మాతృభాష ఒక ఆర్గానిక్ అనుబంధం
Mother tongue is an organic attachment
ఎవరికైనాసరే మాతృభాష అంటే ప్రత్యేక ప్రేమ. మాతృభాషలో మాట్లాడే వాళ్ళ మీద ఒకరకమైన ఆర్గానిక్ అనుబంధం కలుగుతుంది. ప్రతి మనిషికీ తల్లి నుండి మాతృభాష అబ్బుతుంది. మన ప్రాధమిక అనుభవాలు, ఉద్వేగాలు అన్నీ మాతృభాషలోనే మొదలవుతాయి. ప్రపంచాన్ని మనం ముందు మాతృభాషలోనే తెలుసుకుంటాము. సమాజంలోని మంచిచెడులు కూడ మాతృభాషలోనే పరిచయం అవుతాయి.
భాషా మైనారిటీల జీవితాల్లో మాతృభాష తరువాత ప్రాంతీయ భాషలు, బతుకుతెరువు భాషలు ప్రవేశిస్తాయి. క్రమంగా అవే వాళ్ళ మీద ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటాయి. క్రమంగా వాళ్ళు మరో సంస్కృతి లోనికి మారిపోతుంటారు. అలాగని బతుకు తెరువు భాషల్ని ఎవ్వరూ నిరాకరించలేరు. సౌకర్యంగా బతకాలంటే బతుకుతెరువు భాషను స్వీకరించాల్సిందే.
ఒక ప్రాంతంలో నివశించేవారు ఒకే భాషను మాట్లాడాలని వాదించేవారు ఇటీవలి కాలంలో పెరిగారు. ప్రాదేశిక భాష అన్నమాట. టెర్రిటోరియల్ లాంగ్వేజ్ అన్నమాట. మెజారిటీ జనుల మాతృభాషను మిగిలినవారు సహితం మాతృభాషగా స్వీకరించాలనేది ఇందులోవున్న పరమార్ధం. ఒక రాష్ట్రపు అధికార భాషనే అందరూ తమ మాతృభాషగా చేసుకోవాలనే ఆదేశాలూ ఇందులో వున్నాయి. ఇదే నియమాన్ని హిందీకి అన్వయించాలను ఉవ్విళ్ళూరుతున్నవారు కేంద్రంలో అధికారంలో వున్నారు.
ఇలాంటి భాషావాదులు సహజంగా ఛాందసులో, ఆధిపత్యవాదులో అయ్యుంటారని మనం సాధారణంగా అనుకుంటుంటాం. కమ్యూనిస్టులు, మార్క్సిస్టు-లెనినిస్టుల్లో కొందరు సహితం ప్రాదేశిక భాషావాదాన్ని నెత్తిన పెట్టుకుని మోస్తున్నారు. వీరి పుణ్యాన మాతృభాషా దినోత్సవాలు కాస్తా అధికారిక భాషా దినోత్సవాలుగా మారిపోతున్నాయి.
నా మాతృభాష ఉర్దు. ప్రాదేశిక భాష తెలుగు. పొట్టకూటి భాష ఇంగ్లీషు.
ఆఫ్రికా ఖండపు మూలవాసులు బాడి పేయింటింగుగా నల్ల గోరింటాకును వాడతారట. నల్లగా వుండేవారికి నలుపు రంగు ఏమిటీ? అని ఎవరికైనా అనిపించవచ్చు. వాళ్ళకు ఇష్టమైన రంగు నలుపు. బ్రిటీష్ వాడు రాకముందు భారతదేశంలోనూ నలుపే పెద్ద ఆకర్షణ. భాగవతం ప్రకారం ‘నల్లవాడు’ అనిపించుకున్న శ్రీకృష్ణుడి వెంట పదహారు వేలమంది గోపికలు పడ్డారట. అలాగే భారతంలో ఎంతో మంది ఇష్టపడిన ద్రౌపది కూడ నలుపు. అందమంటే తెలుపు అనీ, జ్ఞానం అంటే ఇంగ్లీషు అని మన బుర్రల్లో బ్రిటీషు పాలకులు గట్టిగా జొప్పించారు. ఇప్పుడూ అదే సాంప్రదాయం నడుస్తున్నది.
నాది నరసాపురం ఉర్దు. మాటవున్న ప్రతివాడికి ఒక యాస వుంటుంది. మా ఉర్దూ మ్యూజికల్ నోట్ అచ్చంగా తెలుగు మ్యూజికల్ నోట్ లా వుంటుంది. “ఏరా ఎక్కడికి వెళ్ళావూ?” అని తెలుగు అంటే “క్యారే కా గయా?” అని నరసాపురం ఉర్దులో అంటారు. అయితే, ఇది గుంటూరుజిల్లా ఉర్దూకు ఎక్కువ; దహఖనీ ఉర్దూకు తక్కువ. దహఖనీ ఉర్దూ అంటే నిజాం ఉర్దు. ఇప్పుడు దాన్ని హైదరాబాదీ ఉర్దూ అంటున్నారు. ఉర్దూ చదువుకున్న కుటుంబాల్లో సహజంగానే ఎంతో కొంత ‘షేర్ షాయరీ’ వుంటుంది. మా అమ్మమ్మ కాలంలో మా ఇళ్ళలోనూ ఆ సంస్కృతి కొంచెం వుండేది.
