Friday, 4 June 2021

‘Kara’ Master is the most exciting ‘story’ teller among our predecessors

 ‘Kara’ Master is the most exciting ‘story’ teller among our predecessors

 మా తరానికి ఉత్తేజపూరిత ‘కథా’నాయకుడు ‘కారా’ మాస్టారు.

ఉషా ఎస్ డానీ

 

లోకంలో గొప్పవాళ్ళు చాలామంది వుంటారు. కొత్తతరాల్ని ప్రోత్సహించేవాళ్ళు గొప్పవాళ్ళలో గొప్పవాళ్ళు. వారు మహాత్ములు. అలాంటి అరుదైన వారిలో కాళీపట్నం రామారావు ఒకరు.  వారు చనిపోయాయారు అనగానే 37 ఏళ్ళ  నాటి ఓ సంఘటన గుర్తుకు వచ్చింది.

విప్లవ రచయితల సంఘం 1984 ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మూడు రోజులపాటు విశాఖపట్నంలో ఒక కథా  వర్క్ షాప్ నిర్వహించింది. రావి శాస్త్రి, భూషణం, అల్లం రాజయ్య, సివి సుబ్బారావు  టీచర్లు. కాళీపట్నం రామారావుగారు ఆ కథా  వర్క్ షాప్ కు ప్రిన్స్ పాల్. 

వర్క్ షాప్ కు స్టూడెంట్స్‍ ను ఎంపిక చేయడానికి కారా మాస్టారు ఒక ఎంట్రెన్స్ టెస్ట్ పెట్టారు. 1. మీరు కథలు ఎందుకు రాయాలనుకుంటున్నారూ? 2. ఎలాంటి కథలు రాయాలనుకుంటున్నారూ? 3. కథలు రాయడంలో మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటీ? అని మూడు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాసి పంపాలని అడిగారు. 

“ఆకలంత సహజంగా అన్నమంత అవసరంగా నా జీవితంలోనికి కథలు వచ్చాయి” అంటూ సమాధానం మొదలెట్టాను.  

నా తొమ్మిదవ ఏట ‘సినిమా కష్టాలన్నీ’  మా కుటుంబం లోనికి వచ్చాయి.  మానాన్న కొంచెం పేరూ డబ్బూ వున్న కుటుంబంలో పుట్టాడు. మాకున్న లాంచీ వరదలో కొట్టుకుపోయింది. మాకో టైర్ రీ-ట్రేడింగ్ వర్క్స్ షాప్ వుండేది. బస్సుల జాతియీకరణతో అది మూతపడి పోయింది. అది చాలనట్టు కార్ఖానాలో అగ్ని ప్రమాదం జరిగింది. సైకిల్ షాపు పెడితే అదీ నడవలేదు. కుటుంబం అప్పులపాలయింది. అప్పులోళ్ళ వత్తిడిని తట్టుకోలేక మానాన్న ముఖం చాటేసి ఊరి వదిలి ఢిల్లీ - లూధియాన వెళ్ళిపోయారు. అప్పులవాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇంట్లోవున్న బంగారం, వెండి పళ్ళేలు, గ్రామ్ ఫోన్, పందిరిమంచం, రంగూను భోషాణం, టేబుల్ కుర్చీలు అమ్మి  మా అమ్మ అప్పుల్ని చాలా వరకు తీర్చి,  ఇంటిని వేలం వేయకుండ కాపాడింది. 

మేము నలుగురం. అమ్మా, నేను, తమ్ముడు, చెల్లెలు. మా అమ్మ చాలా మొండిది. తెల్లవారగట్ల నమాజ్ కోసం నాలుగున్నరకు లేచేది. నన్నూ లేపి తనతోపాటు నమాజ్ చదివించేది. ఆ తరువాత నన్ను చదువుకోమని చెప్పి, తను పాత న్యూస్ పేపర్లతో కిరాణా దుకాణాల కోసం కాగితపు సంచులు తయారు చేసేది. సూర్యోదయానికి ముందే లేవడం మూలంగ నాకు సూర్యాస్తమ సమయానికి నిద్ర వచ్చేసేది. ఒక్కోసారి అర్ధరాత్రి మెలుకువ వచ్చి చూస్తే హరికెన్ లాంతరు పెట్టుకుని తను కాగితపు  సంచులు చేస్తూ వుండేది. ఇంతగా కష్టపడినా రోజుకు రెండు మూడు రూపాయలకు మించి వచ్చేదికాదు.  తను పడే కష్టం చూడలేక ఒకరోజు నేను “నన్ను ఎక్కడయినా పనికి పెట్టు. చదువు మానేస్తాను” అన్నాను. “అలాంటి ఆలోచనలు చేయకు. నువ్వు బాగా చదవాలి. ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడాలి” అంది. తను ఇంకోమాట కూడా చెప్పేది; “అరేయ్ యజ్దానీ!  అల్లా మనకు తప్పకుండ మళ్ళీ మంచి రోజులు ప్రసాదిస్తాడు. అప్పటి వరకు మనం బతికుండాలి; ఆరోగ్యంతో వుండాలి”.    

కొన్నిసార్లు వండడానికి మా ఇంట్లో బియ్యం వుండేదికాదు. కొనడానికి డబ్బులు వుండేవి కావు. అప్పుడు మా అమ్మ మా ముగ్గుర్ని ఒకే మంచం మీద పడుకోబెట్టి ఒక కథ చెప్పేది. 

