Chandrababu Political Dilemma / 11 09 2023 / Danny Comment
వచ్చే ఎన్నికల్లో జనసేన గెలిచి అధికారాన్ని చేపడుతుందనే నమ్మకం
పవర్ స్టార్ కు లేదు. అది వారి గొప్పతనం. తన బలహీనతల గురించి తనకు స్పష్టమైన అంచనా
వుండడం కూడ గొప్పతనమే. అందువల్ల వారికి వారే పెట్టుకున్న టైటిల్ ‘కింగ్ మేకర్ ’ క్రీస్తుపూర్వం
3వ శతాబ్దంలో గ్రీసు యువరాజు అలెగ్జాండర్ కు అనేక శాస్త్రాలు బోధించి కింగ్ మేకర్ అనిపించుకున్నాడు
అరిస్టాటిల్. ఇప్పటి కింగ్ మేకర్ వేరు. చంద్రబాబు
గెలుపుకు పదో పరకో సీట్లు తగ్గితే తను సరఫరా చేసి ఆదుకుందామనే గొప్ప హృదయం వారిది.
పవర్ స్టార్ కింగ్ మేకర్ వ్యూహం నచ్చని వాళ్ళు ఆయన్ని ‘ప్యాకేజి స్టార్’ అంటుంటారు.
నైరాశ్యలో కాంగ్రెస్
రాష్ట్ర విభజన కారణంగా 2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటర్లు
కాంగ్రెస్ మీద చాలా గుర్రుగా వున్నారు. అప్పటికి
అధికారంలో వున్న పార్టికి ఒక్క సీటు కూడ రాకుండా ఓడించారు. ఇప్పటి పరిస్థితి వేరు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక
అభివృధ్ధికి నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి కొత్త ప్రాజెక్టులు తదితర అంశాల్లో
బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏపిని నిర్లక్ష్యం చేస్తున్నదనే అభిప్రాయం ప్రజల్లో
బలంగా వుంది. ఇప్పుడు ఏపి ప్రజలు స్థూలంగా
బిజెపికి వ్యతిరేకంగా వున్నారు. ఇక్కడ ఓట్లు
సాధించడానికి బిజెపి దగ్గర ఒక్క ఆయుధం కూడ లేదు. ఒక్క నినాదం కూడ లేదు.
తన స్వంత బలం మీదనే, సింగిల్ హ్యాండెడ్ గా ఎన్నికల్లో గెలవాలనేది
జగన్ అభిమతంగా వుంది. గతంలో లానే 2024 ఎన్నికల్లోనూ
వైసిపి మరొకరితో పొత్తు పెట్టుకోవడం, సీట్లు
పంచుకోవడం జగన్ కు ఏమాత్రం ఇష్టంలేదు. కేంద్రంలో బిజెపి విషయంలో జగన్ ‘రాజును మించిన
రాజభక్తి’ని చాటుకుంటున్నారు. విచిత్రం ఏమంటే జగన్ ఓటు బ్యాంకులో రెడ్డి సామాజికవర్గంతప్ప
అత్యధికులు బిజెపికి పూర్తి వ్యతిరేకులు. మరీ
ముఖ్యంగా ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీలు. జగన్ బిజెపికి అంతే విధేయంగావుంటే ఆ మేరకు
ముస్లింలు, క్రైస్తవులు, ఎస్సీల ఓట్లు తగ్గుతాయి. ఏపి పోలీసులు కూడ జగన్ ఓట్లను తగ్గించడంలో
తమవంతు కృషి గట్టిగానే చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కూడ దాదాపు చంద్రబాబు మైండ్ తోనే ఆలోచిస్తున్నారు.
జనసేన, టిడిపి, బిజేపి కలిసి జగన్ వ్యతిరేక ఓట్లు చీలకుండ చూస్తే తమ గెలుపు ఖాయమని ఆయన పదేపదే చెపుతున్నారు. కేంద్రంలో అధికారంలో వున్న పార్టి అనే ఒకే ఒక్క మాటతప్ప ఏపిలో బిజెపికి ఓట్లు లేవు. పవన్ కళ్యాణ్ నే నమ్ముకుని ముందుకు పోవాల్సిన దయనీయ
స్థితి ఆ పార్టీది.
బిజెపి దృష్టిలో జగన్ కాంగ్రెస్ తో విభేధించి బిజెపి పంచచేరిన
రాజకీయ నాయకుడు. చంద్రబాబు బిజెపి తో విభేధించి కాంగ్రెస్ దగ్గరకు వెళ్ళగల నాయకుడు.
