Saturday, 1 June 2024

Excessive religiosity in the fight for democracy!

 

*ప్రజాస్వామ్య పోరులో మితిమీరిన మమతత్వం!*

డానీ

సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు.

9010757776

 

కార్ల్ మార్క్స్ ఎప్పుడో కమ్యూనిస్టు ప్రణాళిక ప్రవేశికలో వ్యంగ్యంగా అన్నట్టు ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో  భారతీయ జనతా పార్టిని  ‘ముస్లిం భూతం’ వెంటాడుతోంది.

2019 లోక్ సభ ఎన్నికల్ని, బిజెపి, ‘మూడవ పానిపట్టు యుధ్ధం’గా చిత్రించడం మనకు తెలుసు. బిజెపి ఓడిపోతే హిందువులు మరోసారి 250 సంవత్సరాలు రాజ్యాధికారానికి దూరమైపోతారని అమిత్ షా ఓటర్లను భయపెట్టేవారు. సాక్షాత్తు ప్రధాని మోదీజీ ఉత్తరప్రదేశ్  ఎన్నికల్ని ఔరంగ జేబ్, శివాజి మహారాజ్ మధ్య పోరాటంగా ప్రచారం చేశారు. గత ఏడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్ కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని బిజెపి నేతలు అడిగారు.  ఇప్పుడు ఆ హద్దుల్ని కూడ వారు దాటేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో  ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల ద్వయం ప్రతిరోజు ప్రతి ప్రసంగాన్ని ముస్లింల చుట్టూ తిప్పుతున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధానాంశం ముస్లింలు అంటే అతిశయోక్తికాదు.

ఈ ఏడాది జనవరి 22న అయోధ్యలో రామమందిరానికి ప్రాణప్రతిష్ట చేసిన తరువాత బిజెపి గొప్ప ఆత్మ విశ్వాసంతో కనిపించింది.  “ఈసారి 400 సీట్లు దాటుతాం” (అబ్ కి బార్ చార్ సౌ పార్) నినాదాన్ని  ముందుకు తెచ్చింది. అయితే, ఏప్రిల్ 19న మొదటి దశ పోలింగ్ ముగిసిన తరువాత బిజెపి నమ్మకం సడలింది. మీడియాలో అంతా బిజెపి మయంగా సాగిపోతున్న ఎన్నికల ప్రచారం హఠాత్తుగా మందగించింది.  

అంతవరకు విపక్షాలను భయపెడుతున్నట్టు కనిపించిన ప్రధాని నరేంద్ర మోదీజీ  ఆ తరువాత తానే భయపడుతున్నట్టు కనిపిస్తున్నారు. వారిని సావర్కర్, హెగ్డేవార్, గోల్వార్కర్, దీన్ దయాళ్ పూర్తిగా ఆవహించేశారు.

దేశంలో పేదరికాన్ని పారద్రోలడంలో, నిరుద్యోగాన్నీ నిర్మూలించడంలో, సామాన్య ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడంలో  తాము చేసిన కృషిని చెప్పుకోవడానికి ప్రధాని దగ్గర సరుకు లేకపోయింది. కాంగ్రెస్ ‘ముస్లింలీగ్’ పార్టి అయిపోయిందనీ, దేశంలో ఇక హిందువుల్ని రక్షించే ఏకైక పార్టి బిజెపి అనే ప్రచారాన్ని వుధృతం చేశారు.

ఎనభై శాతంకన్నా ఎక్కువగావున్న హిందూ జనాభాకు పధ్నాలుగు శాతం కూడ లేని ముస్లిం జనాభాతో ముప్పు వుందంటే ఎలిమెంటరీ స్కూలు స్థాయి లెఖ్ఖలు తెలిసినవారు కూడ నవ్వుతారు. కానీ, ప్రధాని మోదీజీ మాత్రం ఈ అంశాన్నే లోక్ సభ ఎన్నికల ప్రధాన ప్రచారాస్త్రంగా మార్చారు. భారత (హిందూ) ప్రజల ఆస్తుల్ని కాంగ్రెస్ లాక్కొని దేశంలో ఎక్కువ మంది ముస్లింలకు పంచిపెట్టబోతోందని వారు ఒక విచిత్రమైన ప్రచారాన్ని మొదలెట్టారు.

ఇక్కడ ఎవరికయినా సరే సులువుగా అర్ధం అయ్యే విషయం ఏమంటే మోదీజీ భయపడుతున్నది ముస్లిం ఓటర్లను చూసికాదు; హిందూ సమాజంలో అత్యధికులకు తనను ఈసడించుకుంటున్నట్లు మోదీజీకి అర్ధం అయిపోయింది. హిందూ ఓటు బ్యాంకులో సగాన్నయినా తనకు అనుకూలంగా సమీకరించుకోవాలని వారు అనేక జిమ్మిక్కులు చేస్తున్నారు. అబధ్ధాలు చెప్పడానికి కూడ జంకడంలేదు.  

