Mother Tongue, Official Language and Medium of Instruction
మాతృభాష, అధికార భాష, బోధనా భాష
‘ఎన్.టి.ఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ పేరుతో సాహిత్య పురస్కారo అందిoచే నైతిక హక్కు శ్రీమతి లక్ష్మీ పార్వతికి, అందుకునే నైతిక అర్హత శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడుకి ఎక్కడిది?’ – శీర్షికతో 26 మే 2021న ‘జనసాహితీ’ సంస్థ ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడాన్ని అందులో తీవ్రంగా విమర్శించారు.
‘జనసాహితీ’ కరపత్రం మీద స్పందనగా ఈ వ్యాసంలోని మొదటి భాగాన్ని రాశాను. దాని మీద తన ప్రతిస్పందనగా జనసాహితీ నాయకులు దివికుమార్ 2019 నవంబరు ఆరంభంలో అచ్చయిన ‘ఇంగ్లీషు మాధ్యమంలో చదువుల ద్వారా ఎంత ఇంగ్లీషు పరిజ్ఞానాన్ని అలవరుచుకో గలిగాము? ‘ అనే వ్యాసాన్ని పంపించారు. దాని మీద నా స్పందనగా ఇందులోని రెండవ, మూడవ భాగాన్ని రాశాను)
మొదటిభాగం
1. మాతృభాష వేరు; అధికార భాష వేరు; బోధనా భాషవేరు. ఇవి కన్నవారికీ, పాలకులకు, నియతవిద్యకు సంబంధించిన మాధ్యమాలు.
2. ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అధికార భాష. అంటే యజమాని భాష; మిగిలినవి శ్రామిక భాషలు.
3. జనసాహితీ వంటి సామ్యవాదుల సంస్థ అధికార భాష గురించి ఇంతగా ఆవేదన పడడం విచిత్రంగా వుంది.
4. ప్రభుత్వ పరంగా కనీస ఆదరణ గుర్తింపులు లేని భాషా సమూహాలు ఆంధ్రప్రదేశ్ లో అనేకం వున్నాయి. జనసాహితీ వాటికి ప్రాణం పోసే చర్యలు తీసుకుని వుంటే బాగుండేది.
5. ఏ తల్లిదండ్రులు కూడ తమ పిల్లల్ని పొట్ట కూటి కోసమే నియత విద్యకు పంపిస్తారు. బాషోధ్ధరణ కోసం ఎవ్వరూ తమ పిల్లల్ని నియత విద్యకు స్కూళ్ళకు పంపరు.
6. ఒక అర్ధ శతాబ్దానికి పైగా భద్రలోకం తమ పిల్లల్ని ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకే పంపుతోంది.
7. ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళ సంఖ్య పెరిగాక ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్ళకు పోయేవారు తగ్గిపోయారు.
8. ఉన్నత విద్యలో సైన్స్ కన్నా ఆర్ట్స్ తక్కువది అని అనుకుంటున్నట్టు ఇంగ్లీషు మీడియం కన్నా తెలుగు మీడియం తక్కువది అనే భావన బలంగా వుంది. ఇదొక అత్మన్యూనతాభావం. ఇదొక అణిచివేత.
9. తమ పిల్లల్ని కూడ ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించాలని అభద్రలోకం ఆశపడుతున్నది. ఇదొక అత్మగౌరవ అంశం. వాళ్ళ కోరికను కాదనే హక్కు ఇతరులకు లేదు.
10. ఇప్పటికీ తమ పిల్లలకు తెలుగు మీడియం మాత్రమే కావాలనుకునే తల్లిదండ్రులు వుండవచ్చు, అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేక స్కూళ్ళు ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటికే కొన్ని భాషల కోసం కొన్ని స్కూళ్ళు వున్నాయి.
11. తమను తాము తెలుగు భాషాభిమానులుగా చెప్పుకునేవారు ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూళ్ళకు వ్యతిరేకంగా ఉద్యమించిన సందర్భం ఇంత వరకు కనిపించదు.