అంచేత, బిజెపి జగన్ ను నమ్మినంతగా చంద్రబాబును
నమ్మదు. ఏపిలో వచ్చే ఎన్నికల్లోనూ జగన్ గెలవడమే మేలని బిజెపి భావిస్తోంది. ఆ తరువాత వచ్చే 2029 ఎన్నికల సంగతి అప్పుడు చూసుకోవచ్చనేది
ఆ పార్టి వ్యూహంగా కనిపిస్తున్నది.
` కేంద్ర హోంమంత్రి
అమిత్ షా బహిరంగ సభల్లోనూ, బిజెపి రాష్ట్ర
అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి మీడియా సమావేశాల్లోనూ జగన్ ను గట్టిగానే విమర్శించారు.
వాళ్లిద్దరూ పవన్ కళ్యాణ్ తో పొత్తు వుంటుంది అన్నారేగానీ చంద్రబాబుతో పొత్తు వుంటుందని
ఒక్కసారి కూడ అనలేదు. అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తను గట్టెక్కాలంటే కేంద్రంలో అధికారంలోవున్న
బిజెపి సహకారం అవసరం అని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారు. బిజేపితో ఆయన ‘ఒన్ సైడ్
లవ్’లో బాగా లోతుగా మునిగి తేలుతున్నారు. జాతీయ రాజకీయాల్లో ఎన్ డిఏకు వ్యతిరేకంగా
ఏర్పడిన ‘ఇండియా’ కూటమి సరిగ్గా ఈ కారణంగానే చంద్రబాబును దూరంగా పెట్టింది.
ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపిని ఓడించే ఏకైన లక్ష్యంతో
పనిచేసిన పౌరసమాజం ‘ఎద్దేలు కర్ణాటక’ తెలుగులో
‘మేలుకో కర్ణాటక’ అని అర్ధం. ‘ఎద్దేలు కర్ణాటక’ బృదం రెండు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్
లో పర్యటించింది. ఇక్కడి పరిస్థితుల్ని పరిశీలించింది. లోక్ సభ ఎన్నికల్లోనూ బిజెపిని
ఓడించాలనేది ఆ సంస్థ లక్ష్యం. అయితే, ఇక్కడి రాజకీయ పరిస్థితి చాలా సంక్లిష్టంగా గందర
గోళంలో వుంది. లోక్ సభ ఎన్నికల్లో వైసిపి,
టిడిపి, జనసేన, బిజెపి నాలుగు పార్టిల్లో దేనికి ఓటేసినా అవి అంతిమంగా బిజెపి ఖాతాలోనికే
పోతాయనే అభిప్రాయం ఏపిలో కొన్నాళ్ళుగా స్థిరపడిపోయింది.
అందువల్ల, అసెంబ్లీ ఎన్నికల మీద వున్నంత ఆసక్తి ఎవ్వరికీ లోక్ సభ ఎన్నికల మీద లేకుండా
పోయింది. ఏపీలో బిజెపిని ఓడించే ఒక పటిష్ట వ్యూహాన్ని రచించలేక ‘ఎద్దేలు కర్ణాటక’ బృందం వెళ్ళిపోయింది.
దేశ ప్రతిష్టకు సంబంధించిన జి-20 సమావేశాలు జరుగుతుండగా చంద్రబాబు
అరెస్టుకు ముహూర్తం పెట్టారు. అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ, కేంద్ర హోంమంత్రి
అమిత్ షాజీలకు ఎపి ప్రభుత్వం బాబు అరెస్టు గురించి ముందే తెలిపి వుంటుంది. మోదీ, అమిత్ షాలకు అసౌకర్యాన్ని
కలిగించే పనులు ఏవీ జగన్ చేయరు; చేయలేరు. చేస్తారని ఎవరయినా అనుకుంటే అంతకన్నా అమాయకులు
ఎవ్వరూ వుండరు.
