My mathematical knowledge put me in lots of trouble
నా కొంపముంచిన గణిత జ్ఞానం
డానీ
రేఖాగణితం
(Geometry) లో రెండు బిందువులు తెలిస్తే వాటిని కలిపే గీత తదుపరి ప్రయాణాన్ని సులువుగా వూహించవచ్చు.
ఈ సూత్రాన్నే తరచూ సమాజానికి అన్వయిస్తూ వుంటాను.
దీనినే సమాజ భవిష్యత్తును
ఊహాగానం చేయడం అంటారు. (Exponential Social Prediction).
ఒక సంస్థకు చెందిన ఇద్దరు ప్రముఖ నేతలతో మాట్లాడితే ఆ
సంస్థ కూర్పు మాత్రమేకాదు దాని భవిష్యత్తును కూడ
ఊహాగానం చేయవచ్చు. ఇది ఒక పరికల్పన (hypothesis).
పరికల్పనకు సంపూర్ణ
కఛ్ఛితత్వం (accuracy) వుండకపోవచ్చు. కానీ పరికల్పన అనేది లేకుండ ఆచరణ సాధ్యం కాదు.
సమాజశాస్త్రం మొత్తం పరికల్పనల మీదే నడుస్తుంది. చివరకు విప్లవం కూడ పరికల్పనలు లేకుండా
సాగదు. ఒక ఆలోచనతో ఆచరణ మొదలెడుతాం; ఆచరణలో వచ్చిన అనుభవాలతో ఆలోచనల్ని సవరించుకుంటాం.
ఉద్యమాలలోనూ లాగే జరుగుతుంది పరిస్థితుల మీద మన అవగాహనను బట్టి పరిషారానికి ఒక ఎత్తుగడను
రూపొందిస్తాము. అది అనుకున్న ఫలితాలను సాధిస్తే తదుపరి ఉద్యమాలకు ఆదర్శంగా మారుతుంది.
అనుకున్న ఫలితాలను సాధించకపోతే ఆ ఎత్తుగడను
సవరించుకుంటాము.
మార్క్సిజాన్ని నేను ఔపోసన పట్టేశాను అని చెప్పడం అతిశయోక్తి
స్వోత్కర్ష అవుతుంది. నాకు అంత సీన్ లేదు. కానీ, గతితార్కిక చారిత్రక భౌతిక వాదంలో
ఒక సులభ సూత్రం నాకు బాగా వంటబట్టింది అని మాత్రం చెప్పగలను. గణిత, సమాజశాస్త్రాల్ని
నియత విద్యగానూ, సాహిత్యాన్ని అనియత విద్యగానూ
చదవడంవల్ల కావచ్చు సమాజ భవిష్యత్తును ఊహాగానం చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. నేనొకరకంగా
‘సమాజ జ్యోతిష్కుడిగా’ మారిపోయాను. ఇది నాకు అనేకసార్లు కష్టాలు తెచ్చి పెట్టింది.
అనేక వివాదాల్లోనికి లాగింది. నా ‘జ్యోతిష్యాన్ని’
తీవ్రంగా ఖండించిన వాళ్ళు కూడ తరువాతి కాలంలో “మీరు చెప్పినట్టే జరిగింది” అన్న సందర్భాలున్నాయి.
అయితే ఈలోగా నేను తీవ్ర మానసిక క్షోభనూ కొన్నిసార్లు క్రమశిక్షణా చర్యల్నీ అనుభవించాల్సి
వచ్చేది.
"నువ్వు ఒకే నదిలోకి రెండుసార్లు అడుగు పెట్టలేవు" అని గ్రీకు తత్వవేత్త హెరాక్లిటస్ చెప్పినట్టు
ఈరోజు నిన్నకాదు. నిన్నటి భవిష్యత్తు ఊహాగానం ఈరోజు
మారిపోతుంది. కొత్తది వస్తుంది. కొత్తదాన్ని
స్వీకరించకపోతే మనం గతంలో బతకాలని నిర్ణయించుకున్నటే. ముతగ్గా చెప్పాలంటే శవజాగారం
అన్నమాట.