12.17 సంవత్సరాల పాటు ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్న అనేకమంది పిల్లలు కనీసం సెలవు చీటీని కూడా ఇంగ్లీషులో తప్పులు లేకుండా రాయలేని స్థితి వుందని ‘జనసాహితీ’ కరపత్రంలో పేర్కొన్నారు. పిల్లల ఆంగ్ల పరిజ్ఞానాన్ని తరువాత పరిశీలిద్దాము. తెలుగు మీడియంలో బోధించే ఉపాధ్యాయుల్లో ఎంత శాతం మంది ‘వ్యవసాయ చట్టాలు’ ‘పోలవరం ప్రాజెక్టు’ ‘ఆర్టికల్ 370 రద్దు’, ‘కరోనా విశ్వమారి’ ‘గోదావరి – కావేరి అనుసంధానం’ తదితర వర్తమాన అంశాల మీద తెలుగులో ఒక అందమైన వ్యాసం రాయగలరూ? ఎవరయినా సర్వే జరిపారా?
13. ఎన్టీ రామారావులో నూతన ప్రజాస్వామిక, ఫెడరల్ విలువల్ని చూడగలిగిన వాళ్ళకు అభద్రలోకపు ఆత్మగౌరవ కోరిక న్యాయమైనదని అనిపించకపోవడం అన్యాయం. కారంచేడు దురాగతంతో ఎన్టీ రామారావుకున్న అనుబంధాన్ని విస్మరించిన ఈ కరపత్రం అభద్రలోకపు ఆకాంక్షల్ని ప్రతిబింబించింది అనుకోవడం కష్టం.
14. అభద్రలోకం తమ పిల్లలకు ఇంగ్లీషు మీడియం విద్య కావాలనగానే జనసాహితి సంస్థ మిన్ను విరిగి మీద పడినట్టు గగ్గోలు పెట్టడం అస్సలు బాగోలేదు.
15. చారిత్రక కారణాలు ఏమైనాగానీ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుకన్నా ఇంగ్లీషు పొట్టకూటి భాష. తెలుగు భౌగోళిక అస్తిత్వానికి సింబంధించింది; ఇంగ్లీషు అభివృద్ధికి సంబంధించినది.
రెండవ భాగం
16. కార్పొరేట్ విద్యాసంస్థలు బలపడ్డాక టాలెంట్ గల ఉపాధ్యాయులు అక్కడికి వలసపోయారు. ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలినవాళ్ళల్లో బహు కొద్దిమందితప్ప అత్యధికులు తుక్కు. స్ క్రాప్!
17. మాతృప్రేమ, మాతృభాషలకు ఉపయోగపు విలువ వుంటుంది.
18. నియత విద్య సరుకు; దానికి మారకపు విలువ కూడ వుండితీరాలి.
19. అధికారభాషా పరిరక్షణ కోసం ఒక ప్రభుత్వ వ్యవస్థ వుంటుంది.
20. అభ్యుదయవాదులు అనధికార భాషల పరిరక్షణ కోసం కృషి చేయాలి.
21. ఇతర ప్రభుత్వోగులతోపాటూ ఉపాధ్యాయుల జీతభత్యాలు గత ఇరవై ఏళ్ళలో భారీగా పెరిగాయి. ఈ కాలంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య పెరిగిందిగానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ప్రమాణాలు పడిపోయాయి. విలోమానుపాతం (inversely proportional)!
22. వచన కవితా ప్రక్రియే అంతరించి పోతూ కథా-నవలా ప్రక్రియలు పుంజుకుంటున్న కాలం ఇది. కొందరు అధికార భాషా పరిరక్షకులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పద్యాలనూ, ప్రబంధాలనూ పునరుధ్ధరించే పనిలో పడ్డారు.
23. ఓ యాభై ఏళ్ళ క్రితం తెలుగు మీడియంలో చదివినవాళ్ళు ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో చదువుతున్న వారిని ‘వ్యక్తీకరణ సామర్థ్యం’ ‘స్థూల ప్రాపంచిక పరిజ్ఞానం’ లేనివారిగా చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది తాతా మనవళ్ళ పోటీ!
24. కొత్తతరంతో అనుబంధలేని వృధ్ధతరం ఇలాంటి ముసలి వాదనలు చేస్తున్నది.
25. తెలుగు మీడియం, ఇంగ్లీషు మీడియంలలో చదివిన ఇద్దరు ఫ్రెష్ గ్రాడ్యూయేట్ల మధ్య ‘వ్యక్తీకరణ సామర్థ్యం’ ‘స్థూల ప్రాపంచిక పరిజ్ఞానం’ అంశాల మీద పోటీ పెడితే ఎవరి సామర్ ధ్యం ఎంతో తేలిపోతుందిగా.
