Thursday 13 June 2024

Preamble is the Backbone of Indian Constitution

 *భారత రాజ్యాంగానికి వెన్నెముక ‘పీఠిక’*    


భారతదేశానికేకాక భారత రాజ్యాంగానికి కూడ ఒక ప్రత్యేకత వుంది. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశం భారతదేశం అయితే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం కూడ భారత దేశానిదే.  


          గతంలో న్యాయమూర్తులు, అడ్వకేట్లు, కొందరు అకడమిషియన్లు, కొందరు సామాజిక కార్యకర్తలు తప్ప ఇతరులెవ్వరికీ రాజ్యాంగం గురించి తెలిసేది కాదు. ఆ అవసరమూ వుండేదికాదు. ఇప్పుడు అలాకాదు. సామాన్యులకు సహితం రాజ్యాంగం మీద ఎంతోకొంత అవగాహన వుంటోంది. 


ఈసారి చంద్రబాబుతో జతకట్టిన మోదీజీ వెంటనే జగన్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఈమధ్య చాలా గట్టిగా వినిపిస్తున్నది.  బిల్లులు చట్టాలు కావడానికి  లోక్ సభలో మెజారిటీవుంటే సరిపోదు రాజ్యసభలోనూ మెజారిటీ మద్దతు కావాలి. బిజెపికి లోక్ సభలో మెజారిటీవున్నా రాజ్యసభలో ఇప్పటికీ మెజారిటీ లేదు.  కనుక, మద్దతు కోసం  వైయస్ జగన్ అరెస్టును వాయిదా వేస్తది. రాజ్యసభలో బిజెపికి మెజారిటి వచ్చిన మరుక్షణం జగన్ కు మోదీ, అమిత్ షాలు సినిమా చూపిస్తారని గ్రామాల్లో రచ్చబండ మీద మాట్లాడుకోవడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు పాఠ్యపుస్తకాల నుండి పల్లెటూర్ల వరకు రాజ్యాంగం నిత్యావసర సరుకుగా మారింది. 


          బిజెపి మూడోసారి అధికారానికి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అనే వాదనను ఇటీవలి ఎన్నికల ప్రచారంలో విపక్షాలు బలంగా ముందుకు తెచ్చాయి. అందుకు విరుధ్ధమైన వాదనలూ వినిపించాయి. రాజ్యాంగాన్ని మార్చడం అంత సులువైన వ్యవహారంకాదు. అది ఒక సుదీర్ఘ ప్రక్రియ. పార్లమెంటు వుభయ సభల్లో భారీ సంఖ్యాబలం కూడ కావాలి.  రాజ్యాంగంలోని కొన్ని అధీకరణలకు సవరణలు చేయవచ్చు. అలా ఇప్పటివరకు 106 సార్లు సవరించారు.   అయితే,  రాజ్యాంగ పీఠికను సవరించడం అంత సులువా? అంటే కష్టమే అనుకోవాల్సి వుంటుంది. 


భారత రాజ్యాంగానికి ప్రాణం, వెన్నెముక, కళ్ళు, మెదడు అన్నీ దాని పీఠికే. భారతదేశాన్ని ‘సర్వసత్తాక సామ్యవాద, మతసామరస్య, ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మన రాజ్యాంగ పీఠిక పేర్కొంటోంది. 1949 నవంబరు 26న ఆమోదించిన రాజ్యాంగ పీఠికలో ‘సర్వసత్తాక ప్రజాస్వామిక రిపబ్లిక్’ అని మాత్రమే వుందన్నది వాస్తవం.   ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాలు మొదట్లో లేవు; ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కాలంలో 1976 డిసెంబరు 18న 42వ రాజ్యాంగ సవరణ ద్వార ‘సామ్యవాద, మతసామరస్య’ స్వభావాన్ని అడ్దంగా చేర్చారనే వాదనను బిజెపి చాలా కాలంగా చేస్తోంది. 


తాము ఇక్కడవున్నది రాజ్యాంగాన్ని మార్చడానికే అని చెప్పిన నాయకులూ ఆ పార్టీలో కొందరున్నారు. దీనికి విరుధ్ధమైన వాదన కూడ బలంగానే వుంది. ప్రజాస్వామ్యానికి విస్తృత అర్ధమే ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలని గట్టిగా వాదిస్తున్నవారూ వున్నారు. రాజ్యాంగం ద్వార దేశ ప్రజలు ‘తమకుతాము’ ఇచ్చుకున్న హామీల్లో, న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావం వున్నాయి. వీటిల్లోనూ అంతర్లీనంగా ‘సామ్యవాద, మతసామరస్య’ భావనలున్నాయి. 


“న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు” ఏమాత్రం భారత సాంప్రదాయం కాదనీ వాటిని బయటి దేశాల నుండి అరువు తెచ్చి రాజ్యాంగంలో బలవంతంగా జొప్పించారని అప్పట్లోనే ఆరెస్సెస్ వంటి సంస్థలు గట్టిగానే విమర్శించాయి. వాటికన్నా మనుస్మృతియే మన సమాజానికి సరిగ్గా సరిపోతుందని బలంగా వాదించాయి.