USSR (సోవియట్ రష్యన్ సంయుక్త రాష్ట్రాలు) సామ్రాజ్యవాద
దేశంగా మారిపోయింది అని మార్క్సిస్టు-లెనినిస్టు పార్టీలు ప్రకటించాయి. అప్పటి పీపుల్స్
వార్ రాష్ట్ర కమిటి సెక్రట్రీ రంగన్న (ముక్కు సుబ్బారెడ్డి)ని ఓ సమావేశంలో “చైనా కూడ సామ్రాజ్యవాద దేశంగా మారిపోయిందేమో చెక్
చేశారా?” అని అడిగాను. వారికి చాలా కోపం వచ్చింది. పార్టీ లైన్ తప్పి మాట్లాడుతున్నారు
అని ఒక నిందను నా మీద వేశారు. ఇది 1981 నాటి సంగతి. ఓ ఏడాది తరువాత పీపుల్స్ వార్ చైనాను
కూడ పెట్టుబడీదారీ దేశంగా ప్రకటించింది. రంగన్న మరోసారి కలిసినపుడు మీమాటే గెలిచిందిగా
అన్నారు. “ఏడాది ముందు మీరు ఆ ప్రకటన చేసి వుండాల్సింది” అన్నాను. ఓ మూడు దశాబ్దాల
తరువాత మావోయిస్టు పార్టి చైనాను సామ్రాజ్యవాద దేశంగా ప్రకటించింది. టూలేట్! ఈలోగా
నేను ‘పార్టి లైన్ తప్పిన’ శిక్షను అనుభవించాను.
“వోల్గా ఘనీభవించెను,
యాంగ్సీ కూడా ఘనీభవించేను” అని శివసాగర్ ఓ కవిత రాశారు. “గంగ కూడ ఘనీభవించిందేమో చెక్
చేశారా?’ అన్నాను. రష్యా, చైనాల తరువాత భారతదేశమే ప్రపంచ విప్లవ కేంద్రం అవుతుందని
పీపుల్స్ వార్ నమ్ముతున్న కాలం అది. నా ప్రిడిక్షన్ వారికి చాలా కోపాన్ని తెప్పించి
వుంటుంది. “…. గోదావరి నదీగర్భంలో మంచుగడ్డలు పేరుకున్నాయేమోమరి. వాటిని పరిశీలించాడానికి మనం నరసాపురం నుండి నిజామాబాద్
మీదుగా నాసికా త్రయంబకం వరకు వెళ్ళాలి” అని ‘క్రితం తరువాత’ కవితను సమీక్షిస్తూ 1990
జూన్/జులైలో అంధ్రజ్యోతి వారపత్రికలో రాశాను. ఇది నేరుగా కొండపల్లి సీతారామయ్య మీద
చేసిన విమర్శ అని ఆరోపిస్తూ ఓ విరసం రాష్ట్ర
సమావేశంలో నన్ను బోనులో నిలబెట్టారు. ఇక నేను అక్కడ వుండలేనని నిర్ణయించుకుని ఓ ఏడాది
లోపే పీపుల్స్ వార్ నుండి బయటికి వచ్చేశాను. విచిత్రంగా ఓ రెండేళ్ళ
తరువాత పీపుల్స్ వార్ 1992లో కొండపల్లి సీతారామయ్యను
పార్టీ నుండి బహిష్కరించింది. ఎందుకు బహిష్కరించిందనే విషయంలో ఎవరి కథనాలు వారికి వున్నాయి.
రెండవ అల తెలంగాణ ఉద్యమం సమయంలోనూ నా Exponential Social Prediction మీద కొందరు ఇలాంటి అన్యాయపు ఆరోపణలు చేసి నన్ను బోను ఎక్కించే
ప్రయత్నం చేశారు. నా జ్యోస్యానికి ఒక సామాజిక నేపథ్యం కూడ వుంది.
తెలంగాణలో ముస్లింలకు ఘోరంగా మోసపోయిన చరిత్రవుంది. నిజాం
సంస్థానంలో ఒక ప్రజాస్వామిక ‘దేశాన్ని’ నిర్మించాలనీ కొందరు, రైతు-కూలీ ‘రాజ్యాన్ని’ నెలకొల్పాలని మరికొందరూ
పోరాటాన్ని ఆరంభించారు. ఈ పోరాటానికి థింక్ ట్యాంకుగా పనిచేసిన ‘కామ్రేడ్స్ అసోసియేషన్’ లో రాజ్ బహద్దూర్ గౌర్, దేవులపల్లి వేంకటేశ్వరరావు
వంటి ఇద్దరు ముగ్గురు తప్ప మిగిలిన వాళ్ళందరూ ముస్లింలు. తొలి అమరుడు బందగీ ముస్లిం. 1948లో
షోయబుల్లా ఖాన్ దారుణ హత్య సాకుతోనే జవహర్ లాల్ నెహ్రూ నిజాం మీదికి సైన్యాన్ని పంపించాడు.
ఆ
పోరాటంలో ముస్లింలకు దక్కింది ఏమిటీ? ముస్లింలకు ప్రజాస్వామిక ‘దేశం’ గానీ, కమ్యూనిస్టు
‘రాజ్యం’గానీ దక్కలేదు. ‘మా నైజాం’ అని సోషల్ కేపిటల్ గా చెప్పుకునే అవకాశమూ పోయింది.