రెండో దశ పోలింగ్ (ఏప్రిల్ 26) తరువాత ప్రధాని భయం మరింత పెరిగినట్టు కనిపిస్తున్నది.   కులాల భూమిగా పేరు మోసిన బీహార్ లోని ఈస్ట్ చంపారన్ జిల్లాలో మాట్లాడుతూ ఇండి కూటమి (కాంగ్రెస్) అధికారం లోనికి వస్తే ఎస్టి, ఎస్సి, ఓబిసిల రిజర్వేషన్లను లాక్కొని ‘జిహాదీ’లకు ఇస్తారని భయపెడుతూ బలహీనవర్గాల మధ్య కులమత ఘర్షణను రేపడానికి కూడ వారు వెనుకాడలేదు. 

‘కాంగ్రెస్ యువరాజు రాహుల్ మాట్లాడిన ఒక వీడియోను నేను చూశాను. అది పన్నెండేళ్ల క్రితంది. ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఆయన ఆ వీడియోలో అన్నారు. దేశ వనరుల్లో ముస్లింలకు తొలి హక్కు ఉంటుందని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ముస్లింలీగ్ బాటలో నడుస్తున్న మతతత్వ పార్టీ“ అని ప్రధాని నరేంద్ర మోదీజీ పశ్చిమ బెంగాల్‌లోని ఝర్ గ్రామ్ లో మే 20న జరిగిన ఎన్నికల సభలో ఆరోపించారు.

            ప్రధానిగానీ అమిత్ షాగానీ  టోపీవాలే అన్నా, చొరబాటుదార్లు (ఘూస్ పైఠియే) అన్నా, ఎక్కువమంది పిల్లల్నికనేవారు అన్నా, మదరసా, ముల్లా, మాఫియా అన్నా’  వారు ముస్లింల గురించి మాట్లాడుతున్నారు అనుకోవాలి. ఈ మాటలు లేకుండా వారు ఏ సభలోనూ మాట్లాడడంలేరు. 

అయోధ్యలో తాను నిర్మించిన  ‘మోదీ రామమందిరం’కు ఇండీ కూటమి ‘బాబర్ తాళం” వేస్తుందని వారు కొత్త ఆందోళన మొదలెట్టారు. వారు అంతటితో ఆగడంలేదు. మే 17న ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకీలో ప్రసంగిస్తూ ఇండియా కూటమి బుల్ డోజర్లతో రామమందిరాన్ని కూల్చి వేస్తుందన్నారు. ఎవరయినా సరే బుల్ డోజర్లను ఎక్కడ? ఎలా? వాడాలో  యోగి ఆదిత్యనాథ్ దగ్గర “ట్యూషన్’’ చెప్పించుకోవాలని విపక్షాలకు సూచించారు. శృతి మించిన ప్రధాని ప్రచారం ఆయన ప్రత్యర్ధులకేకాదు; ఆయనతో కొనసాగుతున్న కూటమి సభ్య పార్టీలకు కూడ మింగుడుపడడంలేదు.

పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారితీస్తుందని రసాయన, భౌతిక శాస్త్రాల్లోనేగాక తత్వశాస్త్రం, సమాజశాస్త్రంలోనూ ఒక సూత్రం వుంటుంది. హిందూత్వను ఆరంభించింది దామోదర్ వినాయక్  సావర్కర్ కావచ్చు. ఆ పిదప హెగ్దేవార్, గోల్వార్కర్, దీన్ దయాళ్ వేసిన హిందూత్వ మెట్ల మీద  లాల్ కిషన్ అడవాణి అనేక అడుగులు ముందుకు నడిచారు. 

  ‘గుజరాత్ గాయం’గా ప్రసిధ్ధి చెందిన 2002 నాటి అల్లర్లకు అనేక కారణాలున్నాయి. ఆర్ధికంగా ఎదుగుతున్న ముస్లిం వాణిజ్య సముదాయాన్ని అదుపు చేయడం కూడ వాటిల్లో  ఒక ప్రధాన కారణం.  ఈ మత ఆర్ధిక విధానం పునాది మీదనే నరేంద్ర మోదీజీ రాజప్రసాద నిర్మాణం జరిగింది. ముస్లింల ఆర్ధిక మూలాల్ని వాణిజ్య సముదాయాల్ని  బాహాటంగా  బుల్ డోజర్లతో కూల్చివేసే విధానాన్ని ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ ప్రవేషపెట్టారు.  

“చూడు. పూర్తిగా చంద్రముఖిగా మారిపోయిన నీ భార్య గంగను చూడు” అంటూ ‘చంద్రముఖి’ సినిమా క్లైమాక్స్ లో రజినీకాంత్ డైలాగ్ ఒకటి వుంటుంది. ఇప్పుడు మోదీ అలా  సంపూర్ణ ‘హిందూత్వ’గా మారారు.

