Monday, 25 September 2023

Manipur - దేశమంతా మండేదాకా మేలుకోరా?

 దేశమంతా మండేదాకా మేలుకోరా?

ABN , First Publish Date - 2023-08-01T03:54:21+05:30 IST

        సంఘపరివారపు సామాజిక దృక్పథం, భారతీయ జనతా పార్టీ రాజకీయార్థిక విధానాలు దేశాన్ని ఎంతటి ప్రమాదకర స్థితికి తీసుకుని వెళ్ళగలవో ఇప్పుడు మణిపూర్ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి. మణిపూర్ మంటల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్శ్వాన్ని మాత్రమే చూస్తున్నారు. వివాదంలో కుకీ తెగవారు ఉన్నారు కాబట్టి దీనిని ఆదివాసీ, గిరిజన సమస్యగా కొందరు చూస్తున్నారు. కుకీలు కొండల్లోను, మైతీలు లోయల్లోను నివసిస్తున్నారు కనుక దీనిని కొండవాసులు, లోయ వాసుల సమస్యగా కొందరు చూస్తున్నారు. కుకీల్లో అత్యధికులు క్రైస్తవులు కనుక దీనిని మైనారిటీ మత సమస్యగా కొందరు చూస్తున్నారు. మైతీలు మెజారిటీ, కుకీలు మైనారిటీ కనుక దీన్ని మైనారిటీల మీద మెజారిటీల వేధింపు చర్యలుగా ఇంకొందరు చూస్తున్నారు. ఆ ప్రాంతాల్లో అపారంగావున్న ఖనిజ నిక్షేపాలను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసమే కుకీల మీద జాతిహననం సాగిస్తున్నారనే వాదనా వుంది. విభిన్నమైన సాంస్కృతిక జీవనంగల కుకీలను వేధించడానికీ, అడవులు, కొండల మీద వాళ్లకున్న ప్రత్యేక హక్కుల్ని రద్దు చేయడంకోసమే ఉమ్మడి పౌరస్మృతిని రూపొందిస్తున్నారనే మాటా వినిపిస్తున్నది. ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మైతీలను కుకీల మీదికి ఉసిగొల్పాడనే ఆరోపణలున్నాయి. మణిపూర్ తూర్పు సరిహద్దుల్లో పొరుగుదేశం మైన్మార్‌కు చెందిన రెండు రాష్ట్రాలుంటాయి.  ఆపైన మైన్మార్, లావోస్, థాయిలాండ్ కలిసే గోల్డెన్ ట్రయాంగిల్ (Golden Triangle) వుంటుంది. అది డ్రగ్స్ ట్రాపికింగ్‌కు అంతర్జాతీయ కూడలి. అంచేత మణిపూర్ మంటల్లో అంతర్జాతీయ డ్రగ్ మాఫియా ప్రయోజనాలు కూడ ముడిపడివున్నయనే వాదనా వుంది.

        ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ఎదుర్కొంటున్న సమస్త సమస్యలు మణిపూర్‌లో వున్నాయి. మణిపూర్ ఇప్పుడు మినీ ఇండియా. అంటే ఇప్పుడు మణిపూర్‌లో జరుగుతున్నది రేపు మొత్తం భారతదేశంలో జరుగబోతున్నదని అర్థం.

        దేశంలో ఫాసిస్టు పాలన కొనసాగుతోందని నాలుగేళ్ల క్రితం ఎవరయినా అంటే చాలామంది అంగీకరించేవారు కాదు. ఇవ్వాళ దేశంలో ఫాసిస్టు పాలన (ఫాసీవాద్) కొనసాగుతోందని మణిపూర్ ఆదివాసీ మహిళలు కూడ గొంతెత్తి అరుస్తున్నారు. కుకీ గిరిజన మహిళ డాక్టర్ ముడూసా వీడియోను ఇప్పుడు ప్రపంచమంతా వీక్షీస్తోంది.