అది ఏడవ శతాబ్దపు ఖలీపా హజ్రత్ ఉమర్  ఫారూక్ పాలన నాటి కథ. ప్రజల స్థితి గతుల్ని తెలుసుకోవడానికి హజ్రత్ ఉమర్  రాత్రుళ్ళు గుర్రం మీద మారువేషంలో తిరుగుతుండేవారు. ఒక రోజు అర్ధరాత్రి ఊరి చివర ఒక చెట్టు కింద ఒకామె వంట చేస్తూ కనిపించింది. హజ్రత్ చెట్టు దగ్గరకు వెళ్ళి ఆమెకు కనిపించకుండ అంతా గమనిస్తుంటారు. ఓ మధ్య వయస్కురాలు పొయ్యి మీద కుండ పెట్టి వంట చేస్తుంటుంది. ఆకలితో నకనక లాడుతున్న ఆమె నలుగురు పిల్లలు పొయ్యి చుట్టూ కూర్చొని అన్నం కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. ఎంత సేపటికీ అన్నం ఉడకకపోవడంతో పిల్లలు నీరసపడిపోయి నేల మీద పడుకుంటారు. ఆ తరువాత పొయ్యి ఆర్పి ఆమె కూడ పిల్లలపక్కన ఏడుస్తూ పడుకుంటుంది. హజ్రత్ ఉమర్  పొయ్యి దగ్గరికి వెళ్ళి కుండ మీది మూత తీసి చూస్తారు. అందులో నీళ్ళు, నాలుగు రాళ్ళు వుంటాయి. ఆ తరువాత హజ్రత్ ఉమర్  తన రాజ్యంలో ఎవరికీ  ఆకలితో పడుకునే పరిస్థితి రాకూడదంటూ అందరికీ ఉచిత ఆహార పంపిణి ఏర్పాట్లు చేస్తారు. 

మా అమ్మ ఈ కథను చెపుతున్నదంటే ఆ రోజూ ఇంట్లో అన్నం నిండుకున్నదని మాకు తెలిసిపోయేది. ఎవ్వరం ఆకలి మాట ఎత్తేవాళ్ళం కాదు. ఆకలితో నిద్ర కూడ వచ్చేదికాదు. ఆ విషయం మా అమ్మకు తెలియకూడదని రాత్రంతా కళ్ళు మూసుకుని  నిశ్శబ్దంగా వుండిపోయేవాళ్ళం. 

మా అమ్మకు చెప్పకుండ స్కూలు ఉదయం సెషన్ కు మధ్యాహ్నం సెషన్ కు మధ్య నేను ఒక దుకాణంలో పార్ట్ టైం బాల కార్మికునిగా పనికి చేరాను. తీరిక దొరికినప్పుడెల్లా మా వూరి లైబ్ర్రీలో పిల్లల బొమ్మల కథలు తెగ చదివేవాడిని. లవకుశలు, అభిమన్యుడు, బాలవర్ధిరాజు వగయిరాలు నా అభిమాన కథా నాయకులు. ఇంటికి వచ్చి ఆ కథల్ని మా అమ్మకు చెప్పేవాడిని. ఇందులో నాకు ఒక ‘వ్యూహం- ఎత్తుగడ’ వుండేది. ఆ కథల్లో బాల కథానాయకులు తమ తల్లుల కష్టాల్ని తీర్చినట్టు మా అమ్మ కష్టాలన్నీ నేను తీరుస్తాను అని చాలా తెలివిగా సంకేతాలు ఇచ్చేవాడిని.  సంద్ర్భాన్ని బట్టి మా అమ్మకు ఉత్సాహాన్ని కలిగించడానికి కొంచెం స్వేఛ్ఛ తీసుకుని కథల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసేవాడిని. మా అమ్మ చాలా సంబరపడిపోయేది. నన్ను దగ్గరకు తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకునేది. నవ్వేతే మా అమ్మ చాలా అందంగా వుండేది. తనను నవ్వించడం కోసం అనేక కథలు అల్లేవాడిని. అలా నేను నా జీవిత అవసరార్ధం కథకుడ్ని అయ్యాను – అంటూ కారా మాస్టారికి నా సమాధానాన్ని రాసి పంపాను. 

అల్లం రాజయ్య, బిఎస్ రాములు, నేను  మరో ఇరవై మంది గోదావరి ఎక్స్ ప్రెస్ లో ఆగస్టు 13 ఉదయం విశాఖపట్నం చేరుకున్నాము. కాళీపట్నం రామారావు మాష్టారు స్టేషనుకు వచ్చారు. వారు లాంఛనంగా అందర్నీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారనుకున్నాను.  వారు నన్ను కౌగలించుకుని “నేను మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను” అన్నారు. నాకు ఒక్కసారిగా ఆశ్చర్యమూ ఆనందమూ కలిగాయి. “మనం ఓ రెండు గంటల తరువాత ఎలాగు క్లాసులో కలవబోతున్నాం. నేను అంత వరకు ఆగలేకపోయాను. మీలో ఒక జాక్ లండన్ వున్నాడు” అన్నారు. నేను పరవశించిపోయాను. 

అప్పట్లో నేను ఒక పిల్ల కథకుడ్ని. కాళీపట్నం రామారావు మాస్టారంతటి వారు నా రచనాశైలి గురించి అంత గొప్ప మాటలంటుంటే నా వొళ్ళు నేల మీద నిలబడలేదు. గాల్లో తేలిపోయింది. కొత్త తరం గురించి అన్ని మంచి మాటలు అనడం మహాత్ములకే సాధ్యం. 

4 జూన్ 2021


No comments:

Post a Comment