తమ ఆర్ధిక ప్రయోజనాలను నెరవేర్చిపెట్టేందుకు అనువైన పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాన్ని పెట్టుబడీదారులు రూపొందించుకున్నారని మార్క్స్ అన్నాడు. ప్రాయోజిత పార్లమెంటరీ వ్యవస్థలో కార్పొరేట్లు తమ మీడియా సంస్థల ద్వార రాజకీయ ఆమోదాంశాన్ని ఉత్పత్తి చేస్తున్నారని (Manufacturing Consent)  ఎడ్వర్డ్ హెర్మన్, నోవమ్ చోమ్స్కిలు మూడున్నర  దశాబ్దాల క్రితమే హెచ్చరించారు.

ఇప్పుడు రాజ్యాధికారం అనేది మార్కెట్లో ధర పెట్టి కొనుక్కునే  సరుకుగా మారిపోయింది.  బహిరంగ మార్కెట్లో ఓటుకో రేటు వచ్చింది. మంచి గిరాకీ పెరిగింది. కనీసం వెయ్యి రూపాయల నుండి ప్రతిష్ఠాత్మక నియోజకవర్గాల్లో 5 వేల రూపాయల వరకు ఓటు ధర పెరిగింది. ఓట్ల కొనుగోలులో రాజకీయ పార్టీలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఈసారి ఎన్నికల్లో దాదాపు లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు  పేరున్న సర్వే సంస్థలు అంచన వేసి ప్రకటించాయి.

మన దేశంలో విద్వేష రాజకీయాలకు తావులేకుండా, అందరికీ సమాన అవకాశాలిస్తూ, స్వేఛ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడడం కోసం ఎన్నికల కమీషన్ అనేది ఒకటుంటుందని ఈసారి చాలామంది మరచిపోయారు. ఆ తప్పు ఓటర్లదేమీకాదు; ఎన్నికల కమీషన్ దే.

ఈసారి ఏడు దశలుగా సాగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఐదు దశలు దాటిపోయాక తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎన్నికల కమీషన్ కు వచ్చింది. అప్పటి వరకు గాఢ నిద్రలోవున్న రాజ్యాంగ వ్యవస్థకు మే 22న హటాత్తుగా మెలుకువ వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్పార్టీలు  తమ తమ స్టార్క్యాంపెయినర్ల ప్రసంగాల్లో కనీస మర్యాద పాటించేలా చూడాలని కమిషన్కోరింది. ‘ముస్లింలీగ్‌’, ‘శక్తివంటి పదాల వాడకం మీద  అభ్యంతరం తెలిపింది. కులం, మతం, జాతి, భాషలపై రెచ్చగొట్టే ప్రసంగాలు వద్దనీ, ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచవద్దని హితవు పలికింది.  

నిజానికి ఎన్నికల కమీషన్ కు అపారమైన అధికారాలున్నాయి. ఈసారి ఎన్నికల ప్రచారంలో నియమ నిబంధనల్ని కేంద్రంలోని అధికార పార్టియే ఎక్కువగా అతిక్రమించింది. కానీ, అధికార పార్టి ద్వార ఏర్పడిన ఇప్పటి ఎన్నికల కమీషన్ కు అధికారపార్టి మీద  కొరడాను  ఝళిపించే శక్తి వుంటుందని ఆశించడం తప్పు. ఆ రెండు రోజులు గడవక ముందే అమిత్ షా మరోసారి మదరసా, ముల్లా, మాఫియా అన్నారు.

ఈసారి ఎన్నికల్లో చెప్పుకోదగిన పరిణామం ఏమంటే ఓటర్లు బాహాటంగా డబ్బులు తీసుకున్నారు. ప్రధాన పోటీదారులు అందరి దగ్గరా డబ్బులు తీసుకున్నారు. డబ్బులు తీసుకున్నాక ఒటేయక తప్పదు కనుక  చీకటిపడుతున్నాసరే క్యూల్లో నిలబడి విధిగా ఓట్లు వేశారు. ఈ కిటుకు తెలియనివాళ్ళు ఓటింగ్ శాతం పెరిగిందని మహా ఆశ్చర్యపోతున్నారు!.

కార్పొరేట్ల ఆలోచనా తీరులోనూ మార్పులు వస్తున్నట్టు ఈ ఎన్నికలు కొన్ని తొలి సంకేతాలు ఇచ్చాయి. మెగా కార్పొరేట్ సంస్థలు తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం కొన్నేళ్ళుగా మత రాజకీయ పార్టీలను ప్రోత్సహిస్తున్నాయని అందరికీ తెలెసు. కానీ, మతోన్మాదం శృతిమించి సమాజంలో అశాంతి నెలకొంటే మార్కెట్ మందగిస్తుంది.  అది మెగా కార్పొరేట్ల  ఆర్ధిక ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. అప్పుడవి బిజెపి రాజకీయాలను కూడ వ్యతిరేకిస్తాయి. అలాంటి సూచనలు ఇప్పుడు కొన్ని కనిపిస్తున్నాయి. “షెహజాదే ఆజ్ కల్ అంబానీకా నామ్ నహీ లే రహే హై. దాల్ మే కుచ్ కాలా హై” అని దేశ ప్రధాని అంటున్నారంటే కార్పొరేట్  వాతావరణం మారుతోందని అర్ధం అనుకోవచ్చు.!

24 మే 2024  

No comments:

Post a Comment