ఓ ఏడేళ్ళు హైదరాబాద్ ‘రాష్ట్రం’ పేరుతో నిజాం సంస్థానం కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో
కొత్త రాష్ట్రం పేరులో ఆపాటి ప్రాతినిధ్యం
కూడ లేకుండా పోయింది. అన్నింటికన్నా విషాదం ఏమంటే 1948 నాటి పోలీస్ యాక్షన్ అనబడే సైనిక
చర్య నిజాం సంస్థానంలో వేలాది మంది ముస్లింలను క్రూరంగా చంపేసింది. వాళ్ళ ఆస్తుల్ని
లాక్కున్నది, ద్వంసం చేసింది. ముస్లిం స్త్రీలను
చెరిచింది. ఆ నరమేధంలో కనీసం 40 వేల మంది చనిపోయారని అప్పటి ప్రధాని నెహ్రుకు పండిట్ సుందర్ లాల్ కమిటి
సమర్పించిన రిపోర్టు పేర్కొంది. అనధికార నివేదికలు ఏడు లక్షల మంది చనిపోయారని చెప్పాయి.
ఆ నరమేధం గురించి నా బాల్యంలో మా ఇళ్ళలో చాలా కథనాలు విన్నాను. ఎందువల్లనోగానీ ముస్లింల
ఊచకోత గురించి ఉమ్మడి కమ్యూనిస్టు పార్టి కూడ మౌనంగా వుండిపోయింది.
నిజాం
తెలంగాణతో మా కుటుంబానికి ఓ నాలుగు తరాలుగా అనుబంధంవుంది. మా తాతల్లో అన్న గులాం గౌస్ ఖాన్ గారు నిజాం సంస్థానం రెవెన్యూ
విభాగంలో వర్సేయిల్ గా స్థిర పడితే, తమ్ముడు
గులాం మొహిద్దీన్ ఖాన్ ఆంధ్రా ప్రాంతంలోని నరసాపురంలో స్థిరపడ్డారు. గులాం గౌస్ ఖాన్
గారి పెద్దల్లుడు, అంటే మా పెద్ద మేనత్త భర్త, అబ్దుల్ సత్తార్ పాషా నిజాం సంస్థానంలోని చివరి సుబేదార్లలో
ఒకరు. మా కుటుంబం వారిని ‘గవర్నర్ సాబ్’ అనేది. నిజాం సంస్థానంలోని చరిత్ర పండితుడు
గులాం యజ్దానీ నుండే నా పేరు యజ్దానీ వచ్చింది.
మా మరో మేనత్త కొడుకు ఆసిఫ్ పాషా ప్రస్తుతం
నిజాం ట్రస్టులో ప్రధాన ట్రస్టీ గా వుంటున్నారు. ఇది కుటుంబపరంగా నైజాంతో మా అనుబంధం.
ఉద్యమాలలో
బంధుత్వాలకన్నా రాజకీయ అనుబంధాలు ముఖ్యం. తెలంగాణతో
నాకు ప్రగాఢ రాజకీయ అనుబంధం కూడ వుంది.1969లో
సాగిన తొలిదశ తెలంగాణ ఉద్యమానికి కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలోని ఎంఎల్ గ్రూపు సంపూర్ణ మద్దతు పలికింది. అప్పుడు దాని
పేరు ‘నక్సల్ బరీ సంఘీభావ కమిటి’ అనుకుంటాను. ఆ తరువాత అది సెంట్రల్ ఆర్గనైజింగ్ కమిటి (సివోసి)గా మారింది.
నేను 1978లో సివోసిలో చేరాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును నేను సమర్ధిస్తున్నానన్నదే
దాని అర్ధం. ఆ సివోసి 1980లో పీపుల్స్ వార్ గా మారింది.
నేను
పీపుల్స్ వార్ నుండి బయటికి వచ్చినప్పటికీ ఆ పార్టి చేపట్టిన కార్యక్రమాల్లో సెలెక్టివ్
గా నాకు నచ్చిన వాటిలో కలిసి పనిచేస్తూనే వున్నాను. విరసంతో నా అనుబంధమూ అంతే నాకు
నచ్చిన విరసం కార్యక్రమాల్లో ఇప్పటికీ పాల్గొంటూనే వున్నాను. ఒక సంస్థలో సభ్యులుగా
వుండడం వేరు; ఒక సంస్థతో అంశాలవారీగా కలిసిపనిచేయడం వేరు.
ప్రజాకవి
కాళోజీ నారాయణ రావు అధ్యక్షతన పీపుల్స్ వార్
1998 జనవరిలో (తేదీ 18 అనుకుంటాను) వరంగల్
లో ‘తెలంగాణ జనసభ’ను నిర్వహించింది. ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేస్తూ ‘వరంగల్ డిక్లరేషన్’ను విడుదల చేసింది. ప్రొఫెసర్ జయశంకర్ నాయకత్వాన ఒక
ఉద్యమ కమిటీ కూడ తెలంగాణ జనసభలో ఏర్పడింది.
