కమ్యూనిస్టులు మతవర్గతత్త్వాన్ని గుర్తిస్తారా?
రష్యా
మాజీ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ భౌతిక కాయానికి ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు
వ్లదిమీర్ పుతిన్ శ్రధ్ధంజలి ఘటించిన తీరు ఒక ఆసక్తికర చర్చను రేపింది. పుతిన్
క్రైస్తవ మత సాంప్రదాయం ప్రకారం శ్రధ్ధంజలి ఘటించడంతో ఈ చర్చ మొదలయింది. వాళ్ళిదరు
అసలు కమ్యూనిస్టులా? సోషల్ డెమోక్రాట్లా? పెట్టుబడీదారులా? సామ్రాజ్యవాదులా? ఆస్తికులా? నాస్తికులా? వంటి అనేక సందేహాలు వున్నాయి.
ఈ సందర్భంగా, ‘మతం మీద కమ్యూనిస్టుల వైఖరి
ఏమిటీ?’ అంటూ భారత అల్పసంఖ్యాక సమూహాలు (#indminorities) చాలా కాలంగా వేస్తున్న
ప్రశ్న మళ్ళీ ముందుకు వచ్చింది.
భారతదేశంలో
సామ్యవాద రాజ్య స్థాపన లక్ష్యంతో
కమ్యూనిస్టు పార్టి, హిందూమత రాజ్య స్థాపన లక్ష్యంతో ఆరెస్సెస్ ఒకే
సంవత్సరంలో (1925) పుట్టాయి. ఆరెస్సెస్ సిధ్ధాంతం ప్రధానంగా ముస్లిం క్రైస్తవ
మైనారిటీ సమూహాలను, కమ్యూనిస్టుల్ని వేధించడానికీ, అణిచివేయడానికి పుట్టింది. ఆరెస్సెస్ వ్యవస్థాపకులు తమ లక్ష్యల్ని చాలా
స్పష్టంగానే ప్రకటించారు. దీన్ని
వాళ్ళు ఇటీవల మరికొంచెం విడమర్చి ఐదు ముప్పులు (Malicious-5) అంటున్నారు.
ఆరెస్సెస్ సిధ్ధాంతం, కార్యకలాపాల
ప్రభావంతో ఒక శతాబ్ద కాలంలో దేశంలో జరగబోయే
పరిణామాల్ని అంచనా వేయడంలో భారత కమ్యూనిస్టు పార్టీలు పూర్తిగా విఫలం అయ్యాయి.
అంచేత, హిందూత్వ రాజ్య స్థాపనను నిలవరించడానికి ఒక పటిష్ట వ్యూహాన్నీ, ఎత్తుగడల్ని కార్యక్రమాల్ని రూపొందించే
బాధ్యతనుండి అవి తప్పుకున్నాయి. ఒక శతాబ్ద కాలాన్ని వృధా చేశాయి.
తాము
మతాన్ని అస్సలు గుర్తించబోమని ప్రకటించడంవల్ల సామాజికరంగంలో ఆరెస్సెస్ ను ఎదుర్కొనే వ్యూహం కమ్యూనిస్టులకు లేకుండా
పోయింది. రాజకీయ, ఆర్థికరంగాల్లో
ఆరెస్సెస్ ను ఎదుర్కొనేందుకు కొన్ని ప్రయత్నాలు
కమ్యూనిస్టు పార్టీలు చేశాయిగానీ సామాజిక, సాంస్కృతిక రంగాల్లో వాటి డొల్లతనం
కారణంగా బై డిఫాల్ట్ అవి విఫలం
కాకతప్పలేదు. కులాన్ని తాము గుర్తించడంలేదని ప్రకటించడంవల్ల కూడ కమ్యూనిస్టులు
రాజకీయ రంగంలో అనివార్యంగా వైఫల్యాలను కూడగట్టుకున్నారు.
ఏ
వ్యవస్థలో అయినా మనుషులకు ఒకే ఉనికి (అస్తిత్వం) వుంటుందనుకోవడం చాలా పెద్ద
తప్పిదం. ప్రతి మనిషికీ బహుళ అస్తిత్వాలుంటాయి. భారతదేశంలో ప్రతిమనిషికీ
అనివార్యంగా కులం మతం రెండూ వుంటాయి. ఇది కమ్యూనిస్టు పార్టీల నాయకులకూ తప్పదు.
