత్సరాల క్రితమే ‘ఆదిమ కమ్యూనిస్టు సమాజం’ వుండిందని మార్క్స్ – ఏంగిల్స్ కూడా చెప్పివున్నారు.  ఈశాన్య రాష్ట్రాల్లోని కొండలు అడవుల్లో నివశించే సమూహాల్లో ‘సహజ సామ్యవాద సమాజం’ను ఇప్పటికీ చూడవచ్చు. పారిశ్రామిక ఉత్పత్తి గరిష్టస్థాయిలో పెరగనిచోట సోషలిస్టు రాజ్యాన్ని సాధించామని ఎవరయినా చెపితే వాళ్లకు చారిత్రక భౌతికవాదం బొత్తిగా తెలీదని అర్ధం.

 

ఒక కఠోర చారిత్రక వాస్తవం ఏమంటే ప్రపంచంలో ఇప్పటి వరకు పెట్టుబడీదారీ వ్యవస్థ అభివృధ్ది చెందిన ఏ దేశంలోనూ సోషలిస్టు విప్లవం విజయవంతం కాలేదు. భారత కమ్యూనిస్టు పార్టీలకు నాయకత్వం వహించినవారు భూస్వాములకన్నా తెలివైనవారేతప్ప పెట్టుబడీదార్లుల్ని ఎదుర్కోలేరు. పెట్టుబడీదారీ వ్యవస్థల్లో సోషలిస్టు విప్లవాన్ని విజయవంతం చేయగల సిధ్ధాంత బలం, వ్యూహాలు, ఎత్తుగడలు, సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ వ్యవస్థ, ప్రజల మద్దతు మన దేశంలో ఏ కమ్యూనిస్టు పార్టీకీ లేదు. వాటికున్న బలాలు మూడు; పాలక పార్టీల విధానాల మీద పటిష్టమైన విమర్శను ప్రకటించగలవు; పెద్ద ఎత్తున ప్రచారాందోళనను సాగించగలవు; ‘సామ్యవాద వాస్తవికత’ వాదంతో విస్తృతంగా సాహిత్యాన్ని సృష్టించగలవు.

 

1948 నాటి పోలీస్ యాక్షన్ తమ కోసమే జరిగిందనీ, అందులో దాదాపు 3 వేలమంది కమ్యూనిస్టు కార్యకర్తలు చనిపోయారని కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరచూ చెపుతుంటారు. అది నిజం కూడ. అందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఆ చనిపోయిన వారిలో ముస్లిం-కమ్యూనిస్టులు కూడా వున్నారని విడిగా చెప్పాల్సిన పనిలేదు.

 

కమ్యూనిస్టు నాయకులు చెప్పని ఇంకో పెద్ద నిజం కూడా వుంది.  జే.ఎన్. చౌధరి నాయకత్వంలోని ‘పోలీసు యాక్షన్’ కమ్యూనిస్టు ప్రభావిత జిల్లాలకు చేరుకోవడానికి ముందే నిజాం సంస్థానంలో 3 వేలకు ఓ పది రెట్లకు పైగా  ముస్లింలను అతి క్రూరంగా చంపేశారు.  వాళ్ల ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు, వాళ్ల ఆడవాళ్లను ----- చేశారు. దీనిపైన నెహ్రు వేసిన సుందర్ లాల్ బహుగుణ కమిటి మాత్రమేకాక, ఉమ్మడి కమ్యూనిస్టు పార్టికి అప్పటి పార్లమెంటరీ రాజకీయాల వేదికగావున్న పీపుల్స్ డెమోక్రాటిక్  ఫ్రంట్ (పిడిఎఫ్) నాయకులు కూడ ఒక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందచేశారు.  సుందర్ లాల్ బహుగుణ నివేదికను జాతీయభద్రత కారణంగా చాలాకాలం దాచిపెట్టారుగానీ ఇప్పుడు అది అందుబాటులో వుంది.