తెలంగాణ జనసభ ఆహ్వాన కమిటికి ప్రొఫెసర్ జి ఎన్ సాయిబాబా అధ్యక్షులు. నేను ఆహ్వాన కమిటి
సభ్యుల్లో ఒకడిని. సాయిబాబా నేనూ ఆంధ్రా ప్రాంతం వాళ్ళమే.
అప్పట్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కే. చంద్రశేఖర రావు రవాణాశాఖ మంత్రిగా వున్నారు. వరంగల్ డిక్లరేషన్
ప్రభావంతో వారు తెలంగాణ మీద దృష్టి పెట్టారు. తెలంగాణ ఆర్ధిక, సామాజిక స్థితిగతుల్ని
పరిశోధించడానికి అనధికారికంగా పూనుకున్నారు. పాత్రికేయులు కే నరసింహాచారి, ఎస్ రామకృష్ణల
ఆధ్వర్యంలో తార్నాకలో ‘సెంటర్ ఫర్ సబ్ ఆల్టర్న్ స్టడీస్ (‘సిఎస్ ఎస్’)ను ప్రారంభించారు.
ఆ పరిశోధనా కేంద్రానికి ఓ రెండు నెలలు నేను మేనేజర్ గా వున్నాను. 2004లో వైయస్ రాజశేఖ్రెడ్డి
ముఖ్యమంత్రిగా వున్న కాలంలో స్టేట్ సెక్రటేరియట్ రిపోర్టర్ గా వున్నాను. అలా నాకు తెలంగాణ
ఉద్యమంలోని స్టేక్ హోల్డర్స్ అందరి మనోభావాలను తెలుసుకునే అవకాశం దక్కింది.
కేంద్ర
ఆర్ధికమంత్రి పి చిదంబరం 2009 డిసెంబరు 9న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.
ఆరోజు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం. ప్రకటించిన సందర్భం ప్రాముఖ్యాన్ని
బట్టి తెలంగాణ ఏర్పడడం అనివార్యం అని ఎవరికయిన
అర్ధం అవుతుంది. నేను విజయవాడ వెళ్ళి ‘ఆంధ్రా జర్నలిస్టుల ఫోరం’ ఏర్పాటు చేశాను. రాయలసీమ,
కోస్తాంధ్రా ప్రాంతాల ప్రజలు తమ షరతులను ముందు
పెట్టాలనేది దాని ఉద్దేశ్యం. సమైక్యాంధ్రప్రదేశ్ డిమాండ్ ఒక్కటితప్ప రాయలసీమ, కోస్తాంధ్రా ప్రాంతాల ప్రజలు ఏది కోరినా సరే అన్నింటినీ ఒప్పుకోవడానికి
ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకులు సిధ్ధంగా వున్న రోజులవి. అలా ఒక పెద్దమనుషుల ఒప్పందం కుదిరేది.
ఆ ఒప్పందాన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీక్రణ బిల్లులో చేర్చేవారు. అది తరువాత
చట్టం అయ్యేది. కోస్తాంధ్రా, రాయలసీమ నాయకులు చాలా మూర్ఖంగా వ్యవహ్రించారు. దాని ఫలితంగా
ఆ ప్రాంతాలు భారీగా నష్టపోయాయి.
తెలంగాణ,
ఆంధ్రా ప్రాంతాల వివాదంలో సామాజికవర్గాల పంచాయితీ కూడ వుందని సులువుగా అర్ధం అయింది.
అప్పటి వరకు రాజకీయాల్లో రెడ్ల నాయకత్వంలో కమ్మవాళ్ళు కలిసి ఒక శిబిరంగానూ (కాంగ్రెస్),
కమ్మవాళ్ళ నాయకత్వంలో రెడ్లు కలిసి ఇంకో శిబిరంగానూ
(టిడిపి) ఏర్పడి రాజకీయ రంగాన్ని శాసిస్తూ
వుండేవారు.