కాకుంటే, ఇతరులు తమ కులమతాల్ని దాచరు. కమ్యూనిస్టు నాయకులు ఆ సామాజిక వాస్తవాన్ని
కప్పిపుచ్చేందుకు విఫలయత్నాలు చేస్తుంటారు.
వర్గం
సర్వాంతర్యామి అయినప్పుడు కులవ్యవస్థస్థ, మత వ్యవస్థలోనూ వర్గం వుంటుందనే వాస్తవం
ఇప్పటికీ కమ్యూనిస్టు పార్టీల నాయకత్వానికి బోధపడలేదు. యజమానిమతం-శ్రామిక మతం,
యజమాని కులం – శ్రామిక కులం అనే వర్గ విభజనను అర్ధం చేసుకున్న కమ్యూనిస్టు పార్టి
భారత దేశంలో ఇప్పటికి లేదు. సమాజంలో ఒక సమూహం మరో సమూహాన్ని అణిచివేయడానికి
కులాన్ని మతాన్ని (కూడ) ప్రయోగిస్తుందనే ఎరుక కమ్యూనిస్టు పార్టీలకు లేకుండాపోయింది.
వీరన్న వంటివారు ఒక ప్రయోగం చేయబూనారుగానీ కొద్ది రోజుల్లోనే ఆయనే చనిపోవడంతో ఆ
ప్రయత్నాలు ముందుకు సాగలేదు.
ఫ్యాక్టరీ
కార్మికులు, వ్యవసాయ కూలీలు, టీచర్లు వంటి దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు,
సామ్యవాద భావాలు కలిగిన మధ్యతరగతి తమ ఓటు
బ్యాంకు అని కమ్యూనిస్టు పార్టిలు చాలాకాలం నమ్మేవి. 1952 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో
తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులకు ఆధిక్యత దక్కింది. అయితే అప్పుడు అది తెలంగాణ
రాష్ట్రంకాదు; నిజాం-మరాఠ్వాడ, నిజాం-కన్నడ ప్రాంతాలతో కూడిన హైదరాబాద్ స్టేట్. మరాట్వాడ, కన్నడ ప్రాంతాల్లో
ఆధిక్యాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టి హైదరాబాద్ స్టేట్ లో తొలి ప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసింది. 1955 ఆంధ్రరాష్ట్రం అసెంబ్లీ
ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులకు 15 సీట్లు వచ్చాయి. ఆ తరువాత వారి ఓటు బ్యాంకు
క్రమంగా తరిగిపోతూ వచ్చి, చివరకు రెండు రాష్ట్రాల శాసన సభల్లోనూ ఒక్క స్థానం కూడ
లేని దయనీయ పరిస్థితి దాపురించింది. మరి,
ఈ రెండు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీ
కార్మికులు, వ్యవసాయ కూలీలు, దిగువ స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు, సామ్యవాద భావాలు
కలిగిన మధ్యతరగతి ఏమయిపోయినట్టు? వాళ్ళు
వర్గేతర అస్తిత్వాలను గుర్తించడం మొదలెట్టారు. అదే కులం, మతం, ప్రాంతం. నిన్న
పశ్చిమ బెంగాల్ లో జరిగిందీ ఇదే రేపు
మరోచోటా జరిగేదీ ఇదే.
ఓటర్లలో
అత్యధికులు హిందువులు అని గుర్తించడంవల్లనో, తాము కూడ బై డిఫాల్ట్ హిందువులమనే
స్వీయజ్ఞానం ఆలస్యంగా కలగడంవల్లనో ఇటీవల కొందరు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు బోనాలు
ఎత్తడానికి, హిందూదేవాలయాల్ని సందర్శించడానికి
పూనుకుంటున్నారు.