        1984 చివర్లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత ఢిల్లీ పరిసరాల్లో సిక్కుల మీద ఊచకోత సాగింది. ఆ తరువాత జరిగిన లోక్‍సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో మెజారిటీ దక్కింది. ఒక మైనారిటీ సమూహాన్ని వేధిస్తుంటే మెజారిటీ ఓటు బ్యాంకు ధ్రువీకరణ జరుగుతుందనే ఒక కొత్త పోల్ మేనేజ్‌మెంట్ సూత్రం ముందుకు వచ్చింది. సిక్కులు పంజాబ్, ఢిల్లీ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయిన మైనారిటీలు. దేశం మొత్తంగా విస్తరించివున్న మత మైనారిటీలు ముస్లింలు. వాళ్లను లక్ష్యంగా చేసుకుని మన దేశంలో విద్వేష రాజకీయాలు రూపుదిద్దుకున్నాయి. 

        గత నియంతలు ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకోవడం కోసమైనా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు తలపెట్టేవారు. అంతవరకు టాటా బిర్లాలను ఔటర్‍లో వుంచేవారు. ఇప్పటి నియంతలు వేరు. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా పక్కన పెట్టేసైనాసరే కార్పొరేట్ల సేవలో తరించాలనుకుంటున్నారు.

        ఇప్పుడు మణిపూర్ మంటల్లో కార్పొరేట్ ప్రయోజనాల్ని చూద్దాము. భాగవతంలో భూమిని చాపలా చుట్టి సముద్రంలోనికి తీసుకుపోయిన హిరణ్యాక్షుని కథ ఒకటి వుంటుంది. మన మెగా కార్పొరేట్లు ఆ అంశలో పుట్టినవారు. ఇప్పటికే వాళ్ళు సముద్రాన్ని, ఆకాశాన్నీ మింగేశారు. దేశంలోని 16 షిప్ యార్డులు, 8 ఎయిర్ పోర్టులు ఆదానీ గ్రూపువే.

        ఇటలీలో ఫాసిజం, జర్మనీలో నాజిజం మైనార్టి మత సమూహాలను వేధించాయని మాత్రమే మనకు తెలుసు. కానీ అక్కడ కూడ మెజారిటీలయిన క్రైస్తవుల్లోని కొందరు కార్పొరేట్లు మాత్రమే బాగుపడ్డారుగానీ సామాన్య క్రైస్తవులు అనేక అగచాట్ల పాలయ్యారు. ఇప్పుడు మనదేశంలోనూ అంతే. హిందూ సామాన్య ప్రజలే ఎక్కువగా నష్టపోతున్నారు.

        మోదీ ప్రధాని పదవిని చేపట్టాక గత ఏడాది చివరి వరకు రూ.4 లక్షల కోట్లు విలువ చేసే పబ్లిక్ రంగ సంస్థల్ని అమ్మేశారు. గడిచిన 8 నెలల్లో అమ్మినవి దీనికి అదనం. మన దేశ జనాభాలో ముస్లింలు 15శాతం. ప్రభుత్వరంగ సంస్థల్లో వాళ్ళు 5శాతం కూడా ఉండరు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటు సంస్థలకు అమ్మేస్తుంటే ఆ 5 శాతం ముస్లింలు నష్టపోయేమాట నిజమేగానీ, మిగిలిన 95 శాతం హిందువులు కూడ నష్టపోతున్నారన్నది అంతకన్నా వాస్తవం.