తెలంగాణ
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే అధికారాన్ని చేపట్టే మూడవ రాజకీయ శిబిరానికి నాయకత్వం ఎవరిదీ? అనే ప్రశ్న నన్ను తరచూ దొలుస్తూ
వుండేది? కమ్మ సామాజికవర్గం గెలవగలిగిన నియోజకవర్గాల్లో ఓ నాలుగయిదు మినహా మిగిలినవన్నీ
ఆంధ్రా ప్రాంతంలోనే వున్నాయి. రెడ్డి సామాజికవర్గం గెలవగలిగిన నియోజకవర్గాలు రెండు
ప్రాంతాల్లోనూ దాదాపుగా చెరి సగం వున్నాయి. అంచేత రాష్ట్రం విడిపోతే కమ్మ సామాజికవర్గానికి
కలిగే రాజకీయ ఇబ్బంది పెద్దగా ఏమీ వుండదుగానీ,
రెడ్డి సామాజికవర్గానికి తిప్పలు తప్పవు అనిపించింది. వెలమ సామాజికవర్గం నాయకత్వంలో
కొత్త రాజకీయ శిబిరం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపించాయి. ఇది కూడ సమాజ భవిష్యత్తును ఊహాగానం చేయడమే.
నా
అస్తిత్వాల్లో ముస్లిం అనేది కూడ ఒకటి కనుక
నవతెలంగాణలో ముస్లింల భవిష్యత్తు ఏమిటీ? అనే సందేహం కూడ తరచూ వెంటాడుతూ వుండేది. సైనిక
చర్య – ముస్లింల ఊచకోత గుర్తుకు వచ్చినప్పుడెల్లా
భయంతో ఒళ్ళు గగుర్పొడిచేది. మళ్ళీ సమాజ భవిష్యత్తు ఊహాగానం!
నవ
తెలంగాణాలో ముస్లింల సంక్షేమం, భద్రత, నిధులు,
నియామకాల మీద నిర్దిష్ట హామీలతో కూడిన పెద్దమనుషుల
ఒప్పందం ఒకదాన్ని తెలంగాణ ఉద్యమ నేతలతో రాసుకోవాలని
తెలంణాలోని కొందరు ముస్లిం ఆలోచనాపరులకు సూచించాను. ఒకరిద్దరికి లేఖలు కూడా రాశాను.
వాళ్ళ సమాధానం ఏమిటంటే “ముందు భౌగోళిక తెలంగాణ
ఏర్పడితే ఆ తరువాత దానికదే సామాజిక తెలంగాణ
ఏర్పడుతుంది” “మాకు ఉద్యమ నాయకత్వం మీద పూర్తి నమ్మకం వుంది” “మీరు ఆంధ్రావాళ్ళు కనుక
మీకు అలాంటి సందేహాలే వస్తాయి” అని.
కొత్త రాష్ట్రం
ఏర్పడ్డాక శ్రామికులు, దళిత, బహుజన, ఆదివాసీల జీవితాలు బాగుపడలేదని తెలంగాణ ఉద్యమంలో
ప్రముఖులుగావున్న మావోయిస్టు అభిమానులు, అంబేడ్కఅరిస్టులు ఇటీవల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్
ప్రభుత్వం ఏప్రిల్ 23న 16 ప్రజాసంఘాలను రద్దు
చేశాక ఈ విమర్శలు ఎక్కువయ్యాయి.
సరే.
ముస్లింలు ‘అంతగా విద్యాబుధ్ధులు లేనివారు’ అనుకుందాము. ప్రపంచ జ్ఞానం అంతా ఔపోసన పట్టిన
మావోయిస్టులకు ఏమయిందీ? 1984లో ఎన్టీ రామారావుకు
బేషరతుగా మద్దతు పలికితే పీపుల్స్ వార్ మూతిపళ్ళు రాలాయి. తెలంగాణ ఉద్యమానికి మద్దతు
పలకడం వరకు సరే; ఉద్యమ నాయకత్వపు రిస్క్ ఫ్యాక్టర్ గురించి మావోయిస్టులు ఎందుకు ఆలోచించలేదూ?
తెలంగాణ ఏర్పాటును బేషరతుగా సమర్ధించి రెండు
తెలుగు రాష్ట్రాల్లోని పార్లమెంటరీ రాజకీయాల్లో
కాంగ్రెస్, సాయుధపోరాట రాజకీయాల్లో
మావోయిస్టులు ఒకే విధంగా నష్టపోయారు.