చంద్రబాబు అరెస్టు టిడిపికి లాభమా? నష్టమా? అనేదే ఇప్పుడు బిజెపి
పరిశీలిస్తున్న అంశం. టిడిపి బుధవారం పిలుపు
ఇచ్చిన రాష్ట్ర బంద్ కు ఏపిలోని ఏ జిల్లాలోనూ కనీస స్పందన కూడ రాలేదు. తెలుగుదేశం రాజకీయాల కేంద్రంగా భావించే విజయవాడ నగరంలోనూ బంద్
ప్రభావం కనిపించలేదు. వన్ టౌన్ లో వస్త్ర సముదాయం మాత్రం మూసివేశారు. టిడిపి బంద్ ను
ప్రజలు పట్టించుకోకపోవడం వైసిపికికన్నా బిజెపికే ఎక్కువ ఆనందాన్ని ఇచ్చి వుంటుంది.
వాళ్ళు అశిస్తున్నది కూడ ఇదే.
అప్పుడయితే వారు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారుగానీ ఇవ్వాల్టి
పరిస్థితి వేరు. చంద్రబాబు అరెస్టు అయితే ఎన్ డి ఏ నాయకులు స్పందించలేదు; ‘ఇండియా’
నాయకులు పరామర్శించలేదు. రాజకీయంగా ఇప్పుడు చంద్రబాబు ఒంటరివారయ్యారు. రాహుల్ గాంధీ,
మమతా బెనర్జి, అఖిలెష్ యాదవ్ తదితరులు లాంఛనంగా,
ఖండనలు ఇచ్చారు. అలా అనుకుంటే పురందేశ్వరి కూడ అరెస్టును ఖండించారు. అదే పాతరోజులు అయితే, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్
యాదవ్, ఫరూఖ్ అబ్దుల్లా, శరద్ పవార్, సీతారామ్ ఏచూరి ఈ పాటికి విజయవాడలో దిగిపోయేవారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బాగా లేత కనుక చంద్రబాబు అరెస్టు కేసులో జగన్ ను మాత్రమే విమర్శించారు. బాబు అరెస్టు వెనుక
బిజెపి కేంద్ర పెద్దల సహకారం వున్నట్టు ఆయనకు తెలిసినట్టులేదు. సోము వీర్రాజును తప్పించినపుడే
పవన్ కళ్యాణ్ కు ఒక విషయం అర్ధమై వుండాల్సింది; పురందేశ్వరిని పంపింది చంద్రబాబు కాళ్ళ
కింది భూమిని లాగడానికని. ఎపి రాజకీయాల్లో
చంద్రబాబును బలహీనపరచి పవన్ కళ్యాణ్ ను ముందుకు తీసుకుని రావడం ఢిల్లీ బిజెపి ‘డబుల్ ఇంజిన్’ వ్యూహం. బిజెపి స్వంతంగా బలపడలేనప్పుడు పవన్ కళ్యానే వారికి
దిక్కు.
రాజమండ్రి సెంట్రల్ జైలు రాజకీయ ఖైదీల స్పెషల్ విభాగంలో ప్రవేశించాక చంద్రబాబుకు ఏపి కొత్త రాజకీయాల కొత్త
కోణాల గురించి జ్ఞానోదయం అయ్యుంటుంది. తను
బిజెపితో ఒన్ సైడ్ లవ్ సాగించడం ఏపి ప్రజలకు నచ్చడంలేదని వారు తెలుసుకుని వుంటారు.
రాష్ట్ర బంద్ విఫలం కావడానికి అదే ప్రధాన కారణం
అని గుర్తించి వుంటారు. చంద్రబాబు అరెస్టు
తరువాత ఒక్క టిడిపి నాయకుడు కూడ బిజెపి నేతల్ని పల్లెత్తు మాట అనలేదు. ఇప్పటికీ ఎన్డీఏ
శిబిరంలో చేరాలనేది వారి ఆశయంగా కనిపిస్తున్నది. తాను మోదీ ప్రేమలో వున్నానంటూ పదేపదే
చెప్పుకునే రాజకీయ నాయకునితో ‘ఇండీయా’ టీమ్
కు పనేముంటుంది?
జగన్ వైసిపి ఒంటరిగానే రంగంలో దిగుతుంది. ఇండియా టీమ్ లో కాంగ్రెస్,
సిపిఐ, సిపిఎం, ఆప్ వగయిరాలు ఎలాగూ వుంటాయి.
చంద్రబాబుకు బిజెపి ఛాన్స్ ఇవ్వదు కనుక టిడిపి ఇండియాలో చేరుతుంది. పవన్ కళ్యాణ్ బిజెపి ఇచ్చిన రోడ్ మ్యాప్ లో ముందుకుపోతారు.
డానీ
సమాజ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు
మొబైల్ : 9010757776
No comments:
Post a Comment