కమ్యూనిస్టు
సిధ్ధాంతానికి శాస్త్రస్థాయిని సమకూర్చిన కార్ల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగిల్స్ కు
భారత కమ్యూనిస్టులకున్నంత గందరగోళం లేదు. వర్గ సమాజం వున్నంతకాలం ఒక అవసరంగా మతం
వుంటుందనే అవగాహన వాళ్ళిద్దరికీ వుంది. అయితే, మతం అంతరించిపోతుందని కూడ వాళ్లు
చెప్పారు. (సుదూర భవిష్యత్తులో) సమాజంలోని
వర్గాలు పూర్తిగా రద్దు అయ్యాక, కమ్యూనిస్టు సమాజం ఏర్పడ్డాక మతం అనేది ఒక అణిచివేత
పరికరంగా పనికిరాకుండ పోవడమో, మత భావనలే పూర్తిగా అంతరించిపోవడమో జరుగుతాయని
వాళ్లు వివరించారు.
మతాన్ని,
కులాన్నీ గుర్తించక పోవడానికి కమ్యూనిస్టు నాయకులకు ఒక వ్యక్తిగత ఇబ్బంది వుంది.
వాళ్ళలో అత్యధికులు ఆర్ధికంగా భూస్వామ్య కుటుంబాలకు, సామాజికంగా యజమాని కులాలకు,
యజమాని మతాలకు చెందినవారు. కులమతాల మీద చర్చకు అవకాశం ఇస్తే ఏకంగా తమ ఉనికికే
ముప్పు వస్తుందని వాళ్ళు భయపడి వుండవచ్చు. అంచేత, బహుళ అస్తిత్వాలుండే వర్గ సమాజంలో కులమతాలు నిర్వహించే పాత్ర మీద
చర్చను వాళ్ళు నిలిపివేసి వుండవచ్చు.
యూదునిగా
పుట్టిన ఏసుక్రీస్తు యూదుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినట్టు, ఖురేషీగా
పుట్టిన ప్రవక్త ముహమ్మద్ నాటి మక్కా ఖురేషీలకు
వ్యతిరేకంగా పోరాడినట్టు పెత్తందారీ కులాల్లో పుట్టిన కమ్యూనిస్టు నాయకులు
పెత్తందారీ కుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి వుండవచ్చు. కానీ, అలా జరగలేదు.
కమ్యూనిస్టు
పార్టి నాయకత్వంలో సాగిన అనేక పోరాటాల్లో యజమాని కులాలకు చెందినవారు చాలా పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు. ప్రాణ త్యాగాలకు సహితం సిధ్ధపడ్డారు. అది మహత్తర
విషయం. అయితే, వాళ్ల పోరాటం ఆర్ధిక
రంగానికే పరిమితం అయ్యింది. యజమానివర్గాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా సాగే పోరాటంలో యజమాని
కులాలు, యజమాని మతాల ఆధిపత్యానికి వ్యతిరేకంగానూ పోరాడాల్సిన అవసరం వుందని వాళ్లు
గుర్తించలేదు; పార్టి శేణులకు చెప్పలేదు. ఇదొక చారిత్రక తప్పిదం.
మరోవైపు, కమ్యూనిస్టు పార్టీలకు సహజ అభిమానులయిన
అణగారిన సమూహాలకు వ్యతిరేకంగా యజమాని
వర్గాలు, యజమాని మతాలు, యజమాని కులాలు ఏకమయ్యాయి. దీనినే ఇప్పుడు మనం ‘మతతత్త్వ
కార్పొరేట్ నియతృత్వం’ అంటున్నాం. ఇంత క్లిష్టపదాలు వద్దనుకుంటే సూటిగా ‘భారత ఫాసిజం’
అనుకోవచ్చు. జరిగిందేమిటీ? కమ్యూనిస్టు
పార్టీలు స్వయంకృతాపరాధాలతో బలహీన పడిపోయాయి; అణగారిన సమూహాలు ఫాసిజం ఉక్కు పాదాల
కింద నలిగిపోతున్నాయి.
1883లో కార్ల్
మార్క్స్ చనిపోయినపుడు ఆయన భౌతికకాయాన్ని లండన్ హైగేట్ శ్మశానంలోని యూదుల విభాగంలో ఖననం
చేశారు. ఇది చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్ ఆధీనంలోని సువిశాలమైన 17 ఎకరాల క్రైస్తవ స్మశానం,
అందులో ఓ రెండు ఎకరాల చిన్న భాగాన్ని యూదుల కోసం కేటాయించారు. “the greatest living thinker ceased
to think …. Marx was the best hated and most calumniated man of his time” అంటూ
ఫ్రెడెరిక్ ఏంగిల్స్ అద్భుతంగా ప్రసంగించింది అక్కడే.