అయితే
నా సామాజిక జ్యోస్యాన్ని కొందరు మెచ్చుకున్న సందర్భాలూ వున్నాయి. 2017 నవంవరులో నిజామాబాద్
జిల్లా అభంగపట్నంలో స్థానిక భూస్వాములు దళితుల్ని కొట్టి, బురదలో దించి ఆ దౌర్జన్యాన్ని
వీడియో తీశారు. నేను, సూరేపల్లి సుజాత తదితరులం దళితులకు సంఘీభావాన్ని ప్రకటించడానికి అభంగపట్నం
/ నవీపేట వెళ్ళాం. మేము వెళ్ళే నాటికి నిందితుడు భరత్ రెడ్డి బాధితులను కూడ వెంటబెట్టుకుని
అజ్ఞాతానికి వెళ్ళిపోయాడు. తన సమీప బంధువు ఒకని ద్వార బాధితులకు కొంత నగదుతోపాటూ కొంత పొలం రాసిచ్చి యస్సీ యస్టీ అట్రాసిటీస్ కేసును వెనక్కు తీసుకునేలా పైరవీలు చేస్తున్నాడు. మళ్ళీ
సామాజిక భవిష్యత్తు మీద ఊహాగానం! భరత్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తే ఎలా వుంటుందని
ఆలోచించాను. “దళితుల మీద అగ్రవర్ణాలు సాగిస్తున్న ఆగడాలను చూపించేందుకు గ్రామంలో ఒక షార్ట్ ఫిలిం తీశామనిన్నూ, ఆ వీడియో క్లిప్పింగుల్ని చూసి జనం అపార్ఢం చేసుకున్నారనీన్నూ చెపుతూ ఒక కథనం మన ముందుకు వచ్చే అవకాశం వుంది!” వుంది అని ‘అభంగపట్నానికి భంగపాటు తప్పదు’ వ్యాసంలో రాశాను. మనం సాధారణంగా
బాధితుల పక్షం నుండే ఊహాగానం చేస్తాము. దానితోపాటూ నిందితులు, వాళ్ళ అడ్వాకేట్లు, పోలీసుల దృష్టి
నుండి కూడ ఆలోచన చేస్తే వాస్తవానికి దగ్గరగా ఊహాగానం చేయవచ్చు. సరిగ్గా నేను
జోస్యం చెప్పినట్టే జరిగింది. వాళ్ళు
షార్ట్ ఫిలిం కథనంతోనే బయటికి వచ్చారు.
జర్నలిస్టుగా వున్న కాలంలోనూ ఇలాంటి
జోస్యాలు అనేకం చెప్పేవాడిని. కొంద్రు మెచ్చుకునేవారు. కొందరు విమర్శించేవారు.
కొండపల్లి సీతారామయ్య, కేజి సత్యమూర్తి మాత్రమేకాదు అంతకు
ముందు తరానికి చెందిన చండ్ర రాజేశ్వరరావు, పుచ్చలపల్లి సుంద్రయ్య తదితరుల త్యాగాలనూ,
ఉద్యమాలకు వారి కాంట్రిబ్యూన్ ను ఎప్పూడూ తక్కువగా
చూడరాదు. కుటుంబంలో మన తల్లిదండ్రులు లేకుండా మనం లేనట్టే, సమాజంలో స్పార్టకస్ నుండి సాయిబాబ, వరవరరావు వరకు ముందు తరం ఆలోచనాపరులు లేకుండా
ఈ తరం ఆలోచనాపరులు వుండరు.
వివాదం ఎక్కడ పుడుతుందంటే గత తరం ఎక్కడో ఒకచోట ఆగిపోయివుండవచ్చు.
కొత్త తరం అంతకు మించిన కొత్త పరిణామాల్ని కొత్త సమాజాన్ని చూస్తూ వుండవచ్చు. రెండు
తరాల అనుభవాలు భిన్నం కావచ్చు. అప్పుడు ఒక వైరుధ్యం వస్తుంది. మనం అనేక విషయాల్లో మన తల్లిదండ్రులతో విభేధిస్తాము. ఇదీ అలాంటిదే.
ఇస్లామిక్ గ్రంధాల్లో (వాటిల్లోనూ నేను పండితుడ్నికానుగానీ
నాకు అర్ధమైనంత వరకు) ప్రవక్తల పరంపర ఒకటి కనిపిస్తుంది. ముందు ఆదం అలేహిస్ సలామ్ ఒక
విముక్తి మార్గం చూపిస్తారు. అప్పటికి అది బాగుంటుంది. వారి సంతతి దారి తప్పుతుంది.
తరువాత నూహు అలేహిస్ సలామ్ వచ్చి సంస్కరిస్తారు.
అప్పటికి అది బాగుంటుంది. కానీ వారి సంతతి కూడ దారి తప్పుతుంది. ఆ తరువాత ఇబ్రాహీం
అలేహిస్ సలామ్ వచ్చి అందర్నీ గాడిలో పెడతారు. అప్పటికి అది బాగుంటుంది. కానీ వారి సంతతి
కూడ దారి తప్పుతుంది. ఆ తరువాత మూసా అలేహిస్ సలామ్, ఆ తరువాత ఈసా అలేహిస్ సలామ్, చివరకు ముహమ్మద్ సల్లల్లహు అలైహి
వసల్లమ్ ఇలా సాగుతుంది ఆ పరంపర.