 

సుందర్ లాల్ బహుగుణ నివేదిక బయటికి రాకపోయినా ఆ జాతిహననాన్ని అనుభవించినవారు దాన్నెలా మరచిపోతారూ? అవి వాళ్ల జ్ఞాపకాల్లో పీడకలలుగా కొనసాగుతూనే వుంటాయి. 1984 ఢిల్లీ అల్లర్లు 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత భారతీయ సాహిత్యంలో అత్యంత సహజంగానే, ఒక చారిత్రక అవసరంగానే మైనారిటివాదం అనే ఒక కొత్త ధోరణి ఆరంభమయింది.  2002 గుజరాత్ అల్లర్ల తరువాత ఇది వేగాన్ని పుంజుకుంది. 2014 తరువాత దీనికి ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు మణిపూర్ అల్లర్ల తరువాత దీని ఆవశ్యకత మరీ పెరిగింది. మైనారిటీవాదాన్ని కొందరు అతిఉత్సాహంగా ‘ముస్లివాదం’, ‘ఇస్లాంవాదం’ అంటున్నారుగానీ అవి తెలిసో తెలియకో ‘హిందూవాదం’కు ఆమోదాంశాన్ని కలిగిస్తాయి.

 

ఇండో-అమెరికన్ రచయిత అఫ్సర్ ముహమ్మద్ 1948 నాటి పోలీస్ యాక్షన్ బాధిత కుటుంబాల సంతతిని కలిసి వాళ్ళ అనుభవాలను నమోదు చేసే బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ అంశం మీద ఓ దశాబ్దంపాటు విస్తృత పరిశోధనలు చేసి ఇప్పుడు “Remaking History -1948 Police Action and the muslims of Hyderabad” శీర్షికతో ఒక భారీ చారిత్రక డాక్యుమెంట్ ను ప్రచురించాడు. 

 

సెప్టెంబరు 26 రాత్రి హైదరాబాద్ లా మకాన్ లో జూమ్ మీటింగ్ ద్వార ఈ పుస్తక పరిచయ సభ జరిగింది. ఈ పుస్తకం రాయాల్సిన అవసరాన్నీ, తన అనుభవాల్నీ రచయిత చాలా ఉద్వేగంగా వివరించాడు.

 

2002 గుజరాత్ అల్లర్ల తరువాత తను ముస్లిం సమాజం మీద దృష్టి పెట్టాడు. మొహర్రం పండుగ సందర్భంగా తెలంగాణలో వెల్లివెరిసే మతసామరస్యం మీద పరిశోధన సాగించాడు. ఆ క్రమంలో 1948 పోలీస్ యాక్షన్ బాధితులు అతనికి తారసపడ్డారు. దాచేస్తే దాగని సత్యాలను వెళ్ళడించడానికి సిధ్ధపడ్డాడు. దాని ఫలితమే ఈ పరిశోధనా గ్రంధం. అతని పుస్తకం ఇంకా ఇండియాకు రాలేదు.


మనలో దాదాపు అందరికీ ఒక సెలెక్టివ్ ఆసక్తి వుంటుంది. మనకు కనిపించేదే, మనకు చెందినదే, మనకు ఇష్టమైనదే ప్రపంచం అనుకుంటాము. ప్రపంచం అనేది చాలా పెద్దది. అందులో మనకు తెలిసింది చాలా తక్కువ, తెలియాల్సింది చాలా ఎక్కువ అనే స్పృహ చాలామందికి వుండదు. ప్రపంచం మొత్తం తెలియకపోయినా మనదేశం గురించి, మన రాష్ట్రం గురించయినా తెలియాలి. హీనపక్షం మనతో వందల సంవత్సరాలుగా సహజీవనం చేస్తున్న సమూహాల మనోభావాలనైనా తెలుసుకోవాలిగా.

 

దానికి ఈ పుస్తకం తోడ్పడుతుందని ఆశిస్తాను.

 

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు

9010757776