ఇక్కడా మనకు అంతే. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర
రాజేశ్వరరావు, కొండపల్లి సీతారామయ్య చనిపోతే దహనం చేశారు. మఖ్ధూం మొహియుద్దూన్,
ఎస్. ఎం. రవూఫ్ చనిపోతే ఖననం చేశారు. కమ్యూనిస్టు నాయకులైనా సరే ఎవరి మతాచారాలు
వారికే వుంటాయి. మధ్యలో ఈ బుకాయింపులు దేనికీ?
ప్రకృతిలో ప్రతిదానికీ ఒక ప్రయోజనం వుంటుంది; ప్రయోజనం
లేనిది ఉనికిలో వుండదు. మతానికీ ఒక ప్రయోజనం వుంటుంది. మతం అంతరించిపోతుంది అని చెప్పిన
మార్క్సే వర్గ సమాజంలో మతం ఎందుకు వుండాల్సి
వస్తున్నదో చెప్పాడు. “మతం అనేది అణగారిన సమూహాల నిట్టుర్పువంటిది; హృదయంలేని
ప్రపంచానికి హృదయం వంటిది; ఆత్మలేని పరిస్థితులకు ఆత్మవంటిది” అన్నాడు. (Religion is the sigh of the
oppressed creature, the heart of a heartless world, and the soul of soulless conditions.)
ఇందిరాగాంధీ
హత్య తరువాత కాంగ్రెస్ లోపల-బయట వున్న హిందూత్వ శక్తులు శిక్కుల మీద సాగించిన
ఊచకోత దేశంలో మెజారిటీ మతోన్మాదం చెలరేగబోతున్నదని తొలి ప్రమాద హెచ్చరికను
జారీచేసింది. దీన్ని గమనించిన కే.వి. రమణారెడ్డి 1995 జనవరిలో ‘మతవర్గతత్త్వం’ అనే
పేరిట ఒక కొత్త సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎందువల్లనోగానీ ఈ పుస్తకం మీద
జరగాల్సినంత చర్చ జరగలేదు. కమ్యూనిస్టు పార్టీలు కన్వీనియంట్ గా ఈ పుస్తకం మీద మౌనం
దాల్చాయి.
ఉపయోగ వస్తువులన్నింటికీ వినియోగం, అతి వినియోగం, తక్కువ వినియోగం, దుర్వినియోగం, అత్యాచారం వంటి అనేక దశలుంటాయి. ఇప్పుడు కార్పొరేట్లు తమ ఆర్ధిక ప్రయోజనాల కోసం మతాన్ని అత్యాచారం చేయడానికి తలపడ్డారు. మనం వ్యతిరేకించాల్సింది ఆ సామాజిక అత్యాచారాన్ని. అంతేగానీ, మొత్తంగా మతాన్ని కాదు.
కార్పొరేట్ ఆధిపత్యాన్ని నిలవరించే సామర్ధ్యం సిధ్ధాంతపరంగా కమ్యూనిస్టులకు సమర్ధంగా వుంది. అణగారిన సమూహాలకు మతం అవసరం లేని సమాజాన్ని నిర్మించమని మార్క్స్ సూచించాడు. భారత కమ్యూనిస్టులు సమాజాన్ని మార్చలేక ముందుగానే మతాన్ని రద్దు చేసే విఫల యత్నాలు చేస్తున్నారు. హృదయంలేని ప్రపంచంలో, ఆత్మలేని పరిస్థితుల్లో, కనీసం నిట్టూర్పుని అయినా కోరుకునే సమూహాలు మతాల్ని ఆశ్రయిస్తాయి. కమ్యూనిస్టు పార్టీలు మతాన్నే దూరంగా పెట్టాలనుకుంటే ప్రజలు కమ్యూనిస్టు పార్టీల్ని దూరం పెడతారు. మతతత్త్వ కార్పొరేట్ నియతృత్వ దశలో అయినా కమ్యూనిస్టులు మతవర్గ తత్త్వాన్ని గుర్తిస్తారా?
డానీ
(రచయిత సమాజ విశ్లేషకులు, సీనియర్
పాత్రికేయులు, ముస్లిం థింకర్స్ ఫోరం కన్వీనర్)
3 సెప్టెంబరు
2022
No comments:
Post a Comment