దీనినిబట్టి మనకు అర్ధం అయ్యేదేమంటే ఒక చారిత్రక దశలో
ఒక విముక్తి సిధ్ధాంతం ఆవిర్భవిస్తుంది. తరువాతి కాలంలో దాని అనుచరులు ఆ సిధ్ధాంతాన్ని
భ్రష్టుపట్టిస్తారు. అప్పుడు తప్పకుండా ఒక సరికొత్త సంస్కరణ అవసరం వుతుంది.
ఒక చారిత్రక ద్శలో సిపిఐ ఆవిర్భవించింది. అప్పుడు అది
ఒక మహత్తర పాత్రను నిర్వహించింది. ఆ తరువాత దాని అనుచరులు దాన్ని భ్రష్టు పట్టించారు.
అప్పుడు సిపిఐ (ఎం) ఆవిర్భవించింది. అదీ ఒక మహత్తర పాత్రను నిర్వహించింది. ఆ తరువాత
దాని అనుచరులూ దాన్ని భ్రష్టు పట్టించారు. అప్పుడు సిపిఐ (ఎంఎల్) ఆవిర్భవించింది. ఇలా
కొనసాగుతుంది చరిత్ర గమనం. సిపిఐ (ఎంఎల్) అనుచరులు కూడ దాన్ని భ్రష్టు పట్టించారా?
అనే అనుమానం రాకపోతే తప్పు. సందేహం రావలసిందే.
సమాజ భవిష్యత్తు ఊహాగానం అలా నిరంతరం కొనసాగుతూనే వుంటుంది.
హైదరాబాద్
8 జూన్ 2021
మీరు కమ్యూనిష్టులుగా వుండాలని నా కోరిక!
డానీ
Jampanna J గారూ ! ముందుగా మీకు డబల్ ధన్యవాదాలు. మొదటిది; వివరంగా రెండు పోస్టులు పెట్టినందుకు. రెండోది; మావోయిస్టు పార్టీలో చాలాకాలం సెంట్రల్ కమీటీ సభ్యునిగా పనిచేసిన ఒక కామ్రేడ్ సామాజిక అవగాహనను తెలుసుకునే అవకాశాన్ని నాకు కల్పించి నందుకు.
నా పోస్టులో మీరు తప్పు పట్టిన
అంశాలను వరుసగా చర్చిద్దాం.
1.
రష్యా మార్గంలో
చైనా పతనం తప్పదని నేను 1981 ఆరంభంలోనే ఒక ఊహాగానం చేశాను. చైనాను పీపుల్స్ వార్
1983లో పెట్టుబడీదారీ దేశం అనీ, మావోయిస్టు పార్టి 2016లో సామ్రాజ్యవాద దేశం అనీ ప్రకటించినట్టు మీరు వివరణ ఇవ్వడం బాగుంది. చైనా
సామ్రాజ్యవాద దేశంగా మారబోతున్నదని 35 ఏళ్ళకు ముందే నేను చేసిన పరికల్పన నిజమైనందుకు
నన్ను మీరు మెచ్చుకోకపోవడం అస్సలు బాగోలేదు.
2
“ఏకపక్ష నిర్ణయాలు చేస్తున్నారు. నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు”
అంటూ 1992లో కొండ్పల్లి సీతారామయ్యను పీపుల్స్ వార్ బహిష్కరించింది అని నేను రాశాను.
పార్టీలో
ముఠాలు కడుతున్నందుకూ, పార్టీ వ్యతిరేక ప్రచారం
చేస్తున్నందుకూ ఆయన మీద “చర్య తీసుకోవడం జరిగింది” అని మీరు రాశారు. ఇక నుండి మీ మాటనే
ఖాయం చేసుకుందాము. ఇంతకీ ఆయన మీద తీసుకున్న ‘చర్య’ ఏమిటో మీరు వివరించలేదు. మీరు ఇప్పటికీ
దాన్ని రహాస్యంగా వుంచుతున్నారు. ఇదే నిజాయితీ లేనితనం అంటే.
3
అది పాలకవర్గాల మధ్య కీచులాట
అంటూనే ఆరోజు ఎన్టీ రామారావును మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడం ఎంతటి ప్రజాస్వామిక చారిత్రక
అవసరమో మీరు విస్తారంగా వివరించడం బాగుంది. సారాంశంలో అది భద్రలోకపు ప్రయోజనం. మిమ్మల్ని
నమ్ముకున్న అభద్రలోకం చేత భద్రలోకపు ప్రయోజనాల సాధన కోసం గొడ్డు చాకిరీ చేయించడం దేనికీ?