        సముద్రం ఆకాశం రెండింటినీ మింగేశాక మన అస్మదీయ కార్పొరేట్లకు ఇప్పుడు లోయలు కొండలు కావాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు అడవి మీద విరుచుకు పడ్డారు. మణిపూర్‌ని మండించారు. ఇదొక అత్యాధునిక ఖాండవ దహనం. మైదానంలో వాడుతున్న మెజారిటీ మైనారిటీ ఫార్మూలానే వాళ్లు అడవిలోనూ అమలు చేస్తున్నారు. మణిపూర్‌లో మెజారిటీ మెయితీ తెగను మైనారిటీ కుకీ తెగల మీదికి ఎగదోస్తున్నారు. మణిపూర్‌లో జాతి నిర్మూలన (Ethnic Cleansing) జరుగుతున్నదనీ, ముఖ్యమంత్రి బైరేన్ సింగ్ కుకీలకు బద్ధవ్యతిరేకి అనీ, పోలీసులు ప్రభుత్వాధికారులు బాహాటంగా మెయితీ అల్లరి మూకలకు సహకరిస్తున్నారని సాక్షాత్తు బీజేపీ శాసనసభ్యుడు పావోలియన్ లాల్ హావ్ కిప్ బాహాటంగా ఆరోపిస్తున్నారు.

        కార్పొరేట్ల అటవీ ప్రాంత ఆక్రమణ మణిపూర్‌తో ఆగదని దేశంలోని ఆదివాసీ సంఘాలకు అర్థం అయింది. నాగాలండ్ మొత్తం కుకీలకు సంఘీభావాన్ని తెలుపుతోంది. ఉమ్మడి పౌరస్మృతికి వ్యతిరేకంగా ఝార్ఖండ్ ఆదివాసీ సమూహాల్లో ఒక ఉద్యమం ఆరంభమయ్యి క్రమంగా అటు ఈశాన్య రాష్ట్రాలకు, ఇటు ఛతీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు విస్తరిస్తోంది.

        మణిపూర్‌లో మే 4 నుంచి ఇంటర్నెట్ సదుపాయాలను రద్దు చేశారు. సుప్రీంకోర్టు జోక్యం తరువాత ఇంటర్నెట్ సదుపాయాలను పాక్షికంగా పునరుద్ధరించారు. ఆ తరువాత మాత్రమే మే 4న మణిపూర్‌లో జరిగిన ఒక బీభత్స వికృత సంఘటనకు సంబంధించిన వీడియో వెలుగులోనికి వచ్చింది. బయటికి వచ్చింది ఒక్క వీడియోనే. ఇలాంటి కొన్ని వందల అత్యాచారాలు అక్కడ జరిగినట్టు సోషల్ మీడియా ద్వారా తెలుస్తోంది. అనేకమంది బాధిత స్త్రీలు ఆ ఘోరాలను ఇప్పుడు బయటి ప్రపంచంతో పంచుకుంటున్నారు. మైనారిటీలను వేధిస్తుంటే మెజారిటీలు ఎన్నికల్లో తమను గెలిపిస్తారనే వికృత సిద్ధాంతానికి మణిపూర్ పరాకాష్ఠ.

        ఇప్పుడు మణిపూర్ మంటల సెగ పార్లమెంటుకు తాకింది. గత రెండున్నర నెలలుగా మణిపూర్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే వుంది. కనుక అక్కడ జరుగుతున్న జాతి హననానికి నేరుగా దానిదే బాధ్యత. కేంద్ర ప్రభుత్వం అంటే హోంమంత్రి, ప్రధానమంత్రులే అని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

            రాజకీయ సామాజిక ప్రత్యర్థుల మీద నైతిక దాడి చేయడానికి సంఘపరివారం దగ్గర ఒక పురాతన ఫార్ములా వుంది. ముస్లింల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికి వాళ్ళ మీద విదేశీయులు, చొరబాటుదార్లు, టెర్రరిస్టులు, పొరుగుదేశాల భక్తులు, వాళ్ళ ఆదేశాల ప్రకారం ఇక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, భారత వ్యతిరేకులు వంటి నిందల్ని వేసేవారు. ఇప్పుడు సరిగ్గా అవే నిందల్ని కుకీల మీద వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక తేడా వచ్చింది. దేశప్రజలు నరేంద్ర మోదీ, అమిత్ షాల మాటల్ని గతంలోలా ఇప్పుడు నమ్మడంలేదు.