ఓ నలభై యేళ్ళ క్రితం నిజామాబాద్ లో ఒక రిక్షావాడితో బేరం ఆడుతున్నాను. “జో హమ్ మాంగా వో మునాసిబ్ హై సాబ్” అన్నాడు అతను. మునాసిబ్ పదం వినగానే నేను షాక్ అయ్యాను. అది అతనికి మామూలు విషయం కావచ్చు. రిక్షావాళ్ళు అంతే ఇవ్వాలి ఇంతే ఇవ్వాలి లేకపోతే కుదరదు అంటారుగానీ ఇది సమంజసం, సరసమైన ధర అనగా నేను వినలేదు. హైదరాబాద్ పాతబస్తీలో రిక్షావాళ్ళు సహితం షేర్ షాయరీ చెపుతారట. మగ్దూం మొహియుద్దీన్ షాయరీలు సైతం వాళ్ళకు తెలుసట. 1970ల ఆరభంలో నేను హైదరాబాద్ లో ఓ ఉద్యోగం కోసం వెళ్ళినపుడు అక్కడి ముస్లింలు, మా బంధువులు కూడ నా ఉర్దూను అవహేళన చేసేవారు. నేను రిక్షావాళ్ళతో సంభాషించి నా ఉర్దూను మెరుగు పరచుకునేవాడిని.
మనం వుండే ప్రాంతాలు, మన చుట్టూ వుండే సమూహాలు మారిపోయాక మనం మాట్లాడే భాష కూడ మారిపోతుంటుంది. నరసాపురంలో నేను ఎక్కువగా ముస్లిమేతర సమూహాలతో వున్నాను. అలా నా తెలుగు కొంచెం మెరుగుపడింది. ఆ మేరకు ఉర్దూ వెనుక పడింది. విజయవాడకు మారాక ఖండేల్ వాల్ జైనులతో పనిచేశాను. ఆ సమయంలో హిందీ మెరుగుపడింది. ఆటోమోబైల్ రంగంలో చేరాక ఢిల్లీ ఒరిస్సా బీహార్ బెంగాల్లో ఇంగ్లీషు మెరుగుపడింది. ప్రస్తుతం నా చుట్టూ తెలుగులో మాట్లాడేవారు మాత్రమే వున్నారు. ఆ మేరకు ఇంగ్లీషు, హిందీ ఉర్దూ కూడా రోజువారీ జీవితంలో లేకుండాపోయాయి.
ఎప్పుడయినా ఉర్దూ మాట్లాడేవారు తారస పడితే ఒక ఆర్గానిక్ ఆనందం కలుగుతుంది. మిగిలిన వాద్యాలకన్నా డప్పు, తబలా, మృదంగాల శబ్దాలకు మన చెవులేగాక మన శరీరం కూడ స్పందిస్తుంది. ఎందుకంటే వాటిని తోలుతో తయారు చేస్తారు కనుక. అదొక ఆర్గానిక్ అనుబంధం.
గతవారం హైదరాబాద్ లో మా మేనల్లుడు కాకాని సతీష్ బర్త్ డే పార్టికి పిలిచాడు. కొత్త జెనరేషన్ ఆలోచనలు తెలుసుకోవడానికి ఇలాంటి పార్టిలు తోడ్పడతాయి.
అక్కడ ధీర అనే ఒకామె పరిచయం అయ్యింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది. ముందు మేము కొంతసేపు అకడమిక్ విషయాలు మాట్లాడుకున్నాము. అంతవరకు బాగానే వుండింది గానీ “మీకు షేర్ షాయరీ వచ్చా” అని ఆమె హఠాత్తుగా అడిగింది. “ఉర్దూ భాషే నన్ను వదిలి వెళ్ళిపోయింది; ఇంకా షేర్ షాయరీ కూడానా?” అన్నాను. “నాకు వచ్చు” అంది.
ఆ తరువాత మా సంభాషణ ఇంగ్లీషు నుండి ఉర్దూలోనికి మారింది. నా స్థానం వక్త నుండి శ్రోతగా మారింది. ఒక ముస్లిమేతర అమ్మాయి అంత ధారాళంగా ఉర్దూలో షేర్ షాయరీ వినిపిస్తుంటే ఒక ఆర్గానిక్ అభిమానం కలిగింది. ఆమె ఆరేడు షాయరీలు ఆలపించింది. హమ్ భీ కుచ్ కమ్ నహీ అంటూ ఓ రెండు షాయరీలు వినిపించాలనుకున్నాను. గతంలో బహాదూర్ షా జాఫర్, గాలిబ్, అల్లమా ఇక్బాల్, ఫైజ్ ల షాయరీలను కొంత చదివాను. ఒక్కటీ గుర్తుకు రాలేదు. ఏం చేస్తాం?. నిస్సహాయంగా వహ్వా అంటూ వుండిపోయాను.
No comments:
Post a Comment