నక్సలైట్లకు లాల్ సలామ్ అన్న ఎన్టీఆర్ ఆటాపాటను రద్దు చేశాడు. నక్సలైట్ల ఎజెండాయే తన
ఎజెండా అన్న కేసిఆర్ 30 ప్రజా సంఘాలను రద్దు చేశాడు. ఫరక్ ఏమైనా వుందా? దీన్ని మీరు
ముందుగా ఊహించాలిగా? CAA, NPR, NRCలకు వ్యతిరేకంగా ఆ స్థాయిలో ఒక ఉద్యమాన్ని ఎందుకు
నిర్వహించలేదూ? ఇవి మీకు అప్రజాస్వామికం అనిపించలేదా? లేక ఇందులో మీకు భద్రలోకపు ప్రయోజనం
కనిపించలేదా?
4
కామ్రేడ్స్ అసోషియేషన్ సభ్యుల్లో ముస్లింలే అత్యధికులు అనడం మీకు జీర్ణం కాలేదు.
ముస్లిమేతరులే అత్యధికులు అనేందుకు మీ దగ్గర
సమాచారంలేదు. అయినప్పటికీ ముస్లింలకు ఆధిక్యత నిస్తున్న వాక్యాన్ని ఖండించడానికి మీరు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
నా పోస్టులో పోలీసుచర్య సందర్భంగా 40 వేల మంది ముస్లింలను చంపేశారని రాశాను. ఇది అధికారిక
రిపోర్టు. అనధికారిక లెఖ్ఖలు లక్షల్లో చనిపోయారు అంటున్నాయి. కమ్యూనిస్టులు అయిన వాళ్ళు
ముందుగా ఆ ఊచకోత మీద స్పందించాలి. మీరు ఆ పనిచేయలేదు. ముస్లిం సామాజికవర్గాల సమస్యల
మీద వాళ్ళ మనోభావాల మీద ‘మీకు’ మానవీయ స్పందన లేదు. మొత్తం పోస్టులో నేను నిరూపించ
దలిచిన దాన్నే మీరు ఇప్పుడు బలపరిచారు. ధన్యవాదాలు.
విప్లవ కవిత్వంలో శ్రీశ్రీ, విప్లవ రచనల్లో / ప్రసంగాల్లో కొండపల్లి సీతారామయ్య తదితరులు హిందూ
పౌరాణిక ప్రతీకల్ని వాడినపుడు మార్క్సిస్టు
విమర్శకులకు అభ్యంతరం లేకపోగా, వాటిని గొప్పగా సృజనాత్మక శక్తిగా భావించి మెచ్చుకున్నారు.
ఎవరయినా ముస్లిం, క్రైస్తవ నీతి కథల నుండి ప్రతీకల్ని తమ రచనల్లో, ఉపన్యాసాల్లో వాడితే ఈ కమ్యూనిస్టులే
అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మతతత్వం. దీనికి మావోయిస్టు కేంద్ర కమిటీ (మాజీ) సభ్యులు
కూడ మినహాయింపుకాదు.
నా పోస్టులో ముస్లిం అస్తిత్వం ప్రస్తావన వచ్చిన ప్రతి
సందర్భంలోనూ మీ కామెంట్ లో అవహేళన, ఎద్దేవ,
అవమానించడం, ముస్లింలు గతితర్కానికి (కమ్యూనిజానికి) సంబంధంలేని అంశంగా పేర్కొనడం వంటి
చేష్టలు అనేకం చేశారు. ముస్లింల మీద సాగుతున్న
అణిచివేత ప్రస్తావన కూడ మీకు రుచించలేదు.
ఇది మాకు కొత్తకాదు. మత అల్పసంఖ్యాక వర్గాల మీద మొదటి నుండీ ఇది ‘మీ’ వైఖరి.
నేను ఏ విషయం మీద ఫోకస్ పెట్టాలనుకున్నాననే
విషయంలో మీకు సందేహం వద్దు. భారత దేశంలో మైనారిటీల సంక్షేమం భద్రతే రాజకీయ ఎజెండ అని
1984 నుండి మొత్తుకుంటున్నాను. ఆ పని మిగిలిన వాళ్ళకన్నా కమ్యూనిస్టు పార్టీలు సమర్ధంగా
చేయగలుగుతాయని కూడా నమ్ముతున్నాను. మీరేమో ముస్లిం సమస్యను ఎవరయినా లేవనెత్తినప్పుడెల్లా
ఎద్దేవ చేస్తున్నారు. నయా మనువాద నియంతృత్వ రాజ్యంలో శ్రామిక మత సమూహాన్ని ఎద్దేవ చేసేవారు మరేదయినా కావచ్చుగానీ
కమ్యూనిస్టులు మాత్రం కాలేరు.
మీరు కమ్యూనిష్టులుగా వుండాలని
నా కోరిక. అది మీకు రుచించడం లేదు. మీరు మారలేదు; నేనూ మారలేదు.
హైదరాబాద్
9 జూన్ 2021
No comments:
Post a Comment