26. ఇంతకీ మాతృభాష తెలుగూ పాఠ్యపుస్తకాల్లో వుండే తెలుగూ ఒకటేనా?
మూడవ భాగం
1. ప్రజాసమూహాలు అన్నింటికీ మాతృభాషలుంటాయి. కానీ, ఒక ప్రజాసమూహానికి మాత్రమే తమ మాతృభాషను అధికార భాష చేసుకునే అవకాశం వుంటుంది.
2. ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన తమిళ, మలయాళ, గుజరాతీ తదితర భాషా సమూహాలేగాక అచ్చంగా ఆంధ్రప్రదేశ్ నేల మీద పుట్టిన విభిన్న భాషా సమూహాలు పాతిక్కి పైగా వుంటాయి. దాదాపు పది శాతం మంది మాట్లాడే ఉర్దూ భాషనే పక్కన పెట్టిన అధికార భాషాభిమానులు ఇక గోండు, కోలామీ, కోయ, కువి, కుయి, ఎరుకల, సవర, పర్జీ, కుపియా, కొండ, ఆదివాసీ ఒరియా తదితర స్థానిక భాషల్ని పట్టించుకుంటారని ఆశించడం అత్యాశ.
3. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒక్క తెలుగు భాషనే మాతృభాషగా భావించాలి అనే దురహంకారం ఆధిపత్యవాదం వీరిలో కనిపిస్తోంది..
4. ఎవరికైనాసరే నియత విద్యలో చేరడానికి ముందే తల్లిదండ్రులు, పరిసరాల ద్వార మాతృభాష అబ్బుతుంది.
5. పెద్దలకన్నా పిల్లలకు ఇతర భాషలు చాలా త్వరగా అబ్బుతాయి.
6. మనుషులకు నియత విద్య ద్వార మాత్రమే సమాజ పరిజ్ఞానం రాదు. వ్యక్తులకు తాము పుట్టిన సామాజికవర్గాలను బట్టి, కుటుంబము, , బంధువులు, పరిసరాలు, స్నేహితులు, సహోద్యోగులు, మార్కెట్, మీడియా, దేశ రాజకీయాలు వగయిరాల వల్ల సమాజ పరిజ్ఞానం వస్తుంది.
7. వ్యక్తులు ప్రత్యేక సాధన ద్వార కవులు, కళాకారులూ, రచయితలు అవుతారు. ఏమాత్రం నియత విద్య లేనివారు సహితం గొప్ప కవులు, కళాకారులైన ఉదాహరణలు మనకు అనేకం వున్నాయి.
8. ఇప్పుడున్న ప్రభుత్వ టీచర్లలో ఎక్కువమంది తెలుగు మీడియంలోనే సరిగ్గా పాఠాలు చెప్పలేరు. ఇంగ్లీషును ‘మీడియం ఆఫ్ ఇన్ స్ట్రక్షన్’ గా ప్రకటిస్తే వారిలో సగంకన్నా ఎక్కువ మంది ఇంటిదారి పట్టాల్సి వుంటుంది.
9. సహజంగానే ట్రేడ్ యూనియన్ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయ సంఘాలు ఇంగ్లీషు మీడియంను వ్యతిరేకిస్తాయి.
10. ఇప్పుడున్న టీచర్లందరూ గత నాలుగు దశాబ్దాలుగా దిగజారుతున్న విద్యావ్యవస్థ నుండి పుట్టుకు వచ్చిన వారే. నాణ్యత లేని టీచర్లు తమను పోలిన విద్యార్ధుల్నే సృష్టిస్తారు.
11. పాత టీచర్లకు ఉద్యోగ భద్రతకన్నా కొత్త తరాలకు ఉపాధి కల్పన ముఖ్యం.
12. ట్రేడ్ యూనియనిజం బాగా వంటపట్టినవాళ్ళు సామ్యవాదాన్నీ, కమ్యూనిజాన్నీ, నూతన ప్రజాస్వామిక విప్లవ విలువల్నీ ఏ స్థాయికి దిగజార్చుతారో తెలుసుకోవడానికి జనసాహితీ కరపత్రం తాజా ఉదాహరణ.
(అయిపోయింది)
3 జూన్ 2021
No comments:
Post a Comment