“న్యాయం, స్వేఛ్ఛ, సమానత్వం, సోదరభావాలు” ఎక్కడి నుండి వచ్చాయి? వాటిని రాజ్యాంగంలో ఎవరు పెట్టారూ? అనే విషయంలోనూ భిన్నాభిప్రాయాలున్నాయి. 


1789 నాటి ఫ్రెంచ్ విప్లవంలో ఈ నినాదాలు మార్మోగాయి. అయితే తాను బుధ్ధుని బోధనల నుండి ఈ నాలుగు ఆదర్శాలను స్వీకరించినట్టు గొప్ప దార్శినికులు, భారత రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులు  బిఆర్ అంబేడ్కర్ ఓ సందర్భంలో పేర్కొన్నారు. ఫ్రెంచ్ విప్లవ నినాదాలను జవహర్ లాల్ నెహ్రు సహితం విపరీతంగా అభిమానించేవారు.  


రెండవ ప్రపంచ యుధ్ధం ముగిశాక, బ్రిటీష్ ఇండియాకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వడానికి బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. బ్రిటీష్ ఇండియాను స్వతంత్ర ఇండియాగా మార్చే ప్రక్రియను సజావుగా సాగించడానికి 1946 సెప్టెంబరు 2న భారత తాత్కాలిక ప్రభుత్వం (Provisional Government of India) ఏర్పడింది. అదే రాజ్యాంగ సభగానూ పనిచేసింది. 


భారత తాత్కాలిక ప్రభుత్వానికి అధినేతగా వుండిన జవహర్ లాల్ నెహ్రు 1946 డిసెంబరు 13న  రాజ్యాంగ లక్ష్యాల తీర్మానాన్ని (Objectives Resolution) ప్రవేశపెట్టారు.  దాన్ని 1947 జనవరి 22న రాజ్యాంగ సభ ఆమోదించింది. ఈ తీర్మానంలోనే న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావాలు అనే ఆదర్శాలు చాలా వివరంగా వున్నాయి.  


పౌరసత్వ సవరణ చట్టానికి  (సిఏఏ) వ్యతిరేకంగా 2019 చివర్లో ఢిల్లీ శివార్లలోని షాహీన్ బాగ్ లో ఉద్యమం ఆరంభమయినప్పుడు భారత రాజ్యాంగమే ఆధునిక ‘మతగ్రంధం’గా మారిపోయింది. ఆందోళనకారులైన ముస్లిం మహిళలు ఒక చేత్తో మువ్వన్నెల జాతీయ జెండాను పట్టుకుని మరో చేతిలో భారత రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకుని, ఒళ్ళో గాంధీజీ, అంబేడ్కర్ ల ఫొటోలు పెట్టుకుని “న్యాయం, స్వేఛ్ఛా, సమానత్వం, సోదరభావం” అంటూ నినదించారు.  వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేకంగా  ఆరంభమయిన రైతుల చారిత్రాత్మక ఆందోళన కూడ షాహీన్ బాగ్ నుండి స్పూర్తిపొంది రాజ్యాంగాన్ని గుండెలకు హత్తుకుంది. 


  ‘భారత రాజ్యాంగ పీఠిక’ చారిత్రక ప్రాధాన్యాన్నీ, ప్రాసంగికతను గుర్తించి ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఓ పుస్తకాన్ని రాశారు. రాజ్యాంగానికి సంబంధించిన అనేక  పార్శ్వాలను 18 పర్వాల్లో  ఇందులో ఆవిష్కరించారు. 


భారత రాజ్యాంగం మీద రాయడానికి సరైన ఛాయిస్ మాడభూషి శ్రీధర్ అయితే, ఈ పుస్తకాన్ని ప్రచురించడానికి కూడా సరైన ఛాయిస్ సాహితీ మిత్రులు విజయవాడ ‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావు. పుస్తకాల ప్రచురణలో తనకు ఒక రోడ్ మ్యాప్ వుంది. 


మేధోరంగంలో ఎప్పుడూ ఏదో ఒక అంశం ప్రధాన చర్చగా మారుతుంటుంది. అదేమిటో తెలుసుకోవడానికి ఒక షార్ట్ కట్ వుంది; విశ్వేశ్వరరావు కొత్తగా ప్రచురించిన పుస్తకాన్ని చదవడం.  తను ప్రచురించే పుస్తకాలను జాగ్రత్తగా గమనిస్తే తెలుగు రాజకీయ సామాజిక రంగాల పరిణామ క్రమం అర్ధం అవుతుంది.  అతని ప్రచురణలు  సోషల్ బారోమీటర్స్.  


(‘భారత రాజ్యాంగ పీఠిక’ పుస్తకాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జూన్ 15 శనివారం సాయంత్రం జస్టిస్ బి సుదర్శన రెడ్డి ఆవిష్కరిస్తున్నారు) 

12-06-2024

ప్రచురణ 

ఆంధ్రజ్యోతి దినపత్రిక, 14-06-2924

https://www.andhrajyothy.com/2024/editorial/the-backbone-of-the-constitution-is-the-pitihika-1267899.html


No comments:

Post a Comment