        మణిపూర్‌లో మెజారిటీ సమూహమైన మెయితీలను లూటీలు, దొమ్మీలు, గృహదహనాలు హత్యలు, అత్యాచారాలు చేసే మూకోన్మాదుల జాతిగా ప్రపంచమంతా గుర్తిస్తున్నది. ఇంతటి అపఖ్యాతిని భరించడం మెయితీ జాతిలోని సహృదయులకు సాధ్యం కావడం లేదు. వాళ్లలో ఒక మార్పు వచ్చింది. ‘మమ్మల్ని మీరు తల్లి, సోదరీ అనీ పిలవకండ్రా. మీరు మానవత్వాన్ని కోల్పోయారు. మా పరువు తీసేశారు. మాపై అతిక్రూరమైన జాతిగా ముద్రవేసి ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టారు. మీరూ మిమ్మల్ని పెంచిపోషిస్తున్నవారూ యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే వాస్తవాన్ని గుర్తించండి’ అనే అర్థం వచ్చేలా వాళ్ళు కవితలు, వ్యాసాలు రాస్తున్నారు. వాళ్ళు అంటున్న యాంటి నేషనల్స్! యాంటి ఇండియన్స్! అనే ఆరోపణలు తార్కికంగా ఎవరికి వర్తిస్తాయో విడమరచి చెప్పనవసరం లేదు. ఇప్పుడు అడవిలో జరుగుతున్నట్టే రేపు మైదాన ప్రాంతంలోని మెజారిటీ సమూహాల్లోనూ ఈ మార్పు తప్పక వస్తుంది.

        ఇన్నాళ్ళుగా మణిపూర్‌లో ఏం జరుగుతున్నదో ప్రధాని, హోంమంత్రులకు తెలియదంటే ఆ పదవులకు వారు అనర్హులు. తెలిసి కూడా అక్కడ దారుణాలని కొనసాగనిచ్చారంటే ఇప్పుడు వినపడుతున్న కార్పొరేట్ కుట్ర సిద్ధాంతం నిజమే అని దేశం నమ్మాల్సి వుంటుంది. ఏది ఏమైనా, పార్లమెంటులో మణిపూర్ మీద మాట్లాడడానికి వాళ్ళు భయపడుతున్నారు. వాళ్ళ కలవరం స్పష్టంగానే కనిపిస్తున్నది. ఇప్పుడు వాళ్ళు భారత్, ఇండియా అనే పదాలను వింటేనే అసహనానికి గురవుతున్నారు. ముస్సోలినీ, హిట్లర్ కూడ చివరి రోజుల్లో భయంతోనే బంకర్లలో బతికారు. ఇప్పుడు ఢిల్లీ సన్నివేశాలు ఆ గతాన్ని గుర్తు చేస్తున్నాయి.

        మన పార్లమెంటరీ ప్రాతినిధ్య ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ఆరంభం అవుతున్నదనడానికి ఇవి తొలి సంకేతాలు కావచ్చు! ఇప్పటికే మనం ‘బీజేపీ ముక్త్ దక్షిణ భారత్’లో వున్నాం. 2024 లోక్‍సభ ఎన్నికల తరువాత ‘బీజేపీ ముక్త్ సంపూర్ణ భారత్’ ఏర్పడవచ్చు. మెజారిటీ సమూహాలు మణిపూర్‍లోలా ఆత్మపరిశీలన చేసుకుంటే ఇదేమీ అసాధ్యం కాదు.

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్

రచన ః 

ప్రచురణ : 1 ఆగస్టు  2023 ఆంధ్రజ్యోతి దినపత్రిక, 

https://www.andhrajyothy.com/2023/editorial/do-you-want-to-wake-up-until-the-whole-country-burns-1113495.html

No comments:

Post a Comment